The ruling class
-
కళ్లున్నా చూడలేని ఆర్మూర్ మున్సిపాలిటీ..
బలహీనమైన పాలకవర్గం.. ఆదాయానికి గండి.. మున్సిపల్ మడిగెలకు నామమాత్రపు అద్దె అద్దె పెంపు గడువు ముగిసి ఏడాది.. ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపాలిటీలో పాలకవర్గం బలహీనతను ఆసరాగా తీసుకొని మున్సిపల్ కాంప్లెక్స్‌లో మడిగెలను వ్యాపారుస్తులు నామమాత్రపు అద్దె చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇటీవల పాలకవర్గంతో పాటు మున్సిపల్ అధికారులను మేనేజ్ చేయడానికి సదరు మడిగెల్లో ఉంటున్న 9మంది వ్యాపారస్తులు ఒక్కొక్కరు రూ.35వేల చొప్పున రూ.3,15,000 వసూలు చేసినట్లు తెలిసింది. సుమారు 50 ఏళ్ల క్రితం ఆర్మూర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ స్థలంలో పంత్ రోడ్డులో 9 దుకాణాలను నిర్మించారు. ఈ దుకాణలపై అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్‌లో జమ చేస్తూ వచ్చారు. అప్పటినుంచే పాలకులు, అధికారులు దుకాణాదారుల నుంచి నామమాత్రపు అద్దెనే వసూలు చేస్తూ వస్తున్నారు. 1998లో గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి చెందిన దుకాణాల్లో కొనసాగుతున్న వ్యాపారస్తుల పేర్లు మారుస్తూ దుకాణాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి పాలకవర్గం సమావేశమై మడిగెల అద్దెపై 33.5 శాతం పెంచుతూ రావాలి. 2006లో ఆర్మూర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. కాని పాలకులు, అధికారులు మాత్రం వ్యాపారస్తులకు అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా కేవలం రూ.3,000 అద్దెతో కొనసాగుతున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువగా.. పంత్రోడ్డులో ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. అయితే మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న మడిగెలకు నెలకు, రూ.3,000 అద్దె వసూలు చేస్తే.. రోడ్డు అవతలివైపు ఉన్న ప్రైవేట్ కాంప్లెక్స్‌లలో ఉన్న మడిగెలకు ఒక్కోదానికి నెలకు రూ.10,000 నుంచి రూ.12,000 వసూలు చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏం జరిగింది.. జీవో నెంబర్ 56 ఆధారంగా పాలకవర్గం అద్దె పెంపులో మున్సిపాలిటీకి ఆదాయం పెంచడంలో సానుకూలంగా వ్యవహరించని సమయంలో మున్సిపల్ కమిషనర్ సీడీఎంకు లేఖ ద్వారా తెలియజేసి వారి ఆదేశాల మేరకు అద్దెను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కాని ఇందులో ఏ ఒక్కటీ జరగలేదు. విషయమేమిటంటే ఈ కాంప్లెక్స్‌లో 9మంది దుకాణాదారులు పొట్టకూటి కోసం వ్యాపారాలు చేస్తున్నారు అనుకుంటే పొరపాటే... అంతా కోటీశ్వరులే ఉన్నారు. అదే మార్కెట్లో వారికి షాపింగ్‌మాల్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పేరిట కూడా అద్దె కొనసాగుతోంది. గడువు ముగిసి.. ఈ దుకాణాల అద్దె పెంపు గడువు 2015 అక్టోబర్ 31 నాటికే ముగిసి పోయింది. కాని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం తమకేమీ పట్టనట్లుగా ఉండిపోయారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిన విషయం ఆర్మూర్ పట్టణంలో బహిరంగ రహస్యమే. అవినీతికి తావు లేకుండా అద్దె పెంచుతాం. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9 దుకాణాల అద్దె పెంపు గడువు ముగిసి ఏడాది గడుస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన అధికారులు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా మున్సిపాలిటీకి ఆదాయం పెంచడమే లక్ష్యంగా అద్దె పెంపు ఒప్పందాన్ని పూర్తి చేస్తాము. నిబంధనలకు విరుద్దంగా కేటాయింపులు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాము. - శైలజ, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్ -
మున్సిపల్ సమావేశంలో రభస
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశంలో రభస జరిగింది. పాలకవర్గం, ప్రతిపక్ష కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. సమస్యలపై ఎలాంటి చర్చ లేకుండానే మూడో సమావేశం ముచ్చటగా ముగిసింది. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిషనర్ షాహిద్‌మసూద్, వైఎస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ పాల్గొన్నారు. తొలుత సజావుగా సాగినా అంతలోనే గందరగోళం నెలకొంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏజెండా అంశాల్లో ప్రతిపక్షాలకు నామమాత్రపు ప్రాధాన్యం కల్పించారు. కానీ ప్రతిపక్షాల మాటాలకు సమాధానాలు రాలేదు. ఇంతలోనే టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ అకౌంట్ ఆఫీసర్ అర్చన విధులు నిర్వర్తించడం లేదని ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాలని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆమెకు అండగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ అలల అజయ్, బీజేపీ ప్లోర్లీ డర్ సురేశ్‌జోషి, వైస్‌చైర్‌పర్సన్ ఫరూక్ అహ్మద్‌లో తీర్మానాన్ని అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ల దొంగబిల్లులు చేయకుంటే సరెండర్ చేస్తామనడం సరికాదని మద్దతిచ్చారు. చైర్పర్సన్ బంధువులు చనిపోవడంతో త్వరితగతిన సమావేశం ముగించేశారు. కంటతడి పెట్టిన ఏవో సరెండర్ చేయాలని కమిషనర్‌కు కౌన్సిల్ సభ్యులు తీర్మానం పెట్టగానే అకౌంట్ ఆఫీసర్ అర్చన కన్నీరు పెట్టుకుంది.తనను చైర్పర్సన్ మామ, భర్త , బంధువులు ఫోన్ చేసి వేధిస్తున్నారని సభలో ఆవేదన వ్యక్తం చేసింది. నేను మీ ఇంటి పనిమనిషిని కాదని.. గజిటెడ్ అధికారినని పేర్కొన్నారు. అధికార..ప్రతిపక్షాల వాగ్వాదం కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని అంశాలు తీర్మానం పొందినట్లు చె బుతూ చైర్మన్ వెళ్లేందుకు సిద్ధపడగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్‌లీడర్ అజయ్ అడ్డుకున్నారు. ‘అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేతకాదని ఒప్పుకుని వెళ్లండి లేదా కౌన్సిల్ సమావేశం సజావుగా సాగనివ్వండి’ అంటూ హెచ్చరించారు. దీంతో చైర్పర్సన్ కూర్చుంది. వైఎస్ చైర్మన్ ఫరూక్అహ్మద్ మాట్లాడుతూ, ఇటీవల సర్వే నంబర్ 34ను అక్రమంగా ప్రైవేటు వారికి ఎలా మ్యూటేషన్ చేయించారో కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ కౌన్సిలర్లు కల్పించుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. తోపులాట.. స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. అన్ని అంశాలు అమోదించి పదో అంశాన్ని వదిలేయడంతో స్వతంత్ర కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అడ్డువచ్చిన టీఆర్ఎస్ కౌన్సిలర్లను తోసివేశారు. చైర్‌పర్సన్‌ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మా దయతో చైర్మన్ అయి మా వార్డులో పనులు జరిగే అంశాన్ని ఆమోదించరా అంటూ నిలదీశారు. దీంతో చేసేదేమి లేక కమిషనర్ సలహాతో అంశాన్ని ఆమోదిస్తామని.. నిధులు ఉన్నప్పుడే పనులు చేస్తామని చెప్పడంతో స్వతంత్రులు ఆందోళన విరమించారు. పలు పనులకు ఆమోదం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. 22 అంశాలలో సుమారు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో వర్షాకాలంలో నష్టపోయిన కాలనీలు, పాడైన రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు.