human life
-
స్వార్థం- దైవ చింతన
మానవుడు ప్రధానంగా స్వప్రయోజనా దృష్టి గల జీవి. అది అతన్ని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. దీనికి తోడు ఇతర ప్రాణులకు లేని బుద్ధి బలం కూడా మనిషికి ఉంది. మనిషి లోని సహజ లక్షణమైన ఈ స్వార్థ గుణాన్ని గురించి ఉపనిషత్తులు కూడా వివరించాయి. యాజ్ఞ వల్క్య మహర్షి తన భార్య మైత్రేయితో... ‘భార్య భర్తను ప్రేమిస్తున్న దంటే అది తన ఆనందం కోసమే. భర్త భార్యను ప్రేమిస్తున్నాడన్నా అతని ఆనందం కోసమే. ఇంకా పుత్రుల మీద, దేశం మీద, మానవులకున్న ప్రేమ వారి ఆనందం కోసం కాదు తన ఆనందం కోసమే’ అని చెపుతాడు. తన స్వార్థం కోసం ఉపయోగ పడేంతవరకు మానవుడు సమాజంతో సంబంధం పెట్టుకుంటాడు. మనిషిలో సహజంగా ఉండే ఈ స్వార్థాన్ని నియంత్రణ లేకుండా వదిలిపెడితే భూమిపై సుఖ శాంతులు పూర్తిగా కరువైపోతాయి. తన స్వార్థ ప్రయోజనాలకు బలహీనులను పట్టి పీడిస్తాడు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్ళకు తనూ తన కంటె బలవంతుని చేతిలో బలవుతాడు. లోక నాశనానికి దారి తీసే ఈ స్వార్థ గుణాన్ని అణిచి వేసి, మనిషి మనసులో గొప్ప మార్పు దైవ చింతన తీసుకు రాగలదు. మానవులకు శాంతి మయ జీవితాన్ని ఇవ్వటానికి భగవంతుడు వివిధ రూపాలలో అవత రిస్తుంటాడు.ఇహ లోకంలో ప్రశాంత జీవితం గడపటానికి, పరంలో శాశ్వతా నందాన్ని పొందటానికి తగిన ఉపదేశాన్ని మానవాళికి అందజేసిన గ్రంథ రాజం భగవద్గీత. రోజుకొక శ్లోకం చదివినా, నేర్చుకున్నా ఆలోచనలు భగవంతునిపై నిలుస్తాయంటారు పెద్దలు. ‘భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధగా పూజిస్తాడో అతనికి ఆ రూపంపై శ్రద్ధ నిలిచేటట్లు చేస్తాను’ అంటాడు భగవంతుడు. అలా పూజించినందుకు తగిన ఫలాన్ని అందజేస్తాడు. భగవంతుని చింతనలో మనసు పునీతమై, మనిషి నిస్వార్థ జీవిగా మారి, విశాల దృక్పథాన్ని అలవరచుకుంటాడు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
భక్తుని వేదన..
సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
పొద్దు పోతున్నది...
‘పొద్దు పోయెనే శ్రీరాముని పూని భజింపవే మనసా!’ అని దిగులు పడతారు త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో..‘నిద్దుర చేత కొన్నాళ్ళు,విషయ బుద్ధుల చేత కొన్నాళ్ళు’ అంటూ... జీవితంలో మూడోవంతు కాలం నిద్రలోనూ; ఇంద్రియ విషయాల మీదా, సుఖాల మీదా ఉన్న ఆరాటం తీర్చుకునే ప్రయత్నంలో మరింత కాలం వ్యయమై పోతుండె! అని వాపోయారు."పొద్దున లేచి, త్రితాపములను, నరులపొగడి, పొగడి కొన్నాళ్ళు, వట్టి ఎద్దు రీతి, కన్నతావుల భుజియించి,ఏమి తెలియక కొన్నాళ్ళు, ముద్దుగ తోచు భవసాగరమునమునిగి లేచుచు కొన్నాళ్లు, పద్దుమాలిన పామర జనులతో వెర్రిపలుకులాడుచు కొన్నాళ్ళు, ఓ మనసా!"ఉదయం లేచినప్పట్నుంచి, తాపత్రయ పడుతూ, వాళ్ళకూ వీళ్ళకూ భజన చేస్తూ, కేవలం పశువులా ఎక్కడ ఏది కనిపిస్తే దాన్నంతా భుజిస్తూ, పైపై మెరుగులతో ఆకర్షించే సంసార సాగరంలో మునకలు వేస్తూ ఉండటంలోనూ, సాటి అజ్ఞానులతో సారహీనమైన పోచికోలు చర్చలలోనూ చాలాకాలం నష్టమై పోతుండె!"ముదమున ధన, తనయ, ఆగారముల చూచిమదము చేత కొన్నాళ్ళు, అందు, చెదిరినంత, శోకార్ణవగతుడైజాలి చెందుటయు కొన్నాళ్ళు, ఎదటి పచ్చ చూచి తాళలేక, తానిలను తిరుగుట కొన్నాళ్ళు, ముదిమది తప్పిన ముసలితనమునముందు వెనక తెలియక కొన్నాళ్ళు."కొన్నాళ్ళు ధనమూ, సంతానమూ, ఇల్లూ అనుకుంటూ, వాటిని చూసి మదించటంలో గడిచె. అవి బెడిసికొడితే, మళ్ళీ దుఃఖంలో మునిగి, దైన్యతలో కొన్నాళ్ళు. ఎదుటివాడు పచ్చగా ఉంటే, ఏడుస్తూ కొన్నాళ్ళు. పెద్ద వయసు మీదపడేసరికి, బుద్ధి పనిచేయని స్థితిలో కొన్నాళ్ళు... మొత్తం మీద, బాగుగ నామ కీర్తనములు సేయుటే, భాగ్యమని అనక త్యాగరాజ నుతుడైన శ్రీరాముని తత్త్వము తెలియక కొన్నాళ్ళు. ఎంతో పొద్దు గడిచింది. గమనించుకొని, పొద్దు కొంతయినా మిగిలి ఉండగానే, కోదండ రాముడి మీద మనసు పెట్టి భజించకపోతే, జన్మ వ్యర్థం అని నాదబ్రహ్మ హెచ్చరిక. – ఎం. మారుతి శాస్త్రి -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆయుర్దాయానికి కోవిడ్ కోత
కరోనా కోరల్లో చిక్కి యావత్ ప్రపంచం విలవిల్లాడిన ఘటన ఇప్పటికీ చాలా మందికి పీడకలే. అధునాతన కోవిడ్వ్యాక్సిన్లతో ఎలాగోలా కోవిడ్‌పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేదు నిజం తాజాగా బయటపడింది. 2019–2021 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆయుష్షు దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కష్టాల నుంచి తెరిపినపడి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానీకానికి ఇది పిడుగుపాటులాంటి వార్తే. లాన్సెట్ అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధికారక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే 2020, 2021 సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై తాజా అధ్యయనం సమగ్ర వివరాలను వెల్లడించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది. ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది. ► మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి చోట్ల ఆయుఃక్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. కరోనా తొలినాళ్లలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసుల వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది. ► ప్రపంచవ్యాప్తంగా టీనేజీ, యుక్త వయసు వాళ్లలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగానే ఉందని పేర్కొంది. ► ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 7 శాతం తగ్గాయి. అంటే మరణాలు 5,00,000 తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. ► దక్షిణాసియా, ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్ శాపమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియాలోనే చనియారు. ప్రతి నలుగురిలో ఒకరు సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రాణాలు వదిలారు. ► అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో 15 ఏళ్లుపైబడిన వారు ఎంత మంది? వారిపై కోవిడ్ ప్రభావం, ఆయుర్దాయం వంటి అంశాలను విశ్లేషించారు. వీరిలో 2019–2021 కాలంలో పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం మరణాల రేటు పెరగడం ఆందోళనకం ► 2020, 2021 సంవత్సరాల్లో మొత్తంగా 13.1 కోట్ల మంది మరణించారు. అందులో కోవిడ్ సంబంధ మరణాలు ఏకంగా 1.6 కోట్ల పైమాటే. ► గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్, నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి. ► దక్షిణాఫ్రికాలోని క్వాజూలూ–నాటల్, లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది ► కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న/ కోవిడ్ బారిన పడి కూడా బార్బడోస్, న్యూజిలాండ్, ఆంటిగ్వా, బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం. ► కోవిడ్ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా 1950 నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదు
న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా రాణించాలంటే చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. మానవ జీవితాన్ని, మనుషుల సమస్యలను అర్థంచేసుకొని, పరిష్కరించే నేర్పు అలవర్చుకోవాలని, వారికి అదే అతిపెద్ద సాధనమని పేర్కొన్నారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేను సత్కరించారు. నూతన న్యాయమూర్తు నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య గరిష్టంగా 34కు చేరిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వారి అనుభవంతో సుప్రీంకోర్టుకు మంచి పేరు వస్తుందని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే మనల్ని గొప్ప న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా మారుస్తుందని స్పష్టం చేశారు. -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
కొంచెం నెమ్మదిస్తేనే... నిలవగలం!
గడచిన శతాబ్దాల్లో మనిషి అనూహ్యమైన ప్రగతి సాధించాడు. బొగ్గు, వంటగ్యాస్, సహజ వాయువుల శక్తిని ఒడిసిపట్టి, ఇంధన విప్లవం సాధించడంతో సమాజం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. ఆర్థిక అభివృద్ధి అనేది సామాజిక ఆకాంక్షలు పెరిగేందుకు దోహదపడింది. అదే సమయంలో మానవజాతి భవిష్యత్తు కూడలికి చేరింది. అభివృద్ధి వెంట పరుగులు పెట్టడాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మానవజాతి మరిన్ని కాలాలు మనుగడ సాగించాలంటే ఈ ఆలోచన, సమీక్ష అత్యవసరం. అభివృద్ధితో వచ్చిన ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కేన్స్ చెప్పినట్లు, మనిషి జీవన ప్రమాణం కొన్ని వేల ఏళ్లపాటు స్తబ్ధుగానే ఉండింది. శిలాజ ఇంధనాల వాడకం మొదలుకావడం అంటే 18, 19వ శతాబ్దం నుంచే దీంట్లో పెను పురోగతి మొదలైంది. బొగ్గు, వంటగ్యాస్, ముడిచమురు అందుబాటులోకి రావడం మన జీవితాలను సమూలంగా మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దాల్లోనే సగటు ఆయుష్షు రెట్టింపు అయ్యింది. వేల కిలోమీటర్ల దూరాన్ని గంటల్లో దాటేయగలుగుతున్నాం. ప్రపంచం మూలమూల ల్లోని వారితోనూ సమాచార వినిమయం చిటికెలో జరిగిపోతోంది. వృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దాని విపరిణామాలూ ప్రపంచ రూపు రేఖలను మార్చేశాయి అనడంలో సందేహం లేదు. కానీ ఈ అనూహ్య వేగానికి మనం మూల్యం కచ్చితంగా చెల్లిస్తున్నాం. మరింత ఎక్కువ ఉత్పత్తి చేయాలి... అది కూడా సమర్థంగా జరగాలన్న ఆదుర్దా మనల్ని మనం సమీక్షించుకునే, విమర్శించు కునే... ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మదింపు చేసుకునే సమ యమూ ఇవ్వడంలేదు. పైగా... వలసలు, మనిషి చలనశీలతలకు ముడిపడి ఉన్న రాజకీయ సవాళ్లు కూడా కాలంతోపాటు సంక్లిష్టమ వుతూ పోయాయి. ఇప్పుడు ప్రయాణమూ సులువే, పెద్ద ఎత్తున వలస వెళ్లిపోవడమూ సులభమే. వీటి ప్రభావం వనరులపై పడుతోంది. వలస వెళ్లిన ప్రాంతాల సంస్కృతులతో ఘర్షణలకు కారణ మవుతున్నాయి. సామాజిక సమన్వయమూ దెబ్బతింటోంది. సరి హద్దులు పలుచనైపోయి ప్రపంచం కుంచించుకుపోతున్న కొద్దీ పరిస్థి తులు మరింత ముదురుతున్నాయి. అందుకే ఒక క్షణం ఆగి ఈ సవాళ్లను దీర్ఘాలోచనలతో, సమతుల దృష్టితో పరిష్కరించాల్సి ఉంటుంది. సుస్థిరత–అభివృద్ధి మనిషి శతాబ్దాలుగా ఇంధన వినియోగమనే వ్యసనానికి బానిస. శిలాజ ఇంధనాలు మనల్ని ముందుకు పోయేలా చేసినా ప్రపంచాన్ని వాతావరణ మార్పుల అంచున నిలబెట్టింది కూడా ఇవే. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు పెద్దపీట వేయాల్సిన సమయం ఇదే. అయితే ఈ మార్పు జరగాలంటే గనుల తవ్వకాలు, నిర్మాణాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్నది విమర్శకుల అలోచన. పర్యావరణ అనుకూల టెక్నాలజీల కోసం అవసరమైన రాగి, నికెల్, కోబాల్ట్, ఇతర ఖనిజాలు మన అవసరాలకు తగినన్ని ఉన్నాయా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యల్లో కొంత నిజం లేకపోలేదు. కానీ.. మనిషి తన సృజ నాత్మకతతో వీటిని అధిగమించడం పెద్ద కష్టమూ కాదు. భూమిలో ఈ అత్యవసరమైన లోహాలు తగినన్ని ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. కాకపోతే వీటి శుద్ధీ కరణ పద్ధతులు మాత్రం సమస్యాత్మకమైనవి. వీటిని అధిగమించ డమూ కష్టమేమీ కాదు. డిమాండుకు తగ్గట్టు సరఫరాలను పెంచగలిగే పెట్టుబడిదారీ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే ఈ సవాళ్లను ఎదుర్కోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఈ క్రమంలో పర్యావరణ, సామాజిక సమస్యలను విస్మరించడం సరికాదు. ‘రేర్ ఎర్త్మెటల్స్’ ఉత్పత్తిలో, గ్రీన్ టెక్నాలజీల్లో ముందువరసలో ఉన్న చైనాలో పర్యావరణ పరిస్థితి దిగజారిపోవడం, కాలుష్యం, కొన్ని వర్గాల సామాజిక బహిష్కరణ, ఆరోగ్య అంశాలు మనకు హెచ్చరికలుగా నిలవాలి. ఇంకో కీలకమైన విషయం... పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకోవాలంటే మన ఆలోచనా ధోరణుల్లోనూ మార్పులు రావాలి. సుస్థిరత అనేది అభివృద్ధికి అడ్డంకి కాదనీ, మెరుగైన భవిష్యత్తుకు మార్గమనీ గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధులకు పొంతన కుదరదన్న ద్వైదీభావం సరికాదని తెలుసుకోవాలి. నిజానికి పర్యావరణ అనుకూల విధానాలు ఆర్థిక వృద్ధిని పెంచుతాయనీ, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందనీ అర్థం చేసుకోవడం ముఖ్యం. పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడి పనిచేసే కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇదో మేలి అవకాశం. జీవన విధానంలో నిదానం పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు కాస్త నెమ్మదైన జీవన విధానమూ తోడైతే శిలాజ ఇంధనాల దుష్పరిణామాలను తగ్గించడం వీలవుతుంది. ప్రపంచంపై, సమాజంపై సరైన అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఫలాలను అనుభవించడం అవసరం. అభివృద్ధి సాధించే ప్రయాసలో మన చర్యల పర్యవసానా లను గుర్తించి తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం కూడా అవసరం. ఆధునిక జీవితంపై మోజు తాత్కాలికంగా కొన్ని ప్రయో జనాలు కల్పించవచ్చునేమోగానీ... దీర్ఘకాలంలో భూమ్మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదముంది. అభివృద్ధిని సాధించాలన్న వ్యామోహంలో ప్రస్తుతం 800 కోట్లు దాటిన మానవ జనాభాకు ఆహారం అందివ్వడం ఎలా అన్నది మరవకూడదు. మానవ మనుగడ కోసం మన వేగాన్ని తగ్గించు కోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆహార కల్పన అన్న అంశాల మధ్య సమతౌల్యత సాధించాలి. ప్రస్తుతం ఆహారాన్ని పండించడం అనేది ఒక పరిశ్రమలా సాగు తోంది. అయితే ఇందుకు పర్యావరణం మూల్యం చెల్లిస్తోంది. విచ్చల విడి రసాయన ఎరువుల వాడకం, అడవుల నరికివేతవంటివన్నీ పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యతలు, భూమి సారాల విషయంలో చెడు ప్రభావం చూపాయి. సుస్థిరాభివృద్ధి కావాలంటే ఇదే పద్ధతిని కొనసాగించడం మంచిది కాదు. నిదానమే ప్రధానము అందరికీ ఆహారమన్న సవాలును ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలను వెత కాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ... వ్యవసాయ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయాలి. వనరులు అందరికీ అందుబాటులో ఉండేలా అవకాశాలను కల్పించాలి. కాక పోతే ఇదో సంక్లిష్టమైన సవాలే. ఎన్నో సౌకర్యాలు కల్పించిన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ కొంచెం జాగరూకతతో వ్యవహరించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్లు భవిష్యత్తులో ఉద్యోగాలను తగ్గిస్తాయన్న ఆందోళన కూడా ఒకవైపు ఏర్పడుతోంది. ఈ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. విద్యపై పెట్టే పెట్టుబడులు పెరగాలి. అదే సమయంలో కొత్త టెక్నాలజీల గురించి అందరికీ శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు కావాలి. విధానాల ద్వారా సామాజిక అసమతుల్యతలను రూపుమాపే ప్రయత్నం జరగాలి. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఈ ఉరుకుల జీవితాన్ని కాస్త మందగింపజేస్తే ఆత్మవిమర్శకు అవకాశం ఏర్పడుతుంది. మానసిక, భావోద్వేగ సంక్షేమాలను మన ప్రాథమ్యాలుగా ఉంచుకుని పనిచేసేందుకు పనికొస్తుంది. ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు వీలేర్పడుతుంది. ప్రాపంచిక సౌఖ్యాల వెంబడి పరుగులో సామాజిక బంధాలను దాదాపుగా విస్మ రించాం. బంధుత్వాలు, సహానుభూతి, మానవ సంబంధాలను మరో సారి ఆచరించేందుకు, కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తుంది. డా‘. శ్రీనాథ్ శ్రీధరన్ - వ్యాసకర్త కార్పొరేట్ సలహాదారు, ‘టైమ్ ఫర్ భారత్’ రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! ఏమీ లేకుండానే నిన్ను కూడా!
జీవితం క్షణ భంగురం అని తెలిసి కూడా చేయరాని పనులు చేసి మనిషి ఎన్నో అగచాట్లు పడుతుంటాడు. కొందరు అధికారం, అహం, ఆవేశం, అసూయ అనే 'అ'అక్షరం పట్టుకుని ఆఖరికి.. 'ఆ!'.... అని అర్రుల చాచుతూ ఆక్రందన చేసే పరిస్థితిని కొనితెచ్చుకుంటారు. మరికొందరు కామం, క్రోధం, అనే వాటితో క్షమార్హమైన పనులకు పాల్పడి కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటారు. పగ, పిసినారితనం, అనే 'ప' అక్షరాన్ని పట్టుకుని పడరాని పాట్లు పడి పెడబొబ్బలు పెడుతుంటారు మరికొందరు. ఆ తర్వాత ఏదో జబ్బు చేసో లేక అనుకోని ప్రమాదంలోనో తనువు చాలిస్తారు. మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసహ్యం కలగకూడదు. ఏంటిది! జీవితం ఇలా వృథా చేసుకున్నానా? అని తెలుసుకునేలోపే మన కథ ముగిసిపోతుంది. అందుకే అంటారు పెద్దలు బతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు కనీసం ఒక్కటైన చేసి మనిషి అనిపించుకోమని. కనీసం కౌమర, యవ్వన దశలో తెలిసో తెలియకో ఉడుకురక్తంతో ఉచితానుచితాలు ఆలోచించకుండా చేసి ఉండొచ్చు. కనీసం వృద్ధాప్యంలోనైనా తనకు చేతనైనంతలో ఇతరులకు సేవ చేసి తరించాలి. బహుశా అందుకే కాబోలు పెద్దలు మనిషి జీవితం విస్తరాకులాంటిది అని చెప్పారేమో! ఎందుకిలా అన్నారంటే.. ఇది వరకు ఎక్కువగా పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకల్లో.. భోజనాలు విస్తరాకుల్లోనే వడ్డించేవారు. అందువల్ల దీనితో మనిషి జీవితాన్ని పోల్చి ఉండవచ్చు. ఇక మనిషి జీవితానికి విస్తరాక్కి ఉన్న పోలిక ఏంటో చూస్తే.. భోజనం చేసేటప్పుడు మనం కొద్దిగా నీళ్లు విస్తరిలో జల్లి శుభ్రంగా చేసుకుంటాం. ఆ తర్వాత భోజనం పూర్తయ్యేవరకు దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. తిన్న మరుక్షణం, ఆ ఆకుని మడిచి దూరంగా విసిరేస్తాం. మనిషి జీవితం కూడా అంతే! ఊపిరి పోగానే ఒక్క క్షణం కూడా ఉంచం. అయితే ఇక్కడ విస్తరాకు పడేసినప్పుడు అది సంతోషడుతుందట. ఎందుకంటే తాను పోయే ముందు కనీసం ఒక్కరి ఆకలినైనా తీర్చటానికి ఉపయోగపడ్డానులే అని తృప్తి పడుతుందట. కానీ మనిషికి ఆ తృప్తి ఉండదు. పోయే ముందు వరకు ఏదో ఒక వ్యాపకంతో సతమతమవుతూ.. ఎవరో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాడు మనిషి. చేద్దాంలే సేవ అనుకునేలోపే జీవితం జగడాలు, పట్టింపులతో ముగిసిపోతుంది. ఏ క్షణం మనల్ని మృత్యువు కౌగిలించుకుంటుందో చెప్పలేం. ఆ తరుణం రాగానే మన ఒంటిపై గుడ్డకూడా ఉంచరు. ఎంత పెద్ద ధనికుడైన శ్మశానానికి చేరుకోవాల్సిందే. ఏ డబ్బు కోసం అందరితో తగవులాడి, శత్రుత్వం తెచ్చుకున్నామో.. ఆ సొత్తులోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేం. అందుకే పెద్దలు ఊపిరి ఉన్నప్పుడే నలుగురుకి ఉపయోగపడే పనులు చేసేలా జీవించండిరా! అని హితవు చెప్పేది. లేదంటే విస్తరాకు పాటి విలువ కూడా లేని వృథా జీవితంగా మారుతుందని వారి హెచ్చరిక. (చదవండి: సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!) -
భోజనానికి సగటున 96 నిమిషాలు!
ఆధునిక యుగంలో మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతోంది. పొద్దున నిద్ర నుంచి లేచింది మొదలు రాత్రి మళ్లీ పడకపైకి చేరేదాకా అంతా రొటీన్‌గా సాగిపోతోంది. పల్లె జీవితానికి, నగర జీవితానికి కొంత వ్యత్యాసం ఉంటోంది. పల్లె అయినా, నగరమైనా తినడం, పని చేయడం, నిద్రపోవడం.. ఇదే చక్రం పునరావృతం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితం ఎలా సాగుతోందన్న దానిపై కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు. ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంటోంది? ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? అనేది నిశితంగా పరిశీలించారు. ఇందుకోసం 58 దేశాల్లో వివిధ జాతీయ సర్వేల గణాంకాలను క్రోడీకరించారు. ప్రపంచ జనాభాలో 60 శాతం ఈ అధ్యయనం పరిధిలోకి వచ్చారు. అధ్యయనంలో ఏం తేలిందంటే.. ► ఉద్యోగం, ఉపాధి కోసం మనుషులు వారానికి సగటున 41 గంటలు వెచి్చస్తున్నారు. ► ఇంట్లో పరిశుభ్రతకు 2.5 గంటలు, తోట పనులు, ఇతర వ్యక్తిగత పనులకు 3.4 గంటలు వెచి్చస్తున్నారు. ► స్నేహితులతో బయట ఆనందంగా గడపడానికి, టీవీ వీక్షించడానికి, ఆటలు ఆడడానికి సగటున 6.5 గంటలు వెచి్చస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడయ్యిందని పరిశోధకుడు ఎరిక్ గాల్బ్రెయిత్ చెప్పారు. ► గిన్నెలు కడుక్కోవడం, వంట చేసుకోవడం, టేబుళ్లు శుభ్రం చేసుకోవడానికి జనం 55 నిమిషాలు ఖర్చు చేస్తున్నారు. ► భోజనం చేయడానికి 96 నిమిషాలు(1.6 గంటలు) వెచ్చిస్తున్నారు. ► చేపలు పట్టడం, పంటల సాగు, ఇతర వ్యవసాయ సంబంధిత పనులకు 52 నిమిషాల (0.9 గంటలు) సమయం ఖర్చవుతోంది. ► స్నానం, ఆరోగ్య సంరక్షణ వంటి పనుల్లో 2.5 గంటలు గడుపుతున్నారు. ► సర్వేలో చిన్న పిల్లలను కూడా చేర్చడంతో కొన్ని పనులకు పట్టే సమయం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. ► నిద్ర కోసం వెచి్చస్తున్న సమయం 9 గంటలు కాగా, ఇందులో పిల్లల నిద్ర 11 గంటలు, పెద్దల నిద్ర 7.5 గంటలుగా ఉంది. ► కొన్ని విషయాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మతపరమైన ప్రార్థనలు, పూజలకు నిత్యం 12 నిమిషాలు వెచి్చస్తుండగా, కొన్ని దేశాల్లో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటోంది. ► వివిధ దేశాల నడుమ ఆదాయంలో తేడాలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయా దేశాల్లో వివిధ పనులకు ప్రజలు వెచి్చంచే సమయాల్లోనూ తేడాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ► ఉదాహరణకు సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో వ్యవసాయం కోసం వెచ్చించే సమయం అధికం. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సమయం విషయంలో దేశాల మధ్య పెద్దగా తేడాలు లేవని గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జయాపజయాలు
మానవ జీవితం ద్వంద్వాలమయం. కష్టసుఖాలు, కలిమిలేములు, జయాపజయాలు జీవన గమనంలో సహజ పరిణామాలు. జయాపజయాల గురించి మన సమాజంలో పట్టింపు మోతాదు కంటే ఎక్కువే! విజేతలకు వీరపూజలు చేయడం, పరాజితులను విస్మృతిలోకి తోసిపారేయడం సర్వ సాధారణం. అయితే, జయాపజయాలు దైవాధీనాలని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. ఎవరెన్ని సూక్తులు చెప్పినా, ఎవరూ గెలుపు కోసం ప్రయత్నాలను మానుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు గెలుపు దక్కాలనుకునే పట్టుదలతో పగ్గాలు విడిచిన గుర్రాల్లా దూసుకుపోయేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా, ఎంతటి నీచానికి దిగజారడానికైనా తెగబడేవారు ఇంకొందరు ఉంటారు. శక్తికి మించిన విజిగీషతో రగిలిపోయేవారు చరిత్రను రక్తసిక్తం చేస్తారు. అడ్డదారుల్లో పడి అడ్డదిడ్డంగా పరుగులు తీసి, అడ్డు వచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి అందలాలెక్కుతారు. విజయోన్మత్తతను తలకెక్కించుకుని విర్రవీగుతారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మార్పు దాని సహజ స్వభావం. కాలం మారి, పరిస్థితులు వికటించినప్పుడు విజేతలమనుకుని అంతవరకు విర్రవీగిన వారు పెనుతుపాను తాకిడికి కుప్పకూలిన తాటిచెట్లలా నేలకూలిపోతారు. మన పురా ణాల్లో దుర్యోధనుడు, మన సమీప చరిత్రలో హిట్లర్ వంటి వారు అలాంటి శాల్తీలే! ‘అజ్ఞానపు టంధయుగంలో/ తెలియని ఏ తీవ్రశక్తులో/ నడిపిస్తే నడిచి మనుష్యులు/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అజ్ఞానపుటంధ యుగంలోనే కాదు, వర్తమాన అత్యాధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. మొరటు బలం, మూర్ఖత్వం, మోసం, కుట్రలతో సాధించిన అడ్డగోలు విజయాలను తలకెక్కించుకుని, అదంతా తమ ప్రయోజకత్వంగా తలచి విర్రవీగే విజయోన్మత్తులలో దేశాధి నేతల మొదలుకొని చిల్లరమల్లర మనుషుల వరకు నేటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లలోనే దుర్యోధ నుడికి గుడి కట్టి పూజించేవాళ్లు, హిట్లర్‌ను ఆరాధించే వాళ్లు, లేని సుగుణాలను కీర్తిస్తూ నిరంకు శులకు బాకాలూదే వాళ్లు కనిపిస్తారు. గోబెల్స్‌కు బాబుల్లాంటి దుష్ప్రచార నిపుణులు నిర్విరామంగా ఊదరగొడుతూ, జీవితానికి గెలుపే పరమార్థమనే భావనకు ఆజ్యం పోస్తున్నారు. వీళ్ల ప్రభావం కారణంగానే ఓటమిని జీర్ణించుకోలేని తరం తయారవుతోంది. మనుషుల స్థితిగతులను గెలుపు ఓటములతోనే అంచనా వేయడం మన సమాజానికి అలవాటైపోయింది. గెలవాలనే ఒత్తిడి ఒకవైపు, ఓటమి భయం మరోవైపు బతుకుల్లో ప్రశాంతతను ఆవిరి చేస్తున్నాయి. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల నుంచి ఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ ఒత్తిడి తప్పడం లేదు. గెలుపు ఒత్తిడి కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. ఇంకొందరిని అడ్డదారులు తొక్కిస్తుంది. సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణిని సొమ్ముచేసుకోవడానికి కొందరు మేధావి రచయితలు విజయ సోపానమార్గాలను పుస్తకాలుగా అచ్చోసి జనాల మీదకు వదులుతారు. నానావిధ ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ వికాస ప్రవచనాలతో ఊదరగొడతారు. ‘విజయానికి కావలసినది పదిశాతం ప్రేరణ, తొంభైశాతం కఠోర శ్రమ’ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తు బల్బును కనుక్కొనే ప్రయత్నంలో ఆయన వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ‘విద్యుత్ బల్బును కనుక్కోవడంలో వెయ్యిసార్లు విఫలమై, ఇప్పుడు సాధించారు కదా! ఇప్పుడు మీకేమనిపిస్తోంది?’ అని ఒక పాత్రికేయుడు ఆయనను ప్రశ్నించాడు. ‘వెయ్యిసార్లు నేను విఫలమవలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’ అని బదులిచ్చాడాయన. వైఫల్యాలే విజయానికి సోపానాలని గ్రహించడానికి ఎడిసన్ అనుభవమే మంచి ఉదాహరణ. గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లు ఓటమికి కూడా మానసిక సంసిద్ధతతో ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన పట్టుదలతో పునఃప్రయత్నం చేయడానికి తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోవడానికి తగిన ఓరిమితో ఉండాలి. ఈ రెండూ లోపించడం వల్లనే పరీక్షల్లో వైఫల్యం ఎదురైనప్పుడు అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో! స్వేచ్ఛగా జీవితాన్ని జీవించడమే ఒక సాఫల్యం. ఈ ఎరుక లేకనే చాలామంది జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. చిల్లర గెలుపుల కోసం, పదవుల కోసం, పదవులను పదిలపరచుకోవడం కోసం అధికార బలసంపన్నుల ముందు సాగిలబడతారు. ‘వాని జన్మంబు సఫల మెవ్వాడు పీల్చు/ ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ/ పరుల మోచేతి గంజికై ప్రాకులాడు/ వాని కంటెను మృతుడను వాడెవండు?’ అన్నాడో చాటు కవి. ‘విజయమే అంతిమం కాదు. వైఫల్యమేమీ ప్రాణాంతకం కాదు’ అని తేల్చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. కాబట్టి వైఫల్యం ఎదురైనంత మాత్రాన ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. విజయం సాధించినంత మాత్రాన అమాంతంగా ఒరిగిపడే ఆకాశమూ ఉండదు. ‘వైఫల్యాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే మన అసలు పొరపాటు’ అంటాడు అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. వైఫల్యాలే మనకు గుణపాఠాలు నేర్పే గురువులు. గురువులను గౌరవించడం మన సంప్రదాయం. వైఫల్యాలను గౌరవించడం, విజయాలను వినయంగా శిరసావహించడమే మన కర్తవ్యం! -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు
మానవ జీవనాన్ని, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ప్రధానమైనవి తప్పులు. ఆచరణల్లోని తప్పులు మాత్రమే కాదు ఆలోచనల్లోని తప్పులు కూడా మానవాళికీ, ప్రపంచానికీ అనాదిగా హానిచేస్తూనే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుంటే మనం చేసిన తప్పులవల్ల మనకు ఎంత హాని జరిగిందో, మన తప్పులవల్ల ఇతరులకు ఎంత హాని జరిగిందో మనకే తెలిసిపోతుంది. చరిత్రను అవలోకిస్తే దేశాలకూ, ప్రపంచానికీ తప్పులు ఎంత హాని చేశాయో తెలిసిపోతుంది. హిట్లర్ తప్పులవల్ల ప్రపంచయుద్ధమే జరిగి తత్ఫలితంగా కలిగిన వినాశనం మనకు తెలిసిందే. పెద్దస్థాయిల్లో జరిగిన తప్పులవల్ల సామాన్య ప్రజలు విలవిలాడిపోయిన కథనాన్ని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కళ, భాష, సాంస్కృతిక రంగాలకూ తప్పులవల్ల హాని జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దుల క్రితం చోటు చేసుకున్న తప్పులవల్ల తెలుగు సాహిత్యానికే కాదు భాషకు కూడా జరిగిన పెనుహాని ఇవాళ క్షేత్రవాస్తవంగా మనకు తెలుస్తూనే ఉంది. తప్పులవల్ల మనం తప్పులతోనే ప్రయాణం చేస్తున్నాం; తప్పులవైపే ప్రయాణం చేస్తున్నాం; తప్పులతో మనం మమైకమైపోయాం. తప్పులకు ప్రతి మనిషీ గురయ్యాడు; బలయ్యాడు. విద్యలోని తప్పులు, వృత్తిలోని తప్పులు, వ్యవహారాల్లోని తప్పులు, ఆచారాల్లోని తప్పులు, మతపరమైన తప్పులు, విశ్వాసాల్లోని తప్పులు, ప్రవర్తనల్లోని తప్పులు వీటివల్ల మనిషి జీవితం తప్పులమయం అయిపోయింది. ఫలితంగా మనిషి ఒక తప్పుడు జీవి అయిపోయాడు! మనిషి చేస్తున్నట్లుగా, చేస్తున్నంతగా జంతువులు తప్పులు చెయ్యడం లేదు! మనుషులు చేసిన, చేస్తున్న తప్పులవల్ల మానవప్రపంచానికే కాదు జంతుజాలానికి కూడా హాని జరుగుతోంది. చాల తప్పులు చలామణిలోకి వచ్చేశాయి. చాపకింద నీరులా తప్పులు మనలోకి రావడం కాదు కొనసాగుతున్న వానలా తప్పులు మనపై పడ్డాయి, పడుతున్నాయి.. అందువల్ల మనం తడిసిపోతూ ఉండడం కాదు, ఆ తప్పులు చప్పుడు చెయ్యని నిప్పులుగా అయిపోవడం వల్ల మనం మనకు తెలియకుండానే వాటికి కాలిపోతూ ఉన్నాం. చాల కాలంగా తప్పులతో, తప్పులలో, తప్పుల కోసమే బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతుకుతున్నాం. దానికి పర్యవసానంగా చాల కాలంగా తప్పులు మనల్ని శిక్షిస్తున్నాయి... బతకుతున్నాం అనడానికి ఋజువుగా నిత్యమూ మనం తప్పులవల్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు తప్పుల విషయమై ఉండాల్సిన అవగాహన రావడంలేదు. చరిత్రలోని తప్పులు, తప్పుల చరిత్ర... వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. అందుకే మనల్ని భయాలు, అందోళనలు, ఆపదలు, గందరగోళం చుట్టుముట్టాయి, చుట్టుముడుతున్నాయి. గతంలోని తప్పులతో మనం పోరాడడం లేదు. వర్తమానంలోని తప్పుల గురించి మనం ఆలోచించడంలేదు. భవిష్యత్తులో తప్పులవల్ల జరగనున్న విపత్తుల్ని గ్రహించడం లేదు. తప్పు జరగడం, తప్పు చెయ్యడం అనేవి మనిషికి సహజమైనవే. కానీ తప్పే జరుగుతూ ఉండడం, తప్పే చేస్తూ ఉండడం సహజం కాకూడదు. మన తప్పుల్ని, మనలోని తప్పుల్ని తెలుసుకోలేకపోతే మనం నేరస్థులం అవుతాం.తప్పులవల్ల వర్తమాన, భవిష్యత్తుల్లో మనం ముప్పుల పాలు కాకూడదు. ప్రతి సంవత్సరమూ ధనుర్మాసంలో మన ముందుకు వస్తూ ఉండే తిరుప్పావై పాసురాలలో ఒక చోట ఆణ్డాళ్ చెప్పింది: ‘దామోదరుణ్ణి నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలైపోతాయి’. జరిగిన, జరగబోయే తప్పులు కాలి భస్మం అయిపోవాలని 1,200 యేళ్ల క్రితమే ఇలా ఇంత గొప్పగా ఆశంసించడం జరిగింది. మన తప్పులు, మన చుట్టూ ఉన్న తప్పులు కాలిపోకపోతే ఆ తప్పులకు మనం కాలిపోతాం. సరైన మనస్తత్వంతో, వివేకంతో మనలోని తప్పుల్ని తొలగించుకోవాలి; మనం ఒప్పుల్ని ఒంటబట్టించుకోవాలి; ఆపై మనం క్షేమంగానూ, మేలైనవాళ్లంగానూ బతకాలి. – రోచిష్మాన్ -
ఏం లైఫ్ రా అయ్యా.. రోగం వస్తే మింగే మందుల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జబ్బు చేస్తే రాష్ట్ర ప్రజలు మందుల కోసం చేసే ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలసరి మందుల ఖర్చు ఏడాదికి రూ.663 ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయమై దేశంలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచిందని తెలిపింది. కాగా, రాష్ట్ర జనాభా 3.7 కోట్లు అనుకుంటే ఆ ప్రకారం ఒక్కొక్కరు చేసే ఖర్చు మొత్తం కలిపి రూ. 2,453 కోట్లు అవుతుంది. కేవలం మందుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే, ఇక జబ్బుకు ఇతరత్రా చికిత్సకయ్యే ఖర్చులు సరేసరి. తలసరి ఖర్చు రూ. 663 కాగా, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనడం ద్వారా అయ్యే ఖర్చు రూ.122 ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం రూ.7,844 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 69 శాతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులకే సరిపోతుంది. అంటే ఆపరేషన్లు, వైద్య పరీక్షలకు తదితరాలకు అన్నమాట. మిగిలిన 31 శాతం మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోతే అనేక కుటుంబాలు పేదరికంలోకి పోతున్నాయి. కరోనా సమయంలో ఈ పరిస్థితి ఎక్కువగా చూశాం. ఫలితంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. చుట్టుముడుతున్న ప్రమాదకర వ్యాధులు ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు, 2040 నాటికి గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీపీ, షుగర్, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకర వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశుమరణాలు, ఎయిడ్స్, టీబీ, లంగ్ క్యాన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా జనాలను పీడిస్తున్నాయి. అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు 2040 నాటికి మొదటిస్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ క్యాన్సర్ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. ప్రస్తుతం వివిధ వ్యాధులు వస్తున్న 100 మందిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం, శారీరక శ్రమ చేసేవారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్య 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించడం, 80 శాతం వరకు అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గుండెపోట్లను 50 శాతానికి తగ్గించాలని సూచించింది. ఇది కూడా చదవండి: మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా? -
మనిషి మరణించగానే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!
మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది. సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, వెంటనే శరీరం పాడవడాన్ని అరికట్టేందుకు శరీరానికి ఐస్ బాత్ చేయిస్తారు. ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయో ప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు. చదవండి: పార్ట్ 1: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, ద్రవరూపంలోని నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు. ఒకప్పుడు అనేక జబ్బులకు చికిత్స లేదు. కేన్సర్ వచ్చినా, గుండె పోటు వచ్చినా మరణం తప్ప మార్గాంతరం లేదు. కాని ఇప్పుడు ప్రాణాంతక కేన్సర్ కు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పది నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా కూడా చికిత్సతో తిరిగి బ్రతికిస్తున్నారు. కరోనా వంటి అంటువ్యాధులకు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ తయారు చేశారు. నానో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు కూడా తేలిగ్గా చేయగలుగుతున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలను ఒకరి నుంచి మరొకరికి విజయవంతంగా మారుస్తున్నారు. ఇవన్నీ గంటల వ్యవధిలో జరిగితేనే ఫలితం ఉంటుంది. ఈ కోవలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసి మృత శరీరాన్ని వందేళ్ళ వరకు పాడు కాకుండా భద్రపరచగలిగే స్థాయికి చేరారు. .............ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? నాలుగో భాగంలో చదవండి.. చదవండి: పార్ట్ 2: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే.. -
మంచి మాట.. అంతరంగ జ్ఞానం అంటే..?
ఈ భౌతిక ప్రపంచంలో మనసు ద్వారానే మనం జీవితం కొనసాగిస్తున్నాÆ.. మనసే మనిషికి ఆధారం. మనసు లేకుండా మనిషి జీవితం, జీవన విధానం కూడా లేదు. అలాగని మనస్సుతో కుస్తీ పడవలసిన పని లేదు. మన మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనసు నియంత్రణ చేయలేని విధంగా అంతులేని ఆలోచనలతో నిండి ఉంది. వీటితో మనల్ని మనం గుర్తించు కుంటున్నాం. అయితే అది సరికాదు... మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా... నిర్మలంగా ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. ఇది విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ మనస్సులో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. వ్యతిరేకించేది ఏదైనా మనసులో బలపడుతుంది. అది మనస్సుని బలహీనపరుస్తుంది. స్వీకరించేది ఏదైనా శక్తిని పెంచుతుంది. మనస్సు ఈ భౌతిక ప్రపంచంతో పెనవేసుకున్న సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో అనుకూలమైనది, ప్రతికూలమైనది రెండూ ఉంటాయి. మనిషి జ్ఞానపరంగా ఎదగనపుడు ప్రతికూలమైన దానికి భయపడతాడు, తనకు అనుకూలమైన దానిని ఆశిస్తాడు. కానీ పరిపూర్ణమైన జ్ఞాని అనుకూలమైన వాటిని, ప్రతికూలమైన వాటి సమాచారాన్ని వదిలేస్తాడు. ప్రతికూలమైన దానిని వ్యతిరేకిస్తే అది మన అంతరంగమందు బలపడుతుంది. అనుకూలమైన దానికి స్పందిస్తే అది అందకపోతే అసంతృప్తి కలుగుతుంది. జ్ఞాని అంతరంగం ఎప్పుడూ స్వచ్ఛంగా నిర్మలం గా ఉండాలి. అనుకూల ప్రతికూల విషయాలు రెండు లేనప్పుడు మనస్సు ఖాళీ (శూన్య) స్థితి ఏర్పడి నిర్మలత ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా అంటే సాధన ద్వారా ఏదైనా సాధ్యమేనంటారు మహానుభావులు, సిద్ధపురుషులు. వారు దానిని తమ సాధన ద్వారా నిరూపించి చూపారు కూడా. మనం ఈ భౌతిక ప్రపంచంలో అందరి మధ్య అందరిలో ఉండాలి కానీ వాస్తవ పరిస్థితిని జ్ఞానంతో నిరంతరం విశ్లేషించాలి. భావోద్వేగాలకు తావులేకుండా సంఘటనలు వాటంతట అవే జరుగుతుంటాయి వెళుతుంటాయి కానీ మనం భావోద్వేగాలకు లోనుకారాదు. బాహ్యంగా కనిపించేది వినిపించేది వాస్తవం కాదు, దాని వెనుక వేరే ఉంటుంది. జ్ఞాని దానిని కనిపెట్టగలగాలి. అదే అజ్ఞాని అయితే ఫలితం వచ్చిన తర్వాత బాధపడతాడు. మన విచక్షణతో ఏది చేయాలో అది చేయాలి, ఏమి చెయ్యకూడదో అది చేయకూడదు. ఈ ప్రకృతిలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎలా ఉండకూడదో అలా ఉండకూడదు అనే విచక్షణ జ్ఞానంతో మెలగాలి. జ్ఞానం వచ్చేవరకూ అన్ని గమనిస్తూ ఫలితం ఆశించకుండా ఏమి జరుగుతుందో గమనిస్తూ ప్రయాణం చేయాలి. ఇది ఏమీ సామాన్యమైన విషయం కాదు. రకరకాల మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు ప్రతి ఎదుటి వ్యక్తి తనలాగే అందరూ జీవించాలి తన మాటే వినాలి అనుకుంటాడు. అది తప్పు. ముందుగా నీ దృష్టిని సరి చేసుకోవాలి. ఇది చదువుతున్నప్పుడు చాలా అనుమానాలు రావాలి వాటికి మీ అంతరంగం నుండే జవాబులూ రావాలి. అలా సంతృప్తికరమైన సమాధానం వచ్చినప్పుడు మనసు తేలిక అవుతుంది. సందేహాలు లోపల ఉంటే మనస్సు భారమవుతుంది. విశ్లేషణతో విచారణ ఎవరు చేస్తారో వారికి అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎవరు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా గుడ్డిగా నమ్మరాదు. అనుభవం పొంది సత్యాన్ని గ్రహించాలి. అనుభవంలోకి వచ్చి సత్యంగా మారిన నాడు అది మార్పు చెందే అవకాశమే లేదు. సిద్ధాంతపరంగా స్పష్టత ఉంటే ఆ అనుభవం సులభమవుతుంది. సమదృష్టితో – సత్యదృష్టితో ప్రపంచాన్ని చూస్తూ ఉండటం తో క్రమంగా మన మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. నిజంగా ఈ ప్రపంచం ఎంతో ఆకర్షణీయమైనదిగా కనిపిస్తుంది. సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఆ నిజం తెలిస్తే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూస్తే మనలో వస్తువులపై గాని, విషయాలపై గాని, భోగాలపై గాని ఏ విధమైన కోరికగానీ, వ్యామోహం గానీ లేకుండా తటస్థంగా ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మనస్సులో కోరికల వత్తిడి లేకపోవటాన్ని గమనించవచ్చు. ఎటువంటి ఆందోళన లేకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మనం రాగద్వేషాలనే రంగుటద్దాల నుండి చూస్తున్నాం. కొన్నింటిపై రాగం – కొన్నింటిపై ద్వేషం. బుద్ధిలో ఈ రాగద్వేషాలుంటే వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనిపించవు. మనకు ఇష్టమైన వ్యక్తి ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అందవిహీనంగా ఉన్నా మనకు బాగానే ఉంటాడు. అదే ఇష్టం లేని వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా – ఏమి అన్నా వాటిల్లో నుండి తప్పులను వెతుకుతాం. కనుక ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమే సత్య దర్శనం అంటారు. అటువంటి నిష్ఠలోనే నిరంతరం ఉండాలి. – భువనగిరి కిషన్ యోగి -
మంచి మాట..భయం ఒక భ్రమణం
ఈనాడు సమస్త విశ్వాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య భయం. ఇది ఏదైనా సరే ఒకసారి పట్టుకుందంటే అది వ్యక్తిత్వాన్ని దుర్బలపరుస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆందోళనకు అభద్రతకు గురి చేస్తుంది. ఇదొక మానసిక వేదన. దీనివల్ల మొత్తం మనిషి జీవితం నిర్వీర్యమవుతుంది. ఇది సామాజిక వాతావరణం నుంచి ఉద్భవిస్తుంది తప్ప అంతర్గతంగా ఉండదు. బయట వాతావరణాన్ని బట్టి అంతర్గత లక్షణాలు ప్రకోపిస్తాయి. ఈ లక్షణాలే భయానికి ప్రధాన కారణమవుతున్నాయి. నిత్యజీవితంలో మనిషి రకరకాల భయాలతో కాలం వెళ్ళదీస్తుంటాడు. అవి ప్రాకృతికమైనా, సామాజికమైనా, సాంస్కృతికమైనా వాటిని అధిగమించడం ద్వారానే మనిషి మామూలు మనిషి కావడం సాధ్యపడుతుంది. అయితే ఈ భయాలను అధిగమించాలంటే మనిషనేవాడికి వ్యక్తిగత సాధన, విమర్శనాత్మక పరిశీలన ముఖ్యం. ప్రతిమనిషి నిత్యం ఆలోచనలతో జీవిస్తూ ఉంటాడు. వర్తమానాన్ని విడిచి పెట్టి, భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని తీవ్రంగా ఆలోచిస్తాడు. ఇలాంటి ఆలోచనలే భయాన్ని ప్రోదిచేస్తాయి. మనస్సంటే ఒక భాగం జ్ఞాపకాలు, మరో భాగం ఊహలతో నిండి ఉంటుంది. నిజానికి ఈ రెండు ఊహలే. మనిషి ఇలా ఊహల్లో మునిగిపోవడం వల్లనే భయం కలుగుతుంది. ఈ భయమే మన చుట్టూ హద్దులను గీస్తుంది. ఆ హద్దుల వల్ల మనకి మనం సురక్షితంగా ఉండొచ్చునేమో కానీ, అది జీవించడాన్నుంచి, జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది. భయం వల్ల మనిషి తనకు తానే పరిమితులు నిర్దేశించుకుని తన ప్రపంచంలో తాను మునిగి తేలుతాడు. ఈ క్రమంలో అటు ఆనందానికి, ఇటు స్వేచ్ఛకు దూరమైపోతాడు. అంతేకాదు హాయిగా నవ్వలేడు.. హృదయంతో ఏడ్వలేడు... అసలు మనస్ఫూర్తిగా, ఇష్టంగా ఏ పనీ చేయలేడు. ఏ మనిషైనా భయపడేది భవిష్యత్ గురించే.. తాను చేస్తున్న పనిలో విజయం సాధించగలనా... తన కుటుంబానికి ఆస్తిపాస్తులివ్వగలనా.. తన పిల్లలు చక్కగా చదువుకోగలరా.. తనకు భవిష్యత్‌లో ఆరోగ్యం సహకరిస్తుందా.. ఇలా రకరకాలుగా, వాస్తవంలో లేని వాటి గురించి బాధపడుతూ భయాన్ని పెంచుకుంటూ ఉంటారు. భయం జీవితం నుంచి పుట్టింది కాదు. భ్రాంతులతో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టింది. అస్తిత్వంలో లేని దాని గురించి బాధ పడడం వల్లనే భయం ఆవరిస్తుంది. నిత్యం భవిష్యత్‌లో బతకడం వల్లనే భయం కలుగుతోంది. ఈ భయం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎవరికి వారు సాధన చేయాలి.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.. తామెందుకు భయపడుతున్నామని ప్రశ్నించుకోవాలి.. నిజానికి తాము భయపడాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకోవాలి. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగి పోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. అసలు భయం అంటే ఏమిటి? మనం ఎందుకు భయపడతాం? భయం ఎన్ని రకాలు? భయం లేని మనుషులు వుంటారా? అసలు భయం ఎప్పుడు ఎలా పుట్టింది? ఈ ప్రశ్నలన్నిటినీ నిర్భయంగా చర్చించుకుంటే తప్ప భయం నుంచి విముక్తులు కాలేం. ఈ క్రమంలో కారణాలు తెలిసిన భయాలు కొన్ని.. కారణాలు తెలియని భయాలు కొన్ని. తెలిసిన భయాలకు అర్థవంతమైన వివరణ ఇస్తే పరిష్కారం చూపిస్తే పోతుంది. కాని తెలియని భయాలు అలా కాదు. అవి ఫలానా కారణం వల్ల కలిగాయని ఎవ్వరూ చెప్పరు. అందువల్ల మన భయాలకు మూల కారణాలు తెలుసుకుని, భయాన్ని పోగొట్టుకోవాలి. తన చేతుల్లో లేని ప్రకృతికి దైవత్వం ఆపాదించిన ప్రాచీన మానవుడు దానిపట్ల భయమూ భక్తి పెంచుకున్నాడు. భక్తి పెంచుకోక పోతే నష్టం కలుగుతుందని భయపడ్డాడు. ఫలితంగా మూఢ నమ్మకాలకు లోనయ్యాడు. మూఢత్వం భయానికి మొదటి హేతువు. మూఢనమ్మకాల వల్ల కలిగే భయాలు ఎవరినీ వదలి పెట్టవు. పైగా తమ సంపద పోతుందేమోనన్న భయంతో పోకుండా కాపాడుకోవాలన్నది అదనపు భయంగా తయారవుతుంది. మనుషుల మీద నమ్మకాలు సడలిపోవడం వల్ల ఎవరినీ నమ్మలేని విశ్వాస రాహిత్యం వెన్నాడుతుంది. అలాగే, మంచివారు చెడు చేయరు గనక దుర్మరణం పాలైన వారే ప్రేతాలై హింసిస్తారన్న నమ్మకం ఈ భయం వల్లనే ఏర్పడుతుంది. ఇలా మూఢత్వం అనేక భయాలకు దారి తీసింది. ఇలా అనాదిగా తన పరిధిని పెంచుకున్న భయం నేడు విశ్వ వ్యాప్తమై మనిషిని నిర్జీవంగా తయారు చేస్తోంది. భయానికి సంబంధించి మన పురాణాలలో అనేక ఘట్టాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. పురాణాలలో ఆయా కథలలోని భయాలకు ఓ సముచితమైన కారణం, దిశానిర్దేశం ఉండడం వల్లనే వారంతా మహనీయులయ్యారు. అదే విధంగా మనిషి కూడా తాను నిత్యం వేధించే భయాలతో కృంగి కృశించి పోకుండా, తమ భయాలకు అసలు సిసలైన కారణాలు తెలుసుకుని, వాటి పరిష్కారాలకు ప్రయత్నించినపుడే భయం అనే మహమ్మారి నుంచి విముక్తులవుతారు. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగిపోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. -
హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!
The biggest challenge facing humans in space is eating లండన్: ప్రస్తుతం ప్రపంచమంతా అంటువ్యాధులతో మగ్గిపోతోంది. మరోవైపు భవిష్యత్తులో అంతరిక్షంలో స్థిరపడాలని కలలు కంటోంది కూడా. ఐతే అంతరిక్షంలో స్థిరపడాలనే కల అంత తేలికగా నెరవేరదని తాజాగా సైంటిస్టులు అందుకు సంబంధించి విస్తుపోయే విస్తవాలను వెల్లడించారు. ఒక వేళ మనుషులు స్పేస్‌లో స్థిరపడితే ఆహార కొరత కారణంగా ఒకరినొకరు చంపుకుతింటారని హెచ్చరించారు. అంతరిక్షంలో స్థిరపడితే ఎదుర్కొనవల్సిన సవాళ్లను జనాళ్ల ముందుంచారు. దీంతో అందరూ ఆలోచనలోపడ్డారు. బృహస్పతి, శని గ్రహాలకు చెందిన చందమామలు (మూన్స్) క్యాలిస్టో, టైటాన్లు మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై ఒక కాలనీని స్థాపించి, అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే భూమి నుంచి ఈ రెండు ప్రదేశాలకు ఆహారాన్ని సప్లై చేయడం కుదురుతుందో లేదో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. వ్యాధులు ప్రభలడం, ఆహార కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూమి నుంచి సహాయం రావడానికి సంవత్సరాల కాలం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యూకే నివేదిక ప్రకారం.. ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ ఏం చెబుతున్నారంటే.. భూమి నివాసయోగ్యం కానప్పుడు ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో నవాసాలేర్పరచుకోవాలి. అది సాధ్యపడాలంటే ముందుగా పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో చరిత్ర నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలి. 19వ శతాబ్ధం చివరి భాగంలో కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ నార్త్-వెస్ట్ పాసేజ్‌ను వెతకడానికి బయలుదేరారు. ఆ సమయంలో సాంకేతికత లోపం తలెత్తడంతో దారితప్పారు. వారివద్ద క్యాన్డ్ ఫుడ్ కూడా ఉంది. ఐతే ఆధునిక కాలపు అత్యుత్తమ సాంకేతికత కలిగిఉన్నప్పటికీ అక్కడికి వెళ్లినవారంతా ఒకరినొకరు చంపుకు తిన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాకైన మానవ సమాజాలు చాలా త్వరగా నశించిపోతాయని ప్రొఫెసర్ కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆహార కొరత అక్కడ ఎదుర్కొనే సమస్యలకు సిద్ధపడకుండా కాలిస్టోలోకి మనుషులను పంపితే, పరిణామాలు తప్పవు. తిండి దొరక్క బతకడానికి వేరే మార్గం లేక ఒకరినొకరు తింటారని భవిష్యత్ పరిస్థితిని కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులకు ఆహార సరఫరా ఒక ప్రధాన సవాలని డాక్టర్ కామెరాన్ స్మిత్ కూడా ఆయనతో ఏకీభవించాడు. అంతరిక్షంలో మానవ మనుగడను స్థాపించడానికి ముందుగా వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ గ్రహాంతరవాసుల కోసం వెతుకులాట కొనసాగిస్తోంది. చదవండి: Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత! -
మలి వసంతమూ సంతసమే..
ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు. మానవుడు జన్మించాక తన జీవనకాలంలో విభిన్నమైన పరిణామదశలను ఎదుర్కొంటాడు. ముందుగా బాల్యం, తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వన, ప్రౌఢ దశలను దాటుకుని వృద్ధాప్యంలోనికి అడుగిడడం జరుగుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే జీవన క్రమం. వృద్ధాప్యంలోనికి రాగానే జీవితం అంతా అయిపోయిందని అధిక శాతం వృద్ధులు నైరాశ్యానికి గురి అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలుఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశల్లో కూడా మనకు గుర్తుంటాయి.యవ్వనంలో జీవితాన్ని అనుభవించినప్పటి అందమైన రూపం, దఢమైనశరీరం ఇప్పుడు లేకపోయినా, అప్పటి అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో పదిలంగా, మధురంగా మన మనస్సులో గుర్తుంటుంది. వృద్ధాప్యంలో ప్రతివారి మదిలో కలిగే సందేహమూ, వారుప్రకటించే భావమూ ఒకటే.. ‘‘నేను ఇది వరకు ఉన్నట్లుగా ఉండలేకపోతున్నాను’’ అనే మాట. ఇది చాలా పెద్ద తప్పిదం. యవ్వనంలో ఉన్నట్లుగా ప్రౌఢవయసులో మనిషి ఉండలేనట్లే, వృద్ధాప్యంలోనూ ప్రౌఢవయసులో ఉన్న సత్తువ మనిషిలో ఉండదు. ఈ విషయాన్ని గ్రహించకపోవడం, గ్రహించినా, విచారిస్తూ ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. యవ్వనంలో దట్టమైన పటుత్వం, దిట్టమైన బిగువు జీవులందరికీ భగవానుడు ప్రసాదించే సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ బిగువు సడలుతూ ఉంటుంది. దానికి ఆవేదన చెందడం నిరర్ధకం. అది శరీరానికుండే సహజ లక్షణం. వయసు పెరుగుతున్నకొద్దీ మనిషికి పెరిగే సంపద ఆపారమైన వారి అనుభవం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా వారి చెంత పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఎవరికన్నా ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావి తరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృతభాండాలు..అనుభవాలను పంచుకునే సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతివాళ్ళూ ఆచరించాలి. పిల్లలకు మంచి విషయాలను బోధించడంలో తమను తాము నియంత్రించుకోవాలి. ‘‘మా రోజుల్లో ఇటువంటివి లేనేలేవు.. మేము ఆ రోజుల్లో ఈ విధంగానే చేశామా’’ అన్న నిరసనాపూర్వక మాటలను మాట్లాడకూడదు. ఈ తరహా మాటలను నేటి తరం ఏ మాత్రం హర్షించదు. ‘‘నువ్వు వెళ్ళే పద్ధతి బావుంది.. కొంచెం నేను చెప్పేది కూడా నీ విజయానికి గానీ, నీ సమస్య పరిష్కారానికి గానీ పనికి వస్తుందేమో చూడు’’ అని మృదువుగా అంటే చాలు, ఆ మాటలు యువత హృదయానికి మరింత గా చేరువ అవుతాయి. పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడితే, తమ తర్వాతి తరం వారిని తప్పు పడుతున్నట్లుగా గాక, సాఫల్యపు బాటలో నడిపిన వాళ్ళవుతారు. దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలంవిశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడి వల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి ఆహారపు అలవాట్లు, అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుంది. యవ్వనంలో, ప్రౌఢవయసులో వచ్చే ఆనందం దొంతర దొంతరలయితే, పెద్ద వయసులో అనుభవంవల్ల అలరించే ఆనందం మన ఊహకందే పిల్ల తెమ్మెరలా హాయిగా మనసును సోకుతూ ఉంటుంది. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసునుకాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! వృద్ధాప్యం శాపం కాదు...ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏ మాత్రం బాధించదు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
నిలుపుకోవలసిన అలవాట్లు
ఒక పనిని ప్రతి రోజూ ఒకే సమయానికి చేస్తుంటే దానిని అలవాటు అంటాం. దానిని సూర్యోదయం, సూర్యాస్తమయాలంత సహజంగా, క్రమం తప్పకుండా చేస్తుంటాం. అలా ఇది మన జీవితంలో, వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. దీనికి అంతర్గత ప్రేరణ ఉంటుంది. అంటే, కొన్ని ఏళ్లుగా తెల్లవారు ఝామునే లేవడాన్ని అలవరచుకుంటే అలారం అవసరం లేకుండా ఆ సమయానికి అప్రయత్నంగా మెలకువ వచ్చేస్తుంది. ఒకే సమయానికి భోజనం చేయటం, పడుకోవటం కూడ ఇలాంటివే! వీటిని స్థిర అలవాట్లంటాము. సత్పురుషుల సాంగత్యంతో దానగుణం, పరోపకారం, పెద్దవాళ్ళని గౌరవించటం, నిస్సహాయులకు అండగా నిలవటం, చక్కగా సంభాషించటం, సరైన నిర్ణయాధికారం అనే మంచి అలవాట్లను ప్రయత్నపూర్వకంగా అలవరచుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇవి నిలిచిపోతే, వీటి వల్ల వ్యక్తిగత ప్రగతి తద్వారా సమాజ ప్రగతి కలుగుతుంది.. అలవాట్ల మీద నియంత్రణ అవసరం. మంచి అలవాట్లు కూడ ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార పానాదులు ఒక నిర్ణీత కాలంలో తీసుకునే మనకు అన్నివేళలా అలా సాధ్యం కాకపోవచ్చు. అందుకనే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రతి మంచి అలవాటు కూడ ఒక చెడ్డ అలవాటే నంటాడు. అలవాట్లను మన అధీనంలో ఉంచుకోవాలి. మన శరీరం మన అధీనం లో ఉండాలి గాని అది చెప్పినట్లు మనం వినకూడదు. దాని వశంలోకి మనం వెళ్ళకూడదు. శరీరానికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నడక, వ్యాయామం చేసే అలవాటున్న వాళ్లకు ఒక్కరోజు చేయకపోయినా ఆ వెలితి తెలుస్తుంది. మంచి అలవాట్లు జీవితానికి ఒక క్రమశిక్షణ నిస్తాయి. బాల్యంలో ఏర్పడిన మంచి అలవాట్ల వల్ల మనం పొందే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది. ఇది చాలా కాలం కూడా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల, ఉపాధ్యాయులపాత్ర, బాధ్యత ఎంతో ఉంది. సాధారణంగా చెడుకి ఆకర్షణ ఎక్కువ. దీనివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మంచి అలవాట్లు సైతం పోతాయి. చెడు అలవాట్లకు గురైన వ్యక్తుల కుటుంబాలు ఛిన్నాభిన్నమైన ఉదాహరణ లెన్నో! దీనివల్ల సమాజంలో మనిషికి గౌరవం ఉండదు. పైగా సమాజం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలవాట్లనేవి మనిషి జీవితంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. మంచి అలవాట్లతో జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించు కోగలరు. చెడు అలవాట్లతో జీవితమే నాశనం అయిపోతుంది. ఒక మంచి అలవాటు మనిషిని ఉన్నత పథానికి తీసుకెళ్తే, చెడ్డది అధః పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు కావచ్చు. కాని, అతి ధూమపానం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం, జూదం, దుబారా చేసి అనవసరంగా అప్పులు చేయటం వంటివి చెడు అలవాట్లుగా భావించటంలో ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు. కొందరికి ప్రతి చిన్ననొప్పికి మాత్రలు వేసుకోవటం అలవాటుగా ఉంటుంది. అవసరమున్నా, లేకపోయినా డాక్టర్ల దగ్గరికి పరుగెడుతూ ఉంటారు. ప్రతి చిన్న బాధను కొంచెమైనా సహనంతో భరించలేక పోతే, విపరీతమైన మందుల వాడకం తదనంతర జీవితం పై దుష్ప్రభావం చూపుతుంది. మన దృష్టి దాని మీద నుండి మరల్చుకోవాలి. మంచి అలవాట్లు జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తాయి. మంచి ఆరోగ్యానికి పునాది మంచి అలవాట్లే! పూర్వం బైటికి వెళ్లి ఇంటికి వస్తే, వచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు కడుక్కుని లోపలికి వెళ్లేవారు. అంత శుభ్రత పాటించేవారు. ఆధునికత, జీవనశైలి అన్న పేరుతో ఇప్పుడు వీటిని వదిలేశాం. పాదరక్షలతోనే లోపలికి వెళ్లిపోతున్నాం. చేతులు కడుక్కోకుండానే భోజనం చేసేస్తున్నాం. వీటివల్ల అనారోగ్యాల పాలవుతున్నాం. ఇప్పుడు, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో భయం కొద్దీ పూర్వపు పద్ధతులను ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారు. చేతులు పదే పదే కడుక్కోవడం, కూరగాయలు బజారు నుంచి తెచ్చిన వెంటనే శుభ్రంగా కడగటం వంటివి వంద శాతం చేస్తున్నారు. పూర్వపు శుచి శుభ్రతలకు పూర్ణంగా విలువనిచ్చి పాటిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మంచి అలవాటు. ఈ క్లిష్ట పరిస్థితి పోయాక కూడ, ఇది ఒక స్థిరమైన అలవాటుగా ఎప్పటికి కొనసాగిస్తే, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ దోహదం చేసిన వారవుతారు. ఇటువంటి మంచి అలవాట్లను యువత అవసరార్థం నేర్చుకున్నా తదనంతరం కొనసాగించటం మంచిది. అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. మనిషి మూడు అలవాట్లను తప్పక చేసుకోవాలని మేధావులు చెపుతారు. మొదటిది – డబ్బు సంపాదించటం. జీవన గమనం కోసం, ఆర్ధిక భద్రత కోసం డబ్బు చాలా అవసరం. రెండవది – ఎప్పుడూ తన ప్రవర్తనను తానే విశ్లేషించుకుంటూ, లోపాలను సరి దిద్దుకుంటూ ఆత్మ విమర్శ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. మూడవది – ఇష్టమైన రంగంలో సృజనాత్మకత పెంపొదించుకోవటం అలవాటు చేసుకోవాలి. రచయితలు, సంగీత, నృత్య కళాకారులు, క్రీడారంగ నిపుణులు నిరంతర సాధన చేస్తూనే ఉంటారు. పోటీలు ప్రదర్శనలు వున్నప్పుడే కాక ప్రతిరోజూ సాధన చేస్తూ ఉండటం వల్ల వారి విద్వత్తు మరింత ప్రకాశిస్తుంది. వృత్తినైపుణ్యాలు మెరుగవుతాయి. ప్రజ్ఞాపాటవాలు మరింతగా పరిఢవిల్లుతాయి. మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏదైనా అలవాటు కావటానికి 21రోజులు అవసరమంటారు. ఆ నిర్ణీత కాలంలో నిష్ఠతో ప్రయత్నించటం వల్ల అది అలవాటవుతుంది. దానిని నిలుపుకోవటానికి ప్రతి రోజు ఆ అలవాటును కొనసాగించవలసి ఉంటుంది. శరీరానికి, మనసుకు కూడ మంచి అలవాట్లను అలవాటు చేయాలి. మనసుకు ఎటువంటి క్లిష్ట, విషాద పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం అలవాటు చేయాలి. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ, చెడు, హానికరం అనిపించినవి వదిలేయటానికి ప్రయత్నిస్తూ, మంచి అలవాట్లను వదలకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూండాలి. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యం వైపు నడిపించేవి అలవాట్లు. మంచి అలవాట్లే వ్యక్తిత్వానికి చిరునామా. అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. –డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు!
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయంతో ప్రపంచమంతా గుండెలరచేతిలో పట్టుకుని బతుకు జీవుడా అని కాలం గడుపుతోంటే.. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. మానవుడి జీవిత కాలాన్ని 120 సంవత్సరాల వరకూ పెంచే మార్గం సుగమం కానుందని, ఈ మేరకు తమ పరశోధనలు కొత్త ఊపిరిలూదుతున్నాయని చెబుతున్నారు. వృద్ధాప్య ప్రక్రియలో సాధారణంగా క్షీణించే ఎస్‌ఐఆర్‌టీ-6 అనే ప్రోటీన్ సరఫరాను పెంచడం ద్వారా మనిషి దీర్ఘం కాలం మనిషి దీర్ఘకాలం జీవించే మార్గాన్ని గుర్తించామని బార్-ఇలాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. పరిశోధకులు 250 ఎలుకలపై పరిశోధన గావించి వాటి ఆయుర్దాయం పెంచారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించబడిన పీర్-రివ్యూ పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించింది. ఆయుర్దాయంపై పురోగతి ప్రయోగశాల పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న హైమ్ కోహెన్ మాట్లాడుతూ, ఎలుకల ఆయుర్దాయం 23 శాతం పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నామన్నారు. ఎలుకలలో తామె చూసిన మార్పులు మానవులకు అనువదించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ఆడ, మగ ఎలుకలపై నిర్వహించగా ఆడ ఎలుకలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. మగ ఎలుకల వయస్సు ఎక్కువ పెరిగిందని వివరించారు. మగ ఎలుకల జీవితకాలం 30 శాతం, ఆడవారి జీవితకాలం కేవలం 15 శాతం పెరిగిందని చెప్పారు. అలాగే ఈ ప్రోటీన్ తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుందని, క్యాన్సర్ నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుందని తెలిపారు. కోహెన్ ప్రకారం, వృద్ధాప్య ఎలుకలలో వయస్సుతో శక్తి సాధారణంగా తగ్గుతుంది. కాని వాటి శరీరంలో ఈ ప్రోటీన్ పెరగడం వల్ల శక్తి పెరిగింది. అయితే జన్యుపరంగా మార్పు చేయడం ద్వారా ఎలుకలలో ఎస్‌ఐఆర్‌టీ-6 అనే స్థాయిలను అతను సులభంగా పెంచగలిగినప్పటికీ, మానవులలో ప్రోటీన్‌ను పెంచడానికి మందులు అవసరం. రెండు మూడు సంవత్సరాలలో మానవులలో ఫలితాలను ప్రతిబింబించగలదని కోహెన్ చెప్పారు. దీని స్థాయిలను పెంచే చిన్న అణువులను అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ప్రోటీన్లను మరింత చురుకుగా చేయనున్నారు. వృద్ధాప్యాన్ని పరిష్కరించడానికి భవిష్యత్తులో వీటిని ఉపయోగించవవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి : కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్ -
మావోల హింస వల్లే అత్యధిక ప్రాణనష్టం
సాక్షి, అమరావతి: దేశంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించేందుకు మావోయిస్టు పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన మొత్తం హింసాత్మక ఘటనల్లో 88 శాతం కంటే ఎక్కువ మరణాలకు మావోయిస్టులే పేర్కొంది. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితిపై (2018–2019 మార్చి వరకు) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో వివిద వామపక్ష తీవ్రవాద సంస్థల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) అత్యంత శకిమంతంగా ఉందని నివేదికలో స్పష్టం చేసింది. తీవ్రవాద ప్రభావిత 10 రాష్ట్రాల్లో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో గడిచిన తొమ్మిదేళ్లలో 3,749 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2010 నుంచి 2018 వరకు మొత్తం 10,660 ఘటనలు చోటుచేసుకోగా, వాటిలో 3,749 మంది మరణించారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేలా ప్రజలతో పోలీసులు మమేకం కావాలని హోం శాఖ నివేదికలో సూచించింది. మావోయిస్టుల ప్రభావం ఉన్నచోట ప్రజల భద్రతతోపాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసి, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు మావోయిస్టులను కట్టడి చేయడానికి పోలీసు బలగాల సంఖ్యను పెంచడంతోపాటు భద్రతా సిబ్బందికి అధునాతన ఆయుధాలు, హెలికాఫ్టర్లు తదితర అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నట్టు పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువే.. మావోయిస్టుల హింసాత్మక ఘటనలు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే తక్కువ. మావోయిస్టుల హింసాత్మక ఘటనల విషయంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి తగ్గిపోతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2013లో 10 రాష్ట్రాల్లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల ప్రభావం ఉండేది. 2018 నాటికి 8 రాష్ట్రాల్లోని 60 జిల్లాల పరిధిలో 251 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వీరి ప్రభావం కనిపించింది. ఏపీలో మావోల హింసాత్మక ఘటనలు.. మృతులు ఏడాది ఘటనలు మృతులు 2010 100 24 2011 54 9 2012 67 13 2013 28 7 2014 18 4 2015 35 8 2016 17 6 2017 26 7 2018 12 3 -
