Poor education
-
అ.. అస్తవ్యస్తం ఆ.. ఆపసోపాలు
మళ్లీ అదే తడబాటు. మాతృభాషలో విద్యార్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కనీసం తెలుగు పదాలను అక్షర దోషాలు లేకుండా రాయలేని దుస్థితి. చివరకు చూస్తూ కూడా చదవలేని పరిస్థితి. ఇక ఆంగ్లమంటే ఆందోళన చెందుతున్నారు. గణితం విషయానికి వస్తే వణుకు పుడుతోంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల తీరిదీ.. దాదాపు ఐదు నెలలపాటు విద్యార్థుల్లో అభ్యసన అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపమా?ఉపాధ్యాయుల్లో చిత్తశుద్ధి కొరవడమా? అనే విషయాన్ని పక్కనబెడితే విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువయ్యాయన్నది కాదనలేని వాస్తవం. సాక్షి, రంగారెడ్డి జిల్లా:సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల చదువులు తేలిపోతున్నాయి. స్వేచ్ఛ.. స్వ చ్ఛ.. శ్వేత.. శ్రేష్ట తదితర సరళమైన పదాలు చెబితే రాయలేని పరిస్థితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇంగ్లిష్, గణితం విషయానికి వస్తే మరింత వెనకబడ్డారు. చిన్నచిన్న కూడికలు, తీసివేతలు, భాగహారం లెక్కలు చేయమంటే బిత్తచూపులు చూస్తున్నారు. మూడు, నాలుగో తరగతి విద్యార్థులంటే ఏమో అనుకోవచ్చు కాని పదో తరగతి విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువు నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి విద్యార్థులను మెరుగుపర్చడానికి విద్యాశాఖ గతంలో అభ్యసనాభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలుగు, ఇంగ్లిష్ అంశాల్లో చదవడం, రాయడంతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లో (కూడిక, తీసివేత, భాగహారం, గుణకారం) పట్టు సాధించేలా ట్రిపుల్ ఆర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేసింది. గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మొత్తం 60 పనిదినాల్లో సబ్జెక్టుల బోధనపై ప్రధానంగా దృష్టిసారించారు. పిల్లలు సులువుగా అర్థంచేసుకునేలా ఎలా బోధించాలన్న అంశానికి సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక మాడ్యుల్స్ రూపొందించి విద్యాశాఖ అందజేసింది. మెరుగుదల 14 శాతమే.. నిర్దేశిత సబ్జెక్టుల్లో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలో విద్యార్థులు తీవ్రంగా విఫలమయ్యారు. 60 రోజుల పాటు ప్రత్యేకంగా బోధించినా అరకొర ప్రగతే సాధించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తొలుత ట్రిపుల్ ఆర్ అమలుకు ముందు బేస్ (ప్రీ) టెస్ట్ నిర్వహించి ఆయా సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 97,990 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు రాయలేని, చదవలేని వారు సగటున 47 శాతం మంది విద్యార్థులు ఉన్నట్లు తేలింది. అలాగే ఇంగ్లిష్‌లో 50 శాతం మంది ఉన్నారు. గణితంలో చతుర్విద ప్రక్రియ చేయలేక 49 శాతం మంది విద్యార్థులు సతమతమయ్యారు. అనంతరం సబ్జెక్టుల్లో మెరుగుపడేలా బోధించారు. ప్రతి పది రోజులకోసారి ప్రగతి పరీక్ష పెంచి సామర్థ్యాలను అంచనా వేశారు. ఇలా 60 రోజుల తరగతులు ముగిశాక చివరి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 97,378 మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా వీటి ఫలితాలు వెల్లడయ్యాయి. మొదటి టెస్ట్‌తో పోల్చుకుంటే అన్ని సబ్జెక్టుల్లో సగటున 14 శాతం మంది విద్యార్థుల్లోనే సామర్థ్యాలు మెరుగైనట్లు వెల్లడైంది. మిగిలిన వారిలో ఎటువంటి ప్రగతి కనిపించకపోవడం గమనార్హం. కొరవడిన పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో విద్యార్థుల ప్రతిభ మెరుగుపడక పోవడానికి అధికారుల తీరు కూడా ఒక కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ అమలు చేసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువైందని తెలుస్తోంది. జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు దీనిపై సమీక్ష నిర్వహిస్తే క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు మరింత చిత్తశుద్ధితో పనిచేసే వారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడడంతో టీచర్లు నామమాత్రంగా ట్రిపుల్ ఆర్‌పై దృష్టిసారించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని ఫలితంగానే ఆశించిన స్థాయిలో సామర్థ్యాలను విద్యార్థులు సొంతం చేసుకోలేదని విద్యా పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
రాయలేక.. చదవలేక!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాయడం.. చదవడం.. గణితంలో సర్కారు బడుల విద్యార్థులు చేతులెత్తేస్తున్నారు. 60 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించినా వారిలో ప్రగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ మూడేళ్ల క్రితం పరిచయం చేసిన నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం అమల్లోనూ ఉపాధ్యాయుల్లో చిత్తశుద్ధి కొరవడింది. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రస్థాయి బృందం నిర్వహించిన తనిఖీల్లో ఈ నిజాలు వెల్లడయ్యాయి. సీసీఈ అమల్లోనూ ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయం వెలుగుచూసింది. అసలు సీసీఈపై వారికి సరైన అవగాహనే లేదని అధికారులు పేర్కొనడం గమనార్హం. ఫలితంగా విద్యార్థులు గతంలో మాదిరిగా గైడ్లను వినియోగించాల్సిన దుస్థితి నెలకొంటోందని బట్టబయలైంది. జిల్లావ్యాప్తంగా 27 స్కూళ్లలో తనిఖీ చేసి రూపొందించిన నివేదిక సర్కారు స్కూళ్లలోని డొల్ల చదువులను ఎత్తి చూపుతోంది. పాఠశాలల స్వరూపం, బోధనా తీరు మారేందుకు పలు సూచనలు, సలహాలు చేసింది. ఉత్తమ బోధన, అభ్యాసన విధానంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన కార్యక్రమాల అమలు తీరును రాష్ట్రస్థాయి ప్రత్యేక బృందం గత నెల 5,6 తేదీల్లో పరిశీలించింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు.. మొత్తం 27 స్కూళ్లలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. అభ్యాసనాభివృద్ధి ప్రణాళిక (ఎల్ఈపీ), సీసీఈ, ట్రిపుల్ ఆర్ అమలు తీరు, విద్యార్థుల బ్యాగుల బరువు...ఈ నాలుగు అంశాలే ప్రధాన అంశాలుగా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ట్రిపుల్ ఆర్‌లో అంతంతే.. సమర్థవంతులుగా తీర్చిదిద్దేందుకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు తొలుత చదవడం, రాయడంతో పాటు గణితానికి సంబంధించి చతుర్విద ప్రక్రియల్లో (కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం) అంశాల్లో పట్టు సాధించేలా ట్రిపుల్ ఆర్ విధానం అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. 60 పనిదినాల్లో నిత్యం మధ్యాహ్నం మూడు పీరియడ్లు ఇందుకు కేటాయించి ఆగస్టు నుంచి బోధించినా విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వెల్లడైన అంశాలు ఇవి.. పలు ప్రాథమిక పాఠశాలల్లో ట్రిపుల్ ఆర్‌లో ప్రగతి పది శాతానికి కూడా మించలేదు. ఉపాధ్యాయులు చూపించిన విద్యార్థుల ప్రగతికి.. వాస్తవ పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ప్రగతి రిపోర్ట్ లేదు. తెలుగులో సరళ పదాలు రాయగలిగేవారు 70 శాతం మంది విద్యార్థులే ఉన్నారు. ఎవరూ వాక్యాలు, పేరాలను పూర్తి స్థాయిలో రాసే స్థాయికి చేరుకోలేదు. ఆంగ్ల పదాలు చదివి రాయగలిగిన వారు 70 నుంచి 80 శాతం. గణితంలో కూడికలు, తీసివేతలు సులువుగా చేయగలిగే వారు 60 నుంచి 70 శాతమే ఉన్నారు. లెక్కల విషయానికి వచ్చేసరికి 30 శాతం మంది విద్యార్థులు కూడా చేయలేకపోతున్నారు. ఇక గుణకారం, భాగహారం విషయంలో సరేసరి. అందరూ చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా హైస్కూల్ విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్వహణ ఆశించిన స్థాయిలో లేదు. ప్రారంభంలో చూపిన ఉత్సాహం.. చివరకు వచ్చేసరికి మొక్కుబడి తంతుగా మారింది. కొన్ని పదాలు బోర్డుమీద రాయించి వాటిని పిల్లల నోటుుబుక్కల్లో యథావిధిగా ఎక్కించారు. తద్వారా నూతన పదాల తయారీలో వెనుకబడ్డారు. బయటపడిన ఎంఈఓల, హెచ్ఎంల నిర్లక్ష్యం ట్రిపుల్ ఆర్ మానిటరింగ్ మొక్కుబడి తంతుగా జరిగిందని అధికారుల బృందం తమ నివేదికలో పేర్కొంది. పది రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించినా.. అందుకు సంబంధించిన వివరాల నమోదులో విఫలమయ్యారు. ఎంఈఓలు, హెచ్ఎంలు పిల్లల ప్రగతిని సమీక్షించి సూచనలు, సలహాలు అందించలేదు. కనీసం మానిటరింగ్‌లో భాగంగా ఏయే అంశాలు పరిశీలించాలో కూడా ఉపాధ్యాయులకు తెలియలేదని రిపోర్ట్ కుండబద్ధలు చేసింది. ఇదే అసలు లోపమని అధికారులు పేర్కొన్నారు. అటకెక్కిన సీసీఈ విద్యార్థుల్లో బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకు తీసుకొచ్చి న సీసీఈ విధానం అమలు అటకెక్కింది. ప్రైమరీ స్కూళ్లు పూర్తిగా వెనకబడ్డాయి. ఉన్నత పాఠశాలల్లో కాస్త పర్వాలేకున్నా.. అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. బ్లాక్‌బోర్డ్‌పై టీచర్లు సమాధానాలు రాసి విద్యార్థులకు చూపిస్తున్నారు. విద్యార్థులు స్వతహాగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా.. దీనికి బదులు కొన్ని బడుల్లో ఏకంగా గైడ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై టీచర్లు అభ్యంతరం చెప్పాల్సిపోయి మార్కులు కేటాయించడం గమనార్హం. భారం పెరిగిందంటున్న టీచర్లు, విద్యార్థులు రాష్ట్రస్థాయి అధికారుల బృందం తనిఖీల సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని అభిప్రాయాలు వెల్లిబుచ్చారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల చేయించడం భారంగా పరిణమించిందని టీచర్లు చెప్పారు. వివిధ రకాల ప్రొఫార్మాలు, రిజిస్టర్లు, మార్కులు, గ్రేడింగ్‌తో రాతపనుల భారం పెరిగిందన్నారు. సీసీఈని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూల్యాంకనానికి అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని ఏకరువు పెట్టారు. దీంతోపాటు బోధనేతర పనుల జాబితా పెరిగిందని తెలిపారు. యూడైస్, చైల్డ్ఇన్ఫో, శాలసిద్ధి తదితర పనులూ తమకే అప్పగిస్తున్నారన్నారు. ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్షలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఒకేసారి రాస్తుండడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే మేలు.. ఏయే అంశాలపై దృష్టి పెడితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్న విషయంపై అధికారుల బృందం కొన్ని సూచనలు, సలహాలు అందజేసింది ట్రిపుల్ ఆర్ అమలను ప్రాథమిక పాఠశాలల్లో మార్చి వరకు కొనసాగించాలి ఐదు నుంచి ఆరో తరగతికి వచ్చేలోగా చదవడం, రాయడం, గణిత చతుర్విద ప్రక్రియల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంచేలా హెచ్ఎంలు, ఎంఈఓలు బాధ్యత వహించాలి. గైడ్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి సీసీఈ విధానంపై సంపూర్ణంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్రశ్నావళి తయారీ, మూల్యాంకనంపై టీచర్లకు తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
పాఠశాలలు మూస్తే పేదలకు చదువు కల్ల
విపక్షాల ఆగ్రహం బీజేపీ వాకౌట్ మంచిది కాదన్న కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విపక్షాలు శుక్రవారం అసెంబ్లీలో వ్యతిరేకించాయి. పాఠశాలలను బలోపేతం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, అలా కాకుండా వాటిని మూసివేస్తే పేదలు విద్యకు నోచుకోరని ఆందోళన వ్యక్తం చేశాయి. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ వాకౌట్ చేయగా, కాంగ్రెస్ సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేయడం మంచిది కాదన్నారు. తక్కువమంది విద్యార్థులున్నారని ఉపాధ్యాయులను బదిలీ చేయడం, పదిమందే ఉన్నారని పాఠశాలలనే మూసివేస్తే భవిష్యత్‌లో మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు చదువుకునే అవకాశమే ఉండదన్నారు. హేతుబద్ధీకరణను అమలు చేస్తే హైదరాబాద్‌లోనే 450 పాఠశాల లు మూతపడతాయన్నారు. రాష్ట్రంలో 15వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి పేర్కొనగా, కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకున్న మాదిరిగా, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకటి రెండు పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్దికి పాటుపడితే బాగుంటుందని జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది ఉపాధ్యాయులులేరని ఎమ్మెల్యే డీకేఅరుణ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 200 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీచర్లులేక 272 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. గ్రామీణ పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదు పాఠశాలల హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదని, విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియ మాత్రమేనని విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పాఠశాలలను మూసివేయాలన్న ప్రతిపాదన లేనేలేదని, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన తరువాతే హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంలో సభ్యులు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు లేనిచోట కిలోమీటర్ పరిధిలోనే ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడం జరుగుతుందని, హేతుబద్ధీకరణలో మిగిలిపోయిన ఉపాధ్యాయులను ఆదే మండలంలో ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల పాఠశాలలుంటే అందులో 2,100 స్కూళ్లల్లో విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు లేవన్నారు. 4,600 స్కూళ్లలో మంచినీరు లేదన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో టాయిలెట్ వస్తుందనే కారణంతో విద్యార్థినులు మంచినీరు తాగడం లేదన్నారు. సామాజిక బాధ్యతగా నీటి వసతి నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛభారత్ కార్యక్రమంగా కేంద్రం మార్పు చేసిందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. సామాజిక బాధ్యత కింద కొన్ని సంస్థలకు సర్కారీ బళ్లలో మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని ఆయన తెలిపారు. వచ్చే వారంలోగా 70 సంస్థలకు 20 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఆగస్టు నాటికి వీటిని పూర్తిచేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
పేదలకు చేరువగా విద్య, వైద్యం
ప్రభుత్వ రంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి వెళ్లడి సాక్షి, బెంగళూరు : నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం చేరువ చేసే దిశగా తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రభుత్వ రంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి వెల్లడించింది. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మూడు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు తెలిపారు. సమితి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని విశ్వేశ్వరయ్య పీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య చికిత్సా శిబిరం, రక్తదాన శిబిరాలను ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్.నాగేశ్వరరావు మాట్లాడుతూ... తమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఉచిత వైద్య చికిత్స, రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. దాదాపు వెయ్యి మంది పేదలు పలు జబ్బులకు చికిత్సలు చేయించుకోవడంతో పాటు ఉచితంగా మందులను కూడా అందుకున్నారని చెప్పారు. ఇక దాదాపు 500 మంది యువతీ యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రతిభ ఉండి పేదరికం కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేని విద్యార్థులకు తమ సంస్థ తరఫున ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే పేద విద్యార్థులు తమను సంప్రదిస్తే వారికి వచ్చిన మార్కులను బట్టి సాయం అందిస్తామని తెలిపారు. అలాంటి ప్రతిభావంత విద్యార్థులెవరైనా సరే 9663991458నంబర్లో తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో లోకాయుక్త డీసీపీ ఎం.నారాయణ, జీవిక హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అశోక్.ఎ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.