కదిరి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అందుబాటులో ఉండాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకేసారి 6500 ‘సక్సెస్ స్కూల్స్’ను 2008లో ప్రవేశ పెట్టారు. అప్పటికి దేశ వ్యాప్తంగా కేవలం 4500 పాఠశాలల్లో మాత్రమే సీబీఎస్‌సీ సిలబస్ బోధిస్తున్న ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఉండేవి.గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, వ్యవసాయ రైతు కూలీల పేద విద్యార్థులకు కూడా ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తీసుకురావాలన్నది ఓ కారణం.
బాల్య వివాహాల నిర్మూలన మరో కారణం 6వ తరగతిలో అంగ్ల మాధ్యమంలో చేరిన గ్రామీణ ప్రాంత విద్యార్థినులు 12వ తరగతి వరకూ(సీబీఎస్‌సీ సిలబస్) ఒకే(సమీప) పాఠశాలలో చదివేందుకు అవకాశం కల్పించారు. 12వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ వారికి 17 ఏళ్లు నిండి శారీరక, మానసిక పరిపక్వత చెందుతారు. ఆంగ్లంలో బోధించేం దుకు అప్పటి దాకా ఎస్‌జీ టీచర్లుగా ఉన్న సుమారు 50 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి, వీరికి శిక్షణ కూడా ఇప్పించారు.
స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఎస్జీ టీచర్ల స్థానంలో అప్పట్లో మెగా డీఎస్సీ ద్వారా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. అవసరమైన చోట్ల విద్యావాలంటీర్లను కూడా నియమించి సక్సెస్ స్కూల్స్‌ను సక్సెస్‌గా నడిపారు. వైఎస్ అకాల మరణంతో సక్సెస్ పాఠశాలల్లో సీబీఎస్‌సీ సిలబస్ పోయి స్టేట్ సిలబస్ వచ్చింది. అది కూడా ఇప్పుడు ఆంగ్ల, తెలుగు మాధ్యమ విద్యార్థులకు కామన్ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకం వినియోగిస్తున్నారు. సీబీఎస్‌సీ స్థానంలో స్టేట్ సిలబస్ ప్రవేశపెట్టడంతో విద్యార్థులు 10వ తరగతి తర్వాత బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమై 100 రోజులు పూర్తైప్పటికీ ఇప్పటి దాకా ఏ పాఠశాలలోనూ ఎవరు ఏం బోధించాలనే టైం టేబుల్ కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక స్కూల్ అసిస్టెంట్ వారంలో 24 పీరియడ్స్‌కు తక్కువ కాకుండా 30 పీరియడ్స్‌కు ఎక్కువ కాకుండా బోధించాలి. ఇది కొన్ని చోట్ల మాత్రమే అమలవుతోంది. గణితం బోధించే ఉపాధ్యాయుడు వారంలో ఆరు రోజుల పని దినాల్లో 6 నుండి 10వ తరగతి వరకు ఒక్కో తరగతికి 8 పిరియడ్లు చొప్పున అత్యధికంగా 40 పిరియడ్లు బోధిస్తున్నారు.
ఇంకొన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా ఉంటూనే ఆయా మండల విద్యాధికారులుగా ఇన్‌చార్జ్ బాద్యతలు నిర్వహిస్తున్నారు. వీరు గతంలో బోధించే సబ్జెక్టులు తమకు సంబంధం లేదంటూ తోటి ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు వేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడూ వారంలో 8 పిరియడ్లు బోధించాలనే నిబంధన ఉంది. సక్సెస్ పాఠశాలల్లో బోధనకు ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని కొన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమ విద్యార్థులతో కలిపి బోధిస్తున్నారు. దీంతో ఆంగ్ల మాధ్యమం చదవాలన్న కోరికున్న విద్యార్థులు కొందరు ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల బాట పట్టారు. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎందుకు నోరుమెదపడం లేదని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు ప్రశ్నిస్తున్నారు.
నాడు సక్సెస్ బడులు..నేడు మొక్కుబడులు
Published Sun, Oct 26 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement
Advertisement