సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా టెక్రియాల్ కస్తూర్బా పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం పట్ల జిల్లా కలెక్టర్ శరత్ సీరియస్ అయ్యారు. ఓ వైపు కోవిడ్ కేసులు పంజా విసురుతున్న తరుణంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ శరత్ బుధవారం సందర్శించారు. వైద్యులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఎస్‌ఓ లావణ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల్ని బయటకు ఎలా పంపిస్తారని మండిపడ్డారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేయాలని తెలియదా అని ప్రశ్నించారు. ఎవరో ఒకరు విద్యార్థి కరోనా భారిన పడి ఉండవచ్చని, దానివల్ల అందరికి సోకి ఉంటుందన్నారు.
తమ నిర్లక్ష్యం వల్లే 32 మందికి కరోనా సోకిందని మండిపడ్డారు. పాఠశాలలో కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్ స్కూల్‌లోనే ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భోజనం కూడా ఏర్పాటు చేయాలని ఒకవేళ ఇక్కడ వసతి లేకపోతే సౌత్ క్యాంపస్‌కు పంపించాలని పేర్కొన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎవరు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఇళ్లకు వెళ్తే కరోనా టెస్ట్ తప్పనిసరిగా చేసుకుని తిరిగి రావాలని సూచించారు. తాము అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా కల్పించారు. ఇబ్బంది అనుకుంటే ఇంటికి వెళ్లాలని, ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు పాఠశాలలో శానిటేషన్ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత రాయ్, కౌన్సిలర్ శంకర్ రావు ఉన్నారు.
కేజీబీవీలో కరోనా కలకలం
కాగా జిల్లా కేంద్ర పరిధిలోని టేక్రియాల్‌లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కోవిడ్ కలకలం సృష్టించింది. విద్యాలయంలో 32 మందికి పాజిటివ్ రావడంతో ఆందోళన నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా స్థానిక ఏఎన్‌ఎంలు ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే మంగళవారం స్థానిక ఏఎన్‌ఎం సుజాత టేక్రియాల్ కేజీబీవీలో పరీక్షలు నిర్వహించారు. ఒకరికి పాజిటివ్ రావడంతో ఆమె తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యాలయంలోని 126 మందికి ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించగా 31 మందికి పాజిటివ్ వచ్చింది. విద్య, వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై రెండు మొబైల్ టీంలను రప్పించారు. ల్యాబ్ టెక్నిషియన్‌లతో మళ్లీ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి పరీక్షలు చేయించారు. 142 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. పదో తరగతి చదువుతున్న వారిలో 13 మంది, తొమ్మిదో తరగతిలో 12 మంది, ఏడో తరగతిలో ముగ్గురు, ఆరో తరగతిలో నలుగురు విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ బాధితులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.
వైరస్ ఎలా వ్యాపించింది?
టేక్రియాల్ కేజీబీవీలో 180 మంది విద్యారి్థనులు చదువుకుంటున్నారు. ఇటీవల శివరాత్రి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు కొందరు తమ స్వగ్రామాలకు వెళ్లి వచ్చారు. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది పిల్లలను చూడడానికి వచ్చి వెళ్లారు. దీంతో ఎక్కడో విద్యార్థికి వైరస్ సోకి ఉంటుందని, మిగతా విద్యార్థులకు వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించాలి
వైరస్‌బారిన పడినవారిని హోం క్వారంటైన్‌కు తరలించినట్లు డీఈవో రాజు తెలిపారు. పాఠశాల అంతటా సానిటైజ్ చేయించామన్నారు. నెగెటివ్ వచ్చిన విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు నమోదైన విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. తల్లిదండ్రులు స్వయంగా వచ్చి విద్యార్థులను తీసుకువెళ్లడం గమనార్హం. ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడాలని, కోవిడ్ నిబందనలు పాటించాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ సూచించారు.
చదవండి:
కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి
Comments
Please login to add a commentAdd a comment