Earth Day
-
World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే.. పక్షులకు సేనాపతి
పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్. ఆమె పరిచయం. ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్ ఒకరు. స్టూడెంట్ నుంచి యాక్టివిస్టుగా పూర్ణిమ దేవి బర్మన్‌ది గౌహటి. వైల్డ్‌లైఫ్ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. 2007లో గ్రేటర్ అడ్జటంట్ స్టార్క్స్(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి. పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది. పీహెచ్‌డి ఏం చేసుకోవాలి? పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్‌డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది. విప్పారిన రెక్కలు 2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం. హార్గిల్లా ఆర్మీ ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి. -
Earth Day: ‘రీస్టోర్ అవర్ ఎర్త్’ ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: భూగోళం ఇప్పుడు అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోంది. కోవిడ్ మహమ్మారి రూపంలో విసిరిన పంజాకు యావత్ ప్రపంచం ప్రభావితమైంది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, అడవులపై యథేచ్ఛగా జరుగుతున్న కాలుష్యం, ఇతరత్రా రూపాల్లోని దాడులతో ప్రకృతిలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు వేగంగా అడవులు క్షీణతకు గురికావడం ఆందోళనకు కారణమవుతోంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా ‘ధరిత్రి దినోత్సవం’(ఎర్త్‌డే) నిర్వహిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతిపరంగా సహజమైన ప్రక్రియలు, హరిత సాంకేతికతల ఆవిష్కరణలు, ప్రపంచ పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ/పునఃప్రతిష్టకు వినూత్న ఆలోచనలు చేపట్టే దిశగా ఈ సంవత్సరం ‘రీస్టోర్ అవర్ ఎర్త్’ముఖ్యాంశంగా (థీమ్‌గా) ఐరాస నిర్ణయించింది. 1970 ఏప్రిల్ 22న అమెరికన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ దీనిని ప్రారంభించారు. ఎర్త్ డే నెట్వర్క్ (ఈడీఎన్)సంస్థ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు. గురువారం ఎర్త్‌డేను పురస్కరించుకుని తెలంగాణలోని ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమ కళాశాల విద్యార్థులకు ‘బర్డ్ ఫీడర్’అనే ఛాలెంజ్‌ను విసిరింది. ఎఫ్సీఆర్ఐ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనిధితో, ఈ ఏడాది ‘రీస్టోర్ అవర్ ఎర్త్’అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఏయే చర్యలను చేపడితే పర్యావరణహితంగా, ప్రకృతికి మేలు చేసే విధంగా ఉంటుందనే దానిపై బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్ గైని సాయిలుతో ‘సాక్షి’సంభాషించింది. విద్యార్థులకు ‘బర్డ్ ఫీడర్’ చాలెంజ్... ‘ఈ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మా కాలేజీ విద్యార్థులతో ‘బర్డ్ ఫీడర్’అనే చాలెంజ్ నిర్వహిస్తున్నాం. ఇంట్లో వృథాగా ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, పాత ప్లాస్టిక్, అన్బ్రేకబుల్ బౌల్స్ వంటి వస్తువులను ఉపయోగించి పక్షులకు ఆహారం, నీళ్లు ఏర్పాటు చేసేలా ఫీడర్లు తయారు చేయాలన్నదే ఈ చాలెంజ్. విద్యార్థులు తాము తయారుచేసిన వస్తువులను ‘బర్డ్ ఫీడర్’పోస్టర్‌తో మా ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఫోటో సెల్ఫీలను పోస్ట్ చేసి ఐదుగురు చొప్పున కుటుంబసభ్యులు, మిత్రులకు చాలెంజ్ విసరాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా చాలెంజ్ స్వీకరించినవారు ఇతరులను సవాల్ చేయాల్సి ఉంటుంది. ఈ వేసవి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నందున పక్షుల ఆకలి, దాహం తీర్చడం ద్వారా వాటిని కాపాడేలా ఈ ఫీడర్లు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉన్నా ఈ చాలెంజ్‌తో పాటు ఈ ఏడాది నిర్దేశించిన ‘రీస్టోర్ అవర్ ఎర్త్’థీమ్‌పై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, కవితల పోటీలకు మంచి స్పందన లభించింది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. – ఎన్ఎస్ శ్రీనిధి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎఫ్సీఆర్ఐ స్వాభావిక వృక్ష జాతులను కాపాడుకోవాలి... మన జీవనోపాధి, స్థితిగతులు, ప్రకృతికి దగ్గరగా ఉన్న స్వాభావికమైన స్థానిక చెట్లను పెంచేందుకు ఇప్పుడు ప్రత్యేక కృషి అవసరం. ఇందుకు అనుగుణంగా ప్రకృతి, పర్యావరణంతో మమేకమైన వృక్ష జాతులను సంరక్షించుకోవాల్సిన అవసరముంది. దీనిలో భాగంగా అవసరమైన విత్తనాలను అడవుల నుంచి సేకరించి నర్సరీల్లో పెంచాలి. అడవుల్లో ఆయా రకాల చెట్లకు సంబంధించిన విత్తనాల సేకరణకు అనువైన కాలమిది. హరితహారంలో భాగంగా ఎవరి పరిధిలో వారు అటవీశాఖ, పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా పనికి ఆహార పథకంలో డీఆర్డీఏ వీటి సేకరణ చేపట్టేలా, నాటేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారీగా అరుదైన, అంతరించి పోయే ప్రమాదమున్న మొక్కలు, వృక్షాల వివరాలున్నందున ఈ కార్యక్రమంలో వాటిపై అధిక దృష్టి పెట్టాలి. ‘రీస్టోర్ అవర్ ఎర్త్’లో భాగంగా మన నేటివ్ ప్లాంట్స్, ఇండీజీనియస్ స్పీషీస్‌ను కాపాడుకోవాలి. వీటి ద్వారా గతంలోని మన స్థానిక స్థితిగతులు, జీవనోపాధి పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. వివిధ అవసరాలకు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులు ప్రకృతి సిద్ధంగా, సంప్రదాయ వస్తువులతో తయారయ్యే వాటిని వాడేలా ప్రజలను చైతన్యపరచాలి. పర్యా వరణహితమైన వస్తువులను ప్రోత్సహించి, కాలుష్యాన్ని తగ్గించే దిశలో ప్రకృతి దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా ధరిత్రిని పునరుద్ధరించవచ్చు.’ – గైని సాయిలు, బయో డైవర్సిటీ నిపుణులు, ఫారెస్ట్ 2.0 రీజినల్ డైరెక్టర్ -
Earth Day: తల్లీ భూదేవి
తన మీద వొత్తిడి కలిగించినందుకే కర్ణుడిని భూమాత శపించిందట. భూమి ఇక పాపం మోయలేదు అనుకున్నప్పుడల్లా దేవదూతో, ప్రవక్తో ఉదయించారు రక్షణకు. ఒక నాగలి మొనకు సీతనే ఇచ్చింది ఈ తల్లి. తన కడుపున పంటలు, పాలుగారే నదులు మోసుకుంటూ తిరుగుతుంది రోజుకు 24 గంటలు. గోడ మీద పిల్లలు పిచ్చిగీతలు గీసినా ఒక అందం ఉంటుంది. కాని భూమి మీద మనిషి గీస్తున్న పిచ్చిగీతలు వినాశకరమైనవి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డా కాపాడుకోవాలి. ఇంట్లో ప్రతి తల్లి ఈ విషయమై పాఠం చెప్పాలి. వశం తప్పిన పిల్లాణ్ణి దండించైనా సరే దారికి తేవాలి. అందరి కోసం ధరిత్రి. ధరిత్రి కోసం అందరూ. పురాణాలు ఎప్పుడూ సంకేతాలలోనే మాట్లాడతాయి. ‘భూమ్మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా అవతరించమని దేవుణ్ణి రుషులు మొరపెట్టుకున్నారని’ చెబుతాయి. భూమికి భారం పెరగకూడదని పురాణాలు ముందునుంచి చెబుతూ వస్తున్నాయి. భూమి క్షోభ పడకూడదని కూడా చెబుతూ వచ్చాయి. భూమ్మీద నేరాలు, ఘోరాలు, పాపాలు పెరిగినప్పుడు భూమి రోదిస్తుంది. ఆ రోదన మంచిది కాదు. కనుక ఆ పాపాల్ని రూపుమాపే అవతారపురుషులు అవసరమవుతారు. ఇక్కడ పాపాలు అంటే మనిషికి అపకారం చేసే పాపాలు మాత్రమే కాదు. ప్రకృతికి అపకారం చేసే పాపాలు కూడా. ఇవాళ భూమ్మీద ప్రకృతి పరంగా పెరిగిన పాపాల కంటే మించి పాపాలు లేవు. ప్రకృతి వెంటనే తిరిగి మాట్లాడదని, వెంటనే తిరిగి ప్రతీకారం తీర్చుకోదనే ధైర్యంతో మనిషి ఇది చేస్తాడు. చెట్టును నరికితే చెట్టు వెంటనే గొడ్డలి పట్టుకుని వెంట పడదు. నదికి అడ్డంగా ఆనకట్ట కడితే నది బయటకు వినపడేలా శాపాలు పెట్టదు. పర్వతాలను పిండి పిండి చేసి చదును చేస్తే అవి కన్నెర్ర చేస్తున్నట్టు కనిపించవు. కాని ఒకరోజు వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు శిలల కింద నక్కి ఉండాల్సిన విష క్రిములు బయటపడి మనుషుల మీద దాడి చేస్తాయి. సముద్రాల కింద భూకంపాలు వచ్చి అంతులేని జలరాశి భూమిని ముంచెత్తుతుంది. నదులు ఉగ్రరూపం ధరించి ఊళ్లలోకి వస్తాయి. పర్వతాలు తమ కొండ చరియలు కూల్చి దారులు మూసేస్తాయి. అడవులు తమకు తామే ఎండిపోతాయి. నేల తడారిపోయి లోలోపల ముడుచుకుపోతుంది. మన దగ్గర డబ్బుంటుంది.. నీరు ఉండదు. డబ్బుంటుంది.. తిండి ఉండదు. డబ్బుంటుంది.. మంచి గాలి ఉండదు. భూమి తాలూకు సకల సరంజామాను పాడు చేసి భూమ్మీద ఉండాలని మనిషి మాత్రమే అనుకుంటాడు. అది ఏ తార్కిక శాస్త్రం ప్రకారం కూడా సాధ్యం కాదు. భూమికి నువ్వు గౌరవం ఇస్తే భూమి నీకు జీవితం ఇస్తుంది. తల్లి భూదేవి జీవం ఇచ్చేది ఏదైనా తల్లే. భూమి జీవం ఇస్తుంది. విత్తు వేస్తే ఫలం ఇస్తుంది. లోతుకు తవ్వితే జలం ఇస్తుంది. నీ నివాసపు గోడకు గుణాద్రం అవుతుంది. నీ ప్రయాణానికి వీపు అవుతుంది. నీ సమూహానికి ఊరు అవుతుంది. తల్లి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతుంది. బిడ్డలకు పచ్చటి చేల తోడు ఇస్తుంది. అందుకే భూమిని మనిషి తల్లిగా చేసుకున్నాడు. తల్లిగా ఆరాధించాడు. కాని క్రమక్రమంగా నేటి కొందరు కొడుకులకు మల్లే ఆ తల్లి గొప్పదనాన్ని మరిచాడు. ఆమె పట్ల చూపించాల్సిన ప్రేమను మరిచాడు. తల్లి ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును కూడా దాటే స్థితికి తెచ్చాడు. తల్లి ఏమంటుంది? భూమి తల్లి చెప్పేది మనిషి విననపుడు ప్రతి స్త్రీ భూమితల్లిగా మారి కుటుంబం నుంచి భూమి పట్ల ఎరుక కలిగించే సంస్కారాన్ని పాదు చేయాలి. పిల్లలకు మొక్కలు నాటడం నేర్పాలి. నీరు వృధా చేయకపోవడం నేర్పాలి. విద్యుత్తును ఆదా చేయడం నేర్పాలి. కాగితాన్ని వృధా చేయకూడదని నేర్పాలి. పరిసరాలు మురికి మయం చేయకూడదని నేర్పాలి. అనవసర ఇంధనం వృథా చేసే పద్ధతులను పరిహరించాలని చెప్పాలి. కారు అవసరమే. సైకిల్ తొక్కడం కూడా చాలా అవసరం అని తల్లి చెప్పాలి. ఏసి అవసరమే. కాని కిటికి తెరిచి ఆ వచ్చే గాలికి సహించేంత వేడిని సహించడం కూడా అవసరమే అని చెప్పాలి. ఆహార దుబారా, దుస్తుల దుబారా, ప్లాస్టిక్ దుబారా ఇవన్నీ తగ్గించి తద్వారా భూమి తల్లికి భారం తగ్గించాలని చెప్పడం అవసరమే అని చెప్పాలి. అమ్మ చెప్తేనే కొన్ని మాటలు చెవికి ఎక్కుతాయి. కొన్నిసార్లు అమ్మ గట్టిగా చెప్తే. ఆ తల్లి ఆదర్శం ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. అందరూ వచ్చి అక్కడి పేపర్ ప్లేట్లను తీసుకుని భోజనం చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఆహ్వానం అందుకున్న ఒక తల్లి తన భర్త, ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఒక సంచిని తోడుగా తెచ్చింది. ఆ సంచిలో నాలుగు స్టీల్ ప్లేట్లు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లేట్లలో తను, భర్త, ఇద్దరు పిల్లలు భోం చేశారు. వారు ఎంత తినగలరో అంతే ప్లేట్లలో పెట్టుకున్నారు. భోజనం పూర్తయ్యాక ఎక్కువ నీళ్లు అవసరం లేకుండా ఆ ప్లేట్లు శుభ్రమయ్యాయి. తిరిగి ఆ స్టీల్ ప్లేట్లను వారు సంచిలో పెట్టుకుని వెళ్లిపోయారు. వాళ్లు నాలుగు పేపర్ ప్లేట్ల వృధాను తగ్గించారు. తిన్నంతే తినడం వల్ల ఆహార దుబారా, తక్కువ నీటిని వాడటం వల్ల నీటి దుబారా తగ్గించారు. ఇవి చిన్న ప్రయత్నాలు. కాని ఇవి మొత్తం భూమి మీద భారం తగ్గించేవే. ఆ నాలుగు పేపర్ ప్లేట్లకు ఎంత చెట్టు గుజ్జు అవసరం. అలా అందరూ చేస్తే ఎంత అడవి మిగులుతుంది. ఆలోచించాలి. అంటే ప్రతి చిన్న పనిలోనూ భూమికి సంబంధించిన ఎరుక ఉండాలి. ఈ పని భూమికి భారం అవుతుందా మేలు అవుతుందా అనేది ఆలోచించాలి. తల్లులే జాతికి సంస్కారాలు నేర్పుతూ వచ్చారు. భూమి తల్లిని కాపాడుకోవాలనే సంస్కారాన్ని కూడా వారి ఒడి నుంచి తొలిపాఠంగా అందించాలి. అది నేటి నుంచే మొదలు కావాలి. – సాక్షి ఫ్యామిలీ -
కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు
మానవాళికి, పశు పక్ష్యాదులకు ప్రాణాధారమైన నేల తల్లి ఆచ్ఛాదన లేక మండుటెండల్లో అల్లాడిపోతోంది. వాతావరణంలో పెరిగిపోతున్న తాపం ధాటికి జీవాన్ని కోల్పోతోంది. ఇటువంటి సంక్షోభ కాలంలో సాధారణ పేద రైతులు ఆకుపచ్చని పంటలతో భూతల్లికి వస్త్రం కప్పుతున్నారు. ఏడాది పొడవునా ప్రతి రోజూ పొలం అంతటా పచ్చని పంటలు పండిస్తున్నారు. సాంత్వన పొందిన ఆ తల్లి ప్రేమతో ఇస్తున్న కూరగాయలు, ధాన్యాలను కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిస్తూ ఆనందంగా ఉన్నారు. అపురూపమైన ఈ రైతులు నీటి వసతి ఉన్నవారో, సుభిక్షమైన ప్రాంతవాసులో అనుకుంటే పొరపాటు. ఎడారిగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో! అదికూడా.. వర్షాధార వ్యవసాయ భూముల్లో!! ‘భూమాతను పునరుద్ధరించుకుందాం’ అన్న నినాదంతో ఈ నెల 22న ‘ధరిత్రీ దినోత్సవం’ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా.. కరువు సీమలో ఎండాకాలంలోనూ పచ్చని పంటలతో భూమాతను తమ గుండెలకు హత్తుకుంటున్న కొందరు రైతుల సుసంపన్నమైన అనుభవాల సమాహారమే ఈ కథనం. ప్రకృతి వ్యవసాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’లో ఒకానొక సరికొత్త ఆవిష్కరణ ‘వర్ష రుతువు కన్నా ముందుగానే విత్తనాలు విత్తుకోవటం’. దీన్నే ఆంగ్లంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అంటారు. ఈ పద్ధతిలో ఏడాదిలో 365 రోజులూ పంటలతో భూమిని కప్పి ఉంచడం.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం వల్ల భూమాత తిరిగి జీవాన్ని సంతరించుకుంటున్నది. ఏడాది పొడవునా ఆకుపచ్చని పంటలతో పి.ఎం.డి.ఎస్. పంట భూములు కళకళలాడుతుండటం విశేషం. సాధారణంగా నీరు నదుల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ, నదుల్లో కన్నా పది రెట్లు ఎక్కువ నీరు గాలిలో ఉంది. గాలిలో తేమ రూపంలో నీరుంది. ఆ తేమను గ్రహించి నేలను చెమ్మగిల్లేలా చేస్తూ వర్షం లేని కాలాల్లోనూ పంటలు నిలిచేలా.. సహజసిద్ధంగానే ఏడాది పొడవునా పచ్చగా ఉండేలా చేయటమే.. వినూత్నమైన పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు పద్ధతి విశిష్టత. ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ యన సిద్ధాంతం మూలాధారంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీని ద్వారా కరువును జయించడం, స్థానికంగా ఆహార భద్రతను కల్పించడమే కాకుండా.. భూతాపోన్నతిని సైతం తగ్గించే అవకాశం ఉందని డా. యన స్పష్టం చేస్తున్నారు. తమకున్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణాన్ని మాత్రమే చిన్న, సన్నకారు, పేద రైతులు.. ముఖ్యంగా మహిళా రైతులు పి.ఎం.డి.ఎస్. పద్ధతిలోకి మార్చుతున్నారు. ఆ పొలాలు ప్రస్తుత ఎర్రని ఎండల్లోనూ పచ్చగా అలరారుతూ కూరగాయలను అందిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ పంట పొలాల్లో ఎప్పుడూ పచ్చగా ఉండే ‘ఆహారపు అడవి’ని సృష్టిస్తున్నారు! గత మూడేళ్లుగా ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా కొంత మంది రైతులు పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వీరి కుటుంబాలకు ఏడాది పొడవునా కూరగాయలు వంటి పంటలతో అమృతాహారం అందుతున్నది. తినగా మిగిలిన కూరగాయలను అమ్ముకుంటూ చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సైతం సమకూర్చు కుంటున్నారు. పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు అంటే..? సాధారణంగా వర్షం పడి భూమి పదును అయిన తర్వాత దున్ని విత్తనం వేస్తారు రైతులు. అయితే, ఈ పద్ధతిలో రైతులు చేస్తున్నదేమిటంటే.. వర్షం రాక మునుపే, ఎండాకాలంలోనే, నేల పొడిగా ఉన్నప్పుడే.. ఎకరానికి 600 కిలోల ఘన జీవామృతం వేస్తున్నారు.. దుక్కి చేసి నవధాన్య విత్తనాలకు మట్టి, పేడతో లేపనం చేసి విత్తన బంతులు తయారు చేసి చల్లుతున్నారు. ఆ పైన వేరుశనగ కాయల పొట్టు, కంది పొట్టు, శనగ పొట్టు వంటి పంట వ్యర్థాలను రెండు, మూడు అంగుళాల మందాన వేస్తున్నారు. భూతల్లికి ఆచ్ఛాదనగా కప్పుతున్నారు. గాలిలో ఉన్న తేమను ఈ ఆచ్ఛాదన ఒడిసిపట్టి ఘనజీవామృతానికి, మట్టి కణాలకు అందిస్తోంది. ఆ విధంగా ప్రకృతి సాగు ద్వారానే వాతావరణంలోని తేమను ఒడిసిపట్టి పంట పొలాన్ని సస్యశ్యామలం చేస్తున్న వైనం ప్రపంచానికే ఆదర్శప్రాయం. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగుదారులందరికీ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది! – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ మెట్ట రైతులందరికీ ఈ సాగు పద్ధతిని నేర్పిస్తాం! ప్రకృతి వ్యవసాయం, వర్షానికి ముందే విత్తనాలు వేయటం వంటి సరికొత్త పద్ధతులను అనుసరించడం వల్ల ఎకరం, అరెకరం భూములను వర్షాధారంగా సాగు చేసే రైతులు కూడా ఏడాది పొడవునా అనేక రకాల కూరగాయలు పండించగలుగుతున్నారు. వారు తినగా మిగిలిన కూరగాయలు అమ్మి రూ. 60 వేల నుంచి రూ. 1,50,000 వరకు నికరాదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు, భూసారం పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఏడాదంతా పొలాన్ని పంటలతో పచ్చగా ఉంచుతున్న పుష్పావతి, చంద్రకళ వంటి రైతులు ఏపీలో ప్రస్తుతం 110 మంది ఉన్నారు. 2021–22 సంవత్సరంలో కనీసం 1,500 మంది రైతులతో 365 రోజులూ పచ్చని పంటలు ఉండేలా ప్రకృతి వ్యవసాయం చేయిస్తాం. మున్ముందు రాష్ట్రంలో మెట్ట రైతులందరికీ ఆహార, ఆదాయ, పర్యావరణ భద్రతను కల్పించే ఈ పద్ధతిని నేర్పించాలన్నది మా లక్ష్యం. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు, ఏపీ రైతు సాధికార సంస్థ vjthallam@gmail ఎడారిలో పంటల ఒయాసిస్సు పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యంలో అరెకరంలో 16 పంటలు పండిస్తున్న బండారి పుష్పావతి మండు వేసవిలోనూ పైరు పచ్చని నిరంతర వర్షాధార సేద్యం 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అరెకరంలో రూ. 61,818ల నికరాదాయం వచ్చే ఒకటి, రెండు నెలల్లో రానున్న మరో రూ. 26,800 ఆదాయం రాయలసీమ... అందులోనూ... అనంతపురం జిల్లా... కరువుకు ఓ చిరునామా... అలాంటి జిల్లాలో నీరు చుక్క లభ్యం కాని గుండాల తాండా క్లస్టర్‌లోని ‘గుండాల’ ఓ గిరిజన గ్రామం. ఆ గ్రామంలోని కోడలు పిల్ల బండారి పుష్పావతి. ఆమె భర్త పేరు డేవిడ్... ఆమె చదువుకున్నది 10వ తరగతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమంలో గ్రామస్ధాయి కార్యకర్తగా ఆమె గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆమె అత్త వారి తరపున లెక్కకయితే స్వంతంగా 6 ఎకరాల మెట్ట భూముంది. కానీ ఎప్పుడూ లక్ష రూపాయలకు మించి ఆదాయం చూడలేదు.. బ్రతుకు బండి సాఫీగా సాగాలంటే ఏదో రూపంలో బ్రతుకు తెరువు వెదుక్కోవలసిందే. ఇటు ఉపాధి హావిూ పనులతోపాటు పెద్ద రైతుల వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితులలో ప్రకృతి వ్యవసాయం మార్గదర్శనం చేసింది. ఈ విభాగం జిల్లా మేనేజర్‌గా చేస్తున్న లక్ష్మానాయక్ ఆమెలో ప్రేరణ కలిగించారు. ‘వర్ష రుతువు రాక ముందే పొలంలో విత్తనాలు చల్లుకొనే’ ఒక వినూత్న పద్ధతిని పరిచయం చేశారు. ఒక వైపు ఆదాయంతోపాటు మరో వైపు వందలాది సందర్శకుల అభిమానాన్ని కూడా స్వంతం చేసుకున్నారు పుష్పావతి. 2018లో అర ఎకరాలో దుక్కి చేసి ప్రారంభించిన పచ్చని పంటల సాగు మూడేళ్ల తర్వాత ఇప్పుడు కూడా విరామ మెరుగని దిగుబడులను అందజేస్తుంటే ఆశ్చర్యమే కదా! నేటికీ ఆ పొలంలో 16 రకాల పంటలు అప్పుడే వర్షంలో తడిసి కేరింతలు కొడుతున్న పసి పిల్లల్లా మిలమిలా మెరిసిపోతున్నాయి. వంగ, టమాట, మిరప, క్యాబేజీ, ముల్లంగి, అలసందలు, క్లస్టర్ బీన్స్, గోంగూర, తోటకూర, పాలకూర, కాకర, వేరుశనగ, బంతి పంటలు మరో ఒకటి, రెండు నెలలు దిగుబడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. బహువార్షిక రకాలయిన కంది, ఆముదం అయితే ఒక సంవత్సరంలోనే మూడు దఫాలు దిగుబడులిచ్చాయి. తిండి గడవక ప్రతి ఏటా వలస పోయే ఆ కుటుంబం వలస మాటే మర్చిపోయింది. వచ్చిన దిగుబడిలో తమ కుటుంబం యావత్తూ తినగా మిగిలిన పంట అమ్మడం వలన వచ్చిన డబ్బులతో ఇతర ఖర్చులు కూడా గట్టెక్కుతున్నాయని చెబుతున్న పుష్పవతి కళ్ళల్లో ఏదో కొట్టొచ్చిన మెరుపు. ఆ ఆనందంతో మొత్తం దిగుబడులు, ఖర్చులు టకటకా చెప్పేశారు. ఈ అరెకరంలో పెరుగుతున్న కూరగాయ పంటల ద్వారా 2020 ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన మొత్తం ఆదాయం రూ. 15,178. ఖర్చులు పోను నికరాదాయం రూ.10,738. అదే సంవత్సరం ఖరీఫ్‌లో మొత్తం రూ. 38,540ల దిగుబడి రాగా, ఖర్చులు పోను రూ. 32,630ల నికరాదాయం వచ్చింది. ఇంకా రబీలో ఖర్చులు పోను రూ.18,450 నికరాదాయం చేతికందింది. ఇప్పటి వరకు గత ఏడాదిలో రూ. 61,818 నికరాదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో వంగ మీద రూ.9 వేలు, కంది మీద రూ. 3 వేలు, ఆముదం మీద రూ. 4 వేలు, క్యాబేజీ మీద మరో రూ. 4 వేలు, ముల్లంగి మీద రూ. 4 వేలు, గోరుచిక్కుడు మీద రూ. 400, టమాటా మీద రూ. 2 వేలు, బీర, గోంగూర పంటల ద్వారా రూ. 400 (మొత్తం మరో రూ. 26,800) ఆదాయం వస్తుందని పుష్పావతి ధీమాగా చెప్పారు. ఇంత ఆదాయం తీసుకుంటున్న ఈమె అరెకరం పి.ఎం.డి.ఎస్. పొలానికి నీటి వసతి లేదు. అంతా వర్షాధారమే. 4 అంగుళాల మందంలో ఆచ్ఛాదనగా వేసిన శెనక్కాయల పొట్టుతోపాటు నెలకు రెండు సార్లు 100 లీటర్లు చొప్పున ద్రవ జీవామృతాన్ని క్రమం తప్పకుండా పంటలకు పుష్పావతి అందిస్తున్నారు. అత్యవసర పరిస్ధితులలో గత మూడేళ్లలో కేవలం 5 సార్లు ట్యాంకర్లతో (బోదెలకు ఇరువైపులా వున్న నీటి కాలువల ద్వారా) పంట రక్షక తడులు అందించారు. పుష్పావతి సేద్యం గురించి తప్పక తెలుసుకోవలసిన మరో విశేషం వుంది. వీళ్ళకున్న 6 ఎకరాల భూమిలో అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు మినహాయిస్తే మిగిలిన 5.5 ఎకరాలలో గత ఖరీఫ్‌లో ఏక పంటగా వేరుశనగ వేశారు. ఖర్చులు పోను నికరంగా మిగిలింది కేవలం రూ. 90 వేలు మాత్రమే. అంటే ఒక అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు ద్వారా తీసుకున్న నికరాదాయం 5.5 ఎకరాల్లో వచ్చిన నికరాయంతో దాదాపుగా సమానమన్నమాట. వచ్చే నెలలో మరో అరెకరాలో 365 రోజులు కొనసాగే పంటల సాకు శ్రీకారం చుడతానని చెబుతున్నారు పుష్పావతి. ఈమె పొలానికి ఆనుకొని వున్న పొలం రైతులకు బోరుబావి వున్నప్పటికీ గత ఖరీఫ్‌లో వేరుశనగను సాగు చేసి, రబీలో భూమిని ఖాళీగా వుంచేశారు. అయితే, పుష్పావతి పొలంలో వస్తున్న మార్పులను గమనిస్తున్నారు. ఆచ్ఛాదన చల్లదనానికి భూమిపైకి వస్తున్న వానపాములను, పంట దిగుబడులను చూసి పక్క రైతులు తాము కూడా పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మండు వేసవిలోనూ పచ్చని పంటలతో నేలతల్లికి రక్షణ కల్పిస్తూ.. తమ కుటుంబానికి ఆహార, ఆదాయ భద్రతను అందిస్తున్న చల్లని తల్లి పుష్పావతి (91821 75892)కి జేజేలు. అరెకరంలో రూ.79 వేల నికరాదాయం లీడ్ ఫార్మర్ చంద్రకళ అనుభవం అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం చేపట్టిన పరిశపోగుల చంద్రకళ దంపతులు గత ఏడాదిలో తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకోవడమే కాకుండా రూ. 79 వేల నికరాదాయాన్ని కూడా పొందారు. అనంతపురం జిల్లా పూడేరు మండలం జయపురానికి చెందిన చంద్రకళ ప్రకృతి వ్యవసాయ విస్తరణ విభాగంలో లీడ్ ఫార్మర్‌గా పనిచేస్తూ ఆదర్శప్రాయమైన సేద్యం చేస్తున్నారు. తమకున్న ఎకరం డి.పట్టా మెట్ట భూమిలోని అరెకరంలో గత ఏడాది ఏప్రిల్‌లో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో తీసిన బోరు బావికి ఉద్యాన శాఖ బిందు సేద్య పరికరాలను మంజూరు చేసింది. సజ్జ, జొన్న, కొర్ర, నువ్వులు, ఆవాలు, ధనియాలు, అలసందలు, పెసలు, ఆనప, చిక్కుడు, కాకర, బీర, బంతి, ఆముదం, ఉలవలు, కందులు, మినుములు (ఉద్దులు), వేరుశనగ సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 150 కేజీల ఘనజీవామృతం, 500 కేజీల టైప్2 ఘనజీవామృతం వేసుకొని కలియదున్నారు. 4 అడుగుల వెడల్పుతో బోదెలు (మట్టి పరుపులు) వేసుకొని, ఇరువైపులా 2 అడుగుల వెడల్పున కాలువలు తీశారు. ప్రతి 4 నెలలకొకసారి రిలే పంటలు వేసిన ప్రతి సారీ 150 కేజీల చొప్పున ఘనజీవామృతం చల్లుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని మొక్కంతా తడిసి క్రిందకు జారేలా క్రమం తప్పకుండా పిచికారీ చేశారు. 3 ట్రాక్టర్లతో తెచ్చిన వేరుశనగ పొట్టును పొలమంతా 4 అంగుళాల ఎత్తులో సమతలంగా ఆచ్చాదనగా పరిచారు. ఈ ఆచ్ఛాదన వలన నీటి అవసరం తగ్గడంతోపాటు.. వేరుశనగ పొట్టు కొద్దికొద్దిగా కుళ్ళుతూ మొక్కలకు సారాన్ని అందించడం వలన పంటలన్నీ ఆరోగ్యంగా నిగనిగలాడుతు న్నాయి. బీజ రక్షతో విత్తనశుద్ధి చేసి.. అలసంద, జొన్న పంటలను సరిహద్దు పంటలుగా వేసుకున్నారు. బంతి, ఆముదం పంటలను ఎర పంటలుగా నాటారు. పంటల వైవిధ్యం పాటించారు. ఒక వరుసలో 45 రకాల పంటలుండేలా జాగ్రత్త తీసుకున్నారు. వంగ తరువాత టమోటా, ఆ తరువాత మిరప, క్యాబేజీ మళ్ళీ వంగ.. ఈ విధంగా బహుళ పంటలు పొలమంతా వేశారు. దోమపోటు రాకుండా నీమాస్త్రంను, పూత రాలకుండా పుల్లటి మజ్జిగ పిచికారీ చేశారు. రసాయన అవశేషాలు లేని ముల్లంగి దుంపల కూర తినడం వలన తన భర్తకు వచ్చిన మొలల వ్యాధి శస్త్రచికిత్స చేయకుండానే నయమయ్యిందని చంద్రకళ ఆనందంగా చెప్పారు. వచ్చే ఖరీఫ్‌లో ఆముదం, క్యాబేజీ, క్యారట్, బీట్రూట్ పంటలు వేసుకొని రాబోయే సంవత్సరం మరింత ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తానని చంద్రకళ (99637 17844) ఆశాభావంతో ఉన్నారు. (ఇన్పుట్స్ : డా. డి.పారినాయుడు, జట్టు ట్రస్టు) -
వాతావరణ సదస్సులో పాల్గొనండి
వాషింగ్టన్: అమెరికా ఆధ్వర్యంలో వచ్చే నెలలో 40 మంది దేశాధినేతలతో జరిగే వర్చువల్ సదస్సుకు భారత ప్రధాని మోదీని అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే సందర్భంగా జరగనున్న ఈ రెండు రోజుల సదస్సులో 2030కల్లా తగ్గించాల్సిన కర్బన ఉద్గారాల లక్ష్యాలను బైడెన్ వివరిస్తారని అధ్యక్ష భవనం తెలిపింది. వచ్చే నవంబర్‌లో గ్లాస్గోలో జరగనున్న యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్(సీవోపీ26)కు ఇది కీలకంగా మారనుందని వివరించింది. ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ సదస్సుకు మోదీతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా ఆహ్వానాలను పంపినట్లు వెల్లడించింది. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక బైడెన్ వాతావరణానికి సంబంధించిన పలు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ప్రభుత్వ భూములు, సముద్రజలాల్లో చమురు, సహజ వాయువులకు సంబంధించి కొత్త ఒప్పందాలేవీ కుదుర్చుకోరాదనేది కూడా ఉంది. పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న ప్రపంచ దేశాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించడం ఈ సదస్సు కీలక ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఆర్థిక సాయంతో ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం, వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న దేశాలకు చేయూత ఇవ్వడంపైనా ఈ సదస్సు దృష్టి సారించనుంది. -
మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్!
సాక్షి, హైదరాబాద్ : ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకుంటే కరోనా లాంటి వైరస్లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలతో పాటు కొత్త కొత్త వ్యాధులు ఇవన్ని కూడా పర్యావరణానికి మనం చేస్తున్న హాని వల్లేనని గ్రహించాలని సూచించారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్లు సోకడం ముమ్మరమవుతుందనేది మహ్మమ్మారి కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ఈ సందర్బంగా తెలిపారు. (భూమాతకు కృతజ్ఞతలు తెలుపుదాం: మోదీ) మానవ తప్పిదాల వల్లే వైరస్లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైరస్‌లను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పర్యావరణ విధ్వంసంతోనే గతంలో మెర్స్, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ, ఎబోలా లాంటి వ్యాధులు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందేనని, ఇప్పుడు కొత్తగా కరోనా.. ఇలా మానవులను వరుస పెట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్లకు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆరోగ్యంపై ప్రభావం చూపి మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. (పుడమి తల్లికి ప్రణామం) భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేదని మంత్రి అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచడాన్ని ఉద్యమంలాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ‘చెట్టు అంటే కలప కాదు, అదొక జీవ వ్యవస్థ అని గ్రహించాలి. మానవ జాతిని ఇన్ని కోట్ల సంవత్సారాలు సంరక్షిస్తున్నది అడవులతో కూడిన జీవ వ్యవస్థని గుర్తించాలి. అందుకే ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షించండి, కొత్తగా మొక్కలను నాటండి’ అని మంత్రి అల్లోల పిలుపునిచ్చారు. (వరమా.. శాపమా!) -
భూమాతకు కృతజ్ఞతలు తెలుపుదాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఈ భూమి మీద నుంచి తరిమికొట్టడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం భూమాతకి కృతజ్ఞతలు తెలుపుదామని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ‘అపారమైన ప్రేమతో సమస్త జీవకోటిని కంటికి రెప్పలా కాపాడుతున్న భూమాతకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనకు రక్షణ కల్పిస్తున్న భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భూగ్రహాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, అంత్యంత శ్రేయస్కరంగా ఉండేలా చూసుకుంటామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం’ అని ప్రధాని పిలుపునిచ్చారు. (జన విశ్వాసమే మోదీ ఆయుధం) 1970 ఏప్రిల్ 22న మొదటి ‘ఎర్త్ డే'ను నిర్వహించటం జరిగిందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ప్రధాని పేర్కొన్నారు. కాగా పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించటం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. (పుడమి తల్లికి ప్రణామం) On International Day of Mother Earth, we all express gratitude to our planet for the abundance of care & compassion. Let us pledge to work towards a cleaner, healthier & more prosperous planet. A shout out to all those working at the forefront to defeat COVID-19. #EarthDay2020 — Narendra Modi (@narendramodi) April 22, 2020 ప్రకృతిని ప్రేమిద్దాం: ఉప రాష్ట్రపతి ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యథావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉంటూనే ప్రకృతితో మమేకమయ్యే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతితో కలిసి జీవిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పునరంకితమౌదాం.’ అని పిలుపునిచ్చారు. -
వరమా.. శాపమా!
ఆశ అత్యాశగా మారి స్వార్థం ముసిరినపుడు విచక్షణ జ్ఞానం మరిచి మనిషి అనేక తప్పిదాలకు పాల్పడతాడు. తప్పిదాల మూల్యమే ప్రపంచమంతా అనుభవిస్తున్న క్వారంటైన్ బందీఖాన మనిషిని బందీని చేసి స్వేచ్ఛగా ఎగిరే పక్షులతో, స్వతంత్రంగా తిరిగే జంతువులతో ప్రకృతి పరవశిస్తోంది.. భూమాత పాలిట వరమైన మహమ్మారి మనిషి పాలిట శాపమైంది.. ఊహించని విధంగా భూమిపై పెనుమార్పులు చోటుచేసుకుంటున్నవేళ 50వ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మానవాళికి కరోనా గుణపాఠం లాంటిది. మనిషి స్వార్థానికి అడవులను, చెట్లను నరికివేసి.. పక్షుల, జంతువుల స్వేచ్ఛను హరించడం.. పరిశ్రమల పేరిట గాలి నీరు కలుషితం చేసేశాడు. భూమండలాన్ని శాసించాలన్న స్వార్థపూరిత వైఖరికి కరోనా మహమ్మారి అడ్డుకట్టవేసి మనిషిని నాలుగ్గోడల మధ్య బందీ చేసింది.. ఫలితంగా అన్ని రంగాల్లో కాలుష్యం తగ్గడం.. భూమిపై, లోపల పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. మానవ సంచారం తగ్గడంతో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. జంతువులు మునుపెన్నడూ లేనివిధంగా స్వేచ్ఛగా తిరుగుతూ జనావాసంలోకి వస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్లో చూస్తున్నాం.. ఇంతకుముందు కని పించని జంతువులను చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. నగరాలలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడమనేది తీరని కోరిక.. పరిశ్రమలు మూసివేయడం.. వాహనాల రద్దీ తగ్గడంతో.. గాలి నాణ్యత పెరిగి నగరాలలో వాయుకాలుష్యం తగ్గినట్లు అనేక అధ్యయనాలు తెలి యజేస్తున్నాయి. మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసి సవాల్ విసిరినా మహమ్మారి మూలాన వాతావరణంలో చోటుచేసుకుం టున్న పెనుమార్పులను.. ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తాడని భావిద్దాం. కరోనా నుంచి గుణపాఠం నేర్చుకొని సరికొత్త ప్రపంచంలోకి సరికొత్త ఆలోచనలతో అడుగిడాలని ఆశిద్దాం. (నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం) – ఎ. నాగరాజు, అప్పాజీపేట, నల్లగొండ -
ఇంటి నుంచే పర్యావరణ ఉద్యమం
ప్రపంచంలో చిట్టచివరి కరోనా కేసు కూడా నెగెటివ్ అని తేలిన తర్వాత? దాదాపు అన్ని దేశాలలో అమలవుతున్న లాక్ డౌన్ ఎత్తివేశాక? ఇక మళ్లీ ప్రపంచం గాడిన పడ్డట్టేనా? యథావిధిగా మన జీవితాలు కొనసాగినట్టేనా? అవునని అనుకుంటే మాత్రం ఇంత పెద్ద ఉత్పాతం నుంచి మనం ఏమీ నేర్చుకోనట్టే అంటున్నారు లియత్ ఓలెనిక్, అలెజాండ్రో దాల్ బాన్. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ ఆందోళనకారులు అమెరికా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ, మిగిలిన దేశాలు నడవాల్సిన దిశ ఏమిటో సూచిస్తున్నారు. 1970 ఏప్రిల్ 22న సుమారు రెండు కోట్ల మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి పర్యావరణ హిత సమాజం కోసం గొంతెత్తారు. అదే మొదటి ధరిత్రీ దినోత్సవం. దీని ఫలితమే అదే ఏడాది ఏర్పాటైన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ). తర్వాత అమెరికన్ కాంగ్రెస్ స్వచ్ఛమైన గాలి చట్టం, స్వచ్ఛమైన నీటి చట్టం, అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవజాతుల సంరక్షణ చట్టం చేసింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ వార్మింగ్‌ను నిరాకరిస్తూ, పర్యావరణ హిత చట్టాలన్నీ బలహీనపడేలా వ్యవహరిస్తున్నాడు. ఉష్ణోగ్రతల పెరుగుదల, కారుచిచ్చులు, తుపాన్లు, వరద బీభత్సాల తర్వాత ఇప్పుడు కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను బలిగొంది, ఎంతోమంది ఉపాధిని పోగొట్టింది. ఇదే మేలుకొలుపుగా మన భవిష్యత్ ఏమిటో ప్రశ్నించుకోవాలి అంటున్నారు లియత్, అలెజాండ్రో. కోవిడ్–19 అమెరికన్ సమాజంలో ఏళ్లుగా వేళ్ళూనుకుని ఉన్న అసమానతలను ఎత్తిచూపింది. హెల్త్ కేర్ లేనివాళ్లు, కలుషిత గాలిని పీలుస్తూ బతకాల్సిన వాళ్ళు, పత్రాలు లేని వలస జీవులు, ఖైదీలు, ఇంటి భద్రత లేనివాళ్ళు– ఎవరికి వారికి అందాల్సిన సాయం అందడం లేదు. దశాబ్దాలుగా అమలవుతున్న పర్యావరణ వివక్ష ఈ వర్గాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. పవర్ ప్లాంట్ల దగ్గర ఉన్న వాళ్ళలో ఉబ్బస బాధితులు ఎక్కువ. చమురు వెలికితీత ప్రదేశాల్లో కేన్సర్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కరోనా వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయిన జనం వీళ్లే. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లోని వలసల ఆవాసాలు, బ్రాంక్స్ లోని అల్పాదాయ వర్గాల వాడలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కోవిడ్–19 లాగే ఈ పర్యావరణ సంక్షోభం కూడా ప్రపంచాన్ని తీవ్రంగా అస్థిరపరుస్తుందనీ; ఇది మరెన్నో కొత్త విపత్తులను తేనుందనీ వేలాదిమంది పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ఎన్నో రకాల వ్యాధులు ఇందులో ఒకటి. తగిన చర్యలకు ఉపక్రమించకపోతే గనక పంటలు నాశనం కావడం, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా 2050 నాటికి సుమారు 100 కోట్ల మంది తమ ఆవాసాలకు దూరం అవుతారని వీరు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి అమెరికా నూటికి నూరు శాతం పునర్వినియోగ ఇంధన వనరుల వైపు మారిపోవాలనీ, కరోనా సంక్షోభమే సాకుగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టేలా శిలాజ ఇంధన సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడకుండా నిరోధించాలనీ వీరు కోరుతున్నారు. పర్యావరణ నియంత్రణల మీద ఈపీఏ వెనక్కి తగ్గడం మార్చి 26నే మొదలైంది. ఉల్లంఘనలకు పరిహారం వసూలు చేయకపోగా, సంస్థలే ’స్వీయ పరిశీలన’ చేసుకోవాలని అనడం అంటే, ప్రజారోగ్యాన్ని మరింత ప్రమాదం వైపు నెట్టినట్టే. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే తన రెండు ట్రిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీల కోసం 500 బిలియన్లు ఖర్చు చేసింది. అట్లాంటిది పర్యావరణ హితం కోసం ఒక గ్రీన్ డీల్ కుదుర్చుకోవడానికి ఈ 50వ ధరిత్రీ దినోత్సవం ఒక సందర్భం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు లియత్, అలెజాండ్రో. ఈ సొమ్మును కార్మికులు, పునర్వినియోగ ఇంధన వనరుల పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ సంక్షోభం బారినపడే సముదాయాలకు బదలాయించాలని కోరుతున్నారు. వ్యక్తులు, బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు అన్నీ అటవీ క్షయాన్ని అరికట్టేలా, పర్యావరణానికి మేలు జరిగేలా తమ స్థాయిలో ప్రభావితం చేస్తామని ప్రతిన బూనాలి. 50 ఏళ్ల క్రితం ఇదే కారణంతో రెండు కోట్ల మంది వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. మనల్ని మనం కరోనా భారీ నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం ఇళ్లకే పరిమితమై ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ఈ భూగోళాన్ని కాపాడుకోవడానికీ, తద్వారా దాన్ని మరింత నివాసయోగ్యం చేసుకోవడానికీ ఇంటి నుంచే, ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభిద్దాం. (ధరిత్రీ దినోత్సవానికి నేటితో 50 ఏళ్లు) – పి. శివకుమార్ -
ఆరో వినాశనం.. ఇలా ఆపేద్దాం!
వాషింగ్టన్: భూమి చరిత్రలో ఆరో వినాశనం త్వరలోనే ఉండనుందా..? ఇప్పటివరకు ఐదు సమూహ వినాశనాలతో తల్లడిల్లిన భూమికి ఆరో వినాశనం తప్పదా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న ఆ ఆరో వినాశనానికి మూల కారకులు మానవులేనని కూడా చెబుతున్నారు. భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమతుల్యతను కాపాడి ఆరో వినాశనాన్ని తప్పించేందుకు రూపొందించిన ఓ విధానం అమలుకు ఏడాదికి రూ.7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు. ఇది కూడా ఎంత వీలైతే అంత త్వరగా చేపట్టాలని, తద్వారా మానవ నిర్మిత జీవవైవిధ్యం ద్వారా జరిగే విధ్వంసాన్ని ఈ దశాబ్దంలోనే అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఆరో వినాశనం మానవుడి భుజస్కందాలపై ఉందని, ఏం చేయాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఎకాలజిస్ట్ గ్రెగ్ అస్నర్ తెలిపారు. భూమిపై జీవవైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడటానికి ‘ఏ గ్లోబల్ డీల్ ఫర్ నేచర్(జీడీఎన్)’అనే సైన్స్ పాలసీని రూపొందించిన 19 మంది అంతర్జాతీయ పరిశోధకుల్లో అస్నర్ ఒకరు. ఈ ఖర్చు అంత భారీదేమీ కాదని, అమెరికాలోని యాపిల్, బెర్క్‌షైర్ హాత్వే కంపెనీలు 2018లో ఆర్జించిన లాభాలతో ఇది సమానమన్నారు. రెండో అతిపెద్ద నిర్ణయం.. భూ వినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో జీడీఎన్ రెండో అతిపెద్ద నిర్ణయం కాగా.. మొదటిది 2015లో తీసుకున్న పారిస్ ఒప్పందం. ‘అయితే పారిస్ ఒప్పందం ఒక్కటే భూమిపై జీవ వైవిధ్యాన్ని, మానవాళికి అవసరమైన పర్యావరణాన్ని సంరక్షించలేదు. దీని కోసం మరొక ప్రత్యామ్నాయం అవసరం. శాస్త్ర ఆధారిత, నిర్ణీత కాల పాలసీ అయిన ది గ్లోబల్ డీల్ ఫర్ నేచర్ భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడగలదు. భూ వినాశనాన్ని ఆపడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో జీడీఎన్ పాలసీకి తిరుగులేదు. భావితరాలకు మనం ఇవ్వబోయే అతిపెద్ద బహుమతి ఈ పాలసీ మాత్రమే. జీడీఎన్ పాలసీలో మూడు లక్ష్యాలను నిర్దేశించాం’అని అమెరికాలోని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఎరిక్ డైనర్స్టెయిన్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం: మోదీ వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గించడంలో దేశ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ధరిత్రీ దినోత్సవం ఓ సందర్భం అని ప్రధాని మోదీ అన్నారు. ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ..‘భూమాతకు మనం భక్తితో నమస్కరిస్తాం. ఏళ్లుగా అసాధారణ వైవిధ్యాలకు ఈ భూగ్రహం ఓ నిలయం. మన గ్రహం శ్రేయస్సు కోసం స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులను తగ్గించడంలో మన నిబద్ధతను ఈ రోజున మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం’అని అన్నారు. -
భయపెడుతున్న భూతాపం
అనంతపురం కల్చరల్: వైశాఖ మాసం రాకనే ఏప్రిల్‌లోనే వచ్చేసిన ఎండలు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. జిల్లాలో నిత్యం వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న వారు క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. మానవులు చేసే తప్పిదాల వలన భూమి గతి తప్పుతోందని, ఓజోన్ వినాశనం వల్ల ఎండలు తీవ్రతరమవుతున్నాయని, ఇప్పటికే తనను తాను శుభ్రపరచుకొనే సహజ గుణాన్ని భూమి కోల్పోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. గతంలో వజ్రకరూరు మండలంలో ‘దప్పిక చావు’ నమోదు కావడం, అలాగే కల్యాణదుర్గం బోరంపల్లిలో ఆకలి చావులు అధికంగా నమోదు కావడం సంచలనం రేకెత్తించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ భూమిని రక్షించాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలియజేయడానికి ఏప్రిల్ 22న ‘ధరిత్రి దినోత్సవం’ జరుపుకుంటున్నాము. కనీసం ఒక్కరోజైనా ధరిత్రి గురించి మనం ఆలోచించికపోతే భవిష్యత్ తరాల వారి మనుగడే ప్రమాదమన్న సంకేతాలతో ఆర్డీటీ, ఎకాలజీ సెంటర్, అనంత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు భూ ప్రాముఖ్యాన్ని తెలిపే సదస్సులు, చర్చావేదికలు అనేక ఏళ్లుగా నిర్వహిస్తూనే ఉన్నాయి. ఎడారి నివారణకు చర్యలు జిల్లాలో స్వార్థపరుల కుట్రల వల్ల అటవీ సంపద క్రమంగా కనుమరుగవుతోంది. జిల్లా భూభాగంలో 1.90 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించాయి. అటవీ సంరక్షణపై ఒకప్పటి నిర్లక్ష్యం జిల్లాను ఎడారిగా మార్చేసే ప్రమాదంలో పడేసింది. దానికితోడు గొర్రెల కాపర్లు అనాగరికంగా అడవులకు నిప్పు పెడితే అనంతరం లేత గడ్డి వస్తుందన్న మూఢనమ్మకంతో చెట్లను నాశనం చేస్తున్నారు. వృక్షాలు లేకపోతే రాబోయే ప్రమాద ఘంటికలను ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సంస్థలు త్వరగా గ్రహించాయి. ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు అంతరిస్తున్న అటవీ సంపద వల్ల రానున్న ప్రమాదాన్ని గ్రహించి ధరిత్రి, అటవీ, జల సంరక్షణ కోసం పాటుపడుతున్నాయి. చాలా సంస్థలు ‘ధరిత్రి రక్షతి రక్షితః’ అంటూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పడమేగాక, ఆచరించి చూపిస్తున్నాయి. దీనికి తోడు గ్యాస్ వాడకం బాగా పెరగడంతో అడవుల్లో కట్టెల కోసం చెట్లు నరికేసే ప్రమాదం కూడా క్రమంగా తగ్గుతూ ఉండడం కొంత వరకు మేలు కల్గిస్తున్న అంశం. తడారుతున్న గొంతులు దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమో దయ్యే జిల్లాగా అనంతపురం జిల్లా రికార్డులకెక్కింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ఇప్పటికే నీటి సమస్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పీఏబీఆర్, సీబీఆర్, పెన్నార్ కుముద్వతిని వంటి ప్రాజెక్టుల ద్వారానే ఇక్కడ నీటి కరువు తీరాలి. దురదృష్టవశాత్తు అధికార గణానికి చిత్తశుద్ధి లేకపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. వందలాది గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్టు ఇటీవల సర్వేలు చెపుతున్నాయి. నీటి వనరులు లేక పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇక్కడి కరువు ఎంత కరాళనృత్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాధారమైన నీటిని సంరక్షించుకోవాలంటే జిల్లాకు దాదాపు 40 టీఎంసీల నీరు అవసరం. ఎండలు పెరగడం ఇబ్బందికరం ఈ ధరిత్రికి హాని కలగకుండా శక్తిని సృష్టించే సహజ వనరులున్నాయి. సౌరశక్తి, పవన విద్యుత్తు, బయోగ్యాస్ మొదలైనవన్నీ ప్రతి మనిషికీ అత్యవసరమైనవే. వీటన్నింటినీ సంరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఈసారి ఎండల తీవ్రత వల్ల కనీసం అవగాహనా సదస్సులు నిర్వహించలేనంత ఇబ్బందిలో ఉన్నాము. భూతాపం పెరగకుండా చర్యలు అత్యవసరం. భవిష్యత్™Œ తరాల వారు సుఖంగా జీవించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనువైన మార్గనిర్దేశనం చేయాలి. – వైవీ మల్లారెడ్డి, ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ భావి జీవితాలకు భరోసానిద్దాం అనంతపురం కల్చరల్: పెరుగుతున్న కాలుష్యం, భూతాపం మనిషి ప్రమాదంగా మారేలా చేస్తోందని, ధరిత్రి రక్షణ కోసం అందరం కృషి చేయాలని జేవీవీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని జేవీవీ కార్యాలయంలో ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కల్పించే కరపత్రాలను ఆవిష్కరించారు. జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలు ష్యం భూమాతకు కడుపు కోతగా మిగులుతోందని, అభివృద్ధి పేరుతో సాగుతున్న తంతు భూ ఉపరితలాన్ని దహించివేస్తోందన్నారు. తాగేనీరు, పీల్చే గాలి, నివసించే నేల ఇలా ప్రతీది కలుషితమైపోతుంటే మానవ మనుగడకే ప్రమాదంగా మారుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఒకప్పుడు ప్రకృతి అందాలతో విరాజిల్లిన అటవీ భూములు, చెరువులు స్వార్థంతో నాశనం చేస్తుంటే ప్రభుత్వం చూడనట్టుందని విమర్శించారు. ప్రజలు తమ బాధ్యతగా తీసుకుని ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నారాయణప్ప, బాబాజాన్, శ్రీనివాసులు, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి నీడలా పేదరికం!
