- కబ్జా భూములు తేల్చేందుకు కమిటీ
- అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
- ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష
మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి
Published Sat, Aug 27 2016 11:16 PM | Last Updated on Fri, Aug 17 2018 2:49 PM
ఆదిలాబాద్ అర్బన్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇందుకు అధికారులందరూ సహకరించాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. రానున్న రెండున్నరేళ్లలో మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోగల లీజ్ ల్యాండ్స్, కబ్జాకు గురైన స్థలాలు, భూములు, కోర్టు కేసులతో పెండింగ్‌లో భూముల వివరాలు సేకరించేందుకు ఒక కమిటీ వేయనున్నట్లు చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జేసీ సుందర్ అబ్నార్‌తో చర్చించారు. ముందుగా కార్యాలయం రికార్డ్సు ఉన్నాయా.. రికార్డులో ఉన్నది.. క్షేత్రస్థాయిలో ఉందా లేదా.. అనేది పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ల్యాండ్ ఉందా.. కబ్జాకు గురైందా.. ఎంత మేరకు ఉంది.. అనే వివరాలు అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. అనంతరం గత సమావేశంలో చర్చించిన అంశాలు ఏవి.. ఎంత మేరకు చర్యలు తీసుకున్నారో మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌కు సంబంధించిన ఆస్తులు, ఆదాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పన్ను చెల్లించడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పన్ను చెల్లించని కార్యాలయాలకు తాళాలు వేస్తే డబ్బులు అవే వస్తాయన్నారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్, అటవీ శాఖ, రోడ్డు భవనాల శాఖ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్‌కు ఆదాయం గతేడాది రూ.9 కోట్లు కాగా, నెలకు రూ.65 లక్షల ఖర్చు ఉందని, ఇందులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరాత్ర ఉన్నాయని వివరించారు. అధికారులు పనులపై దృష్టి పెడితే తప్పక ముందుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో జేసీ సుందర్‌అబ్నార్, మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతయారు, అధికారులు జగదీశ్వర్‌గౌడ్, అయాజ్, సాయికిరణ్, భాస్కర్‌రావు, సుమలత, అనురాధ, ప్రియాంక, శోభ, మమత, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement