
సాక్షి, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఒకటవ టౌన్‌లో సైబర్ క్రైమ్ కేసులో విచారణ జరుపుతున్న ఆలకుంట సంపత్(31) గురువారం రాత్రి పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్న సమయంలో ఎడమ చేతి నొప్పి రావడంతో జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వెళ్లిన తర్వాత చికిత్స పొందుతూ సంపత్ మృతి చెందాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లాలోని అంతర్‌గామ్‌లోని ఒడ్డెర కాలనీకి చెందిన సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. డేటా ఏంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూళ్లు చేశారు. లావోస్ దేశం పంపించి అక్కడ సైబర్ నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంకు వెళ్లి వారి సహాకారంతో భారతదేశంకు తిరిగివచ్చారు. భారతదేశంలోని రాయబార కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆలకుంట సంపత్, దండగుల చిరంజీవి, రాజారెడ్డిని నిజామాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 4న రిమాండ్‌కు తరలించారు. సంపత్‌తో పాటు చిరంజీవిని ఈనెల 12న కోర్టు అనుమతితో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లి విచారించినట్లు తెలుస్తోంది. అనంతరం నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరుపుతున్న సమయంలో సంపత్‌కు ఎడమ చేతి నొప్పి రావడంతో సైబర్ క్రైమ్ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది జీజీహెచ్‌కు తరలించారు.
చికిత్స పొందుతున్న సమయంలో ఫిట్స్ రావడంతో సంపత్ చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. గురువారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో సైబర్ క్రైమ్ పోలీస్ నెంబర్ నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సంపత్ గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పడంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు సంపత్ తీవ్రంగా గాయపడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబంసభ్యుల న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా చేశారు. వీడియో ద్వారా పోస్టుమార్టరం నిర్వహిస్తామని డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. పోలీసుల విచారణలో సంపత్ మృతి చెందాడా లేక ఆసుపత్రిలో మృతి చెందాడా.. అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment