అడవులను 33 శాతానికి పెంచుతాం: జోగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచేందుకు వచ్చే నాలుగేళ్లలో 2.30 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించామని అటవీశాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఇప్పటివరకు 1.80 కోట్ల మొక్కలను నాటినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి అటవీ అకాడమీలో అటవీశాఖకు కేటాయించిన నూతన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అన్ని రకాల సమతుల్య వాతావరణం కలిగి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు.
అటవీశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారుల అవసరాల నిమిత్తం ప్రభుత్వం వాహనాలను అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు సిబ్బంది కృషిచేయాలని సూచించారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ భూములకు సమీపంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్ల విస్తరణకు అటవీశాఖ అధికారులు శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం 2014 జాతీయ అటవీశాఖ స్పోర్ట్స్ మీట్‌లో బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించిన సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగదు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద తదితరులు పాల్గొన్నారు.