సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని స్థానిక సంస్థల్లో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని ఆర్థిక శాఖ ఆడిట్ విభాగం ఎత్తిచూపింది. జిల్లా, మండల పరిషత్‌తోపాటు, గ్రామ పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో జరిగిన అక్రమాలు ఆడిట్ నివేదికలో బట్టబయలయ్యాయి. ఆయా స్థానిక సంస్థల పాలకవర్గాల నేతలు, అధికారులు కలిసి ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంపై ఆడిట్ శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరం లో జిల్లాలోని స్థానిక సంస్థల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏకీకృత ఆడిట్, సమీక్షా నివేదిక (కన్సాలిడేటెడ్ ఆడిట్ రివ్యూ రిపోర్టు)ను గురువారం విడుదల చేసింది.
ఈ నివేదికలో జిల్లాలోని పలు సంస్థల్లో జరిగిన అవకతవకలు ఇలా ఉన్నాయి..
జిల్లాలో 2010-11 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా రూ.4.30 కోట్ల నిధులు నిబంధనల కు విరుద్ధంగా ఖర్చయ్యాయని, వీటిపై 1,067 ఆడిట్ శాఖ అభ్యంతరాలు ఉన్నట్లు తెలిపింది. ఇందులో జిల్లా పరిషత్‌కు సంబంధించి రూ.1.14 కోట్ల వ్యయంపై 48 అభ్యంతరాలు, మండల పరిషత్‌లకు సంబంధించి రూ.1.74 కోట్ల వ్యయంపై 455 అభ్యంతరాలు, గ్రామపంచాయతీల్లో రూ.1.41 కోట్లకు సంబంధించి 564 అభ్యంతరాలున్నట్లు తేల్చింది.
మున్సిపాలిటీలు..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ.3.64 కోట్ల నిధులను నిర్దేశిత అంశాలకు కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఆడిట్‌శాఖ గుర్తించింది. మున్సిపాలిటీకి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఈ నిధులను ఖర్చు చేయడంలో నిబంధనలు తుంగలో తొక్కినట్లు తేలింది.
నిర్మల్ మున్సిపాలిటీలో పత్రిక ప్రకటనల జారీలో రూ.లక్షల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. రూ.1.79 లక్షల ప్రకటనల బిల్లులను నిబంధనలకు తుంగలో తొక్కి కట్టబెట్టినట్లు తేల్చారు.
మార్కెట్ కమిటీలు..
పత్తి మార్కెట్‌లలో రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో నిధులు ఖర్చు చేయడంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. ఆ యార్డు పరిధిలోని ఆర్‌సీసీ గోదాములకు సంబంధించి రూ. 13.33 లక్షల అద్దె బకాయిలు అధికారులు వసూలు చేయడం లేదని తేల్చింది. కళాజాత పేరుతో రూ.2.88లక్షలు కట్టబెట్టినట్లు గుర్తించింది. యార్డులో బందోబస్తు నిర్వహించిన పోలీసులకు భోజన ఖర్చుల పేరిట రూ.2.02 లక్షలు డ్రా చేసినట్లు తేలింది.
భైంసా మార్కెట్ యార్డులో రూ.2.07 లక్షల నిధులు పక్కదారి పట్టినట్లు తేలింది. ఇంద్రవెల్లి, జైనథ్ మార్కెట్ కమిటీల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు.
పంచాయతీరాజ్ సంస్థలు..
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నిర్మల్ సబ్ డివిజన్‌లో ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల్లో వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని మినహాయించారు. ఇలా మినహాయించిన నిధులు రూ.లక్షల్లో సంబంధిత శాఖలకు డిపాజిట్ చేయనట్లు ఆడిట్‌లో తేలింది.
జిల్లా పరిషత్ ఉద్యోగుల క్వార్టర్లకు సంబంధించి రూ.1.75 లక్షలను రికవరీ చేయాల్సి ఉండగా, వదిలేసినట్లు తేల్చారు.
ఉట్నూర్ మండల పరిషత్‌లో రూ.2.60 లక్షల నిధుల వ్యయానికి సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవు. అదేవిధంగా కౌటాల, సిర్పూర్ మండలాల్లో ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన రికార్డులు కూడా ఆడిట్ అధికారులకు చూపలేదు.
ఇచ్చోడ మండల పరిషత్‌కు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం వచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్లిపోయినట్లు గుర్తించారు.
ఆదిలాబాద్ గ్రంథాలయ సంస్థలో కంప్యూటర్ల కొనుగోలు విషయమై రూ. 1. 20 లక్షలను అడ్వాన్స్‌ల రూపంలో డ్రా చేసిన అధికారులు ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయనట్లు తేలింది.
‘లెక్క’ లేదు
Published Fri, Feb 14 2014 2:24 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement