కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్య సేవలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు ఓ చిన్నారికి అరుదైన చికిత్స అందించారు. నాలుగు నెలల క్రితం 650 గ్రాముల బరువుతో జన్మించిన పాపకు చికిత్సతో పునర్జన్మను ప్రసాదించారు.
గత సెప్టెంబర్ 9న ఆదిలాబాద్‌లోని శాంతినగర్ కాలనీకి చెందిన రాకేశ్, విజయలక్ష్మి దంపతులకు 650 గ్రాముల బరువుతో పాప జన్మించింది. అతి తక్కువ బరువుతో జన్మించిన పాపను రిమ్స్ వైద్యులు నాలుగు నెలలు ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి వైద్యమందించారు. బరువు 1.9 కిలోలకు చేరి మామూలు స్థితికి రావడంతో చిన్నారిని ఆదివారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా డిశ్చార్జి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అతితక్కువ బరువుతో పుట్టిన పాపను మామూలు స్థితికి తీసుకు రావడంపై రిమ్స్ వైద్యులను అభినందించారు. వైద్యుల కొరత ఉన్నా రాష్ట్రంలోనే ఏ ఆస్పత్రిలో లేని విధంగా పాపను వైద్యంతో బతికించడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో రిమ్స్ ఇన్‌చార్జి డెరైక్టర్ అశోక్, చిన్నపిల్లల వైద్య నిపుణులు సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.