తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష | Revanth Review On Heavy Rains In Telangana, CM Inspect Flood Hit Khammam | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీ వర్షాలు.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

Published Mon, Sep 2 2024 1:39 PM | Last Updated on Mon, Sep 2 2024 3:08 PM

Revanth Review On Heavy Rains In Telangana, CM Inspect Flood Hit Khammam

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్నచోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని కలెక్టరేట్‌లలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్‌ఎఫ్‌ తరహా శిక్షణ ఇవ్వాలని సీఎం తెలిపారు. వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలని వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులను ఆదేశించారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలని పేర్కొన్నారు.

సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తక్షణమే కేంద్ర సాయం కోరుతూ సీఎం రేవంత్‌ లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని మోదీని కోరారు. మరోవైపు వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం రూ. 5 కోట్లు విడుదల చేశారు.

వర్షాల సమయంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న  రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు.

ఖమ్మం బయల్దేరిన సీఎం..
ఈ మేరకు సీఎం రేవంత్‌ ఖమ్మం బయల్దేరారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో ఖమ్మం టౌన్‌ ఎఫెక్ట్‌ అవ్వగా.. వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్నారు. రాత్రికి ఖమ్మంలోనే బసచేయనున్నారు. రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్గం మధ్యలో కోదాడలోనూ పర్యటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement