సాక్షి, నిజామాబాద్: శవయాత్రలో భాగంగా కోర్టు ముందు డప్పులు వాయిస్తూ బాణాసంచా పేల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడిన సంఘటన ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు..ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీకి చెందిన ప్యాట్ల లక్ష్మన్(45) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని కోర్టు మీదుగా శవయాత్రతో బయలుదేరారు.
ఈ క్రమంలో కోర్టు ఎదుట గల అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా పేల్చారు. కోర్టు ఎదుట నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించి తమ విధులకు ఆటంకం కల్పించిన వారిని తన ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనకు బాధ్యులైన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి చర్యను నిరసిస్తూ పట్టణంలోని ఎల్‌ఐసీ భవనం ఎదుట 63వ నెంబరు జాతీయ రహదారిపై మృతదేహంతో నాలుగు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డుకు అడ్డంగా కూర్చుని రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు బస్సులు వదిలి కాలినడకన బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆర్మూర్ సీఐ రాఘవేందర్‌తో పాటు పోలీసులు ఆందోళనకారులకు ఎంత సర్దిచెప్పినా వినలేదు. తమ బంధువులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు రాస్తారోకోను విరమించేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. అంత్యక్రియలు సైతం చేసేది లేదంటూ తేల్చిచెప్పారు. చివరికి ఆర్మూర్ ఏసీపీ అందె రాములు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాస్తారోకో చేస్తున్న స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. వారిపై ఎలాంటి కేసులు ఉండవని పోలీసులతో పాటు న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, ఎంకే నరేందర్, గంట సదానందం హామీ ఇవ్వడంతో రాస్తోరోకో విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment