ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ నిర్వహించిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమానికి అధికార యంత్రాంగం స్పందించింది. నిరుపేదల ఆవాసాలకు గుర్తింపు లభించింది.
ఆదిలాబాద్ రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ నిర్వహించిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమానికి అధికార యంత్రాంగం స్పందించింది. నిరుపేదల ఆవాసాలకు గుర్తింపు లభించింది. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందన్న ఆనందం పేదల్లో వ్యక్తమైంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ‘వీఐపీ రిపోర్టర్’గా ఆదిలాబాద్ సమీపంలోని భగత్‌సింగ్‌నగర్ కాలనీలో శనివారం పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న విషయం విదితమే. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్మిక కుటుంబాలు మంత్రికి ఏకరువు పెట్టాయి.
పింఛన్లు అందడం లేదని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, విద్యుత్ సౌకర్యం లేక చీకటల్లో కాలం వెళ్లదీస్తున్నామని వివరించారు. నివాసాలకు గతంలో పట్టాలు ఇచ్చినా ఇంటి నంబర్లు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి వెంటనే ఇళ్ల నంబర్లు వేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సర్పంచు రాథోడ్‌రామారావు, కార్యదర్శి కలీమ్, పంచాయతీ సిబ్బంది కాలనీ లో పర్యటించి పట్టాలున్న ఇళ్లకు నంబర్లు వేశారు. గతంలో పట్టాలు మంజూరైన 440 ఇళ్లకు నంబర్లు వేస్తామని సర్పంచు రామారావు తెలిపారు.