కోవిడ్‌ తగ్గిన తర్వాత ఎన్నిరోజులకు వ్యాక్సిన్‌ తీసుకోవాలి? | How Many Days After Recovery From Covid Should take Vaccine | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే వైరస్‌ కట్టడి 

Published Mon, May 24 2021 8:26 AM | Last Updated on Mon, May 24 2021 8:29 AM

How Many Days After Recovery From Covid Should take Vaccine - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి చాలా వేగంగా ఉంది. స్వీయ నియంత్రణతోనే వైరస్‌ను కట్టడి చేయవచ్చు. ప్రతిఒక్కరు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలి. కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వచ్చిన వారు భయాందోళనకు గురికావొద్దు. ప్రభుత్వం ఇచ్చే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌ వాడితే నయం అవుతుందని డాక్టర్‌ పవార్‌ రమేష్‌ ఎండీ (పల్మొనరి మెడిసిన్‌) తెలిపారు. ఆయనతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి కోవిడ్‌తో బాధపడుతున్న వారితో పాటు పలువురు ఫోన్‌చేసి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమం నిర్ణయించినప్పటికీ 11 గంటల తర్వాత కూడా ఫోన్‌ చేసినవారి సందేహాలను సైతం నివృత్తి చేశారు. 

ప్రశ్న: కోవిడ్‌ సోకి ఐదు రోజులైంది. ప్రభుత్వం ఇచ్చే కిట్‌ వాడుతున్నా. ఇంకా ఎలాంటి మందులు వాడాలి.?– గుర్రాల రాజేష్, ఆదిలాబాద్‌. 
డాక్టర్‌:
ప్రభుత్వం ఇచ్చిన కిట్‌ వాడితే సరిపోతుంది. లక్షణాలు లేకపోయినా కిట్‌ను వాడాలి. ఆయాసం, ఆక్సిజన్‌ రేటు పడిపోతే వైద్యుడిని సంప్రదించాలి.  విటమిన్‌ –సి, విటమిన్‌ –డి, మల్టీవిటమిన్‌లు తీసుకోవాలి. 

ప్రశ్న: కోవిడ్‌ తగ్గిన తర్వాత ఎన్నిరోజులకు వ్యాక్సిన్‌ తీసుకోవాలి.?  – కవిత, మావల 
డాక్టర్‌:
కోవిడ్‌ సోకి నయం అయిన మూడు నెలల తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. కోవిడ్‌ తగ్గిన వ్యక్తుల్లో యాంటీబాడీలు తయారవుతాయి. దాదాపు ఆరు నెలల వరకు మళ్లీ కోవిడ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినంత మాత్రానా అజాగ్రత్త వహించొద్దు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. 

ప్రశ్న: జ్వరం వస్తుంది తగ్గడం లేదు.. గొంతునొప్పి ఉంది. కరోనా నిర్దారణ పరీక్ష చేస్తే నెగెటివ్‌ వచ్చింది. ఏం చేయాలి.?– శోభన్, ఉట్నూర్‌ 
డాక్టర్‌: కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత జ్వరం తగ్గకపోయినా లక్షణాలు ఉంటే ఎక్స్‌రే కానీ, సిటీ స్కాన్‌ చేయించాలి. అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. 
ప్రశ్న: నాకు షుగర్‌ వ్యాధి ఉంది. నా వయస్సు 50 సంవత్సరాలు. నేను వ్యాక్సిన్‌  వేయించుకోవచ్చా..?  – రవీందర్, బోథ్‌ 
డాక్టర్‌: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ వేయించుకోవడం మంచిది. 

ప్రశ్న: పాజిటీవ్‌ వచ్చి 20 రోజులైంది.. ఇంకా దగ్గు తగ్గడం లేదు.. జ్వరం తగ్గడం లేదు.? – సుధాకర్, బోథ్,  – గణేష్, కౌఠ 
డాక్టర్‌:
దమ్ము రాకపోతే దగ్గు ఉన్నప్పటికీ ఏం కాదు. భయపడాల్సిన అవసరం లేదు. 14 రోజులు దాటిన తర్వాత కోవిడ్‌ తగ్గిపోతుంది. దగ్గు మరింత ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. 

ప్రశ్న: నెలకిందట పాజిటివ్‌ వచ్చింది. సిటీ స్కాన్‌ చేస్తే 15 శాతం వైరస్‌ ఉన్నట్లు డాక్టర్‌ చెప్పారు. ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందాను. ప్రస్తుతం ఆక్సిజన్‌ 94 శాతం ఉంది. ఇంకా ఇంట్లో ఉండి ఆక్సిజన్‌ వాడుతున్నా..?– చిన్నాజీ, బోథ్‌ 
డాక్టర్‌: ఆక్సిజన్‌ రేటు క్రమంగా పెరుగుతుంది. నడిచినప్పుడు ఆయాసం వస్తే వైద్యుడిని సంప్రదించాలి. త్వరలోనే నయం అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. వైద్యులు ఇచ్చి న మందులను వాడాలి. 

ప్రశ్న: పాజిటివ్‌ వచ్చి నాలుగు రోజులైంది. లక్షణాలు లేవు. దమ్ము ఉంది.? – భూమన్న, బజార్‌హత్నూర్‌ 
డాక్టర్‌: దమ్ము ఉంటే ఎక్స్‌రే తీయించుకోవాలి. కరోనా వచ్చిన 10 రోజులు చాలా కీలకం. చివరి ఐదురోజుల్లోనే ఆరోగ్యం క్షీణిస్తుంది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటే ఆక్సిజన్‌ పల్స్‌రేటు చూసుకోవాలి. కరోనా మందులను వాడాలి. 

ప్రశ్న: ఈనెల 16న కరోనా వచ్చింది. నేను అస్తమా పేషెంట్‌ని. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఆక్సిజన్‌ 98 శాతంఉంది..? – ఆనంద్,     ఆదిలాబాద్‌ 
డాక్టర్‌: అస్తమా ఉన్నవారు అస్తమాకు సంబంధించిన మందులతో పాటు కోవిడ్‌ కిట్‌ వాడాలి. దగ్గు ఎక్కువగా ఉన్నా, దమ్ము వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలి. దమ్ము మరీ ఎక్కువగా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందడం మంచిది. 

ప్రశ్న: కోవిడ్‌ రావడంతో 50శాతం ఊపిరితిత్తులు చెడిపోయాయి. ఆక్సిజన్‌ రేటు అప్పుడే పెరుగుతుంది, తగ్గుతుంది..?– గంగమ్మ, పొచ్చర 
డాక్టర్‌:
నడిచినప్పుడు కానీ, మరుగుదొడ్లు, మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు పల్స్‌రేటు పడిపోవడం, ఆయాసం వస్తే వైద్యుడిని చూపించుకోవాలి. కార్డియాలజీ వైద్యుడిని కూడా సంప్రదించాలి. సిటీ స్కాన్‌ మరోసారి చేయించుకుంటే బాగుంటుంది. 

ప్రశ్న: నాకు అక్టోబర్‌ 2న పాజిటివ్‌ వచ్చింది. ఆరు నెలల నుంచి ఇంకా నీరసం తగ్గడం లేదు. ఇంకా కోవిడ్‌ ఉంటుందా.– శ్రీనివాస్, సూర్యపేట్‌ 
డాక్టర్‌:
ఆరు నెలల వరకు కోవిడ్‌ ఉండదు. 14 రోజుల నుంచి 18 రోజుల వరకే కోవిడ్‌ ఉంటుంది. పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. 

ప్రశ్న: వాడిన మాస్కులు ఉపయోగిస్తే బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందా..?  – సాయిప్రసాద్, సొనాల 
డాక్టర్‌: ఒక మాస్కును 24 గంటల వరకు వాడొచ్చు. ఆ తర్వాత శుభ్రపర్చుకుంటే బాగుంటుంది. క్లాత్‌ మాస్క్‌ అయినా, సర్జికల్‌ మాస్క్‌ అయినా ఎక్కువ రోజులు వాడకూడదు. ఐదు మాస్కులు కొనుగోలు చేసి రోజుకొకటి చొప్పున వాడితే బాగుంటుంది. 

ప్రశ్న: కోవిడ్‌ వచ్చి 25 రోజులైంది.. నిద్రలో ఉలికిపడుతున్నా..?  – మహేష్, సిరికొండ 
డాక్టర్‌: కోవిడ్‌ ప్రభావం 14 రోజుల వరకే ఉంటుంది. కోవిడ్‌తో భయపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యంతో ఉండాలి. ధైర్యంతోనే కోవిడ్‌ను జయించవచ్చు. కోవిడ్‌ గురించి ఆలోచించడం మానివేయాలి. భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. 

ప్రశ్న: కోవిడ్‌ వచ్చినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారానికి దూరంగా ఉండాలి..?  – నరేందర్, బేల 
డాక్టర్‌: కోవిడ్‌ సోకిన వారు అన్నిరకాల ఆహారం తీసుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలను తినకూడదు. 

ప్రశ్న: మాస్కులు వాడితే కోవిడ్‌ సోకదా..? – రమేష్, నేరడిగొండ 
డాక్టర్‌:రోనా వచ్చిన వ్యక్తికి ఆరు ఫీట్ల దూరంలో ఉండాలి. ఇద్దరు మాస్కులు పెట్టుకుంటే 90శాతానికి పైగా కోవిడ్‌ సోకే అవకాశం ఉండదు. ప్రతిఒక్కరు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. విందు, వినోదాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడిప్పుడే కోవిడ్‌ కేసులు తగ్గుతున్నాయి. మరో నెల రోజుల వరకు అప్రమత్తంగా ఉంటే మంచిది. 

ప్రశ్న: ఆక్సిజన్‌ పల్స్‌రేట్‌ ఎంత ఉండాలి. కోవిడ్‌ వచ్చినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? – రాకేష్, తాంసి 
డాక్టర్‌: కోవిడ్‌ సోకి హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు ప్రభుత్వం ఇచ్చే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌ వాడాలి. 95 శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ పడిపోతే వైద్యుడిని సంప్రదించాలి. కోవిడ్‌ వచ్చిన వారు ఆవిరి పట్టాలి. మూడు పూటలు ఆహారం తీసుకోవాలి. భయాందోళనకు గురికావొద్దు. 

ప్రశ్న: చిన్నారులకు కోవిడ్‌ సోకుతుందా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి– లక్ష్మణ్, ఇచ్చోడ 
డాక్టర్‌:
ప్రస్తుతం చిన్న పిల్లలకు కోవిడ్‌ ఎక్కువగా సోకడం లేదు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లల్లో ఎక్కువ శాతం జలుబు, జ్వరం వస్తుంది. అవసరం ఉంటే తప్పా పిల్లల్ని బయటకు తీసుకెళ్లకూడదు. చిన్నారులకు సైతం మాస్కులు ధరించాలి. దీంతో కోవిడ్‌ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ఏవైనా లక్షణాలు ఉంటే వైద్యుడిని  సంప్రదించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement