సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలు.. ఐదేళ్లు పూర్తి చేసుకొని నేటితో పదవీకాలం ముగించనున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు జరగని మందమర్రి మున్సిపాలిటీ మినహా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల పాలనకు నేటితో తెర పడనుంది. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను విధించే అవకాశం ఉంది. త్వరలో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక పురపాలికల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.
ఒకచోట మినహా..
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ ఐదు మున్సిపాలిటీలో 2014లో టీఆర్‌ఎస్ పాలకవర్గాలే ఏర్పడ్డాయి. ఒక్క భైంసాలో మాత్రం ఏఐఎంఐఎం పాలకవర్గం ఏర్పడింది. ఒక్క నిర్మల్ మినహాయించి ఐదు పురపాలికల్లో మహిళా చైర్‌పర్సన్‌లే ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఆదిలాబాద్‌లో చైర్‌పర్సన్‌గా రంగినేని మనిషా, వైస్ చైర్మన్‌గా ఫారుఖ్‌అహ్మద్, నిర్మల్‌లో చైర్మన్‌గా అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్‌చైర్మన్‌గా అజీమ్‌బిన్ యాహియ, మంచిర్యాలలో చైర్‌పర్సన్‌గా మామిడిశెట్టి వసుంధర, వైస్‌చైర్మన్‌గా నల్ల శంకర్, బెల్లంపల్లిలో చైర్‌పర్సన్‌గా సునితారాణి, వైస్‌చైర్మన్‌గా సత్యనారాయణ, కాగజ్‌నగర్‌లో చైర్‌పర్సన్‌గా సీపీ విద్యావతి, వైస్ చైర్మన్‌గా సద్దాం హుస్సేన్, భైంసాలో చైర్‌పర్సన్‌గా సఫియా బేగం, వైస్‌చైర్మన్‌గా జాబిర్ అహ్మద్ అప్పట్లో బాధ్యతలు స్వీకరించారు.
అయితే బెల్లంపల్లిలో నాలుగేళ్లు చైర్‌పర్సన్‌గా ఉన్న సునితారాణిపై అవిశ్వాస తీర్మాణం పెట్టి తొలగించడంతో మునిమంద స్వరూప చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. వైస్ చైర్మన్‌గా మాత్రం సత్యనారాయణనే కొనసాగారు. ఇక్కడ మినహా ఉమ్మడి జిల్లాలోని ఐదుబల్దియాల్లో పాలకవర్గాలు సంపూర్ణంగా పాలన ముగించనున్నాయి. అయితే మిగితా పాలకవర్గాల్లోనూ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత సభ్యుల్లో అసంతృప్తి కారణంగా అవిశ్వాసం పెడతారనే ప్రచారం సాగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అప్పటి మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశవాహుల్ని సద్దుమణిగించడంతో అవిశ్వాస వ్యవహారాలు నిలిచిపోయాయి. ఐదేళ్ల పాలన నేటితో పూర్తికానుంది.
కొత్త రాష్ట్రంలో బాధ్యతలు..
ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 30న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. 2014 మే 13న వాటి ఫలితాలు వెలుబడ్డాయి. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్, నిర్మల్‌లో బీఎస్పీ, భైంసాలో ఎంఐఎం, కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్, బెల్లంపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందాయి. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో పాలకవర్గాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు నిర్వహించగా ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగరవేసి పాలన పగ్గాలు చేపట్టింది.
మంచిర్యాల, బెల్లంపల్లిలో కాంగ్రెస్ సభ్యులు అప్పుడు ప్రత్యేక సమావేశంలో విప్‌ను ధిక్కరించి మరీ టీఆర్‌ఎస్‌కు జై కొట్టడంతో ఆ రెండు చోట్ల కూడా టీఆర్‌ఎస్ పాలకవర్గ బాధ్యతలు చేజిక్కించుకుంది. భైంసాలో ఎంఐఎం పదవీ బాధ్యతలు చేపట్టింది. ప్రధానంగా నిర్మల్‌లో అప్పుడు బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నుంచే అభ్యర్థులను బరిలో నిలిపి అత్యధికంగా గెలవడం జరిగింది.
ఆ తర్వాత ఐకేరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో బీఎస్పీ నుంచి కౌన్సిలర్లుగా గెలిచిన సభ్యులు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు బీఎస్పీ కౌన్సిలర్‌గా గెలిచిన అప్పాల గణేష్ టీఆర్‌ఎస్ నుంచి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పాల గణేష్ కాంగ్రెస్‌లోకి మారారు. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవులు ఇచ్చారు.
ఇక కొత్త జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో ఏర్పడిన మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగిసిపోనుండగా త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ద్వారా కొత్త జిల్లాలో కొత్త పాలకవర్గాలు ఏర్పడనున్నాయి. ఆదిలాబాద్‌లో ఆదిలాబాద్, నిర్మల్‌లో నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఉన్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాల్లో ఒక్కో మున్సిపాలిటీ ఉండగా నిర్మల్‌లో 3, మంచిర్యాలలో అత్యధికంగా 7 మున్సిపాలిటీలు ఉండటం గమనార్హం. అయితే మందమర్రి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment