కళ్లున్నా చూడలేని ఆర్మూర్ మున్సిపాలిటీ.. | ARMOOR can not see the eyes of the municipality .. | Sakshi
Sakshi News home page

కళ్లున్నా చూడలేని ఆర్మూర్ మున్సిపాలిటీ..

Published Mon, Nov 7 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

కళ్లున్నా చూడలేని ఆర్మూర్ మున్సిపాలిటీ..

కళ్లున్నా చూడలేని ఆర్మూర్ మున్సిపాలిటీ..

బలహీనమైన    పాలకవర్గం.. ఆదాయానికి గండి..
మున్సిపల్ మడిగెలకు నామమాత్రపు అద్దె
అద్దె పెంపు గడువు ముగిసి ఏడాది..
 

ఆర్మూర్ :   ఆర్మూర్ మున్సిపాలిటీలో పాలకవర్గం బలహీనతను ఆసరాగా తీసుకొని మున్సిపల్ కాంప్లెక్స్‌లో మడిగెలను వ్యాపారుస్తులు నామమాత్రపు అద్దె చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇటీవల పాలకవర్గంతో పాటు మున్సిపల్ అధికారులను మేనేజ్ చేయడానికి సదరు మడిగెల్లో ఉంటున్న 9మంది వ్యాపారస్తులు ఒక్కొక్కరు రూ.35వేల చొప్పున రూ.3,15,000 వసూలు చేసినట్లు తెలిసింది. సుమారు 50 ఏళ్ల క్రితం ఆర్మూర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ స్థలంలో పంత్ రోడ్డులో 9 దుకాణాలను నిర్మించారు. ఈ దుకాణలపై అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్‌లో జమ చేస్తూ వచ్చారు.

అప్పటినుంచే పాలకులు, అధికారులు దుకాణాదారుల నుంచి నామమాత్రపు అద్దెనే వసూలు చేస్తూ వస్తున్నారు.  1998లో గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి చెందిన దుకాణాల్లో కొనసాగుతున్న వ్యాపారస్తుల పేర్లు మారుస్తూ దుకాణాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి పాలకవర్గం సమావేశమై మడిగెల అద్దెపై 33.5 శాతం పెంచుతూ రావాలి.  2006లో ఆర్మూర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. కాని పాలకులు, అధికారులు మాత్రం వ్యాపారస్తులకు అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా కేవలం రూ.3,000 అద్దెతో కొనసాగుతున్నారు.  
 మార్కెట్ ధర కంటే తక్కువగా..
 పంత్‌రోడ్డులో ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. అయితే మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న మడిగెలకు నెలకు, రూ.3,000 అద్దె వసూలు చేస్తే.. రోడ్డు అవతలివైపు ఉన్న ప్రైవేట్ కాంప్లెక్స్‌లలో ఉన్న మడిగెలకు ఒక్కోదానికి నెలకు రూ.10,000 నుంచి రూ.12,000 వసూలు చేస్తున్నారు.

ఆర్మూర్ మున్సిపాలిటీలో  ఏం జరిగింది..
జీవో నెంబర్ 56 ఆధారంగా పాలకవర్గం అద్దె పెంపులో మున్సిపాలిటీకి ఆదాయం పెంచడంలో సానుకూలంగా వ్యవహరించని సమయంలో మున్సిపల్ కమిషనర్ సీడీఎంకు లేఖ ద్వారా తెలియజేసి వారి ఆదేశాల మేరకు అద్దెను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కాని ఇందులో ఏ ఒక్కటీ జరగలేదు. విషయమేమిటంటే ఈ కాంప్లెక్స్‌లో 9మంది దుకాణాదారులు పొట్టకూటి కోసం వ్యాపారాలు చేస్తున్నారు అనుకుంటే పొరపాటే... అంతా కోటీశ్వరులే ఉన్నారు. అదే మార్కెట్‌లో వారికి షాపింగ్‌మాల్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పేరిట కూడా అద్దె కొనసాగుతోంది.
 
గడువు ముగిసి..
ఈ దుకాణాల అద్దె పెంపు గడువు 2015 అక్టోబర్ 31 నాటికే ముగిసి పోయింది. కాని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం తమకేమీ పట్టనట్లుగా ఉండిపోయారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిన విషయం ఆర్మూర్ పట్టణంలో బహిరంగ రహస్యమే.
 
అవినీతికి తావు లేకుండా అద్దె పెంచుతాం.
 ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9 దుకాణాల అద్దె పెంపు గడువు ముగిసి ఏడాది గడుస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన అధికారులు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా మున్సిపాలిటీకి ఆదాయం పెంచడమే లక్ష్యంగా అద్దె పెంపు ఒప్పందాన్ని పూర్తి చేస్తాము.  నిబంధనలకు విరుద్దంగా కేటాయింపులు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాము.     - శైలజ, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement