
సాక్షి, అమరావతి: దేశంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించేందుకు మావోయిస్టు పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన మొత్తం హింసాత్మక ఘటనల్లో 88 శాతం కంటే ఎక్కువ మరణాలకు మావోయిస్టులే పేర్కొంది. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితిపై (2018–2019 మార్చి వరకు) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో వివిద వామపక్ష తీవ్రవాద సంస్థల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) అత్యంత శకిమంతంగా ఉందని నివేదికలో స్పష్టం చేసింది. తీవ్రవాద ప్రభావిత 10 రాష్ట్రాల్లో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో గడిచిన తొమ్మిదేళ్లలో 3,749 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2010 నుంచి 2018 వరకు మొత్తం 10,660 ఘటనలు చోటుచేసుకోగా, వాటిలో 3,749 మంది మరణించారు.
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేలా ప్రజలతో పోలీసులు మమేకం కావాలని హోం శాఖ నివేదికలో సూచించింది. మావోయిస్టుల ప్రభావం ఉన్నచోట ప్రజల భద్రతతోపాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసి, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు మావోయిస్టులను కట్టడి చేయడానికి పోలీసు బలగాల సంఖ్యను పెంచడంతోపాటు భద్రతా సిబ్బందికి అధునాతన ఆయుధాలు, హెలికాఫ్టర్లు తదితర అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నట్టు పేర్కొంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువే..
మావోయిస్టుల హింసాత్మక ఘటనలు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే తక్కువ. మావోయిస్టుల హింసాత్మక ఘటనల విషయంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి తగ్గిపోతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2013లో 10 రాష్ట్రాల్లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల ప్రభావం ఉండేది. 2018 నాటికి 8 రాష్ట్రాల్లోని 60 జిల్లాల పరిధిలో 251 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వీరి ప్రభావం కనిపించింది.
ఏపీలో మావోల హింసాత్మక ఘటనలు.. మృతులు
ఏడాది ఘటనలు మృతులు
2010 100 24
2011 54 9
2012 67 13
2013 28 7
2014 18 4
2015 35 8
2016 17 6
2017 26 7
2018 12 3