పాఠశాలలు మూస్తే పేదలకు చదువు కల్ల | Poor students cannot be study, if schools would be closed, says Jagadeesh reddy | Sakshi
Sakshi News home page

పాఠశాలలు మూస్తే పేదలకు చదువు కల్ల

Published Sat, Nov 15 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

పాఠశాలలు మూస్తే పేదలకు చదువు కల్ల

పాఠశాలలు మూస్తే పేదలకు చదువు కల్ల

విపక్షాల ఆగ్రహం  
బీజేపీ వాకౌట్    
మంచిది కాదన్న కాంగ్రెస్

 
సాక్షి, హైదరాబాద్:  తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విపక్షాలు శుక్రవారం అసెంబ్లీలో  వ్యతిరేకించాయి. పాఠశాలలను బలోపేతం చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, అలా కాకుండా వాటిని మూసివేస్తే పేదలు విద్యకు నోచుకోరని ఆందోళన వ్యక్తం చేశాయి. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ వాకౌట్ చేయగా, కాంగ్రెస్ సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేయడం మంచిది కాదన్నారు. తక్కువమంది విద్యార్థులున్నారని ఉపాధ్యాయులను బదిలీ చేయడం, పదిమందే  ఉన్నారని పాఠశాలలనే మూసివేస్తే భవిష్యత్‌లో మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు చదువుకునే అవకాశమే ఉండదన్నారు. హేతుబద్ధీకరణను అమలు చేస్తే హైదరాబాద్‌లోనే 450 పాఠశాల లు మూతపడతాయన్నారు.
 
 రాష్ట్రంలో 15వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి పేర్కొనగా, కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకున్న మాదిరిగా, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకటి రెండు పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్దికి పాటుపడితే బాగుంటుందని జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది ఉపాధ్యాయులులేరని ఎమ్మెల్యే డీకేఅరుణ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 200 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీచర్లులేక 272 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. గ్రామీణ పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదు
 పాఠశాలల హేతుబద్ధీకరణ అంటే మూసివేయడం కాదని, విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియ మాత్రమేనని విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పాఠశాలలను మూసివేయాలన్న ప్రతిపాదన లేనేలేదని, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన తరువాతే హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంలో సభ్యులు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు లేనిచోట కిలోమీటర్ పరిధిలోనే ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడం జరుగుతుందని, హేతుబద్ధీకరణలో మిగిలిపోయిన ఉపాధ్యాయులను ఆదే మండలంలో ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల పాఠశాలలుంటే అందులో 2,100 స్కూళ్లల్లో విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు లేవన్నారు. 4,600 స్కూళ్లలో మంచినీరు లేదన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో టాయిలెట్ వస్తుందనే కారణంతో విద్యార్థినులు మంచినీరు తాగడం లేదన్నారు.
 
 సామాజిక బాధ్యతగా నీటి వసతి
 నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛభారత్ కార్యక్రమంగా కేంద్రం మార్పు చేసిందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. సామాజిక బాధ్యత కింద కొన్ని సంస్థలకు సర్కారీ బళ్లలో మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని ఆయన తెలిపారు. వచ్చే వారంలోగా 70 సంస్థలకు 20 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించే బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఆగస్టు నాటికి వీటిని పూర్తిచేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement