English medium students
-
ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి.. జేఈఈలో 99 శాతానికి పైగా వారే!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యావకాశాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తమ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారు అతి తక్కువ మంది కాగా.. వారిలోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్ సాధించిన వారు శూన్యం. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. డిమాండ్ల నేపథ్యంలో.. ఉన్నత విద్యావకాశాలను ముఖ్యంగా ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతేడాది నుంచి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లంతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహింపజేస్తోంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్ రాసేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ముందు జేఈఈ నిర్వహణ బాధ్యతలు చూసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2014 వరకు ఆంగ్లం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ మాధ్యమాల్లో జేఈఈని నిర్వహించేది. 2016 తర్వాత ఆంగ్లం, హిందీ, గుజరాతీల్లో జేఈఈని కొనసాగిస్తూ మరాఠీ, ఉర్దూలను తొలగించారు. తమ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో జేఈఈ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నందున బెంగాలీ భాషా మాధ్యమంలో ఈ పరీక్షలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేయడంతో.. ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ మెయిన్ నిర్వహణకు బీజం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండటం, తమిళనాడు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఆ భాషా మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఎన్టీఏ.. జేఈఈలో ఆంగ్లం, హిందీ, గుజరాతీలతో పాటుగా కొత్తగా మరో 10 ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
ఎదగడానికి ఇంగ్లిషే రాచబాట
వేలసంవత్సరాల భారతీయ చరిత్రలో ప్రధాన పాలక భాషలుగా చలామణి అయిన సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిషు భాషలకు శూద్రులు, దళితులు, ఆదివాసీలు వెలుపలే ఉంటూ వచ్చారు. పాలకభాషకు దూరమయ్యారు కాబట్టే తొలినుంచీ వీరికి దేశవ్యాప్తంగా సంబంధాలుండేవి కావు. చిన్న స్థాయి భాషలతోటే వీరి మనుగడ సాగేది. దేశ చరిత్రలో ఇంగ్లిష్ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారతదేశంలో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేద్కర్తోటే ప్రారంభమైంది. వెనుకబడిన వర్గాలు జాతీయ స్థాయి సంబంధాల్లోకి రావాలంటే ఇంగ్లిషు తప్పనిసరి. కానీ ఇంగ్లిష్ భాష ఎన్నికల అంశంగా మారితే తప్ప సామాన్య ప్రజలందరి భాషగా ఇంగ్లిషును పాలకులు అనుమతించరన్నది వాస్తవం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది: చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్.. వీరిలో ఇంగ్లీషు చక్కగా ఎవరు మాట్లాడతారు అన్నదే ఆ చర్చ సారాంశం. వీళ్లు ముగ్గురూ శూద్రులే. చంద్రబాబు, కేసీఆర్‌లు తొలి తరంలో ఇంగ్లిష్ నేర్చుకున్న వారు కాగా, వైఎస్ జగన్ రెండో తరానికి చెందిన, ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న విద్యావంతుడైన నాయకుడు. ఆయన తండ్రి కూడా డాక్టరే. పైగా ఇంగ్లిష్ చక్కగా మాట్లాడేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6000 ప్రభుత్వ పాఠశాలల్ని ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం ద్వారా ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ బోధనను ప్రారంభించారు. గ్రామీణ విద్యా పరివర్తన విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన మార్పు ఇదే. దీన్ని మంచి రాజకీయ ఆవిష్కరణగా భావిస్తూనే, చారిత్రకంగా ఇంగ్లిష్ విద్యలో శూద్రులు/దళితులు/ఆదివాసుల స్థానమేంటో చూద్దామా? మనకు తెలిసిన చరిత్రలో ఇంగ్లిష్ మూడో భారతీయ పాలక (అధికారిక) భాషగా ఉంటోంది. కలకత్తా ప్రావిన్స్‌లో భాషా విధానాన్ని పర్షియన్ భాష నుంచి ఇంగ్లిష్‌కు మార్చడం ద్వారా 1858లో ఇంగ్లిష్ భారతీయ పాలక భాషగా మారింది. దీనికి ముందు పర్షియన్ భాషే అఖిల భారత స్థాయిలో పాలనాభాషగా ఉండేది. పర్షియన్ భాష పాలనా భాషగా మారడానికి ముందు దేశంలో సంస్కృతమే పాలకుల భాషగా ఉండేది. ఇంతవరకు ఈ మూడు భాషలు మాత్రమే అఖిల భారత స్వభావాన్ని సంతరించుకుని ఉండేవి. ఇతర భాషలన్నీ భారతీయ చరిత్ర పొడవునా ప్రాంతీయ, స్థానిక, గిరిజన భాషలుగా ఉండేవి. హరప్పా నగర నాగరికతలో ఏ భాష అమల్లో ఉండేదో మనకు తెలీదు. బహుశా అది బౌద్ధుల కాలంలో ప్రాచుర్యంలో ఉండిన పాళీ వంటి భాష అయివుండవచ్చు. నాటి పాలక రాజవంశాలు పాళి భాషను ఏమేరకు ఉపయోగించి ఉంటాయో మనకు తెలీదు. బౌద్ధ, జైన సాహిత్యం పాళి భాషలోనే ఉండటంతో ఇది కూడా ప్రధాన భారతీయ భాషగా ఉండవచ్చు కానీ సంస్కృత ఆధిపత్యం సాగిన కాలంలో పాళీని నిర్మూలించివేశారు. పలు దక్షిణ భారత భాషలు పాళీతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ సంస్కృతం ఉనికిలో ఉన్న విధంగా పాళీ ఒక భాషగా మనలేదు. సంస్కృత భాషను ఇంటి భాషగా, మార్కెట్ భాషగా అనుమతించనప్పటికీ హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థతోపాటు సంస్కృతం కొనసాగుతూ వచ్చింది. సంస్కృత ఆధిపత్యం రాజ్యమేలిన కాలంలో ఇప్పటి ఇతర వెనుకబడిన కులాలు, రిజర్వ్డ్ విభాగంలో లేని భూమి కలిగివున్న శూద్ర ఉన్నత వర్గం, రైతాంగంతో సహా శూద్ర వ్యవసాయ ఉత్పత్తిదారులకు సంస్కృత భాషలో చదివే, రాసే హక్కు ఉండేది కాదు. ఇక దళితులను, గిరిజనులను తొలి నుంచి పౌర సమాజ వ్యవస్థకు వెలుపలనే ఉంచేశారు. కాబట్టి సంస్కృతం లేదా పర్షియన్ భాషల్లో వారి ప్రవేశం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. దాదాపుగా కులవంశాలు, తెగలు మాట్లాడే చిన్నచిన్న భాషలతోటే వీరు మనుగడ సాగించేవారు. జాతి గురించిన వారి భావన కేవలం తెగ లేక వంశం అనే అర్థంలో ఉండేది. 21వ శతాబ్ది ప్రారంభం నాటికి శూద్రులు/దళితులు/గిరిజనులు తమ తమ భాషా ప్రాంత రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషల్లో చక్కగా వ్యక్తీకరించగల స్థాయిని పొందారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజలతో వీరి సంబంధ బాంధవ్యాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. అదే సమయంలో బ్రాహ్మణులు/బనియాలు కొత్త భాష అయిన ఇంగ్లిషుపై పట్టు సాధించి అంతర్జాతీయ కమ్యూనిటీలోకి పరివర్తన చెందారు. ప్రారంభంలో వీరు కూడా ఇంగ్లిష్‌ని వలసభాషగా నిందించేవారు కానీ ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో ఆ భాషను నేర్చుకోవడం కొనసాగించారు. 21వ శతాబ్ది ప్రారంభం నాటికి వీరు తమకుతాముగా ఇంగ్లిష్ మాట్లాడే, రాసే వర్గంగా మారారు. అయితే ముఖ్య విషయమేమిటంటే, ఇంగ్లిష్ జాతీయ భాషగా మారినప్పటికీ, శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆది వాసీలు దేశవ్యాప్తంగా పరస్పర సంబంధాలలో ఉండేవారు కాదు. సంస్కృతం చలామణిలో ఉన్న కాలంలో బ్రాహ్మణులు మాత్రమే దేశ వ్యాప్తంగా సంబంధాలు కలిగి ఉండేవారు. కొంతమంది బనియాలు, క్షత్రియులకు కూడా సంస్కృతం తెలిసినప్పటికీ అది వారి ఇంటి భాషగా ఉండేది కాదు. బ్రాహ్మణులకు మాత్రం సంస్కృతం ఇంటిభాషే. ఈరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ శూద్రులు, దళితులు, ఆదివాసుల్లో కొద్దిమంది మాత్రమే ఇంగ్లిష్‌ను చదివి, రాయడమే కాకుండా రాష్ట్ర పాలనాపరమైన అంశాల్లో పాలుపంచుకుంటున్నారు. వారి ఆత్మవిశ్వాస స్థాయిలు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీరికి కూడా అంతర్జాతీయ భాష గురించి తెలుసు, పైగా ఉత్పత్తిలో పాలుపంచుకోనప్పటికీ రాష్ట్రంలోని, మార్కెట్లోని ప్రతి రంగంలోనూ ఆధిక్యత కలి గివున్న బ్రాహ్మణులు, బనియాలతో వీరు పోటీపడుతున్నారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ శక్తులు వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పత్తికి కట్టుబడిపోవడంతో వీరికి రాష్ట్రాల మధ్య సంబంధాలతో పనిలేకుండా పోయింది. వ్యాపార కార్యాచరణ, రాష్ట్ర పాలనకు లాగా గ్రామీణ, చేతివృత్తుల ఉత్పత్తికి దేశవ్యాప్త ప్రయాణాలు, అనుసంధానం అవసరం లేదు. ఆధ్యాత్మిక రంగంలోని బ్రాహ్మణులు, వ్యాపారరంగంలోని బనియాలు సంస్కృతంలో, ప్రాంతీయ భాషల్లో అధునాతన భాషా నైపుణ్యాలను పొందారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ ప్రజానీకంపై ఆధిపత్యం వహించడానికి వీరు తమ బాషా నైపుణ్యాలను ఉపయోగించేవారు. ఈ పరిస్థితుల్లో భారతీయులందరికీ ఇంగ్లిషును పరి చయం చేయకపోతే, ఈ శూద్ర, దళిత, ఆదివాసీలు ఆధునిక ఆర్థికవ్యవస్థలోకి ప్రవేశించలేరు కూడా. చివరకు అన్ని రాష్ట్రాల్లోనూ మార్కెట్ సంబంధాలు కూడా ఇంగ్లిషులోనే నడుస్తున్నాయి. సాధారణ మార్కెట్ పూర్తిగా ఇంగ్లిషుకు మారనప్పటికీ, సాంకేతిక మార్కెట్లో మాత్రం ఇంగ్లిష్ ఇప్పుడు విస్తరిస్తోంది. హిందీకి అలాంటి విస్తరణ లేదు. 16వ శతాబ్దిలో మొఘల్ పాలన నుంచి బ్రిటిష్ పాలన మధ్యకాలం వరకు పర్షియన్ భాష దేశవ్యాప్తంగా వ్యవహారంలో ఉండేది. చిన్నచిన్న పాలకులు పర్షియన్, ఇతర భాషల్లోనే పాలనను నిర్వహించినప్పటికీ ముఖ్యంగా వీరు ముస్లిం లేక బ్రాహ్మణ అధికారులపైనే ఆధారపడేవారు. ఉదాహరణకు, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఉర్దూ, పర్షియన్ భాషలను ఉపయోగించేవారు. కొన్ని రాష్ట్రాలు పర్షియన్, ఇతర భాషలను ఉపయోగించేవి. శూద్రులలో ఉన్నత స్థాయి కలిగిన వారు 20 శతాబ్ది ప్రారంభంలో భూయజమానులుగా లేక భూస్వాములుగా మారి నప్పటికీ, వారిలో పర్షియన్ భాషా నైపుణ్యాలు పెరగలేదు. సంస్కృతభాష మాత్రం హిందూ మతపరమైన భాషగా ఉనికిని సాగించింది కానీ శూద్రులకు ఈనాటికీ పౌరోహిత్య హక్కు లేదు. అందుకే వీరు సంస్కృత పాఠాలతో పాండిత్య స్థాయిలో సంబంధం కలిగిలేరు. కొద్దిమంది శూద్రులు మాత్రమే సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, వీరు గొప్ప పండితులు కాలేకపోయారు. పైగా హిందూ ధార్మిక గ్రం«థా లపై వీరు చేసే వ్యాఖ్యానాలకు సాధికారిక ఆమోదం లభించలేదు. బ్రాహ్మణ పండితుడి సంస్కృతం మాత్రమే ప్రామాణికంగా గుర్తింపు పొందేది. అందుచేతే సంస్కృత భాషా రంగంలో సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చించడానికి శూద్రులలో ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. ఫలితంగా వేల ఏళ్లుగా వీరు జాతీయతత్వం అనే భావనకు దూరంగా ప్రత్యేక ప్రాంతాల్లోనే మిగిలిపోయి ఉన్నారు. ప్రస్తుతం దళితుల ముందున్న మార్గం ఏది? శూద్రులు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతికి ఏకైక పరిష్కారం దేశం లోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడమే. విద్యలో ద్వంద్వ మీడియం.. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ప్రాంతీయ భాష, ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అనేది ఒక వంచనాత్మక వ్యవస్థ. శూద్రులను, దళితులను, ఆదివాసీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిని అందుకోకుండా అడ్డుకోవడమే దీని లక్ష్యం. భారత స్వాతంత్య్రానంతరం కూడా బ్రాహ్మణ, బనియా శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలాంటి వ్యవస్థకు పథక రచన చేశారు. శూద్ర, దళిత, ఆదివాసీలకు జాతీయస్థాయిలో వారిని అనుసంధానించే భాషే లేకుండా పోయింది. దేశ చరిత్రలో ఇంగ్లిష్ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారత్‌లో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. ఆనాటికి రాజారామ్మోహన్ రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్, మహదేవ్ గోవింద్ రనడే (అందరూ బ్రాహ్మణులే) ఇంగ్లిష్‌లోనే చదువుకున్నారు. నిజానికి తిలక్ 1880లోనే ఇంగ్లిష్ మీడి యం స్కూల్‌ను ప్రారంభించారు. మహాత్మా పూలే ఆయన సీనియర్. కానీ ఒక స్కాటిష్ మిషన్ స్కూల్లో 7వ తరగతి వరకే ఆయన చదువుకున్నారు. శూద్రులను చారిత్రక నిరక్షరాస్యత నుంచి ఆయన కాపాడారు. శూద్రులలో కొద్దిమంది మాత్రమే ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం పొంది ఇంగ్లిషు విద్యను నేర్చుకున్నారు కానీ ఇంగ్లిష్ నేర్వడంలో వారికి పరిమితులు ఉండేవి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న కొందరు శూద్రులు విద్యపై ఎన్నడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. మైసూర్ రాజు, బరోడా రాజు వంటి చిన్న చిన్న రాజులు ఉండేవారు. ఈయనే తర్వాత అంబేడ్కర్‌కి విద్యలో సహాయం చేశారు. కాని ఇలాంటి రాజులు తమ కుటుంబ సభ్యులను ఇంగ్లండ్‌కు పంపించి ఇంగ్లిష్ విద్య నేర్పించిన రుజువులేవీ లేవు. విద్యకున్న శక్తి ఏమిటో గ్రహించిన వారు కాబట్టి బ్రాహ్మణులు, బనియాలు మాత్రమే విద్య గురించి తీవ్రంగా ఆలోచించేవారు. ఏమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేడ్కర్తోటే ప్రారంభమైంది. ఆ విప్లవం ప్రాథమికంగా అనిశ్చితంగానే ఉంటోంది. అది ఆత్మిక, భౌతిక రూపొన్ని సంతరించుకోలేదు. హిందుత్వ శక్తులు అందరికీ ఇంగ్లిషు విద్యను అనుమతిస్తాయో అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎన్నికల అంశంగా మారితే తప్ప ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ వ్యతిరేక మేధావులు ఇంగ్లిష్ భాషను సామాన్య ప్రజాభాషగా అనుమతించబోరని వారితో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నా అనుభవం తేల్చి చెబుతోంది. వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ -
టెన్త్‌లో పెరిగిన ఇంగ్లిషు మీడియం విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు 5,09,831 మంది రెగ్యులర్ విద్యార్థులు, 28,397 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు హాజరుకానున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 2,96,251 మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులు, 2,01,262 మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే వారిలో తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య 10 శాతం వరకు తగ్గిపోగా, ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పెరిగింది. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 49 శాతం మంది పరీక్షలకు హాజరుకాగా ఈసారి ఆ సంఖ్య 39.47 శాతానికి పడిపోయింది. ఇంగ్లిషు మీడియంలో పరీక్షలు రాసిన విద్యార్థులు 51 శాతం ఉండగా ఈసారి అది 58.10 శాతానికి పెరిగింది. మరో 2.42 శాతం మంది విద్యార్థులు ఇతర మీడియంలలో పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. ఇంగ్లిషు మీడియంపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి కారణంగా తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2016–17 విద్యా సంవత్సరంలో 128 ప్రైవేటు పాఠశాలలు తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంలోకి మారాయి. మరోవైపు మోడల్ స్కూళ్లలో సీట్లు పెరగడం, కొత్త ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుతో ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. 2,856 కేంద్రాల్లో పరీక్షలు.. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,856 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 5,38,228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు పరీక్షకు విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఆలస్యం కాకుండా చూసుకోవాలని పరీక్ష విభాగం అధికారులు స్పష్టం చేశారు. -
ఇంగ్లిష్‌లో ఇరగదీశారు!
♦ తెలుగు మీడియం కంటే అధిక ఉత్తీర్ణత ♦ తెలుగులో 81.75%..ఆంగ్ల మాధ్యమంలో 89.30% సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోలిస్తే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. పదో తరగతిలో మొత్తంగా 85.63 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిష్ మీడియంలో మాత్రం 89.30 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియంలో 81.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పెరిగిన ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండటమే ఇందుకు కారణం. గతేడాది ఇంగ్లిష్ మీడియంలో 2,56,363 మంది పరీక్షలకు హాజరైతే 2,11,281 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి మాత్రం పరీక్షలకు 2,82,682 మంది హాజరు కాగా.. వారిలో 2,52,433 మంది (89.30) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,44,448 మంది హాజరు కాగా 1,79,221 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఉర్దూ మీడియంలో గతేడాది 11,713 మంది హాజరు కాగా 7,034 మంది (60.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య తగ్గినా ఉత్తీర్ణత శాతం పెరిగింది. అదే ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థుల సంఖ్యతోపాటు ఉత్తీర్ణత శాతం కూడా పెరగడం గమనార్హం. -
నాడు సక్సెస్ బడులు..నేడు మొక్కుబడులు
కదిరి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అందుబాటులో ఉండాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకేసారి 6500 ‘సక్సెస్ స్కూల్స్’ను 2008లో ప్రవేశ పెట్టారు. అప్పటికి దేశ వ్యాప్తంగా కేవలం 4500 పాఠశాలల్లో మాత్రమే సీబీఎస్సీ సిలబస్ బోధిస్తున్న ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఉండేవి.గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, వ్యవసాయ రైతు కూలీల పేద విద్యార్థులకు కూడా ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తీసుకురావాలన్నది ఓ కారణం. బాల్య వివాహాల నిర్మూలన మరో కారణం 6వ తరగతిలో అంగ్ల మాధ్యమంలో చేరిన గ్రామీణ ప్రాంత విద్యార్థినులు 12వ తరగతి వరకూ(సీబీఎస్సీ సిలబస్) ఒకే(సమీప) పాఠశాలలో చదివేందుకు అవకాశం కల్పించారు. 12వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ వారికి 17 ఏళ్లు నిండి శారీరక, మానసిక పరిపక్వత చెందుతారు. ఆంగ్లంలో బోధించేం దుకు అప్పటి దాకా ఎస్జీ టీచర్లుగా ఉన్న సుమారు 50 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి, వీరికి శిక్షణ కూడా ఇప్పించారు. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఎస్జీ టీచర్ల స్థానంలో అప్పట్లో మెగా డీఎస్సీ ద్వారా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. అవసరమైన చోట్ల విద్యావాలంటీర్లను కూడా నియమించి సక్సెస్ స్కూల్స్‌ను సక్సెస్‌గా నడిపారు. వైఎస్ అకాల మరణంతో సక్సెస్ పాఠశాలల్లో సీబీఎస్సీ సిలబస్ పోయి స్టేట్ సిలబస్ వచ్చింది. అది కూడా ఇప్పుడు ఆంగ్ల, తెలుగు మాధ్యమ విద్యార్థులకు కామన్ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకం వినియోగిస్తున్నారు. సీబీఎస్సీ స్థానంలో స్టేట్ సిలబస్ ప్రవేశపెట్టడంతో విద్యార్థులు 10వ తరగతి తర్వాత బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమై 100 రోజులు పూర్తైప్పటికీ ఇప్పటి దాకా ఏ పాఠశాలలోనూ ఎవరు ఏం బోధించాలనే టైం టేబుల్ కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక స్కూల్ అసిస్టెంట్ వారంలో 24 పీరియడ్స్‌కు తక్కువ కాకుండా 30 పీరియడ్స్‌కు ఎక్కువ కాకుండా బోధించాలి. ఇది కొన్ని చోట్ల మాత్రమే అమలవుతోంది. గణితం బోధించే ఉపాధ్యాయుడు వారంలో ఆరు రోజుల పని దినాల్లో 6 నుండి 10వ తరగతి వరకు ఒక్కో తరగతికి 8 పిరియడ్లు చొప్పున అత్యధికంగా 40 పిరియడ్లు బోధిస్తున్నారు. ఇంకొన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా ఉంటూనే ఆయా మండల విద్యాధికారులుగా ఇన్చార్జ్ బాద్యతలు నిర్వహిస్తున్నారు. వీరు గతంలో బోధించే సబ్జెక్టులు తమకు సంబంధం లేదంటూ తోటి ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు వేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడూ వారంలో 8 పిరియడ్లు బోధించాలనే నిబంధన ఉంది. సక్సెస్ పాఠశాలల్లో బోధనకు ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని కొన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమ విద్యార్థులతో కలిపి బోధిస్తున్నారు. దీంతో ఆంగ్ల మాధ్యమం చదవాలన్న కోరికున్న విద్యార్థులు కొందరు ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల బాట పట్టారు. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎందుకు నోరుమెదపడం లేదని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు ప్రశ్నిస్తున్నారు. -
సక్సెస్ అంతంతే!
మంచిర్యాల సిటీ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. జిల్లాలో 468 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 272 పాఠశాలల్లో 2008 సంవత్సరంలో సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియం ప్రారంభించింది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులు కాకుండా ఆరు నుంచి పదో తరగతి తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయులతోనే బోధన ప్రారంభించింది. అధికారులు మొదటి ఏడాది సీబీఎస్ఈ సిలబస్‌ను ఎంపిక చేశారు. సాధ్యం కాదని ఉపాధ్యాయులు చెప్పడంతో రెండో సంవత్సరం రాష్ట్ర సిలబస్‌కు పరిమితం చేశారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన ఇంగ్లిషు మీడియంలో అంతంత మాత్రమే ఉండటం, మరికొన్ని పాఠశాలల్లో అత్తెసరు ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. కొందరు విద్యార్థులు ప్రైవేటును ఆశ్రయించగా, మరికొందరు తెలుగు మీడియంకు బదిలీ అయ్యారు. దీంతో సక్సెస్ పాఠశాలల సంఖ్య 100 లోపుకు పడిపోయింది. ‘ఫీజుల’ భారం తట్టుకోలేక.. పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లిషు మీడియం విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగింది. ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించి, ఫీజుల భారం తట్టుకోలేక ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో ఒక్క మంచిర్యాల మండలంలోనే పదో తరగతి 91 మంది విద్యార్థులు మాత్రమే చదివారు. ఇందులో 47 మంది బాలికలే కావడం విశేషం. కాగా, 1998 డీఎస్సీ తర్వాత నియామకమైన ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ఇంగ్లిషు మీడియం వారే ఉన్నారు. వీరితోపాటు ఉపాధ్యాయ శిక్షణలో ఇంగ్లిషు మెథడాలజీ తీసుకున్నవారు కూడా ఉన్నారు. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిని ఉన్నత పాఠశాలల్లో నియమిస్తే కొంత మేరకు విద్యార్థులకు న్యాయం జరిగేది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు కూడా 1998కి ముందు నియామకమై పదోన్నతి పొందినవారే ఉన్నారు. వీరితోనే ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు ప్రస్తుతం తరగతులు చెప్పిస్తున్నారు. దీంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైన ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇంగ్లీష్ మీడియంలో ఇరగదీశారు
- సరాసరి కంటే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణత శాతం ఎక్కువ - 4.95 లక్షల మందిలో 4.60 లక్షల మంది పాస్ - మొత్తం విద్యార్థుల్లో సగం ఇంగ్లిషు మీడియం వారే - 10 జీపీఏ సాధించిన వారు 4,085 మంది - ఏపీ గురుకులాల హవా - విడుదలైన పదో తరగతి ఫలితాలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తంగా 83.17 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిషు మీడియంలో మాత్రం 92.90 శాతం మంది పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతంతో పోల్చినా ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతమే ఎక్కువగా ఉంది. మార్చి/ఏప్రిల్ నెలల్లో జరిగిన పరీక్ష ఫలితాలను సచివాలయ డి బ్లాక్‌లో గురువారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ విడుదల చేశారు. ఈసారి పరీక్షలకు మొత్తంగా మొత్తంగా 12,15,391 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 10,10,960 మంది విద్యార్థులు (83.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులను మినహాయిస్తే.. రెగ్యులర్ విద్యార్థుల్లో 10,61,703 మంది పరీక్షలకు హాజరుకాగా 9,40,924 మంది (88.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సత్తా చాటిన బాలికలు.. పదో తరగతిలోనూ బాలికలే సత్తా చాటారు. బాలురు 87.96 శాతం వుంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 89.33 శాతం వుంది పాస్ అయ్యూరు. 5,44,538 మంది బాలురు పరీక్షలు రాయగా 4,78,955 మంది (87.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 5,17,165 మంది బాలికలు పరీక్షలు రాయగా 4,61,969 మంది (89.33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఏపీ గురుకులాల హవా.. మేనేజ్మెంట్ల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల హవా కొనసాగింది. వాటిల్లో 95.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఈసారి బాలికల (94.07) కంటే బాలురు (97.68 శాతం) అధిక శాతం మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. 99 స్కూళ్లు ఆంధ్రప్రదేశ్ గురుకులాల సొసైటీ పరిధిలో ఉండగా 91 పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 51 స్కూళ్ల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 7,750 మంది పరీక్షలు రాయగా 7,602 మంది (98.1 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 48 గురుకుల బాలుర స్కూళ్లు ఉండగా 28 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు వచ్చాయి. 43 బాలికల పాఠశాలు ఉండగా 23 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లోనూ బాలికల (90.22 శాతం) కంటే బాలురే (94.15 శాతం) అధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల.. ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిషు మీడియం ఉండటమే ఇందుకు కారణం. 3,28,256 మంది విద్యార్థులు 2012లో ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాయగా, గత ఏడాది 4,62,984 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగి 4,95,225కు చేరుకుంది. అందులో 4,60,086 మంది (92.90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పది జీపీఏ గుంటూరులో అధికం..: గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) పదికి పది సాధించిన విద్యార్థులు గుంటూరులో ఎక్కువ మంది ఉన్నారు. మొత్తంగా పది జీపీఏ సాధించిన విద్యార్థులు 4,085 మంది ఉండగా, గుంటూరు జిల్లాలో 586 మంది పది జీపీఏ సాధించారు. ఆ తర్వాత స్థానంలో 562 మందితో రంగారెడ్డి నిలిచింది. పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్యలో విజయనగరం జిల్లా (46 మంది) చివరి స్థానంలో నిలిచింది. గిరిజన గురుకులాల్లో 89.94 శాతం ఉత్తీర్ణత పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోని 77 ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 89.94 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు గురుకులం కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. వీరిలో బాలికలు 90.50 శాతం, బాలురు 89.63 శాతమని వివరించారు. 5,606 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకాగా... 5,029 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. సీతంపేట, భద్రగిరి, దమ్మపేట, కొమరాడ, కులకచెర్ల, మల్లి, తుమ్మలవలస, కొయ్యూరు, జి.మాడుగుల బాలుర గురుకుల పాఠశాలలో, భద్రగిరి, కొత్తగూడ, కూనవరం, సీతంపేట, వనపర్తి బాలికల పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.