సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాయడం.. చదవడం.. గణితంలో సర్కారు బడుల విద్యార్థులు చేతులెత్తేస్తున్నారు. 60 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించినా వారిలో ప్రగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ మూడేళ్ల క్రితం పరిచయం చేసిన నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం అమల్లోనూ ఉపాధ్యాయుల్లో చిత్తశుద్ధి కొరవడింది. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రస్థాయి బృందం నిర్వహించిన తనిఖీల్లో ఈ నిజాలు వెల్లడయ్యాయి. సీసీఈ అమల్లోనూ ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయం వెలుగుచూసింది. అసలు సీసీఈపై వారికి సరైన అవగాహనే లేదని అధికారులు పేర్కొనడం గమనార్హం. ఫలితంగా విద్యార్థులు గతంలో మాదిరిగా గైడ్లను వినియోగించాల్సిన దుస్థితి నెలకొంటోందని బట్టబయలైంది. జిల్లావ్యాప్తంగా 27 స్కూళ్లలో తనిఖీ చేసి రూపొందించిన నివేదిక సర్కారు స్కూళ్లలోని డొల్ల చదువులను ఎత్తి చూపుతోంది. పాఠశాలల స్వరూపం, బోధనా తీరు మారేందుకు పలు సూచనలు, సలహాలు చేసింది.
ఉత్తమ బోధన, అభ్యాసన విధానంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన కార్యక్రమాల అమలు తీరును రాష్ట్రస్థాయి ప్రత్యేక బృందం గత నెల 5,6 తేదీల్లో పరిశీలించింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు.. మొత్తం 27 స్కూళ్లలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. అభ్యాసనాభివృద్ధి ప్రణాళిక (ఎల్‌ఈపీ), సీసీఈ, ట్రిపుల్ ఆర్ అమలు తీరు, విద్యార్థుల బ్యాగుల బరువు...ఈ నాలుగు అంశాలే ప్రధాన అంశాలుగా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ట్రిపుల్ ఆర్‌లో అంతంతే..
సమర్థవంతులుగా తీర్చిదిద్దేందుకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు తొలుత చదవడం, రాయడంతో పాటు గణితానికి సంబంధించి చతుర్విద ప్రక్రియల్లో (కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం) అంశాల్లో పట్టు సాధించేలా ట్రిపుల్ ఆర్ విధానం అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. 60 పనిదినాల్లో నిత్యం మధ్యాహ్నం మూడు పీరియడ్లు ఇందుకు కేటాయించి ఆగస్టు నుంచి బోధించినా విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
వెల్లడైన అంశాలు ఇవి..
పలు ప్రాథమిక పాఠశాలల్లో ట్రిపుల్ ఆర్‌లో ప్రగతి పది శాతానికి కూడా మించలేదు.
ఉపాధ్యాయులు చూపించిన విద్యార్థుల ప్రగతికి.. వాస్తవ పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ప్రగతి రిపోర్ట్ లేదు.
తెలుగులో సరళ పదాలు రాయగలిగేవారు 70 శాతం మంది విద్యార్థులే ఉన్నారు. ఎవరూ వాక్యాలు, పేరాలను పూర్తి స్థాయిలో రాసే స్థాయికి చేరుకోలేదు.
ఆంగ్ల పదాలు చదివి రాయగలిగిన వారు 70 నుంచి 80 శాతం.
గణితంలో కూడికలు, తీసివేతలు సులువుగా చేయగలిగే వారు 60 నుంచి 70 శాతమే ఉన్నారు. లెక్కల విషయానికి వచ్చేసరికి 30 శాతం మంది విద్యార్థులు కూడా చేయలేకపోతున్నారు. ఇక గుణకారం, భాగహారం విషయంలో సరేసరి. అందరూ చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా హైస్కూల్ విద్యార్థులు వెనుకబడి ఉన్నారు.
