సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు 5,09,831 మంది రెగ్యులర్ విద్యార్థులు, 28,397 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు హాజరుకానున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 2,96,251 మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులు, 2,01,262 మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
గతేడాదితో పోల్చితే ఈసారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే వారిలో తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య 10 శాతం వరకు తగ్గిపోగా, ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పెరిగింది. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 49 శాతం మంది పరీక్షలకు హాజరుకాగా ఈసారి ఆ సంఖ్య 39.47 శాతానికి పడిపోయింది.
ఇంగ్లిషు మీడియంలో పరీక్షలు రాసిన విద్యార్థులు 51 శాతం ఉండగా ఈసారి అది 58.10 శాతానికి పెరిగింది. మరో 2.42 శాతం మంది విద్యార్థులు ఇతర మీడియంలలో పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. ఇంగ్లిషు మీడియంపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి కారణంగా తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2016–17 విద్యా సంవత్సరంలో 128 ప్రైవేటు పాఠశాలలు తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంలోకి మారాయి. మరోవైపు మోడల్ స్కూళ్లలో సీట్లు పెరగడం, కొత్త ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుతో ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
2,856 కేంద్రాల్లో పరీక్షలు..
పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,856 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 5,38,228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు పరీక్షకు విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఆలస్యం కాకుండా చూసుకోవాలని పరీక్ష విభాగం అధికారులు స్పష్టం చేశారు.
టెన్త్‌లో పెరిగిన ఇంగ్లిషు మీడియం విద్యార్థులు
Published Fri, Mar 3 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
Advertisement