కాలం సాక్షిగా చెప్పే సత్యం
మానవ జీవితం చాలా అమూల్యమైనది. అది ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు. అల్లాహ్ దాన్ని రహస్యంగా ఉంచాడు. దాన్ని ఛేదించే శక్తిని ఎవ్వరికీ ప్రసాదించలేదు. కనుక జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. డబ్బు, గౌరవం, ఉద్యోగం, అధికారం, హోదా ఏదైనా కావచ్చు, అది సాధ్యమే. కాని కాలాన్ని మాత్రం ఎంత ధనం ధారపోసినా, ఎంతపలుకుబడి ఉపయోగించినా సాధించలేము. గడిచినకాలం – అది రెప్పపాటైనా సరే – కోట్లు కుమ్మరించినా మనకు లభించదు. ఇది కాలం చెప్పే సత్యం. మనం దాని విలువను గుర్తించకపోతే అది మనకోసం ఆగదు. గోడకు అమర్చినగడియారం ముల్లు ‘టిక్ టిక్’ మని శబ్దం చేస్తూ తన పని అది చేస్తూనే ఉంటుంది. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే అది మనకు ఉపకరిస్తుంది. లేకపోతే అది మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ముందుకు సాగిపోతుంది. అందుకని మనం ఏవిషయంలో అయినా సకాలంలో స్పందించగలగాలి. సమయం మించి పోయిన తరువాత తీరిగ్గా విచారిస్తే ప్రయోజనం ఉండదు. అవకాశాలు ఎప్పుడూ మనకోసం నిరీక్షిస్తూ ఉండవు. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి.మనమే వాటిని అందిపుచ్చుకోవాలి. అవి మనవద్దకు రావాలని ఆశించడం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏది అవసరమో దానిపై దృష్టి కేంద్రీకరించాలి. బాధ్యతల నిర్వహణలో అలసత్వాన్ని ఎంతమాత్రం దరిచేరనీయకూడదు.ఎందుకంటే, ఈరోజు చేయవలసిన కార్యాన్ని రేపటికి వాయిదా వేశామంటే కాలం విలువను మనం గుర్తించనట్లే లెక్క. ఈనాటి కొద్దిపాటి అలక్ష్యం రేపటి బాధ్యతను రెట్టింపుచేస్తుంది. ఒకటికి రెండు తోడై, బాధ్యతలు పేరుకు పోతాయి. ఇక ఆతరువాత బాధ్యతల నిర్వహణ తలకుమించినభారంగా పరిణమించి, పలాయనవాదాన్ని ఆశ్రయించే దుస్థితికి తీసుకువస్తుంది. అద్భుతమైన విజయాలను సాధించినవారి జీవితాలను పరిశీలిస్తే, వారు కాలాన్ని(సమయాన్ని) ఎలా తమకు అనుకూలంగా మలచుకొని, సద్వినియోగం చేసుకొని, కొత్త అవకాశాలను సృష్టించుకున్నారో, కొంగ్రొత్త ఆవిష్కరణలకు ఎలా నాంది పలికారో మనకు అర్ధమవుతుంది.ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ తన జీవితకాలంలో వెయ్యికంటే ఎక్కువ నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. వాటిలో గ్రామ్ ఫోన్, విద్యుత్తుబల్బు అతని ఆవిష్కరణలే అని మనందరికీ తెలుసు. ఇది ఎలాసాధ్యమైంది? అతను కాలం నాడిని ఒడిసిపట్టి, దాన్నిసద్వినియోగం చేసుకున్నాడు. కాలక్షేపం కోసం కాలాన్ని దుర్వినియోగంచేయలేదు.సరదాలు, సొల్లుకబుర్లకోసం సమయాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అతను, తనప్రయోగశాలనే వినోదశాలగా మార్చుకున్నాడు. చేస్తున్న పనిలోనే ఆనందాన్ని, వినోదాన్ని అనుభవించాడు. కాలం విలువను గుర్తించబట్టే, విద్యుత్ బల్బును కనుగొనే సమయంలో ఏకధాటిగా పన్నెండు, పదమూడు రోజులు ప్రయోగశాలలోనే నిద్రలేని రాత్రులు గడిపాడు.అందుకని కాలం విలువను, ప్రాధాన్యతను గుర్తించాలి. పవిత్రఖురాన్ కూడా ‘కాలం సాక్షిగా’ మానవాళికి అనేక హితబోధలు చేసింది. కాలగతిలో కలిసిపోయిన వారి గాథల్ని గుణపాఠాలుగా వివరించింది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ హితోపదేశాలకనుగుణంగా నడచుకొని ఇహ పర లోకాల్లో సాఫల్యం పొందాలని ఆశిద్దాం. ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హెల్త్ టిప్స్
⇔ ఈ కాలంలో తరచుగా గొంతు నొప్పి బాధపెడుతుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. టీలో కూడా వేసుకోవచ్చు. ⇔ గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు కలిపి రోజుకు రెండు– మూడుసార్లు గార్గిలింగ్ చేస్తే (గొంతులో పోసుకుని గరగరలాడించడం) గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ⇔ పొట్ట పనితీరు క్రమం తప్పినట్లనిపిస్తే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతూ మధ్యలో కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్, సూప్‌ల వంటివి తీసుకోవాలి. వారంలో కనీసం ఒకరోజు ఇలా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శుభ్రపడి పొట్ట యథాస్థితికి వస్తుంది. ⇔ ఫ్లూ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా కొద్ది రోజులు ఒళ్లునొప్పులు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ముల్లంగి రసంలో అంతే మోతాదు ఆలివ్ ఆయిల్ కలిపి అరగంట సేపు అలాగే ఉంచి శరీరానికి మర్దన చేస్తే ఒంటి నొప్పులు తగ్గుతాయి. -
సంపాదించడం తప్పా?
ఇవాళ దేశంలో ఎవరిని కదిలించినా కరెన్సీ కబుర్లే! ఒకప్పుడు మన జేబులో విలాసంగా ఉన్న విలువైన వెయ్యి నోటు ఇవాళ చిత్తు కాగితంతో సమానమంటే, మరేదో కొత్త నోటు సంపాదిస్తే దాని విలువ రెండు వేలని అంటే - అసలు విలువ దేనిది? ఆ కాగితానిదా? లేక మనం దానికి ఇస్తున్న ప్రాధాన్యానిదా? ఇంతకీ డబ్బు సంపాదన మంచిదా? చెడ్డదా? ఎంత సంపాదిస్తే మంచి? మరెంత సంపాదిస్తే చెడు? డబ్బు సంపాదన తప్పు అని మన ధర్మం ఎక్కడా చెప్పలేదు. మానవ జీవితంలో దానికున్న విలువనూ తోసిపుచ్చలేదు. కాకపోతే, ఎలా సంపాదించాలో స్పష్టంగా చెప్పాయి. మనిషి తన జీవితంలో నాలుగు పురుషార్థాల కోసం శ్రమించాలని శాస్త్రవచనం. ఆ నాలుగూ ఏమిటంటే ధర్మం, అర్థం (డబ్బు), కామం (కోరిక), మోక్షం! ఈ చతుర్విధ పురుషార్థాల్లో - రెండోది ధన సంపాదన. మొట్టమొదటిది - ధర్మం. అంటే, జీవితాన్ని ధర్మంగా గడపాలి. అది మొదటిది. అలా ధర్మంగా జీవిస్తూ, ‘అర్థం’... అంటే డబ్బు సంపాదించాలి. అది రెండోది. అలా ధర్మమార్గాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా, ధర్మబద్ధంగా కోరిక తీర్చుకోవాలి. అది మూడోది. ఇలా మూడింటితో, నాలుగో పురుషార్థమూ, అత్యున్నతమైన మోక్షసాధన చేయమన్నారు. అలాగే, ప్రతి గృహస్థూ నిత్యం అయిదు రకాల కర్మలు చేయాలని శాస్త్రమే చెబుతోంది. అవి - ‘బ్రహ్మ యజ్ఞం’ (పరమాత్మను సేవించడం), ‘దేవ యజ్ఞం’ (దేవతల సేవ), ‘పితృ యజ్ఞం’ (పితృదేవతల సేవ), ‘మనుష్య యజ్ఞం’ (తోటి మానవుల్ని సేవించడం), ‘భూత యజ్ఞం’ (ఇతర జీవకోటిని సేవించడం). ఈ అయిదూ నిత్యజీవితంలో ఆచరించాలంటే, ద్రవ్యం కావాలి. అంటే, గృహస్థుగా జీవితం సాగిస్తున్నవారు డబ్బు సంపాదించడం తప్పు కానేకాదు. కాకపోతే, మనిషి ఆ డబ్బును ధర్మంగా సంపాదించకపోతేనే తప్పు. అలా ధర్మంగా సంపాదించిన డబ్బును కూడా తన అవసరాలకు వినియోగించుకోగా మిగిలినది సమాజ హితం కోసం, తోటివారి బాగు కోసం వినియోగించకపోతే మరీ తప్పు. భగవంతుణ్ణీ, తోటివారినీ సేవించకుండా కేవలం తమ కోసం తాము బతికేవారు నరకంలో పడతారని ‘భగవద్గీత’ పేర్కొంది. గృహస్థుగా మన ధర్మం నిర్వహిస్తున్నప్పుడు, నిజజీవిత సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలు వహిస్తున్నప్పుడు అనుకోకుండా - మాటలతోనో, చేతలతోనో, ఆలోచనలతోనో ఇతరులను బాధించే ప్రమాదం ఉంది. అది ఉద్దేశపూర్వకం కాకపోయినా దుష్కర్మే. అందుకే, నిస్వార్థంగా తోటివారికి సేవ చేస్తూ, చేసిన కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఆ దుష్కర్మ తీరుతుందని పెద్దల మాట. అంటే, డబ్బు సంపాదించేది స్వార్థం కోసం, మన అహంకారాన్ని పెంచుకోవడం కోసం కాదు! మన నిత్యావసరాలు తీర్చుకొంటూనే, తోటి మానవుల్లో ఉన్న మాధవుణ్ణి సేవించడం కోసం! అలాగే, మనది కానిది తీసుకోవడం దొంగతనంతో సమానం. సంపాదించే క్రమంలో మరొకరికి కష్టం, నష్టం కలిగించడం, అవతలివారిని వాడుకొని వదిలేయడం పరమ తప్పు. కానీ, ఇవేవీ మనం గ్రహించడం లేదు. ఎంత సంపాదించినా, ఇంకా ఇంకా కావాలనే దురాశలో పడిపోతున్నాం. ‘నాకు, నా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు...’ అంటూ తరతరాలకూ సరిపడా ఆస్తుల్ని స్వార్థంతో పోగేసుకోవడం మీద దృష్టిపెడుతున్నాం. నిజానికి, పోగు చేసుకోవాల్సింది ధర్మాన్ని ఆచరించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని! అంతేతప్ప, పోయినప్పుడు వెంట రాని ఈ ఆస్తుల్ని కాదు!! అది మనం గుర్తించడం లేదు. సౌకర్యంగా జీవించడం తప్పు కాదు. దాని కోసం అక్రమ మార్గాలకు మళ్ళడం తప్పు. అధర్మంగా డబ్బు సంపాదిస్తే, అది తాత్కాలికంగా సుఖం ఇచ్చినట్లు అనిపించవచ్చు కానీ, ఆ పాపం మాత్రం వెంటాడి వేధిస్తుంది. ఎవరైనా, అవసరానికి మించి కూడబెడితే, ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరవైనట్లు...’ అని శతకకారుడు చెప్పినట్లుగా ఆ డబ్బంతా చివరకు ప్రభుత్వాల సొమ్ము, పరుల సొమ్ము అవుతుంది. అసలు సిసలు ‘బ్లాక్ మనీ’ బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నది అందుకే! - రెంటాల