- ప్రభుత్వ రంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి వెళ్లడి
సాక్షి, బెంగళూరు : నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం చేరువ చేసే దిశగా తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రభుత్వ రంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి వెల్లడించింది. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మూడు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు తెలిపారు.
సమితి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని విశ్వేశ్వరయ్య పీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య చికిత్సా శిబిరం, రక్తదాన శిబిరాలను ఐఆర్‌ఎస్ అధికారి కె.చంద్రిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్.నాగేశ్వరరావు మాట్లాడుతూ... తమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఉచిత వైద్య చికిత్స, రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు.
దాదాపు వెయ్యి మంది పేదలు పలు జబ్బులకు చికిత్సలు చేయించుకోవడంతో పాటు ఉచితంగా మందులను కూడా అందుకున్నారని చెప్పారు. ఇక దాదాపు 500 మంది యువతీ యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రతిభ ఉండి పేదరికం కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేని విద్యార్థులకు తమ సంస్థ తరఫున ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.
ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే పేద విద్యార్థులు తమను సంప్రదిస్తే వారికి వచ్చిన మార్కులను బట్టి సాయం అందిస్తామని తెలిపారు. అలాంటి ప్రతిభావంత విద్యార్థులెవరైనా సరే 9663991458నంబర్‌లో తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో లోకాయుక్త డీసీపీ ఎం.నారాయణ, జీవిక హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అశోక్.ఎ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.