మళ్లీ అదే తడబాటు. మాతృభాషలో విద్యార్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కనీసం తెలుగు పదాలను అక్షర దోషాలు లేకుండా రాయలేని దుస్థితి. చివరకు చూస్తూ కూడా చదవలేని పరిస్థితి. ఇక ఆంగ్లమంటే ఆందోళన చెందుతున్నారు. గణితం విషయానికి వస్తే వణుకు పుడుతోంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల తీరిదీ.. దాదాపు ఐదు నెలలపాటు విద్యార్థుల్లో అభ్యసన అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపమా?ఉపాధ్యాయుల్లో చిత్తశుద్ధి కొరవడమా? అనే విషయాన్ని పక్కనబెడితే విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువయ్యాయన్నది కాదనలేని వాస్తవం.
సాక్షి, రంగారెడ్డి జిల్లా:సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల చదువులు తేలిపోతున్నాయి. స్వేచ్ఛ.. స్వ చ్ఛ.. శ్వేత.. శ్రేష్ట తదితర సరళమైన పదాలు చెబితే రాయలేని పరిస్థితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇంగ్లిష్, గణితం విషయానికి వస్తే మరింత వెనకబడ్డారు. చిన్నచిన్న కూడికలు, తీసివేతలు, భాగహారం లెక్కలు చేయమంటే బిత్తచూపులు చూస్తున్నారు. మూడు, నాలుగో తరగతి విద్యార్థులంటే ఏమో అనుకోవచ్చు కాని పదో తరగతి విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువు నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి విద్యార్థులను మెరుగుపర్చడానికి విద్యాశాఖ గతంలో అభ్యసనాభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలుగు, ఇంగ్లిష్ అంశాల్లో చదవడం, రాయడంతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లో (కూడిక, తీసివేత, భాగహారం, గుణకారం) పట్టు సాధించేలా ట్రిపుల్ ఆర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేసింది. గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మొత్తం 60 పనిదినాల్లో సబ్జెక్టుల బోధనపై ప్రధానంగా దృష్టిసారించారు. పిల్లలు సులువుగా అర్థంచేసుకునేలా ఎలా బోధించాలన్న అంశానికి సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక మాడ్యుల్స్ రూపొందించి విద్యాశాఖ అందజేసింది.
మెరుగుదల 14 శాతమే..
నిర్దేశిత సబ్జెక్టుల్లో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలో విద్యార్థులు తీవ్రంగా విఫలమయ్యారు. 60 రోజుల పాటు ప్రత్యేకంగా బోధించినా అరకొర ప్రగతే సాధించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తొలుత ట్రిపుల్ ఆర్ అమలుకు ముందు బేస్ (ప్రీ) టెస్ట్ నిర్వహించి ఆయా సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 97,990 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు రాయలేని, చదవలేని వారు సగటున 47 శాతం మంది విద్యార్థులు ఉన్నట్లు తేలింది. అలాగే ఇంగ్లిష్‌లో 50 శాతం మంది ఉన్నారు. గణితంలో చతుర్విద ప్రక్రియ చేయలేక 49 శాతం మంది విద్యార్థులు సతమతమయ్యారు. అనంతరం సబ్జెక్టుల్లో మెరుగుపడేలా బోధించారు. ప్రతి పది రోజులకోసారి ప్రగతి పరీక్ష పెంచి సామర్థ్యాలను అంచనా వేశారు. ఇలా 60 రోజుల తరగతులు ముగిశాక చివరి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 97,378 మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా వీటి ఫలితాలు వెల్లడయ్యాయి. మొదటి టెస్ట్‌తో పోల్చుకుంటే అన్ని సబ్జెక్టుల్లో సగటున 14 శాతం మంది విద్యార్థుల్లోనే సామర్థ్యాలు మెరుగైనట్లు వెల్లడైంది. మిగిలిన వారిలో ఎటువంటి ప్రగతి కనిపించకపోవడం గమనార్హం.
కొరవడిన పర్యవేక్షణ
ఆశించిన స్థాయిలో విద్యార్థుల ప్రతిభ మెరుగుపడక పోవడానికి అధికారుల తీరు కూడా ఒక కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ అమలు చేసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువైందని తెలుస్తోంది. జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు దీనిపై సమీక్ష నిర్వహిస్తే క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు మరింత చిత్తశుద్ధితో పనిచేసే వారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడడంతో టీచర్లు నామమాత్రంగా ట్రిపుల్ ఆర్‌పై దృష్టిసారించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని ఫలితంగానే ఆశించిన స్థాయిలో సామర్థ్యాలను విద్యార్థులు సొంతం చేసుకోలేదని విద్యా పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment