మంచిర్యాల సిటీ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. జిల్లాలో 468 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 272 పాఠశాలల్లో 2008 సంవత్సరంలో సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియం ప్రారంభించింది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులు కాకుండా ఆరు నుంచి పదో తరగతి తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయులతోనే బోధన ప్రారంభించింది.
అధికారులు మొదటి ఏడాది సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఎంపిక చేశారు. సాధ్యం కాదని ఉపాధ్యాయులు చెప్పడంతో రెండో సంవత్సరం రాష్ట్ర సిలబస్‌కు పరిమితం చేశారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన ఇంగ్లిషు మీడియంలో అంతంత మాత్రమే ఉండటం, మరికొన్ని పాఠశాలల్లో అత్తెసరు ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. కొందరు విద్యార్థులు ప్రైవేటును ఆశ్రయించగా, మరికొందరు తెలుగు మీడియంకు బదిలీ అయ్యారు. దీంతో సక్సెస్ పాఠశాలల సంఖ్య 100 లోపుకు పడిపోయింది.
‘ఫీజుల’ భారం తట్టుకోలేక..
పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లిషు మీడియం విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగింది. ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించి, ఫీజుల భారం తట్టుకోలేక ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో ఒక్క మంచిర్యాల మండలంలోనే పదో తరగతి 91 మంది విద్యార్థులు మాత్రమే చదివారు. ఇందులో 47 మంది బాలికలే కావడం విశేషం. కాగా, 1998 డీఎస్సీ తర్వాత నియామకమైన ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ఇంగ్లిషు మీడియం వారే ఉన్నారు.
వీరితోపాటు ఉపాధ్యాయ శిక్షణలో ఇంగ్లిషు మెథడాలజీ తీసుకున్నవారు కూడా ఉన్నారు. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిని ఉన్నత పాఠశాలల్లో నియమిస్తే కొంత మేరకు విద్యార్థులకు న్యాయం జరిగేది.
ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు కూడా 1998కి ముందు నియామకమై పదోన్నతి పొందినవారే ఉన్నారు. వీరితోనే ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు ప్రస్తుతం తరగతులు చెప్పిస్తున్నారు. దీంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైన ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
సక్సెస్ అంతంతే!
Published Mon, Aug 11 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement
Advertisement