ఆయుర్దాయానికి కోవిడ్‌ కోత | Covid-19 has shortened human life expectancy by Two years | Sakshi
Sakshi News home page

ఆయుర్దాయానికి కోవిడ్‌ కోత

Published Thu, Mar 14 2024 6:01 AM | Last Updated on Thu, Mar 14 2024 6:01 AM

Covid-19 has shortened human life expectancy by Two years - Sakshi

మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ల ఆయుఃక్షీణత

దక్షిణాసియా దేశాలపై కోవిడ్‌ పెను ప్రభావం

తగ్గిన ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు

లాన్సెట్‌ తాజా నివేదికలో వెల్లడి

కరోనా కోరల్లో చిక్కి యావత్‌ ప్రపంచం విలవిల్లాడిన ఘటన ఇప్పటికీ చాలా మందికి పీడకలే. అధునాతన కోవిడ్‌వ్యాక్సిన్లతో ఎలాగోలా కోవిడ్‌పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేదు నిజం తాజాగా బయటపడింది. 2019–2021 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆయుష్షు దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్‌ కష్టాల నుంచి తెరిపినపడి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానీకానికి ఇది పిడుగుపాటులాంటి వార్తే. లాన్సెట్‌ అధ్యయనంలోని ముఖ్యాంశాలు

► 2019 డిసెంబర్‌లో తొలిసారిగా కోవిడ్‌ వ్యాధికారక కరోనా వైరస్‌ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే 2020, 2021 సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై తాజా అధ్యయనం సమగ్ర వివరాలను వెల్లడించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది. ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది.
► మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి చోట్ల ఆయుఃక్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. కరోనా తొలినాళ్లలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసుల వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది.
► ప్రపంచవ్యాప్తంగా టీనేజీ, యుక్త వయసు వాళ్లలో కోవిడ్‌ మరణాల రేటు ఎక్కువగానే ఉందని పేర్కొంది.
► ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 7 శాతం తగ్గాయి. అంటే మరణాలు 5,00,000 తగ్గాయని అధ్యయనం వెల్లడించింది.
► దక్షిణాసియా, ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్‌ శాపమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియాలోనే చనియారు. ప్రతి నలుగురిలో ఒకరు సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రాణాలు వదిలారు.
► అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో 15 ఏళ్లుపైబడిన వారు ఎంత మంది? వారిపై కోవిడ్‌ ప్రభావం, ఆయుర్దాయం వంటి అంశాలను విశ్లేషించారు. వీరిలో 2019–2021 కాలంలో పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం మరణాల రేటు పెరగడం ఆందోళనకం
► 2020, 2021 సంవత్సరాల్లో మొత్తంగా 13.1 కోట్ల మంది మరణించారు. అందులో కోవిడ్‌ సంబంధ మరణాలు ఏకంగా 1.6 కోట్ల పైమాటే.
► గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్, నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్‌ మరణాలు భారీగా నమోదయ్యాయి.
► దక్షిణాఫ్రికాలోని క్వాజూలూ–నాటల్, లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది
► కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న/ కోవిడ్‌ బారిన పడి కూడా బార్బడోస్, న్యూజిలాండ్, ఆంటిగ్వా, బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం.
► కోవిడ్‌ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా 1950 నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement