మున్సిపల్ సమావేశంలో రభస | pandemonium in Municipal meeting | Sakshi
Sakshi News home page

మున్సిపల్ సమావేశంలో రభస

Published Sat, Nov 1 2014 4:41 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

మున్సిపల్ సమావేశంలో రభస - Sakshi

మున్సిపల్ సమావేశంలో రభస

 ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశంలో రభస జరిగింది. పాలకవర్గం, ప్రతిపక్ష కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. సమస్యలపై ఎలాంటి చర్చ లేకుండానే మూడో సమావేశం ముచ్చటగా ముగిసింది. శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిషనర్ షాహిద్‌మసూద్, వైఎస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ పాల్గొన్నారు. తొలుత సజావుగా సాగినా అంతలోనే గందరగోళం నెలకొంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏజెండా అంశాల్లో ప్రతిపక్షాలకు నామమాత్రపు ప్రాధాన్యం కల్పించారు. కానీ ప్రతిపక్షాల మాటాలకు సమాధానాలు రాలేదు.

ఇంతలోనే టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ అకౌంట్ ఆఫీసర్ అర్చన విధులు నిర్వర్తించడం లేదని ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆమెకు అండగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ అలల అజయ్, బీజేపీ ప్లోర్‌లీ డర్ సురేశ్‌జోషి, వైస్‌చైర్‌పర్సన్ ఫరూక్ అహ్మద్‌లో తీర్మానాన్ని అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ల దొంగబిల్లులు చేయకుంటే సరెండర్ చేస్తామనడం సరికాదని మద్దతిచ్చారు. చైర్‌పర్సన్ బంధువులు చనిపోవడంతో త్వరితగతిన సమావేశం ముగించేశారు.
 
కంటతడి పెట్టిన ఏవో
సరెండర్ చేయాలని కమిషనర్‌కు కౌన్సిల్ సభ్యులు తీర్మానం పెట్టగానే అకౌంట్ ఆఫీసర్ అర్చన కన్నీరు పెట్టుకుంది.తనను చైర్‌పర్సన్ మామ, భర్త , బంధువులు ఫోన్ చేసి వేధిస్తున్నారని సభలో ఆవేదన వ్యక్తం చేసింది. నేను మీ ఇంటి పనిమనిషిని కాదని.. గజిటెడ్ అధికారినని పేర్కొన్నారు.  
 
అధికార..ప్రతిపక్షాల వాగ్వాదం
కౌన్సిల్ సమావేశంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని అంశాలు తీర్మానం పొందినట్లు చె బుతూ చైర్మన్ వెళ్లేందుకు సిద్ధపడగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్‌లీడర్ అజయ్ అడ్డుకున్నారు. ‘అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేతకాదని ఒప్పుకుని వెళ్లండి లేదా కౌన్సిల్ సమావేశం సజావుగా సాగనివ్వండి’ అంటూ హెచ్చరించారు. దీంతో  చైర్‌పర్సన్ కూర్చుంది. వైఎస్ చైర్మన్ ఫరూక్‌అహ్మద్ మాట్లాడుతూ, ఇటీవల సర్వే నంబర్ 34ను అక్రమంగా ప్రైవేటు వారికి ఎలా మ్యూటేషన్ చేయించారో కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కల్పించుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది.  
 
తోపులాట..
స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. అన్ని అంశాలు అమోదించి పదో అంశాన్ని వదిలేయడంతో స్వతంత్ర కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అడ్డువచ్చిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్లను తోసివేశారు. చైర్‌పర్సన్‌ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మా దయతో చైర్‌మన్ అయి మా వార్డులో పనులు జరిగే అంశాన్ని ఆమోదించరా అంటూ నిలదీశారు. దీంతో చేసేదేమి లేక కమిషనర్ సలహాతో అంశాన్ని ఆమోదిస్తామని.. నిధులు ఉన్నప్పుడే పనులు చేస్తామని చెప్పడంతో స్వతంత్రులు ఆందోళన విరమించారు.
 
పలు పనులకు ఆమోదం
మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. 22 అంశాలలో సుమారు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో వర్షాకాలంలో నష్టపోయిన కాలనీలు, పాడైన రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement