ఆర్వీఎం.. అయోమయం! | RVM .. Confused! | Sakshi
Sakshi News home page

ఆర్వీఎం.. అయోమయం!

Published Fri, Jan 31 2014 6:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

RVM .. Confused!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
 రాజీవ్ విద్యా మిషన్.. రికార్డులు చూస్తే అంతా ఉన్నట్టే అనిపిస్తుంది.. కానీ  ఏదీ సవ్యంగా ఉండదు.. ఇదొక అక్రమాల పుట్ట. అంతులేని అవినీతికి, అంతకు మించిన అలసత్వానికి పర్యాయ పదం ఆర్వీఎం. ప్రజాదనం కొల్లగొట్టి ఏజెన్సీల గల్లా నింపడం, వాళ్లిచ్చే కమీషన్లను పోగేసుకోవడమే అధికారుల పని. ఆ తర్వాత పర్యవేక్షణ లేక కోట్లాది విలువైన ఉపకరణాలు విద్యార్థులకు ఉపయోగపడకుండానే పోతున్నాయి. గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడం, వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచి కాన్వెంట్ స్కూల్ విద్యార్థులకు దీటుగా మలిచేందుకు కంప్యూటర్ విద్యను బోధించాలని ప్రతిపాదించారు. ఫైళ్లు చకచక కదిలాయి. కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్‌ను ఓ ఏజెన్సీకి అప్పగించారు.
 
  సుమారు  కోటి రూపాయలకి పైగా ఖర్చు చేసి జిల్లాలో 43 కస్తూర్బా పాఠశాలలకు 125 కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను పంపిణీ చేశారు. వాటి ద్వారా 7,500 మంది విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలని నిర్దేశించారు. పైగా కలెక్టర్ స్మితా సబర్వాల్ పాఠశాల మౌలిక వసతులు, ఉత్తీర్ణత సాధనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు. హాజరుశాతం, ఉత్తీర్ణత పెంచాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కస్తూర్బా పాఠశాలల పనితీరు, వాటిలో బోధన ఉపకరణాల ద్వారా చేసే విద్యాబోధన  తీరును పరిశీలించేదుకు ‘సాక్షి’ కొన్ని పాఠశాలలను సందర్శించినప్పుడు అంతులేని అలసత్వం బయటపడింది. ఎంతో ఉపయుక్తమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించకుండా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిన తీరు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన కంప్యూటర్లను ఉపయోగించకుండా, ఏళ్లకేళ్లుగా కనీసం సీల్ తీయకుండా అటక మీద పడేయడం ఆశ్చర్యంగొలిపింది. ‘సాక్షి’కి అందిన సమాచారం మేరకు 43 పాఠశాలల్లో ఒక్క పాఠశాలలో కూడా కంప్యూటర్ విద్యాబోధన లేదు.
 
     శివ్వంపేటలో కస్తుర్బా గిరిజన బాలికల వసతి గృహానికి రెండు సంవత్సరాల క్రితం ఐదు కంప్యూటర్లను సరఫరా చేసింది. వీటిని కనీసం సీల్ కూడా తీయకుండా అటకమీద వేశారు. అప్పటి నుంచి అవి వృథాగా ఉన్నాయి. కాగా కంప్యూటర్ బోధన అందించేందుకుగాను అవకాశం లేకపోవడంతో వాటిని ఉపయోగించడం లేదని అక్కడి ఉపాధ్యాయుడు చెప్తున్నారు.
 
     అల్లాదుర్గంలో కంప్యూటర్లను మూలకు పడేశారు. అక్కడి విద్యార్థులకు కంప్యూటర్ అంటే కూడా ఏమిటో తెలియని పరిస్థితి ఉంది.
 
     కొండాపూర్‌లో కంప్యూటర్లను ఉపయోగించకుండానే పనికి రాకుండా పోయాయి. యూపీఎస్, మానిటర్‌లోకి ఎలుకలు వెళ్లి వైర్లు కొరికివేయడంతో అవి చెడిపోయాయి.
 
     కంగ్టిలో కంప్యూటర్లు ఉంచడానికి స్థలం లేదని ఓ మూలన పడేశారు. కంప్యూటర్ బోధించడానికి ఎవరూ లేరని విద్యార్థులు చెప్తున్నారు.  
 
     జగదేవ్‌పూర్‌లో ఒక్క రోజు కూడా వాడకుండానే రిపేర్‌కు వచ్చాయి. ఇక్కడ కంప్యూటర్ విద్యాబోధన చేయలేదని విద్యార్థులు చెప్తున్నారు.
 
 మేమేం చేయగలం: ప్రధానోపాధ్యాయుల ఆవేదన  
 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు కానీ వాటిని బోధించే ఉపాధ్యాయులను నియమించలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. గత ఏడాది కంప్యూటర్ విద్యా బోధన కోసం కేజీబీవీలో పనిచేస్తున్న సీఆర్టీలలో కంప్యూటర్ అవగాహన కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి విద్యా బోధన చేయించేవారు. ఎలాంటి అదనపు చెల్లింపులు చెల్లిం చకపోవడంతో పనిచేస్తున్న సీఆర్టీలు బోధించేందుకు నిరాకరించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు మాసాలు కావస్తున్నా కంప్యూటర్ బోధకుల నియామకంలో స్పష్టమైన ఆదేశాలు ఇంతవరకు అందలేదు. దీంతో కంప్యూటర్ బోధనపై దృష్టి సారించలేకపోయామని హెడ్‌మాస్టర్లు చెప్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని బోధించడానికి గౌరవ  వేతనం ఇచ్చి ఒక్క ఇన్‌స్ట్రక్టర్‌ను పెట్టాలనే ఆలోచన మాత్రం చేయలేదని వారు అంటున్నారు.
 
 వృధా నిజమే
 కంప్యూటర్ బోధనకు టీచర్లను నియమించకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. కంప్యూటర్ సీఆర్టీల కోసం ఆర్వీఎం సంచాలకులకు ప్రతిపాదనలు పంపాం. ఈ విద్యా సంవత్సరం కూడా కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలలో కంప్యూటర్ పరి జ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో శిక్షణ ఇవ్వలేకపోయాం.
  -రమేష్, ఆర్వీఎం ఇన్‌చార్జి పీఓ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement