క్లస్టర్ పాఠశాలలను వ్యతిరేకిస్తూ 24న ధర్నా | On the protests against the 24 cluster schools | Sakshi
Sakshi News home page

క్లస్టర్ పాఠశాలలను వ్యతిరేకిస్తూ 24న ధర్నా

Published Thu, Mar 19 2015 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

On the protests against the 24 cluster schools

రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల తీర్మానం
 
కర్నూలు(జిల్లా పరిషత్): క్లస్టర్ పాఠశాలల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన ధర్నా చేయాలని తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠవాలల విద్య సంస్కరణలో భాగంగా క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయనుంది.

ఈ విషయమై బుధవారం స్థానిక గాంధినగర్‌లోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కన్వీనర్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శీలం కాంతారావు అధ్యక్షత వహించారు. క్లస్టర్ పాఠశాలల వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ద్వారకా తిరుమల మండలంలో ఉన్న 57 గ్రామాల పాఠశాలలను కేవలం 10 పాఠశాలలుగా కుదించడం వల్ల 47 గ్రామాల్లో పాఠశాలలు మూతపడటం, ఉపాధ్యాయులు 40 మంది మిగులు చూపారన్నారు.  

దీనివల్ల పేద విద్యార్థులు డ్రాపవుట్లుగా మారడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కుగ్రామాల్లో కూడా ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పరోక్షంగా క్లస్టర్ పాఠశాలలను ప్రవేశపెడుతోందని విమర్శించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. హృదయరాజు మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యా సంస్కరణలో భాగంగా పాఠశాలలను కుదించి, మౌళిక వసతులు కల్పిస్తూ క్లస్టర్ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది, పది గ్రామాల నుంచి బస్సుల ద్వారా విద్యార్థులను తరలిస్తామని ప్రభుత్వం చెప్పడం బడుగు, బలహీనవర్గాల వారికి విద్యను దూరం చేయడమేనన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. రత్నం ఏసేపు మాట్లాడుతూ క్లస్టర్ పాఠశాలల ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకైనా సిద్దమన్నారు.

పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ప్రైవేటపరం చేయడానికి క్లస్టర్ ప్రతిపాదన అని, దీన్ని విరమించుకోవాలని కోరుతూ ఈ నెల 24న ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం(జిటిఎ) జిల్లా కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ గతంలో ప్రవేశపెట్టిన పథకాలు జయప్రదం కాకుండా కొత్త పథకాన్ని ఎలాంటి చర్చలు లేకుండా ప్రవేశపెడుతున్నారని విమర్శించారు.

సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభత్వు పాఠశాలలను నాశనం చేయడానికి క్లస్టర్ ప్రతిపాదనలో ఉన్నాయని ఆరోపించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. కమలాకరరావు, ఎస్. ఇస్మాయిల్, జీటీఎ నాయకులు రామచంద్రుడు, ఐఎఫ్‌టీయు నాయకులు టి. నాగరాజు, పీవైఎల్ యువజన సంఘం నాయకులు టి. తిరుపాలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement