హిందుత్వ ప్రాపంచిక దృక్పథం 2014 నుంచి సంపూర్ణంగా దేశాన్ని నియంత్రిస్తూ ఉంది. ఢిల్లీలో నరేంద్రమోదీ, అమిత్ షాలు, నాగ్‌పూర్‌లోని మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె తదితర ఆర్‌ఎస్‌ఎస్ అధినేతలు ఒక అసాధారణమైన జాతీయవాద భావజాలాన్ని అమలుచేస్తూ వస్తున్నారు. హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో చారిత్రకంగా మినహాయించిన కులాలు, కమ్యూనిటీలను ఈ జాతీయవాద లక్ష్యం మినహాయించబోదనీ, వారు హిందువులైతే విద్యా వ్యవస్థల్లోంచి వారిని పక్కన పెట్టమని వీరు చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ముస్లింలను, క్రిస్టియన్లను ఇతరులుగా మాత్రమే ఈ దృక్పథం చూస్తుంటుంది.
1990ల సరళీకరణ తర్వాత బడా వాణిజ్య కుటుంబాలు విద్యా వ్యాపారంలోకి అడుగుపెడుతూ వచ్చాయి. రాజీవ్‌గాంధీ హయాం లోనే హరియాణాలోని సోనిపట్‌లో ప్రైవేట్ విద్యారంగం కోసం ఏర్పర్చిన ప్రత్యేక ఆర్థిక మండళ్లలో వీరికి భారీ స్థాయిలో భూమిని కేటాయించారు. ఆ తర్వాతే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ఉనికిలోకి వచ్చాయి. అత్యంత ఖర్చుతో కూడిన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియంని వీటిలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీని ఇవి పాటించలేదు. ఇప్పుడు అత్యంత సరళమైన ఆర్ట్, ప్రాథమిక సైన్స్ విశ్వవిద్యాలయాలుగా పేరొందిన అశోకా, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ఇక్కడే మనుగడలో ఉన్నాయి. దేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అశోకా విశ్వవిద్యలయాన్ని 2014లోనే స్థాపించడం గమనార్హం.
కేంద్ర విద్యా చట్టాలు, నిబంధనలను అమలు చేస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం వర్సిటీలతో పోలిస్తే పై వర్సిటీల స్వభావం, పనితీరు పూర్తిగా భిన్నమైనవి. ఇవి తమ సొంత సిలబస్‌ని కలిగి ఉండటమే కాకుండా, అత్యత నాణ్యమైన ఆంగ్లో - అమెరికన్ ఇంగ్లిష్‌ను బోధిస్తున్నాయి. కాబట్టే ఈ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ప్రపంచ మార్కెట్లలో తమ ఉద్యోగావకాశాలకు సంబంధించి సమర్థవంతంగా పోటీ పడగలుగుతున్నారు. నిరుపేద ఆర్థిక నేపథ్యం కలిగి ఉండి తొలి తరం ప్రాంతీయ భాషా స్కూల్ విద్యా విధానంలో పెరిగివచ్చిన దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఈ ప్రైవేట్ విద్యా కేంపస్‌లలోకి కనీసం అడుగు కూడా పెట్టలేరు.
జేఎన్‌యూ, ఢిల్లీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నాణ్యమైన విద్యను అందించేవి. ప్రాంతీయ భాషలో చదువుకున్న తొలితరం యువత కూడా ఇవి అందించే నాణ్యమైన విద్యను, ఇంగ్లిష్ భాషను క్రమంగా అందిపుచ్చుకోగల వాతావరణం ఈ విద్యాసంస్థల్లో ఉండేది. కానీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అలాంటి వాతావరణం ఉండదు. మనం ఉత్తమమైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలహీనపర్చి శుద్ధ ప్రైవేట్ ఉన్నత విద్యను ప్రోత్సహించినట్లయితే పేదవర్గాలు అతి త్వరలో లేక తర్వాతైనా నిస్పృహకు గురికాక తప్పదు. ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి కేంద్ర విద్యా సంస్థలు, సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో హిందుత్వ శక్తులు హిందీని మరింతగా ముందుకు తీసుకు వస్తున్నారు. అలాగే వారి శుద్ధ జాతి కేంద్రక హిందుత్వ సిలబస్‌ని కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీనపరుస్తూ, మరోవైపు విదేశీ మార్కెట్ల కోసం సంపన్నులను విద్యావంతులను చేయడానికి ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడం జాతీయవాదం కానే కాదు. భారతదేశం భాషా పరంగా చూస్తే చైనా, జపాన్ వంటి ఇంగ్లిషేతర జాతీయ భాషను కలిగిన దేశం కాదు. అలాగే హిందీ భాష మాండరిన్ (చైనా), జపనీస్ భాష లాంటిది అసలే కాదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తూ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో దానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ప్రమాదకరమైన పద్ధతి. దీని ద్వారా ఒకనాటికి భారతీయ ఇంగ్లిష్, పూర్వపు సంస్కృతంలాగా కొద్దిమంది చేతివిద్యలా మారిపోతుంది. హిందుత్వ శక్తుల ద్వారా తీసుకొస్తున్న ఈ భాషా, సిలబస్ కంటెంట్ రాజకీయాల ప్రమాదాన్ని శూద్ర/దళిత/ఆదివాసీ మేధావులు గమనించే స్థితిలో లేరు. పైగా విద్యా విభాగాల నుంచి దీనికి ప్రతిఘటన ఎదురుకావడం లేదు.
హిందుత్వ స్కూల్ మానసపుత్రిక బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇప్పుడు చాలావరకు హిందీలో బోధన చేస్తూ పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాసేలా అనుమతిస్తోంది. కానీ చాలామంది హిందీలోనే పరీక్షలు రాస్తున్నారు, తమ పరిశోధనలను సమర్పిస్తున్నారు. అయితే గత 35 ఏళ్లుగా మన విద్యావ్యవస్థను ప్రభావితం చేయగల మేధావులను ఈ విశ్వవిద్యాలయం సృష్టించలేకపోయింది. తద్భిన్నంగా, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ అనేకమంది స్కాలర్లను, ప్రభుత్వ ఉన్నతోద్యోగులను, ప్రముఖ రాజకీయ నేతలను రూపొందించాయి. ప్రమాణాలను తీసివేసే ధోరణి ఇలాగే కొనసాగితే, ఈ వర్సిటీలు కూడా మన పేరుమోసిన జాతీయవాద విశ్వవిద్యాలయాల స్థాయికి పడిపోతాయి.
పైగా, హిందుత్వ స్కూల్ దేశీయ పరిశ్రమలు, వ్యవసాయం, విద్యారంగాల్లో భారీ ప్రైవేటీకరణ పట్ల అనుకూలత వ్యక్తం చేస్తోంది. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను వారు ప్రైవేటీకరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త సాగుచట్టాల ద్వారా వ్యవసాయ మార్కెట్లను కూడా ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగానే రైతులు పోరాడుతున్నారు. ఇక ఉన్నత విద్యలో వీరి విధానం కచ్చితంగా భవిష్యత్తుకు భారం కానుంది. ప్రైవేట్ విద్యా సంస్థలను జాతీయీకరణకు బదులుగా అంతర్జాతీయీకరణ వైపు అనుమతిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రమాణాలు పెద్దగా లేని శుద్ధ జాతీయవాద పంథా వైపు తీసుకుపోతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయీకరణ పొందిన ప్రపంచంలో ప్రాంతీయీకరించిన విద్యావ్యవస్థను తీసుకురావడంతో పేదలు మరింతగా అవకాశాలు కోల్పోయి ప్రమాణాలు దిగజారిన వర్గంగా మిగిలిపోతారు.
కేంద్రప్రభుత్వం యూజీసీ ద్వారా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌నీ, భాషనీ, సంస్థాగత చట్రాన్నీ నియంత్రిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు లేదా స్పర్థాతత్వం వంటివి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కావు. భారతీయతపై కాకుండా ప్రాచీన హిందూతత్వంపై, హిందూ విజ్ఞానంపై దృష్టి సారించే హిందూ జాతీయవాదం లక్ష్యం ఏమిటంటే, మెల్లగా ఆంగ్లీకరణను రంగం నుంచి తప్పించడమే. ఉదాహరణకు రాజకీయ తత్వవిచారాన్ని బోధించేటప్పుడు దాంట్లోని యూరోపియన్ చింతనను తగ్గించివేసి భారతీయ వేద విజ్ఞానాన్ని, ఉపనిషత్ చింతనను ముందుకు తీసుకువస్తున్నారు. అయితే దీంట్లోనూ బౌద్ధచింతనను మినహాయించడం కుట్రపూరితం అనిపిస్తోంది. చివరకు జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీలు కూడా ఇప్పుడు ఇంగ్లిష్ నైపుణ్యాలను, అంతర్జాతీయ స్పర్థకు తావిచ్చే జ్ఞానాన్ని మెరుగుపర్చడంపై కాకుండా, హిందీ, హిందుత్వ భావజాలానికి పరిమితం కావడంపైనే దృష్టి పెడుతున్నాయి. చివరకు కేంద్రీకృత పాలన ఉన్న చైనాలో కూడా విద్యావ్యవహారాల్లో ఇంత సంకుచిత దృష్టితో వ్యవహరించడం లేదు. ఈమధ్యనే ప్రతాప్ భాను మెహతా రాజీనామా, వెనువెంటనే అశోకా యూనివర్సిటీలలో జరిగిన చర్చను చూస్తే, విద్యా దార్శనికత కలిగిన ఆధ్యాపకులు జేఎన్‌యూ, ఢిల్లీ వర్శిటీల వంటి కేంద్ర విశ్వవిద్యాలయాలను వదిలిపెట్టి వెళ్లిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కంచ ఐలయ్య, వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
ఇంగ్లిష్ తొలగింపే లక్ష్యంగా...
Published Fri, Aug 13 2021 1:09 AM | Last Updated on Fri, Aug 13 2021 1:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment