పుడమితల్లికి వందనాలు...
నేడు ఎర్త్‌డే
పచ్చటి పొలాలతో పచ్చపచ్చటి చీరను ధరిస్తుంది భూమి... పర్వతాలను శిఖరాయమానంగా అలంకరించుకుంటుంది భూమి... పండ్లు, పూలు, కాయలు, ఆకులకు జన్మనిచ్చే నిత్య గర్భిణి భూమి.. మానవుల దోషాలను భరిస్తూ, గుణాలను స్మరిస్తూ... అందరినీ కడుపులో పెట్టుకుంటుంది భూమి... భూమి... ఎన్నో ప్రాణులకు, జీవరాశులకు ఆవాసం. భూమి లేనిదే మానవ జీవనం లేదు. భూమిని భూమాతగా కొలుస్తాం. క్షమకు మారు పేరు భూమి కావడం వల్లనే ‘క్షమయా ధరిత్రీ’ అంటారు.
ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, భూదేవికి నమస్కరించి, ‘సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే విష్ణుపత్నీ నమస్తుభ్యమ్ పాదఘాతం క్షమస్వమే ॥అని చదవడం సంప్రదాయంగా వస్తోంది. అంటే ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని అర్థం.