ట్రిపుల్ ఆర్ నిర్వహణ ఆశించిన స్థాయిలో లేదు. ప్రారంభంలో చూపిన ఉత్సాహం.. చివరకు వచ్చేసరికి మొక్కుబడి తంతుగా మారింది. కొన్ని పదాలు బోర్డుమీద రాయించి వాటిని పిల్లల నోటుుబుక్కల్లో యథావిధిగా ఎక్కించారు. తద్వారా నూతన పదాల తయారీలో వెనుకబడ్డారు.
బయటపడిన ఎంఈఓల, హెచ్‌ఎంల నిర్లక్ష్యం
ట్రిపుల్ ఆర్ మానిటరింగ్ మొక్కుబడి తంతుగా జరిగిందని అధికారుల బృందం తమ నివేదికలో పేర్కొంది. పది రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించినా.. అందుకు సంబంధించిన వివరాల నమోదులో విఫలమయ్యారు. ఎంఈఓలు, హెచ్‌ఎంలు పిల్లల ప్రగతిని సమీక్షించి సూచనలు, సలహాలు అందించలేదు. కనీసం మానిటరింగ్‌లో భాగంగా ఏయే అంశాలు పరిశీలించాలో కూడా ఉపాధ్యాయులకు తెలియలేదని రిపోర్ట్ కుండబద్ధలు చేసింది. ఇదే అసలు లోపమని అధికారులు పేర్కొన్నారు.
అటకెక్కిన సీసీఈ
విద్యార్థుల్లో బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకు తీసుకొచ్చి న సీసీఈ విధానం అమలు అటకెక్కింది. ప్రైమరీ స్కూళ్లు పూర్తిగా వెనకబడ్డాయి. ఉన్నత పాఠశాలల్లో కాస్త పర్వాలేకున్నా.. అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. బ్లాక్‌బోర్డ్‌పై టీచర్లు సమాధానాలు రాసి విద్యార్థులకు చూపిస్తున్నారు. విద్యార్థులు స్వతహాగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా.. దీనికి బదులు కొన్ని బడుల్లో ఏకంగా గైడ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై టీచర్లు అభ్యంతరం చెప్పాల్సిపోయి మార్కులు కేటాయించడం గమనార్హం.
భారం పెరిగిందంటున్న టీచర్లు, విద్యార్థులు
రాష్ట్రస్థాయి అధికారుల బృందం తనిఖీల సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని అభిప్రాయాలు వెల్లిబుచ్చారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల చేయించడం భారంగా పరిణమించిందని టీచర్లు చెప్పారు. వివిధ రకాల ప్రొఫార్మాలు, రిజిస్టర్లు, మార్కులు, గ్రేడింగ్‌తో రాతపనుల భారం పెరిగిందన్నారు. సీసీఈని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూల్యాంకనానికి అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని ఏకరువు పెట్టారు. దీంతోపాటు బోధనేతర పనుల జాబితా పెరిగిందని తెలిపారు. యూడైస్, చైల్డ్‌ఇన్ఫో, శాలసిద్ధి తదితర పనులూ తమకే అప్పగిస్తున్నారన్నారు. ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్షలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఒకేసారి రాస్తుండడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా చేస్తే మేలు..
ఏయే అంశాలపై దృష్టి పెడితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్న విషయంపై అధికారుల బృందం కొన్ని సూచనలు, సలహాలు అందజేసింది
ట్రిపుల్ ఆర్ అమలను ప్రాథమిక పాఠశాలల్లో మార్చి వరకు కొనసాగించాలి
ఐదు నుంచి ఆరో తరగతికి వచ్చేలోగా చదవడం, రాయడం, గణిత చతుర్విద ప్రక్రియల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంచేలా హెచ్‌ఎంలు, ఎంఈఓలు బాధ్యత వహించాలి.
గైడ్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి
సీసీఈ విధానంపై సంపూర్ణంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
ప్రశ్నావళి తయారీ, మూల్యాంకనంపై టీచర్లకు తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment