ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
వర్షాలు, వరదలతో వాటిల్లిన భారీ నష్టం పరిశీలనకు రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహా్వనం
వర్షాలు, వరదలపై సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు
మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని పరిశీలించడానికి స్వయంగా రాష్ట్రానికి రావాలని ఆహా్వనించారు. ఈ మేరకు ప్రధానిని కోరుతూ లేఖ రాయాలని సీఎస్‌ను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలపై సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రైల్వే లైన్లు కొట్టుకుపోవడం, పదుల సంఖ్యలో రోడ్లు, చెరువులకు గండ్లు పడడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, భారీ ఆస్తి నష్టాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధానిని రాష్ట్ర పర్యటనకు ఆహా్వనించాలని చెప్పారు.
ఇళ్లు కూలినవారికి ఇందిరమ్మ ఇళ్లు
వర్షాలు, వరదలతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు, పాడి పశువులకిచ్చే పరిహారాన్ని రూ.37,500 నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెలకిచ్చే పరిహారాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. (ఈ మేరకు పరిహారం పెంచుతూ విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది) తక్షణమే ఈ మేరకు పరిహారం అందించాలని ఆదేశించారు. ఇళ్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు రూ.5 కోట్ల చొప్పున తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపండి
ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. అయితే 4 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ అంచనాలను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంట నష్టం వివరాలతో కేంద్రానికి సమగ్ర నివేదిక పంపించి కేంద్ర బృందాలను పరిశీలనకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
యువ పోలీసులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ
ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి తక్షణ సహాయం ఎందుకు అందడం లేదని సీఎం ప్రశ్నించగా, మన విజ్ఞప్తి ఆధారంగా వాళ్లు దగ్గరగా ఉన్న బలగాలను పంపుతారని, ఇందుకు సమయం పడుతుందని అధికారులు బదులిచ్చారు. భవిష్యత్తులో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లలోని యువ పోలీసులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి బృందాలను ఏర్పాటు చేసుకున్న ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయాలని, అక్కడి వారితో శిక్షణ ఇప్పించాలని సూచించారు.
కూలీలకు బియ్యం, పప్పులు ఇవ్వండి
హైదరాబాద్ నగరంలో చిన్న అవాంఛనీయ సంఘటన జరగడానికి వీల్లేదని సీఎం ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, తాగు నీటి సరఫరా, పారిశుధ్యం విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలొచి్చనా వెంటనే పరిష్కరించాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. రోజూ కూలికి వెళ్లేవారు పనులు లేక ఇళ్ల దగ్గరే ఉండిపోతారని, అలాంటి వారిని గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఆ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయండి
అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడానికి కారణాలను సీఎం వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలొచ్చాయని, గతంలో ఐదేళ్లు, పదేళ్లకోసారి ఇలాంటి వర్షాలు వచ్చేవని, ఇటీవల తరచుగా కురుస్తున్నాయని, దీనిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment