kasthurbha school
-
మీ వల్లే 32 మందికి కరోనా.. కలెక్టర్ సీరియస్!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా టెక్రియాల్ కస్తూర్బా పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం పట్ల జిల్లా కలెక్టర్ శరత్ సీరియస్ అయ్యారు. ఓ వైపు కోవిడ్ కేసులు పంజా విసురుతున్న తరుణంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ శరత్ బుధవారం సందర్శించారు. వైద్యులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఎస్ఓ లావణ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల్ని బయటకు ఎలా పంపిస్తారని మండిపడ్డారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేయాలని తెలియదా అని ప్రశ్నించారు. ఎవరో ఒకరు విద్యార్థి కరోనా భారిన పడి ఉండవచ్చని, దానివల్ల అందరికి సోకి ఉంటుందన్నారు. తమ నిర్లక్ష్యం వల్లే 32 మందికి కరోనా సోకిందని మండిపడ్డారు. పాఠశాలలో కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్ స్కూల్లోనే ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భోజనం కూడా ఏర్పాటు చేయాలని ఒకవేళ ఇక్కడ వసతి లేకపోతే సౌత్ క్యాంపస్‌కు పంపించాలని పేర్కొన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎవరు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఇళ్లకు వెళ్తే కరోనా టెస్ట్ తప్పనిసరిగా చేసుకుని తిరిగి రావాలని సూచించారు. తాము అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా కల్పించారు. ఇబ్బంది అనుకుంటే ఇంటికి వెళ్లాలని, ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు పాఠశాలలో శానిటేషన్ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత రాయ్, కౌన్సిలర్ శంకర్ రావు ఉన్నారు. కేజీబీవీలో కరోనా కలకలం కాగా జిల్లా కేంద్ర పరిధిలోని టేక్రియాల్‌లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కోవిడ్ కలకలం సృష్టించింది. విద్యాలయంలో 32 మందికి పాజిటివ్ రావడంతో ఆందోళన నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా స్థానిక ఏఎన్ఎంలు ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే మంగళవారం స్థానిక ఏఎన్ఎం సుజాత టేక్రియాల్ కేజీబీవీలో పరీక్షలు నిర్వహించారు. ఒకరికి పాజిటివ్ రావడంతో ఆమె తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యాలయంలోని 126 మందికి ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించగా 31 మందికి పాజిటివ్ వచ్చింది. విద్య, వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై రెండు మొబైల్ టీంలను రప్పించారు. ల్యాబ్ టెక్నిషియన్లతో మళ్లీ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి పరీక్షలు చేయించారు. 142 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. పదో తరగతి చదువుతున్న వారిలో 13 మంది, తొమ్మిదో తరగతిలో 12 మంది, ఏడో తరగతిలో ముగ్గురు, ఆరో తరగతిలో నలుగురు విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ బాధితులను హోం క్వారంటైన్లో ఉంచారు. వైరస్ ఎలా వ్యాపించింది? టేక్రియాల్ కేజీబీవీలో 180 మంది విద్యారి్థనులు చదువుకుంటున్నారు. ఇటీవల శివరాత్రి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు కొందరు తమ స్వగ్రామాలకు వెళ్లి వచ్చారు. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది పిల్లలను చూడడానికి వచ్చి వెళ్లారు. దీంతో ఎక్కడో విద్యార్థికి వైరస్ సోకి ఉంటుందని, మిగతా విద్యార్థులకు వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలి వైరస్‌బారిన పడినవారిని హోం క్వారంటైన్‌కు తరలించినట్లు డీఈవో రాజు తెలిపారు. పాఠశాల అంతటా సానిటైజ్ చేయించామన్నారు. నెగెటివ్ వచ్చిన విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు నమోదైన విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. తల్లిదండ్రులు స్వయంగా వచ్చి విద్యార్థులను తీసుకువెళ్లడం గమనార్హం. ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడాలని, కోవిడ్ నిబందనలు పాటించాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ సూచించారు. చదవండి: కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి -
32 మంది విద్యార్థులకు కరోనా..కలెక్టర్ సీరియస్
-
చపాతీ పిండిలో పురుగులు.. విద్యార్థినులకు అస్వస్థత
పెద్ద అడిశర్లపల్లి(నల్లగొండ): కలుషిత ఆహారం తిన్న 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివారం జరిగింది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు ఈ రోజు ఉదయం టిఫిన్‌లో భాగంగా చపాతి అందించారు. ఆ చపాతీలకోసం వినియోగించిన గోదుమ, మైదా పిండి, పప్పులో పురుగులు ఉండటంతో పాటు చపాతీలు సరిగా కాలక పోవడంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని 108ల సాయంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 200 మంది విద్యార్థినిలు ఉన్న పాఠశాలాలో ఇప్పటికే జ్వరాలతో 35 మంది ఇళ్లకు చేరారు. -
ఆర్వీఎం.. అయోమయం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాజీవ్ విద్యా మిషన్.. రికార్డులు చూస్తే అంతా ఉన్నట్టే అనిపిస్తుంది.. కానీ ఏదీ సవ్యంగా ఉండదు.. ఇదొక అక్రమాల పుట్ట. అంతులేని అవినీతికి, అంతకు మించిన అలసత్వానికి పర్యాయ పదం ఆర్వీఎం. ప్రజాదనం కొల్లగొట్టి ఏజెన్సీల గల్లా నింపడం, వాళ్లిచ్చే కమీషన్లను పోగేసుకోవడమే అధికారుల పని. ఆ తర్వాత పర్యవేక్షణ లేక కోట్లాది విలువైన ఉపకరణాలు విద్యార్థులకు ఉపయోగపడకుండానే పోతున్నాయి. గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడం, వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచి కాన్వెంట్ స్కూల్ విద్యార్థులకు దీటుగా మలిచేందుకు కంప్యూటర్ విద్యను బోధించాలని ప్రతిపాదించారు. ఫైళ్లు చకచక కదిలాయి. కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్‌ను ఓ ఏజెన్సీకి అప్పగించారు. సుమారు కోటి రూపాయలకి పైగా ఖర్చు చేసి జిల్లాలో 43 కస్తూర్బా పాఠశాలలకు 125 కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను పంపిణీ చేశారు. వాటి ద్వారా 7,500 మంది విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలని నిర్దేశించారు. పైగా కలెక్టర్ స్మితా సబర్వాల్ పాఠశాల మౌలిక వసతులు, ఉత్తీర్ణత సాధనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు. హాజరుశాతం, ఉత్తీర్ణత పెంచాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కస్తూర్బా పాఠశాలల పనితీరు, వాటిలో బోధన ఉపకరణాల ద్వారా చేసే విద్యాబోధన తీరును పరిశీలించేదుకు ‘సాక్షి’ కొన్ని పాఠశాలలను సందర్శించినప్పుడు అంతులేని అలసత్వం బయటపడింది. ఎంతో ఉపయుక్తమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించకుండా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిన తీరు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన కంప్యూటర్లను ఉపయోగించకుండా, ఏళ్లకేళ్లుగా కనీసం సీల్ తీయకుండా అటక మీద పడేయడం ఆశ్చర్యంగొలిపింది. ‘సాక్షి’కి అందిన సమాచారం మేరకు 43 పాఠశాలల్లో ఒక్క పాఠశాలలో కూడా కంప్యూటర్ విద్యాబోధన లేదు. శివ్వంపేటలో కస్తుర్బా గిరిజన బాలికల వసతి గృహానికి రెండు సంవత్సరాల క్రితం ఐదు కంప్యూటర్లను సరఫరా చేసింది. వీటిని కనీసం సీల్ కూడా తీయకుండా అటకమీద వేశారు. అప్పటి నుంచి అవి వృథాగా ఉన్నాయి. కాగా కంప్యూటర్ బోధన అందించేందుకుగాను అవకాశం లేకపోవడంతో వాటిని ఉపయోగించడం లేదని అక్కడి ఉపాధ్యాయుడు చెప్తున్నారు. అల్లాదుర్గంలో కంప్యూటర్లను మూలకు పడేశారు. అక్కడి విద్యార్థులకు కంప్యూటర్ అంటే కూడా ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. కొండాపూర్‌లో కంప్యూటర్లను ఉపయోగించకుండానే పనికి రాకుండా పోయాయి. యూపీఎస్, మానిటర్లోకి ఎలుకలు వెళ్లి వైర్లు కొరికివేయడంతో అవి చెడిపోయాయి. కంగ్టిలో కంప్యూటర్లు ఉంచడానికి స్థలం లేదని ఓ మూలన పడేశారు. కంప్యూటర్ బోధించడానికి ఎవరూ లేరని విద్యార్థులు చెప్తున్నారు. జగదేవ్‌పూర్‌లో ఒక్క రోజు కూడా వాడకుండానే రిపేర్‌కు వచ్చాయి. ఇక్కడ కంప్యూటర్ విద్యాబోధన చేయలేదని విద్యార్థులు చెప్తున్నారు. మేమేం చేయగలం: ప్రధానోపాధ్యాయుల ఆవేదన కంప్యూటర్లను ఏర్పాటు చేశారు కానీ వాటిని బోధించే ఉపాధ్యాయులను నియమించలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. గత ఏడాది కంప్యూటర్ విద్యా బోధన కోసం కేజీబీవీలో పనిచేస్తున్న సీఆర్టీలలో కంప్యూటర్ అవగాహన కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి విద్యా బోధన చేయించేవారు. ఎలాంటి అదనపు చెల్లింపులు చెల్లిం చకపోవడంతో పనిచేస్తున్న సీఆర్టీలు బోధించేందుకు నిరాకరించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు మాసాలు కావస్తున్నా కంప్యూటర్ బోధకుల నియామకంలో స్పష్టమైన ఆదేశాలు ఇంతవరకు అందలేదు. దీంతో కంప్యూటర్ బోధనపై దృష్టి సారించలేకపోయామని హెడ్మాస్టర్లు చెప్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని బోధించడానికి గౌరవ వేతనం ఇచ్చి ఒక్క ఇన్స్ట్రక్టర్ను పెట్టాలనే ఆలోచన మాత్రం చేయలేదని వారు అంటున్నారు. వృధా నిజమే కంప్యూటర్ బోధనకు టీచర్లను నియమించకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. కంప్యూటర్ సీఆర్టీల కోసం ఆర్వీఎం సంచాలకులకు ప్రతిపాదనలు పంపాం. ఈ విద్యా సంవత్సరం కూడా కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలలో కంప్యూటర్ పరి జ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో శిక్షణ ఇవ్వలేకపోయాం. -రమేష్, ఆర్వీఎం ఇన్చార్జి పీఓ