సాక్షి, రంగారెడ్డి జిల్లా : సర్కారు బడిలో బోధన సన్నగిల్లుతోంది.. విద్యార్థి సామర్థ్యం రోజురోజుకీ తగ్గుతోంది.. తరగతి పెరుగుతున్న కొద్దీ వారి ప్రతిభ క్రమంగా మసక బారుతుంది. ఇటీవల రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ సహా పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలోని కొన్ని పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించగా.. పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఉపాధ్యాయులు విధులకు సకాలంలో బడికి హాజరు కాకపోవడం ఒక ఎత్తయితే, విద్యార్థికి పాఠ్యాంశాల్లో కనీస సామర్థ్యం కూడా లేకపోవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. పరిశీలించిన అన్ని పాఠశాలల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించడంతో.. జిల్లా విద్యాశాఖపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఉపాధ్యాయుల టెలీకాన్ఫరెన్స్‌లోనూ ఆర్‌వీఎం ఎస్‌పీడీ ఉషారాణి విద్యాశాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పనితీరు మార్చుకోవాలంటూ ముక్కుసూటిగా స్పష్టం చేయడం గమనార్హం.
ఎవరి సామర్థ్యం ఎంత..?
జిల్లాలో 2,314 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,640 ప్రాథమిక పాఠశాలలు, 247 ప్రాథమికోన్నత పాఠశాలలు కాగా మరో 427 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 3.5లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠ్యాంశాల బోధన అనంతరం క్రమ ం తప్పకుండా విద్యార్థులకు లఘు పరీక్షలు, యూనిట్ పరీక్షలు నిర్వహించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత. వీటి ఆధారంగానే విద్యార్థుల సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతుంది. అయి తే జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. కొన్ని పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ.. వా టి ఫలితాలను ప్రకటించలేదు. ప్రోగ్రెస్ కార్డుల పై ప్రభుత్వం ఎలాంటి మార్గనిర్దేశం చేయనందునే పంపిణీ చేయలేదని ఉపాధ్యాయులు చెప్పుకొస్తున్నారు. కానీ పరీక్షపత్రాల మూల్యాంకనం అనంతరం వచ్చిన మార్కులను కూడా విద్యార్థికి తెలియజేయక పోవడం ఉపాధ్యాయుల పనితీరును స్పష్టం చేస్తోంది. ఆర్వీఎం రాష్ట్ర స్థాయి అధికారులు ఓ పాఠశాలను తనిఖీ చేసి నాలుగో తరగతి విద్యార్థిని పరిశీలించగా.. పాఠ్యపుస్తకాన్ని సైతం చదవలేక తెల్లముఖం వేయడంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. త్రైమాసిక పరీక్షలు దగ్గరపడుతున్నా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించడంపై జిల్లా విద్యాశాఖ సైతం ఇప్పటివరకు దృష్టి సారించ లేదు.
వెనుక‘బడి’...
ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ పలు అంశాల్లో అట్టడుగు స్థానంలో ఉందని పేర్కొన్నారు. బోధనలో నాణ్యత లేదని, ఉపాధ్యాయుల హాజరు శాతం సరిగా లేదని, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ ప్రక్రియలో ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నారన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటులోనూ తీవ్ర జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పలు అంశాల్లో లోపాలను గుర్తు చేస్తూ సరిదిద్దుకోవాలని ఆదేశించారు.
సర్కారు చదువు తిరోగమనం
Published Mon, Sep 23 2013 12:18 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
Advertisement