Adilabad Municipality
-
ఐదేళ్లుగా సేవ చేస్తున్నా టికెట్ ఇవ్వలేదు
ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో మరోమారు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు 48వ వార్డుకు టీఆర్ఎస్ తరుపున నామినేషన్ దాఖలు చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష పవన్‌రావు కంటతడి పెట్టారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఉపసంహరణ కేంద్రానికి భర్తతో కలిసి వచ్చారు. తనకు బీ–ఫామ్ అందకపోవడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి సేవలందిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పట్టణ ప్రజలకు నిస్వార్థ సేవలను అందజేశానని కంటతడి పెట్టారు. అటువంటి తనను పట్టణ ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డగా చూసుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ఓ పెద్ద మనిషి గెలుపుకోసం ఆహర్నిషలు కృషి చేశానని, అటువంటిది కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు కూడా బీ–ఫామ్ ఇవ్వలేదన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇప్పటి వరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ తన కొడుకును చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించుకున్నామని, నన్ను తప్పుకోవాలని సోమవారం రాత్రి ఇంటికి వచ్చి ఒత్తిడి చేయడం సరికాదని ఆవేధన చెందారు. చైర్‌పర్సన్‌గా పని చేసిన నీవు కౌన్సిలర్‌గా ఉండకూడదంటూ ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు సేవలందించిన నాకు వార్డు ప్రజలకు సేవందించే అవకాశం కల్పించమని కోరినా వినలేదని పేర్కొన్నారు. -
హంగులకే కోట్లు ఇస్తున్నారు
సాక్షి, ఆదిలాబాద్ : అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్టుంది ఆదిలాబాద్ కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణం తీరు. భవన నిర్మాణం కంటే మిగితా హంగులకే రెట్టింపు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా ప్రారంభమైన ఈ భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడంలేదు. పైపెచ్చు.. అంచనా వ్యయాలు పెరుక్కుంటూ ఇంతవరకూ వచ్చింది. మొదట మున్సిపల్ ఫండ్ కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకవర్గం ఆదిలాబాద్ బల్దియాలో కొలువుదీరిన తర్వాత 2017లో మున్సిపాలిటీ కోసం కొత్త భవనం నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో భవనం అన్ని సదుపాయాలతో నిర్మించాలని భావించారు. అప్పుడు మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చే బీఆర్జీఎఫ్ నిధులను దీనికోసం వెచ్చించాలని యోచించారు. అయితే బీఆర్జీఎఫ్ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో అసలు సమస్య వచ్చింది. దీంతో అప్పటికే మిగులు బీఆర్జీఎఫ్ నిధులు, మున్సిపల్ ఫండ్ కలిపి రూ.1.70 కోట్లతో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. టెండర్‌ను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ నిధుల మేరకు కేవలం భవన నిర్మాణం చేసి వదిలిపెట్టారు. భవనానికి లోపల, బయట తుది మెరుగులకు నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నాసిరకంగా నిర్మాణం అప్పట్లో కాంట్రాక్టర్ భవన నిర్మాణానికి సంబంధించి నాణ్యత పాటించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ భవన నిర్మాణంలో పెచ్చులు ఊడిపోయాయని చెబుతున్నారు. అంతేకాకుండా నిర్మాణ సమయంలో వాటర్ క్యూరింగ్ సరిగా చేయకపోవడంతో భవనం నాణ్యతపై ప్రశ్న తలెత్తుతోంది. దీంతోనే పెచ్చులు ఊడిపోయాయని పలువురు పేర్కొంటున్నారు. కోట్ల నిధులు వెచ్చించి భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అధికారులు కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులొత్తడం ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఆర్అండ్బి కింద ఆరునెలల క్రితం ఈ టెండర్ మంజూరైంది. అయితే వరుసగా ఎన్నికలు రావడంతో టెండర్ పనులు పూర్తికాలేదు. తాజాగా టెండర్ పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్ల పనులను అప్పగించారు. అందులో భాగంగా మున్సిపాలిటీ భవనాన్ని ఆకర్షణీయమైన హంగులతో నిర్మాణం పూర్తి చేసేందుకు 15 రోజుల కిందట పనులు ప్రారంభించారు. అయితే మున్సిపల్ అధికారుల తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రధానంగా వరుసగా ఎన్నికలు వచ్చిన సమయంలో కలెక్టర్ అనుమతి తీసుకొని వివిధ పనులు చేపట్టారు. మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు ఇదివరకే ప్రారంభమైన దృష్ట్యా కలెక్టర్ అనుమతితో ఎప్పుడో మళ్లీ టెండర్ చేసి పనులు అప్పగించేందుకు చర్యలు తీసుకొని ఉంటే ఈపాటికి భవన నిర్మాణం పూర్తయ్యేది. అయితే పాలకవర్గం పదవీకాలం జూలై 2వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు వేచిచూసిన అధికారులు ఇటీవల టెండర్ పనులు పూర్తిచేయడం వెనక ఆంతర్యమేమిటో? ఆర్అండ్బీ నిధులతో మళ్లీ జీవం బీఆర్జీఎఫ్ నిలిచిపోవడం, ఇటు మున్సిపాలిటీలో నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో అసలు భవన నిర్మాణం పూర్తవుతుందా?.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల పట్టణ శివారులో ఉన్న పలు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన విషయం విదితమే. అందులో భాగంగా ఆదిలాబాద్ బల్దియాను 36 వార్డుల నుంచి 49 వార్డులకు పెంచారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందికి మరింత బాధ్యత, పనితీరు పెరగనుంది. దీనికితోడు ప్రస్తుతం ఉన్న భవనం విస్తరించిన మున్సిపాలిటీ కార్యకలాపాలకు సరిపోనివిధంగా ఉండడం కూడా రానున్న రోజుల్లో కొత్త భవనం ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న భవనానికి ఎదురుగానే ఇందిరా టౌన్‌హాల్ స్థలంలో ప్రస్తుతం సంప్‌హౌజ్‌కు సమీపంలోనే ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 3 నమూనాలో నిర్మిస్తున్న ఈ సముదాయంలో పైఅంతస్తు పూర్తిగా సమావేశ మందిరం కోసం చేపడుతున్నారు. ప్రస్తుతం 49 వార్డులకు పెరగడంతో కౌన్సిలర్ల సంఖ్య 49తో పాటు కోఆప్షన్ సభ్యులు, అధికారులు అందరూ కలిపి సుమారుగా వందమంది సమావేశ మందిరంలో కూర్చునేందుకు వీలుగా భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవనం నిర్మించినప్పటికీ మెరుగులు దిద్దాల్సి ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పనులు చేపట్టేందుకు వీలుగా రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. సమావేశ మందిరంలో పూర్తిగా సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భవిష్యత్‌లో గ్రేడ్–1 మున్సిపాలిటీ నుంచి మరింత ఉన్నత గ్రేడ్ సాధించినా ఈ భవనంలో కార్యకలాపాలకు సరిపోయేలా పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్‌ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో మున్సిపల్ ఏఈ అరుణ్‌ను వివరణ కోరగా భవన నిర్మాణ పనులు మళ్లీ 15 రోజుల కిందట ప్రారంభించినట్లు తెలిపారు.త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఐదేళ్ల పాలన ముగిసింది
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలు.. ఐదేళ్లు పూర్తి చేసుకొని నేటితో పదవీకాలం ముగించనున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు జరగని మందమర్రి మున్సిపాలిటీ మినహా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల పాలనకు నేటితో తెర పడనుంది. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను విధించే అవకాశం ఉంది. త్వరలో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక పురపాలికల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. ఒకచోట మినహా.. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ ఐదు మున్సిపాలిటీలో 2014లో టీఆర్ఎస్ పాలకవర్గాలే ఏర్పడ్డాయి. ఒక్క భైంసాలో మాత్రం ఏఐఎంఐఎం పాలకవర్గం ఏర్పడింది. ఒక్క నిర్మల్ మినహాయించి ఐదు పురపాలికల్లో మహిళా చైర్పర్సన్లే ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఆదిలాబాద్‌లో చైర్‌పర్సన్‌గా రంగినేని మనిషా, వైస్ చైర్మన్‌గా ఫారుఖ్అహ్మద్, నిర్మల్‌లో చైర్మన్‌గా అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్‌చైర్మన్‌గా అజీమ్బిన్ యాహియ, మంచిర్యాలలో చైర్‌పర్సన్‌గా మామిడిశెట్టి వసుంధర, వైస్‌చైర్మన్‌గా నల్ల శంకర్, బెల్లంపల్లిలో చైర్‌పర్సన్‌గా సునితారాణి, వైస్‌చైర్మన్‌గా సత్యనారాయణ, కాగజ్‌నగర్‌లో చైర్‌పర్సన్‌గా సీపీ విద్యావతి, వైస్ చైర్మన్‌గా సద్దాం హుస్సేన్, భైంసాలో చైర్‌పర్సన్‌గా సఫియా బేగం, వైస్‌చైర్మన్‌గా జాబిర్ అహ్మద్ అప్పట్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే బెల్లంపల్లిలో నాలుగేళ్లు చైర్‌పర్సన్‌గా ఉన్న సునితారాణిపై అవిశ్వాస తీర్మాణం పెట్టి తొలగించడంతో మునిమంద స్వరూప చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. వైస్ చైర్మన్‌గా మాత్రం సత్యనారాయణనే కొనసాగారు. ఇక్కడ మినహా ఉమ్మడి జిల్లాలోని ఐదుబల్దియాల్లో పాలకవర్గాలు సంపూర్ణంగా పాలన ముగించనున్నాయి. అయితే మిగితా పాలకవర్గాల్లోనూ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత సభ్యుల్లో అసంతృప్తి కారణంగా అవిశ్వాసం పెడతారనే ప్రచారం సాగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అప్పటి మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశవాహుల్ని సద్దుమణిగించడంతో అవిశ్వాస వ్యవహారాలు నిలిచిపోయాయి. ఐదేళ్ల పాలన నేటితో పూర్తికానుంది. కొత్త రాష్ట్రంలో బాధ్యతలు.. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 30న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. 2014 మే 13న వాటి ఫలితాలు వెలుబడ్డాయి. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్, నిర్మల్‌లో బీఎస్పీ, భైంసాలో ఎంఐఎం, కాగజ్‌నగర్‌లో టీఆర్ఎస్, బెల్లంపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందాయి. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో పాలకవర్గాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు నిర్వహించగా ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసి పాలన పగ్గాలు చేపట్టింది. మంచిర్యాల, బెల్లంపల్లిలో కాంగ్రెస్ సభ్యులు అప్పుడు ప్రత్యేక సమావేశంలో విప్‌ను ధిక్కరించి మరీ టీఆర్ఎస్కు జై కొట్టడంతో ఆ రెండు చోట్ల కూడా టీఆర్ఎస్ పాలకవర్గ బాధ్యతలు చేజిక్కించుకుంది. భైంసాలో ఎంఐఎం పదవీ బాధ్యతలు చేపట్టింది. ప్రధానంగా నిర్మల్‌లో అప్పుడు బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నుంచే అభ్యర్థులను బరిలో నిలిపి అత్యధికంగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఐకేరెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో బీఎస్పీ నుంచి కౌన్సిలర్లుగా గెలిచిన సభ్యులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు బీఎస్పీ కౌన్సిలర్‌గా గెలిచిన అప్పాల గణేష్ టీఆర్ఎస్ నుంచి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పాల గణేష్ కాంగ్రెస్‌లోకి మారారు. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్‌లో టీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవులు ఇచ్చారు. ఇక కొత్త జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలో ఏర్పడిన మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగిసిపోనుండగా త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ద్వారా కొత్త జిల్లాలో కొత్త పాలకవర్గాలు ఏర్పడనున్నాయి. ఆదిలాబాద్‌లో ఆదిలాబాద్, నిర్మల్‌లో నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఉన్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాల్లో ఒక్కో మున్సిపాలిటీ ఉండగా నిర్మల్‌లో 3, మంచిర్యాలలో అత్యధికంగా 7 మున్సిపాలిటీలు ఉండటం గమనార్హం. అయితే మందమర్రి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. -
‘స్వచ్ఛత’లో వెనుకంజ
సాక్షి, ఆదిలాబాద్‌రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్–2019 ర్యాంకుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎంతో వెనుకబడింది. ఈ సారి జాతీయస్థాయిలో 330వ స్థానంలో నిలిచింది. గతంలో 133వ ర్యాంకులో ఉన్న మున్సిపాలిటీ ఈ సారి వెనక్కి వెళ్లింది. ఈ ఏడాది మైనస్ మార్కులు ఉండడంతో ర్యాంకుల్లో వెనుకబడ్డామని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ఏ మేరకు అమలవుతుందో తెలుసుకునేందుకు 2017 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను ప్రారంభించింది. ఏటా జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందం సభ్యులు పరిశుభ్రతను పరిశీలించి స్వచ్ఛతపై వివరాలు సేకరించిన తర్వాత మార్పులను బట్టి ర్యాంకు కేటాయిస్తారు. ఈ బృందం సభ్యులు కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాల సేకరణతోపాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి పంపిస్తారు. ఈ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటిస్తుంది. గతం కంటే ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతో కొంత ర్యాంకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే గతంలో మైనస్ మార్కులు ఉండేవి కావు, ఈ సారి మైనస్ మార్కులు ఉండడంతో ర్యాంకులో వెనుకపడ్డట్లు తెలుస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తగ్గిన ర్యాంకు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ 2017లో 195వ ర్యాంకు సాధించింది. 2018లో 2,423 మార్కులు సాధించి 133వ ర్యాంకు పొందింది. 2017తో పోలిస్తే 2018లో మెరుగైన ర్యాంకు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 330వ ర్యాంకు సాధించగా, రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించింది. వీటిలో మెరుగైతేనే.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మార్పులు, మెరుగైన ర్యాంకు సాధించాలంటే మొదటగా ప్రత్యేక ప్రణాళిక రూపొదించుకోవాల్సి ఉంటుంది. ర్యాంకు సాధించుకోవాలంటే పట్టణ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తేవాలి. పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా చూడడంతోపాటు పారిశుధ్య కార్మికులు బాధ్యతగా చెత్తను ప్రతీ రోజు తీసుకెళ్లేలా చూడాలి. మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలకు రెండు చెత్త బుట్టలు అందించాలి. వాటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజల నుంచి వివరాలను రాబడతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందంలోని అధికారులు మున్సిపాలిటీ నాలుగు విభాలుగా విభజించి మార్కులు కేటాయిస్తారు. సర్వీస్ లెవల్ బెంచ్ మార్కులు 1250, థర్డ్ పార్టీ ఆఫీసర్ల పరిశీలన ద్వారా 1250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్ గ్యార్బేజీ, ప్రీసిటీ, కెపాసిటీ బిల్డిండ్ ద్వారా మరో 1250 మార్కులకు కేటాయించి ర్యాంకు ప్రకటిస్తారు. మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతోనే.. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో గతంలో మైనస్ మార్కులు ఉండేవి కావు. ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చారు. దీంతో ర్యాంకు తగ్గింది. వచ్చే సంవత్సరం పట్టణ ప్రజలకు మరింత అవగాహన కల్పించి, మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. – మారుతిప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
ముందే ‘మ్యూటేషన్’
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో ఇకపై భూమి క్రయ, విక్రయాలు జరిపేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు తప్పనిసరిగా మ్యూటేషన్ ఫీజు భరించాల్సిందే. దీంతో ఆస్తులు కొనుగోలు చేసేవారు ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ భారాన్ని మోయాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి గెజిట్ జారీ అయ్యింది. ఆగస్టు 2న కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతోపాటు మున్సిపాలిటీల్లో పలు గ్రామాల విలీనం జరిగిన విషయం విదితమే. ఈ విలీనం జరిగిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించి భూ క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రధానంగా ఆ గ్రామాల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణంపై స్పష్టత రాకపోవడంతో ఈ జాప్యం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 0.5 శాతం మ్యూటేషన్ ఫీజు సాధారణంగా ఆస్తుల కొనుగోలు సమయంలో ఇరు పార్టీలు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో కొనుగోలుదారు భూమి మార్కెట్ విలువపై 4శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో ఏ భూమికైనా ఇదే విధంగా ఉంటుంది. మున్సిపాలిటీలో మాత్రం పేరు మార్పిడికి సంబంధించి అదనంగా మ్యూటేషన్ ఫీజు భూమి విలువ మీద 0.5శాతం కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే తీసుకోవడం జరుగుతుంది. గ్రామపంచాయతీలో రిజిస్ట్రేషన్ తర్వాత నేరుగా జీపీ కార్యాలయంలో మ్యూటేషన్ ఫీజు చెల్లించి చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనం చేశారు. వాటికి సంబంధించి ఆగస్టు 2 తర్వాత రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రధానంగా ఆయా వార్డు, బ్లాక్, విస్తీర్ణం వివరాలపై స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం వ్యక్తమైంది. దీంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఆయా గ్రామాల్లో అప్పటినుంచి రిజిస్ట్రేషన్లను జరపడంలేదు. ఈ నేపథ్యంలో క్రయవిక్రయాలు చేసుకునే వారిలో ఆందోళన వ్యక్తమైంది. విలీన గ్రామాలు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన అనుకుంట గ్రామాన్ని వార్డు నెం.13లో కలిపారు. అర్లి(బి) జీపీలోని బెల్లూరి, నిషాన్ఘాట్ గ్రామాలను వార్డు నెం.3లో, రాంపూర్(ఆర్)ను వార్డు నెం.32లో, బట్టిసావర్గాం జీపీలోని ఎన్‌హెచ్‌బీ కాలనీ, టైలర్స్‌కాలనీ, పోలీసు కాలనీ, వివేకానంద కాలనీ, అగ్రజా టౌన్షిప్, ఆదర్శ్‌కాలనీ, భగత్‌సింగ్ కాలనీలను వార్డు నెం.27లో విలీనం చేశారు. మావల గ్రామపంచాయతీ పరిధిలోని దస్నాపూర్, దుర్గానగర్, కేఆర్కే కాలనీ, వికలాంగుల కాలనీలో మిగిలిన భాగంతోపాటు అటెండర్ కాలనీ, కృష్ణానగర్, ఇందిరమ్మ కాలనీలను వార్డు నెం.19లో విలీనం చేశారు. మార్కెట్ విలువ పాత పద్ధతే.. ఆయా గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమైనప్పటికీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రస్తుతం పాత విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సబ్రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులతో కలిపి మార్కెట్ రివిజన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ప్రతి రెండేళ్లకోసారి భూములకు సంబంధించి రివిజన్ చేసి మార్కెట్ విలువలను సవరించడం, పెంచడం జరుగుతుంది. ప్రస్తుతానికి విలీన గ్రామాల్లో పాత విలువలోనే రిజిస్ట్రేషన్ చేయనుండడంతో ఇప్పటికే ఆయా గ్రామాల్లో క్రయ, విక్రయాల పరంగా రిజిస్ట్రేషన్ విలువలో భారీ తేడాలు వచ్చే అవకాశం లేదు. అదనంగా మ్యూటేషన్ ఫీజును మాత్రమే భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఆస్తి పన్ను పరంగా కూడా మూడేళ్ల వరకు ఎలాంటి మార్పుచేర్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మార్కెట్ విలువలు మాత్రం రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఏదైన నిర్ణయం తీసుకుంటే సవరణ చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. సీసీఏలో నమోదు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో త్వరలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించడం జరుగుతుంది. సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం విషయంలో స్పష్టత వచ్చింది. ఆన్లైన్లో ఈ సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం మున్సిపాలిటీలోని వార్డుల్లో జతచేస్తూ సీసీఏలో నమోదు చేయాల్సి ఉంది. సోమవారం దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. – జయవంత్‌రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
టెండర్లు మరిచారు..
సాక్షి, ఆదిలాబాద్: కోట్ల రూపాయల పనులిచ్చారు.. టెండర్లు మాత్రం మరిచారు.. ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు.. పనులకు సంబంధించి ఇక్కడి నుంచి అంచనా వ్యయాలు రూపొందించి పంపించినప్పటికీ సాంకేతిక అనుమతి రాలేదు. టెండర్లకు మోక్షం కలగడం లేదు. అప్పట్లో మున్సిపాలిటీ పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. టెండర్లకు సంబంధించి వివిధ దశల ప్రక్రియలను పూర్తి చేయడంలో జిల్లా ఆర్అండ్బీ అధికారుల లోపమా, లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో పనులకు అనుమతినివ్వడంలో ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయం నుంచే జాప్యం జరుగుతుందా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో మున్సిపాలిటీ పనులు చేపట్టే పరిస్థితి లేదని ఆర్‌అండ్‌బీకి అప్పగించగా ఇప్పుడు ఆర్అండ్బీ తీరుతో విస్మయం వ్యక్తమవుతోంది. రూ.28 కోట్ల పనులు.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం బడ్జెట్లోనే ప్రత్యేక నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి ప్రతీ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల పనులను మంజూరు చేసింది. ఆదిలాబాద్ మున్సిపాలిటిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీఓఆర్టీ నెం.187 ద్వారా 2018 మార్చి 22న రూ.28.30 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు మంజూరై దాదాపు ఐదు నెలలు అవుతోంది. అప్పట్లో ఈ పనులను మున్సిపాలిటీ నుంచి ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. దీనిపై మున్సిపల్ కాంట్రాక్టర్లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపాలిటీలో ఈ పనులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బీకి అప్పగించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఈ పనులను చేపట్టలేదని ఒకవేళ భావిస్తే ఇప్పుడు ఆర్అండ్బీ టెండర్ల దశకు తీసుకొచ్చేందుకే ఆపసోపాలు పడుతోంది. ఐదు నెలల క్రితం మంజూరైన ఈ నిధులను అప్పట్లోనే వినియోగించుకుంటే ఇప్పటికే పనులు కూడా ఓ దశకు వచ్చేవి. ఇప్పుడు వర్షాలు కురుస్తుండడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఆర్అండ్బీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్కా మార్చిలో మంజూరైన ఈ నిధులకు సంబంధించి ఒకవేళ తామే చేపట్టి ఉంటే ఈపాటికి పనులను ప్రారంభించేవారని మున్సిపల్ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఎక్కడ లోపం.. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో పలు ముఖ్యమైన మార్గాల్లో రోడ్లు, డివైడర్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, భారీ మురికి కాల్వల నిర్మాణాల కోసం ఈ నిధుల ద్వారా అంచనా వ్యయాలు రూపొందించారు. వీటిని స్థానిక ఆర్అండ్బీ అధికారులు సీఈ పరిశీలన కోసం పంపించారు. దానికి సంబంధించి సాంకేతిక అనుమతినిచ్చిన పక్షంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలుస్తారు. అయితే అంచనా వ్యయం రూపొందించి ఇక్కడి నుంచి పంపించామని అధికారులు చెబుతున్నారు. మరి సాంకేతిక అనుమతినివ్వడంలో ప్రధాన కార్యాలయంలో జాప్యం ఎందుకు జరుగుతుందన్నది వారికే తెలియాలి. ప్రధానంగా రోడ్లు, భవనాల నిర్మాణాలు ఉండడంతో వేర్వేరు సీఈలు సాంకేతిక అనుమతులివ్వాల్సి ఉంటుందని, దీనివల్లే ఆలస్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా, కాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బీలో పోస్టుల ఖాళీ నేపథ్యంలో టెండర్ల నిర్వహణ క్రమాలకు సంబంధించి ఇక్కడే జాప్యం జరిగిందన్న విమర్శలు లేకపోలేదు. ఇవి మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కావడం, కేటాయించిన నిధుల్లో అధిక పనులు, అంచనా వ్యయాలు ఉండడంతోనే ఆర్అండ్బీ అధికారులు కొంత నిర్లక్ష్యం చేస్తున్నారన్న అపవాదు వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆర్అండ్బీ చేపట్టే పనులు తక్కువ సంఖ్యలో ఉన్నా అవి వందల వేల కోట్ల రూపాయల విలువైనవి ఉంటాయి. అలాంటి సమయంలో మున్సిపాలిటీకి సంబంధించి కేవలం కొన్ని కోట్ల రూపాయల్లోనే వందల సంఖ్యలో పనుల అంచనా వ్యయాలను రూపొందించడంతో దానికి సాంకేతిక అనుమతినివ్వడంలో పైనుంచి ఆల స్యం జరుగుతుందన్న అభిప్రాయం లేకపోలేదు. 117 పనులు.. రూ.28 కోట్లకు సంబంధించి 117 పనుల అంచనా వ్యయాలను రూపొందించారు. అందులో ప్రధానంగా రిమ్స్ వెనకాల, మహాలక్ష్మివాడలో డ్రైనేజీల నిర్మాణాలు, వివేకానంద చౌక్‌నుంచి రైల్వే స్టేషన్ వరకు, పంజాబ్‌చౌక్ నుంచి దేవిచంద్చౌక్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు చేపట్టాలి. సిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా డివైడర్లలో అందమైన మొక్కలు, ఫౌంటేయిన్స్, పెయింటింగ్స్, తదితరవి చేపట్టాలి. అసంపూర్తిగా మిగిలిన కొత్త మున్సిపాలిటీ భవనానికి సంబంధించి మరో మూడున్నర కోట్లు ఈ నిధుల నుంచే కేటాయించారు. పలుచోట్ల బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. అంచనా వ్యయాలు రూపొందించి పంపించాం మున్సిపాలిటీలో రూ.28 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనా వ్యయాలను రూపొందించి పంపించాం. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు నిర్వహిస్తాం. ప్రభుత్వం నుంచి ఆర్‌అండ్‌బీకి జీఓ రావడంలోనే ఆలస్యం జరిగింది. ఈ నిధుల్లో రోడ్లతోపాటు భవనాల నిర్మాణాలు కూడా ఉండడంతో హెడ్ ఆఫీసులో వేర్వేరు సీఈల నుంచి సాంకేతిక అనుమతి లభించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇవి తుది దశకు వచ్చింది. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం. – వెంకట్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ, ఆదిలాబాద్ -
మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి
కబ్జా భూములు తేల్చేందుకు కమిటీ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష ఆదిలాబాద్ అర్బన్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇందుకు అధికారులందరూ సహకరించాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. రానున్న రెండున్నరేళ్లలో మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోగల లీజ్ ల్యాండ్స్, కబ్జాకు గురైన స్థలాలు, భూములు, కోర్టు కేసులతో పెండింగ్‌లో భూముల వివరాలు సేకరించేందుకు ఒక కమిటీ వేయనున్నట్లు చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జేసీ సుందర్ అబ్నార్‌తో చర్చించారు. ముందుగా కార్యాలయం రికార్డ్సు ఉన్నాయా.. రికార్డులో ఉన్నది.. క్షేత్రస్థాయిలో ఉందా లేదా.. అనేది పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ల్యాండ్ ఉందా.. కబ్జాకు గురైందా.. ఎంత మేరకు ఉంది.. అనే వివరాలు అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. అనంతరం గత సమావేశంలో చర్చించిన అంశాలు ఏవి.. ఎంత మేరకు చర్యలు తీసుకున్నారో మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌కు సంబంధించిన ఆస్తులు, ఆదాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పన్ను చెల్లించడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పన్ను చెల్లించని కార్యాలయాలకు తాళాలు వేస్తే డబ్బులు అవే వస్తాయన్నారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్, అటవీ శాఖ, రోడ్డు భవనాల శాఖ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్‌కు ఆదాయం గతేడాది రూ.9 కోట్లు కాగా, నెలకు రూ.65 లక్షల ఖర్చు ఉందని, ఇందులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరాత్ర ఉన్నాయని వివరించారు. అధికారులు పనులపై దృష్టి పెడితే తప్పక ముందుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో జేసీ సుందర్‌అబ్నార్, మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతయారు, అధికారులు జగదీశ్వర్‌గౌడ్, అయాజ్, సాయికిరణ్, భాస్కర్‌రావు, సుమలత, అనురాధ, ప్రియాంక, శోభ, మమత, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలు ఇంకేప్పుడు..?
ఆదిలాబాద్ కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపాలిటిలో నిధులున్న రాజకీయ పరిణామాలు, అధికారుల బదిలీలు, ఇంచార్జీ కమిషనర్ల బదిలీల ఇబ్బందులతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం మున్సిపాలిటిలో కంటికి క నిఫించకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలో ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇంకుడు గుంతలు తవ్వించకున్నవారికి రూ. 4 వేల ప్రభుత్వం అందజేస్తుంది. కాగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటిలో తమ నిధులతో టెండర్లను ఆహ్వనించి ఇంకుడు గుంతలను తవ్వించాల్సి ఉంటుంది. గత మూడు నెలల కిందట ఇంకుడు గుంతలకు టెండర్లు ఆహ్వనించి ఖరారు చేసిన ఇప్పటి వరకు అది కౌన్సిల్ ఆమోదానికి నోచుకోవడం లేదు. నెలల తరబడి మున్సిపాలిటి ఖాతాలో నిధులు ములుగుతున్నాయి. ఇంకెప్పుడు ఇంకుడు గుంతలకు మోక్షం.. వేసవికాలంలోనే చాలా ఇంకుడు గుంతలకు తవ్వకాలు ప్రభుత్వం చేపట్టింది. ఆయా జిల్లా కార్యాలయాలు , ఇండ్లలోనూ కొందరు సోంత డబ్బులతో ఇంకుడు గుంతలను తవ్వించారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఇటువంటి కన్నెతైన చూడటం లేదు. మున్సిపాలిటిలలో రెగ్యులర్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెళ్లిన నాటి నుంచి ఇంచార్జీ కమిషనర్లుగా వ్యవహరించిన ఆర్డీలో సుధాకర్‌రెడ్డి సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దీంతో పాటు ఆర్వో, ఈఈ , అసిస్టెంట్ కమిషనర్, టీ పీవోలు అనివార్య కారణాలలో లీవ్‌లు పెట్టుకోవడంతో అప్పటి నుంచి పాలన అస్తవ్యస్తంగా మారింది. కాగా ఆర్డీవో సుధాకర్‌రెడ్డి బదిలీపై వెళ్లగా , ఇంచార్జీ స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు బాధ్యతలు తీసుకున్న రెండు రోజులతో రెగ్యులర్ కమిషనర్‌గా కె. అలువేలు మంగతాయారు బాధ్యతలను స్వీకరించారు. కాగా ఇప్పుడైన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతాయా లేదా వేచి చూడాల్సి ఉంది. కౌన్సిల్ సమావేశంలో ఈ పనులకు ఆమోదం తెలిపి పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ వర్షాకాలంలో ఇంకుడు గుంతలు నిర్మించక పోతే వృథాప్రయాసగా మిగుతుంది. నిధులు వృథా అవుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కౌన్సిల్లో ప్రవేశపెడుతాం.. -రంగినేని మనీశ , మున్సిపల్ చైర్పర్సన్ ఇంకుడు గుంతల నిర్మాణాల కోసం ప్రవేశ పెట్టిన టెండర్ల అంశాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టెవిధంగా చూస్తాం. గతంలోనూ ఇంకుడుగుంతల నిర్మాణం పై ప్రజలకు అవగాహన కల్పించాం. త్వరలో కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత పనులు వేగవంతంగా పూర్తయ్యేటట్లు చూస్తాం. ఈ విషయం మా దృష్ఠిలో ఉంది ముందుగానే ఆ విషయం అధికారులతో చర్చిచాం. మరోసారి అధికారులతో మాట్లాడి అందరి సహకరంలో కార్యక్రమాలను చేపడతాం. -
సామూహిక హరితహరాన్ని విజవయంతం చేయండి
ఆదిలాబాద్ కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపాలిటి పరిధిలో సోమవారం నిర్వహించే సామూహిక హరితహరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కె. అలువేలు మంగతాయారు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో శనివారం స్వయం సహయక సంఘాలతో హరితహరం కార్యక్రమం పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హఱితహరం కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములయ్యేలా కాలనీవాసులను చైతన్యం చేయాలని, ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని సూచించారు. పట్టణంలోని 36 వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని, ఆయా కాలనీలకు సంబంధించి స్వయం సహయక సంఘాలు ఇందులో పాల్గొనాలని చెప్పారు. ప్రజలందరిని మొక్కలు నాటించే విధంగా చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. మొక్కలు నాటడం వలన కలిగే లాభాలను తెలియజేయాలని చెప్పారు. ముందుస్తుగా అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రతి వార్డులో వార్డు లేవల్ అధికారులుంటారని, ఆ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం సాగుతుందా లేదా.. అనేది ఫోన్‌ద్వార సమాచారం తెలుసుకునేందుకు సిబ్బందిని నియామించినట్లు చెప్పారు ఎప్పటికప్పుడు ఆ సమాచారంతో ఆయా కాలనీలకు వెళ్తూ మొక్కలను నాటుతాయని చెప్పారు. 18న ఉదయం 7 గంటల నుంచి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందులో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మంద రవిబాబు, శానీటరీ ఇన్స్‌స్పెక్టర్లు ఆయాజ్, జగదీశ్వర్‌గౌడ్, టీపీబీవో అనురాధ, ఏఈ నవీన్‌కుమార్; హరితహరం ఇంచార్జి కె. శ్రీనివాస్, ఐకేపీ టౌన్ మిషన్ కో ఆర్టినేటర్ భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో రచ్చకెక్కిన విభేదాలు
ఆదిలాబాద్ : తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగురామన్నకు ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ వర్గీయుల మధ్య నెలకొన్న విభేదాలు గురువారం తారస్థాయికి చేరాయి. పట్టణంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎవరికి వారే పోటాపోటీగా చేసుకుంటున్నారు. ఛైర్మన్ మనీషాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మంత్రి జోగు రామన్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మంత్రి వ్యవహార శైలిపై మున్సిపల్ ఛైర్మన్ మనీషా వర్గీయులు కారాలు మెరియాలు నూరతున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వం వద్ద పంచాయితీ తేల్చుకోవాలని ఇరు వర్గాలు వ్యూహారచన చేస్తున్నట్లు సమాచారం. -
ఐదు నిమిషాల్లో ముగిసిన సర్వసభ్య సమావేశం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లో ముగిసింది. గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లోనే ముగియడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు కమిషనర్ నాగమల్లేశ్వరరావు చాంబర్‌కు వెళ్లి ఎజెండా పత్రాలు చింపేసి నిరసన తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రజా సమస్యలు చర్చించకుండానే వాయిదా వేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులు నిరసన తెలిపారు. -
మున్సిపల్ సమావేశంలో రభస
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశంలో రభస జరిగింది. పాలకవర్గం, ప్రతిపక్ష కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. సమస్యలపై ఎలాంటి చర్చ లేకుండానే మూడో సమావేశం ముచ్చటగా ముగిసింది. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిషనర్ షాహిద్‌మసూద్, వైఎస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ పాల్గొన్నారు. తొలుత సజావుగా సాగినా అంతలోనే గందరగోళం నెలకొంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏజెండా అంశాల్లో ప్రతిపక్షాలకు నామమాత్రపు ప్రాధాన్యం కల్పించారు. కానీ ప్రతిపక్షాల మాటాలకు సమాధానాలు రాలేదు. ఇంతలోనే టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ అకౌంట్ ఆఫీసర్ అర్చన విధులు నిర్వర్తించడం లేదని ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాలని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆమెకు అండగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ అలల అజయ్, బీజేపీ ప్లోర్లీ డర్ సురేశ్‌జోషి, వైస్‌చైర్‌పర్సన్ ఫరూక్ అహ్మద్‌లో తీర్మానాన్ని అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ల దొంగబిల్లులు చేయకుంటే సరెండర్ చేస్తామనడం సరికాదని మద్దతిచ్చారు. చైర్పర్సన్ బంధువులు చనిపోవడంతో త్వరితగతిన సమావేశం ముగించేశారు. కంటతడి పెట్టిన ఏవో సరెండర్ చేయాలని కమిషనర్‌కు కౌన్సిల్ సభ్యులు తీర్మానం పెట్టగానే అకౌంట్ ఆఫీసర్ అర్చన కన్నీరు పెట్టుకుంది.తనను చైర్పర్సన్ మామ, భర్త , బంధువులు ఫోన్ చేసి వేధిస్తున్నారని సభలో ఆవేదన వ్యక్తం చేసింది. నేను మీ ఇంటి పనిమనిషిని కాదని.. గజిటెడ్ అధికారినని పేర్కొన్నారు. అధికార..ప్రతిపక్షాల వాగ్వాదం కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని అంశాలు తీర్మానం పొందినట్లు చె బుతూ చైర్మన్ వెళ్లేందుకు సిద్ధపడగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్‌లీడర్ అజయ్ అడ్డుకున్నారు. ‘అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేతకాదని ఒప్పుకుని వెళ్లండి లేదా కౌన్సిల్ సమావేశం సజావుగా సాగనివ్వండి’ అంటూ హెచ్చరించారు. దీంతో చైర్పర్సన్ కూర్చుంది. వైఎస్ చైర్మన్ ఫరూక్అహ్మద్ మాట్లాడుతూ, ఇటీవల సర్వే నంబర్ 34ను అక్రమంగా ప్రైవేటు వారికి ఎలా మ్యూటేషన్ చేయించారో కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ కౌన్సిలర్లు కల్పించుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. తోపులాట.. స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. అన్ని అంశాలు అమోదించి పదో అంశాన్ని వదిలేయడంతో స్వతంత్ర కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అడ్డువచ్చిన టీఆర్ఎస్ కౌన్సిలర్లను తోసివేశారు. చైర్‌పర్సన్‌ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మా దయతో చైర్మన్ అయి మా వార్డులో పనులు జరిగే అంశాన్ని ఆమోదించరా అంటూ నిలదీశారు. దీంతో చేసేదేమి లేక కమిషనర్ సలహాతో అంశాన్ని ఆమోదిస్తామని.. నిధులు ఉన్నప్పుడే పనులు చేస్తామని చెప్పడంతో స్వతంత్రులు ఆందోళన విరమించారు. పలు పనులకు ఆమోదం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. 22 అంశాలలో సుమారు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో వర్షాకాలంలో నష్టపోయిన కాలనీలు, పాడైన రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. -
మున్సిపాలిటీలో క‘న్నీటి’ వ్యథ
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని నీటి సమస్య ప్రజలకు కన్నీరు తెప్పిస్తోంది. వేసవిలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. నల్లా నీటి కోసం ఆయా కాలనీల ప్రజలు నిత్యం నిరీక్షించాల్సిన పరిస్థితి. నీటి సరఫరాలో సమయపాలన పాటించనందున పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పన్ను వసూలు చేస్తున్నా.. మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులుండగా 32,554 కుటుంబాలున్నాయి. లక్షా 17వేల 338 జనాభా ఉంది. 11,860 నల్లా కనెక్షన్లున్నాయి. ఇందులో సగానికంటే ఎక్కువ కనెక్షన్లకు నీరు సరఫరా కావడంలేదు. 300 వీధి కుళాయిలుండగా అధికారులు కొన్నింటిని తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 751 చేతిపంపులుండగా 609 మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నల్లా నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేయడం, సమయపాలన లేకుండా 20 నిమిషాలే నీటిని వదలడం తదితర కారణాలతో పట్టణంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మూడేళ్ల కిందటి వరకు నిత్యం నల్లా నీరు సరఫరా అయ్యేది. మూడేళ్లుగా విద్యుత్ కోతలంటూ రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ కోతలు లే నపుడు కూడా నీటి సరఫరాలో ఎలాంటి మార్పులేదు. నల్లా బిల్లు ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. తక్కువ స్థాయిలో సరఫరా.. బల్డియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణ ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. 36 వార్డుల్లో ప్రజలకు 23.92 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 20.36 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇంతకంటే తక్కువ స్థాయిలో నీరు సరఫరా చేస్తున్నట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మావల చెరువు నుంచి ఫిల్డర్బెడ్, హౌసింగ్ బోర్డు, విద్యానగర్ కాలనీల్లో నీటిని సరఫరా చేస్తుండగా, మిగితా కాలనీలకు లాంగసాంగ్వి చెరువు నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. సరిపడా నీరు సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నారు. నిధులు మంజూరైనా.. మున్సిపల్ పరిధిలోని చేతిపంపుల మరమ్మతుకు రూ.18.8 లక్షలు మంజూరైనా అవి నిరుపయోగమయ్యాయి. చేతిపంపు విడి భాగాలు కోనుగోలు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో చేతిపంపులు మరమ్మతుకు నోచుకోవడం లేదు. వేసవి ముగుస్తున్నా అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మావల, లాంగసాంగ్వి ప్రాంతాల నుంచి నీటి సరఫరాకు 18 ఇంచుల పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా పెరిగిన పట్టణ జనాభాకు సరిపోవడం లేదు. జనాభాకు తగినట్లు ఇంతకంటే వెడల్పు పైపులైన్ వేసి తాగునీరు సరఫరా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
‘లెక్క’ లేదు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని స్థానిక సంస్థల్లో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని ఆర్థిక శాఖ ఆడిట్ విభాగం ఎత్తిచూపింది. జిల్లా, మండల పరిషత్‌తోపాటు, గ్రామ పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో జరిగిన అక్రమాలు ఆడిట్ నివేదికలో బట్టబయలయ్యాయి. ఆయా స్థానిక సంస్థల పాలకవర్గాల నేతలు, అధికారులు కలిసి ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంపై ఆడిట్ శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరం లో జిల్లాలోని స్థానిక సంస్థల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏకీకృత ఆడిట్, సమీక్షా నివేదిక (కన్సాలిడేటెడ్ ఆడిట్ రివ్యూ రిపోర్టు)ను గురువారం విడుదల చేసింది. ఈ నివేదికలో జిల్లాలోని పలు సంస్థల్లో జరిగిన అవకతవకలు ఇలా ఉన్నాయి.. జిల్లాలో 2010-11 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా రూ.4.30 కోట్ల నిధులు నిబంధనల కు విరుద్ధంగా ఖర్చయ్యాయని, వీటిపై 1,067 ఆడిట్ శాఖ అభ్యంతరాలు ఉన్నట్లు తెలిపింది. ఇందులో జిల్లా పరిషత్‌కు సంబంధించి రూ.1.14 కోట్ల వ్యయంపై 48 అభ్యంతరాలు, మండల పరిషత్‌లకు సంబంధించి రూ.1.74 కోట్ల వ్యయంపై 455 అభ్యంతరాలు, గ్రామపంచాయతీల్లో రూ.1.41 కోట్లకు సంబంధించి 564 అభ్యంతరాలున్నట్లు తేల్చింది. మున్సిపాలిటీలు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ.3.64 కోట్ల నిధులను నిర్దేశిత అంశాలకు కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఆడిట్‌శాఖ గుర్తించింది. మున్సిపాలిటీకి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఈ నిధులను ఖర్చు చేయడంలో నిబంధనలు తుంగలో తొక్కినట్లు తేలింది. నిర్మల్ మున్సిపాలిటీలో పత్రిక ప్రకటనల జారీలో రూ.లక్షల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. రూ.1.79 లక్షల ప్రకటనల బిల్లులను నిబంధనలకు తుంగలో తొక్కి కట్టబెట్టినట్లు తేల్చారు. మార్కెట్ కమిటీలు.. పత్తి మార్కెట్లలో రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో నిధులు ఖర్చు చేయడంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. ఆ యార్డు పరిధిలోని ఆర్సీసీ గోదాములకు సంబంధించి రూ. 13.33 లక్షల అద్దె బకాయిలు అధికారులు వసూలు చేయడం లేదని తేల్చింది. కళాజాత పేరుతో రూ.2.88లక్షలు కట్టబెట్టినట్లు గుర్తించింది. యార్డులో బందోబస్తు నిర్వహించిన పోలీసులకు భోజన ఖర్చుల పేరిట రూ.2.02 లక్షలు డ్రా చేసినట్లు తేలింది. భైంసా మార్కెట్ యార్డులో రూ.2.07 లక్షల నిధులు పక్కదారి పట్టినట్లు తేలింది. ఇంద్రవెల్లి, జైనథ్ మార్కెట్ కమిటీల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. పంచాయతీరాజ్ సంస్థలు.. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నిర్మల్ సబ్ డివిజన్లో ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల్లో వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని మినహాయించారు. ఇలా మినహాయించిన నిధులు రూ.లక్షల్లో సంబంధిత శాఖలకు డిపాజిట్ చేయనట్లు ఆడిట్లో తేలింది. జిల్లా పరిషత్ ఉద్యోగుల క్వార్టర్లకు సంబంధించి రూ.1.75 లక్షలను రికవరీ చేయాల్సి ఉండగా, వదిలేసినట్లు తేల్చారు. ఉట్నూర్ మండల పరిషత్‌లో రూ.2.60 లక్షల నిధుల వ్యయానికి సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవు. అదేవిధంగా కౌటాల, సిర్పూర్ మండలాల్లో ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన రికార్డులు కూడా ఆడిట్ అధికారులకు చూపలేదు. ఇచ్చోడ మండల పరిషత్‌కు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం వచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆదిలాబాద్ గ్రంథాలయ సంస్థలో కంప్యూటర్ల కొనుగోలు విషయమై రూ. 1. 20 లక్షలను అడ్వాన్స్‌ల రూపంలో డ్రా చేసిన అధికారులు ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయనట్లు తేలింది.