ఎదగడానికి ఇంగ్లిషే రాచబాట | English Language In Important For Go Higher Level | Sakshi
Sakshi News home page

ఎదగడానికి ఇంగ్లిషే రాచబాట

Published Wed, Apr 24 2019 12:30 AM | Last Updated on Wed, Apr 24 2019 12:30 AM

English Language In Important For Go Higher Level - Sakshi

వేలసంవత్సరాల భారతీయ చరిత్రలో ప్రధాన పాలక భాషలుగా చలామణి అయిన సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిషు భాషలకు శూద్రులు, దళితులు, ఆదివాసీలు వెలుపలే ఉంటూ వచ్చారు. పాలకభాషకు దూరమయ్యారు కాబట్టే తొలినుంచీ వీరికి దేశవ్యాప్తంగా సంబంధాలుండేవి కావు. చిన్న స్థాయి భాషలతోటే వీరి మనుగడ సాగేది. దేశ చరిత్రలో ఇంగ్లిష్‌ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారతదేశంలో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్‌ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేద్కర్‌తోటే ప్రారంభమైంది. వెనుకబడిన వర్గాలు జాతీయ స్థాయి సంబంధాల్లోకి రావాలంటే ఇంగ్లిషు తప్పనిసరి. కానీ ఇంగ్లిష్‌ భాష ఎన్నికల అంశంగా మారితే తప్ప సామాన్య ప్రజలందరి భాషగా ఇంగ్లిషును పాలకులు అనుమతించరన్నది వాస్తవం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది: చంద్రబాబు నాయుడు, జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌.. వీరిలో ఇంగ్లీషు చక్కగా ఎవరు మాట్లాడతారు అన్నదే ఆ చర్చ సారాంశం. వీళ్లు ముగ్గురూ శూద్రులే. చంద్రబాబు, కేసీఆర్‌లు తొలి తరంలో ఇంగ్లిష్‌ నేర్చుకున్న వారు కాగా, వైఎస్‌ జగన్‌ రెండో తరానికి చెందిన, ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్న విద్యావంతుడైన నాయకుడు. ఆయన తండ్రి కూడా డాక్టరే. పైగా ఇంగ్లిష్‌ చక్కగా మాట్లాడేవారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6000 ప్రభుత్వ పాఠశాలల్ని ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడం ద్వారా ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ బోధనను ప్రారంభించారు. గ్రామీణ విద్యా పరివర్తన విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన మార్పు ఇదే.  దీన్ని మంచి రాజకీయ ఆవిష్కరణగా భావిస్తూనే, చారిత్రకంగా ఇంగ్లిష్‌ విద్యలో శూద్రులు/దళితులు/ఆదివాసుల స్థానమేంటో చూద్దామా?

మనకు తెలిసిన చరిత్రలో ఇంగ్లిష్‌ మూడో భారతీయ పాలక (అధికారిక) భాషగా ఉంటోంది. కలకత్తా ప్రావిన్స్‌లో భాషా విధానాన్ని పర్షియన్‌ భాష నుంచి ఇంగ్లిష్‌కు మార్చడం ద్వారా 1858లో ఇంగ్లిష్‌ భారతీయ పాలక భాషగా మారింది. దీనికి ముందు పర్షియన్‌ భాషే అఖిల భారత స్థాయిలో పాలనాభాషగా ఉండేది. పర్షియన్‌ భాష పాలనా భాషగా మారడానికి ముందు దేశంలో సంస్కృతమే పాలకుల భాషగా ఉండేది. ఇంతవరకు ఈ మూడు భాషలు మాత్రమే అఖిల భారత స్వభావాన్ని సంతరించుకుని ఉండేవి. ఇతర భాషలన్నీ భారతీయ చరిత్ర పొడవునా ప్రాంతీయ, స్థానిక, గిరిజన భాషలుగా ఉండేవి.

హరప్పా నగర నాగరికతలో ఏ భాష అమల్లో ఉండేదో మనకు తెలీదు. బహుశా అది బౌద్ధుల కాలంలో ప్రాచుర్యంలో ఉండిన పాళీ వంటి భాష అయివుండవచ్చు. నాటి పాలక రాజవంశాలు పాళి భాషను ఏమేరకు ఉపయోగించి ఉంటాయో మనకు తెలీదు. బౌద్ధ, జైన సాహిత్యం పాళి భాషలోనే ఉండటంతో ఇది కూడా ప్రధాన భారతీయ భాషగా ఉండవచ్చు కానీ సంస్కృత ఆధిపత్యం సాగిన కాలంలో పాళీని నిర్మూలించివేశారు. పలు దక్షిణ భారత భాషలు పాళీతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ సంస్కృతం ఉనికిలో ఉన్న విధంగా పాళీ ఒక భాషగా మనలేదు. సంస్కృత భాషను ఇంటి భాషగా, మార్కెట్‌ భాషగా అనుమతించనప్పటికీ హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థతోపాటు సంస్కృతం కొనసాగుతూ వచ్చింది. సంస్కృత ఆధిపత్యం రాజ్యమేలిన కాలంలో ఇప్పటి ఇతర వెనుకబడిన కులాలు, రిజర్వ్‌డ్‌ విభాగంలో లేని భూమి కలిగివున్న శూద్ర ఉన్నత వర్గం, రైతాంగంతో సహా శూద్ర వ్యవసాయ ఉత్పత్తిదారులకు సంస్కృత భాషలో చదివే, రాసే హక్కు ఉండేది కాదు. ఇక దళితులను, గిరిజనులను తొలి నుంచి పౌర సమాజ వ్యవస్థకు వెలుపలనే ఉంచేశారు. కాబట్టి సంస్కృతం లేదా పర్షియన్‌ భాషల్లో వారి ప్రవేశం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. దాదాపుగా కులవంశాలు, తెగలు మాట్లాడే చిన్నచిన్న భాషలతోటే వీరు మనుగడ సాగించేవారు. జాతి గురించిన వారి భావన కేవలం తెగ లేక వంశం అనే అర్థంలో ఉండేది.

21వ శతాబ్ది ప్రారంభం నాటికి శూద్రులు/దళితులు/గిరిజనులు తమ తమ భాషా ప్రాంత రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషల్లో చక్కగా వ్యక్తీకరించగల స్థాయిని పొందారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజలతో వీరి సంబంధ బాంధవ్యాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. అదే సమయంలో బ్రాహ్మణులు/బనియాలు కొత్త భాష అయిన ఇంగ్లిషుపై పట్టు సాధించి అంతర్జాతీయ కమ్యూనిటీలోకి పరివర్తన చెందారు. ప్రారంభంలో వీరు కూడా ఇంగ్లిష్‌ని వలసభాషగా నిందించేవారు కానీ ప్రైవేట్‌ పాఠశాలల్లో, కళాశాలల్లో ఆ భాషను నేర్చుకోవడం కొనసాగించారు. 21వ శతాబ్ది ప్రారంభం నాటికి వీరు తమకుతాముగా ఇంగ్లిష్‌ మాట్లాడే, రాసే వర్గంగా మారారు. అయితే ముఖ్య విషయమేమిటంటే, ఇంగ్లిష్‌ జాతీయ భాషగా మారినప్పటికీ, శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆది వాసీలు దేశవ్యాప్తంగా పరస్పర సంబంధాలలో ఉండేవారు కాదు. సంస్కృతం చలామణిలో ఉన్న కాలంలో బ్రాహ్మణులు మాత్రమే దేశ వ్యాప్తంగా సంబంధాలు కలిగి ఉండేవారు. కొంతమంది బనియాలు, క్షత్రియులకు కూడా సంస్కృతం తెలిసినప్పటికీ అది వారి ఇంటి భాషగా ఉండేది కాదు. బ్రాహ్మణులకు మాత్రం సంస్కృతం ఇంటిభాషే.

ఈరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ శూద్రులు, దళితులు, ఆదివాసుల్లో కొద్దిమంది మాత్రమే ఇంగ్లిష్‌ను చదివి, రాయడమే కాకుండా రాష్ట్ర పాలనాపరమైన అంశాల్లో పాలుపంచుకుంటున్నారు. వారి ఆత్మవిశ్వాస స్థాయిలు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీరికి కూడా అంతర్జాతీయ భాష గురించి తెలుసు, పైగా ఉత్పత్తిలో పాలుపంచుకోనప్పటికీ రాష్ట్రంలోని, మార్కెట్‌లోని ప్రతి రంగంలోనూ ఆధిక్యత కలి గివున్న బ్రాహ్మణులు, బనియాలతో వీరు పోటీపడుతున్నారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ శక్తులు వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పత్తికి కట్టుబడిపోవడంతో వీరికి రాష్ట్రాల మధ్య సంబంధాలతో పనిలేకుండా పోయింది. వ్యాపార కార్యాచరణ, రాష్ట్ర పాలనకు లాగా గ్రామీణ, చేతివృత్తుల ఉత్పత్తికి దేశవ్యాప్త ప్రయాణాలు, అనుసంధానం అవసరం లేదు. ఆధ్యాత్మిక రంగంలోని బ్రాహ్మణులు, వ్యాపారరంగంలోని బనియాలు సంస్కృతంలో, ప్రాంతీయ భాషల్లో అధునాతన భాషా నైపుణ్యాలను పొందారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ ప్రజానీకంపై ఆధిపత్యం వహించడానికి వీరు తమ బాషా నైపుణ్యాలను ఉపయోగించేవారు. ఈ పరిస్థితుల్లో భారతీయులందరికీ ఇంగ్లిషును పరి చయం చేయకపోతే, ఈ శూద్ర, దళిత, ఆదివాసీలు ఆధునిక ఆర్థికవ్యవస్థలోకి ప్రవేశించలేరు కూడా. చివరకు అన్ని రాష్ట్రాల్లోనూ మార్కెట్‌ సంబంధాలు కూడా ఇంగ్లిషులోనే నడుస్తున్నాయి. సాధారణ మార్కెట్‌ పూర్తిగా ఇంగ్లిషుకు మారనప్పటికీ, సాంకేతిక మార్కెట్లో మాత్రం ఇంగ్లిష్‌ ఇప్పుడు విస్తరిస్తోంది. హిందీకి అలాంటి విస్తరణ లేదు.

16వ శతాబ్దిలో మొఘల్‌ పాలన నుంచి బ్రిటిష్‌ పాలన మధ్యకాలం వరకు పర్షియన్‌ భాష దేశవ్యాప్తంగా వ్యవహారంలో ఉండేది. చిన్నచిన్న పాలకులు పర్షియన్, ఇతర భాషల్లోనే పాలనను నిర్వహించినప్పటికీ ముఖ్యంగా వీరు ముస్లిం లేక బ్రాహ్మణ అధికారులపైనే ఆధారపడేవారు. ఉదాహరణకు, హైదరాబాద్‌ రాష్ట్రంలో నిజాం  ఉర్దూ, పర్షియన్‌ భాషలను ఉపయోగించేవారు. కొన్ని రాష్ట్రాలు పర్షియన్, ఇతర భాషలను ఉపయోగించేవి. శూద్రులలో ఉన్నత స్థాయి కలిగిన వారు 20 శతాబ్ది ప్రారంభంలో భూయజమానులుగా లేక భూస్వాములుగా మారి నప్పటికీ, వారిలో పర్షియన్‌ భాషా నైపుణ్యాలు పెరగలేదు. సంస్కృతభాష మాత్రం హిందూ మతపరమైన భాషగా ఉనికిని సాగించింది కానీ శూద్రులకు ఈనాటికీ పౌరోహిత్య హక్కు లేదు. అందుకే వీరు సంస్కృత పాఠాలతో పాండిత్య స్థాయిలో సంబంధం కలిగిలేరు. కొద్దిమంది శూద్రులు మాత్రమే సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, వీరు గొప్ప పండితులు కాలేకపోయారు. పైగా హిందూ ధార్మిక గ్రం«థా లపై వీరు చేసే వ్యాఖ్యానాలకు సాధికారిక ఆమోదం లభించలేదు. బ్రాహ్మణ పండితుడి సంస్కృతం మాత్రమే ప్రామాణికంగా గుర్తింపు పొందేది. అందుచేతే సంస్కృత భాషా రంగంలో సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చించడానికి శూద్రులలో ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. ఫలితంగా వేల ఏళ్లుగా వీరు జాతీయతత్వం అనే భావనకు దూరంగా ప్రత్యేక ప్రాంతాల్లోనే మిగిలిపోయి ఉన్నారు.

ప్రస్తుతం దళితుల ముందున్న మార్గం ఏది?
శూద్రులు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతికి ఏకైక పరిష్కారం దేశం లోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టడమే. విద్యలో ద్వంద్వ మీడియం.. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ప్రాంతీయ భాష, ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం అనేది ఒక వంచనాత్మక వ్యవస్థ. శూద్రులను, దళితులను, ఆదివాసీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిని అందుకోకుండా అడ్డుకోవడమే దీని లక్ష్యం. భారత స్వాతంత్య్రానంతరం కూడా బ్రాహ్మణ, బనియా శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలాంటి వ్యవస్థకు పథక రచన చేశారు. శూద్ర, దళిత, ఆదివాసీలకు జాతీయస్థాయిలో వారిని అనుసంధానించే భాషే లేకుండా పోయింది. దేశ చరిత్రలో ఇంగ్లిష్‌ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారత్‌లో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్‌ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. ఆనాటికి రాజారామ్మోహన్‌ రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్‌ తిలక్, మహదేవ్‌ గోవింద్‌ రనడే (అందరూ బ్రాహ్మణులే) ఇంగ్లిష్‌లోనే చదువుకున్నారు. నిజానికి తిలక్‌ 1880లోనే ఇంగ్లిష్‌ మీడి యం స్కూల్‌ను ప్రారంభించారు. మహాత్మా పూలే ఆయన సీనియర్‌. కానీ ఒక స్కాటిష్‌ మిషన్‌ స్కూల్‌లో 7వ తరగతి వరకే ఆయన చదువుకున్నారు. శూద్రులను చారిత్రక నిరక్షరాస్యత నుంచి ఆయన కాపాడారు.

శూద్రులలో కొద్దిమంది మాత్రమే ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం పొంది ఇంగ్లిషు విద్యను నేర్చుకున్నారు కానీ ఇంగ్లిష్‌ నేర్వడంలో వారికి పరిమితులు ఉండేవి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న కొందరు శూద్రులు విద్యపై ఎన్నడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. మైసూర్‌ రాజు, బరోడా రాజు వంటి చిన్న చిన్న రాజులు ఉండేవారు. ఈయనే తర్వాత అంబేడ్కర్‌కి విద్యలో సహాయం చేశారు. కాని ఇలాంటి రాజులు తమ కుటుంబ సభ్యులను ఇంగ్లండ్‌కు పంపించి ఇంగ్లిష్‌ విద్య నేర్పించిన రుజువులేవీ లేవు. విద్యకున్న శక్తి ఏమిటో గ్రహించిన వారు కాబట్టి బ్రాహ్మణులు, బనియాలు మాత్రమే విద్య గురించి తీవ్రంగా ఆలోచించేవారు. ఏమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేడ్కర్‌తోటే ప్రారంభమైంది. ఆ విప్లవం ప్రాథమికంగా అనిశ్చితంగానే ఉంటోంది. అది ఆత్మిక, భౌతిక రూపొన్ని సంతరించుకోలేదు. హిందుత్వ శక్తులు అందరికీ ఇంగ్లిషు విద్యను అనుమతిస్తాయో అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎన్నికల అంశంగా మారితే తప్ప ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ వ్యతిరేక మేధావులు ఇంగ్లిష్‌ భాషను సామాన్య ప్రజాభాషగా అనుమతించబోరని వారితో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నా అనుభవం తేల్చి చెబుతోంది.

వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్‌
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement