‘పొద్దు పోయెనే శ్రీరాముని పూని భజింపవే మనసా!’ అని దిగులు పడతారు త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో..
‘నిద్దుర చేత కొన్నాళ్ళు,
విషయ బుద్ధుల చేత కొన్నాళ్ళు’ అంటూ... జీవితంలో మూడోవంతు కాలం నిద్రలోనూ; ఇంద్రియ విషయాల మీదా, సుఖాల మీదా ఉన్న ఆరాటం తీర్చుకునే ప్రయత్నంలో మరింత కాలం వ్యయమై పోతుండె! అని వాపోయారు.
"పొద్దున లేచి, త్రితాపములను, నరుల
పొగడి, పొగడి కొన్నాళ్ళు, వట్టి ఎద్దు రీతి, కన్నతావుల భుజియించి,
ఏమి తెలియక కొన్నాళ్ళు, ముద్దుగ తోచు భవసాగరమున
మునిగి లేచుచు కొన్నాళ్లు, పద్దుమాలిన పామర జనులతో వెర్రి
పలుకులాడుచు కొన్నాళ్ళు, ఓ మనసా!"
ఉదయం లేచినప్పట్నుంచి, తాపత్రయ పడుతూ, వాళ్ళకూ వీళ్ళకూ భజన చేస్తూ, కేవలం పశువులా ఎక్కడ ఏది కనిపిస్తే దాన్నంతా భుజిస్తూ, పైపై మెరుగులతో ఆకర్షించే సంసార సాగరంలో మునకలు వేస్తూ ఉండటంలోనూ, సాటి అజ్ఞానులతో సారహీనమైన పోచికోలు చర్చలలోనూ చాలాకాలం నష్టమై పోతుండె!
"ముదమున ధన, తనయ, ఆగారముల చూచి
మదము చేత కొన్నాళ్ళు, అందు, చెదిరినంత, శోకార్ణవగతుడై
జాలి చెందుటయు కొన్నాళ్ళు, ఎదటి పచ్చ చూచి తాళలేక, తా
నిలను తిరుగుట కొన్నాళ్ళు, ముదిమది తప్పిన ముసలితనమున
ముందు వెనక తెలియక కొన్నాళ్ళు."
కొన్నాళ్ళు ధనమూ, సంతానమూ, ఇల్లూ అనుకుంటూ, వాటిని చూసి మదించటంలో గడిచె. అవి బెడిసికొడితే, మళ్ళీ దుఃఖంలో మునిగి, దైన్యతలో కొన్నాళ్ళు. ఎదుటివాడు పచ్చగా ఉంటే, ఏడుస్తూ కొన్నాళ్ళు. పెద్ద వయసు మీదపడేసరికి, బుద్ధి పనిచేయని స్థితిలో కొన్నాళ్ళు... మొత్తం మీద, బాగుగ నామ కీర్తనములు సేయుటే, భాగ్యమని అనక త్యాగరాజ నుతుడైన శ్రీరాముని తత్త్వము తెలియక కొన్నాళ్ళు. ఎంతో పొద్దు గడిచింది. గమనించుకొని, పొద్దు కొంతయినా మిగిలి ఉండగానే, కోదండ రాముడి మీద మనసు పెట్టి భజించకపోతే, జన్మ వ్యర్థం అని నాదబ్రహ్మ హెచ్చరిక. – ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment