ఇంగ్లిష్‌లో ఇరగదీశారు!
♦ తెలుగు మీడియం కంటే అధిక ఉత్తీర్ణత
♦ తెలుగులో 81.75%..ఆంగ్ల మాధ్యమంలో 89.30%
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోలిస్తే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. పదో తరగతిలో మొత్తంగా 85.63 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిష్ మీడియంలో మాత్రం 89.30 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియంలో 81.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
పెరిగిన ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు
ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండటమే ఇందుకు కారణం. గతేడాది ఇంగ్లిష్ మీడియంలో 2,56,363 మంది పరీక్షలకు హాజరైతే 2,11,281 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి మాత్రం పరీక్షలకు 2,82,682 మంది హాజరు కాగా.. వారిలో 2,52,433 మంది (89.30) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,44,448 మంది హాజరు కాగా 1,79,221 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఉర్దూ మీడియంలో గతేడాది 11,713 మంది హాజరు కాగా 7,034 మంది (60.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య తగ్గినా ఉత్తీర్ణత శాతం పెరిగింది. అదే ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థుల సంఖ్యతోపాటు ఉత్తీర్ణత శాతం కూడా పెరగడం గమనార్హం.