నేడు ‘ఎర్త్ డే’. భూమిపై జనాభా ఎంత పెరిగితే మాత్రం ఏమిటి? ప్రకృతి వనరులను పాతాళం నుంచి అయినా తోడుకునే శక్తి మనుషులకు లేనప్పుడు కదా మనం భయపడాలి అని అభివృద్ధివాదులు వాదిస్తుంటారు. పెరుగుతున్న జనాభాకు నీడలా దీర్ఘంగా పొడవెక్కే పేదరికం కూడా వీరికి అభివృద్ధిలా కనిపిస్తుందో ఏమో! ఎంత సంపన్న సమాజంలోనైనా అధిక జనాభా వల్ల మొదట ఇక్కట్ల పాలయ్యేది నిరుపేదలే. వీరిని దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి పథకాలను రూపొందించాలి ప్రభుత్వాలు. అభివృద్ధి పేదల్ని మింగేయకుండా. ఒక్కోసారి –లోకంలోని ఈ పేదరికం, క్షుద్బాధ.. భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయా అన్న సందేహం కలుగుతుంటుంది. కష్టం తెలియడానికి, కష్టపడి బతకడం ఎలాగో నేర్పించడానికి, నీతి నియమాలను ఏర్పరచడానికి దేవుడు ఇంతమందిని పుట్టించి, ఆహారాన్ని అతి ప్రయాస మీద మాత్రమే సంపాదించుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాడా? జనాభా, ఆహార వనరులు ఒకే నిష్పత్తిలో పెరుగుతూ పోతుంటే మనిషి ఎప్పటికీ ఆదిమ దశలోనే ఉండిపోయేవాడా... దొరికిందేదో ఇంత తిని, దొరలా మంచెలపై దొర్లి! కానీ... సర్వ శక్తి సంపన్నుడైన కారుణ్యమూర్తిలో ఇంతటి క్రౌర్యం ఉంటుందా? అయినా క్రౌర్యమని, కాఠిన్యం అని ఎందుకనుకోవాలి? జీవన పోరాటంలో మానవజాతిని రాటు తేల్చడానికి అయివుండొచ్చు కదా! ఇదే నిజం అనుకుంటే జనాభా సూత్రాలన్నిటి వెనుకా అంతస్సూత్రంగా దేవుడు ఉండాలి, దేవుడు పెడుతున్న యాతన ఉండాలి, ఆ యాతన... మనిషిని నిస్పృహలోకి నెట్టడానికి కాక, క్రియాశీలం చేయడానికి అయివుండాలి. -
పుడమితల్లికి వందనాలు...
నేడు ఎర్త్‌డే పచ్చటి పొలాలతో పచ్చపచ్చటి చీరను ధరిస్తుంది భూమి... పర్వతాలను శిఖరాయమానంగా అలంకరించుకుంటుంది భూమి... పండ్లు, పూలు, కాయలు, ఆకులకు జన్మనిచ్చే నిత్య గర్భిణి భూమి.. మానవుల దోషాలను భరిస్తూ, గుణాలను స్మరిస్తూ... అందరినీ కడుపులో పెట్టుకుంటుంది భూమి... భూమి... ఎన్నో ప్రాణులకు, జీవరాశులకు ఆవాసం. భూమి లేనిదే మానవ జీవనం లేదు. భూమిని భూమాతగా కొలుస్తాం. క్షమకు మారు పేరు భూమి కావడం వల్లనే ‘క్షమయా ధరిత్రీ’ అంటారు. ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, భూదేవికి నమస్కరించి, ‘సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే విష్ణుపత్నీ నమస్తుభ్యమ్ పాదఘాతం క్షమస్వమే ॥అని చదవడం సంప్రదాయంగా వస్తోంది. అంటే ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని అర్థం. -
మదర్ ఎర్త్
బీటలువారిన భూమి.. ‘మొక్క’వోని సంకల్పంతో ఆ పగుళ్లకు బ్యాండేజీ వేసి, చికిత్స చేస్తే.. పుట్టింది ఓ లత. భూమి నిండా పచ్చదనం అలా తీగలా అల్లుకోవాలని సందేశాన్నిస్తున్న ఈ చిత్రం.. ఇంకా మనం ఈ భూమిపై సృష్టిస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కడుతుంది. ధరిత్రి పట్ల మనమెంత బాధ్యతాయుతంగా ఉండాలో చెబుతుంది. నిలువెల్లా గాయాలతో విలయం అంచున ఉన్న భూమిని ఇప్పటికైనా కాపాడుకొని ఆకుపచ్చని వాతావరణాన్ని సృష్టిద్దామంటున్న ఇటువంటి చిత్రాలెన్నో... - కళ ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు.. వనాలు కరుమరుగై ఎటుచూసినా జనాలు, భవనాలు.. విషతుల్యంగా మారిపోతున్న జలాలు.. బీడుపడి గోడు వెళ్లబోసుకుంటున్న నేల.. ఈ పరిస్థితికి కారణం మనిషేనంటున్నాయి ఈ చిత్రాలు. ఎర్త్ డే సందర్భంగా బంజారాహిల్స్‌లోని గోథెజంత్రమ్ ‘పర్‌స్పెక్టివెన్: మదర్ఎర్త్’ పేరుతో వరుసగారెండోసారి ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇందులో 45 ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. ఇవన్నీ ధరిత్రి సౌందర్యాన్ని.. ఈ నేలపై మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని తెలియచెప్పేవే. ‘దక్కన్ పీఠభూమి దర్పాన్ని చాటే ‘రాక్స్’.. ఇప్పుడు ఠీవిని కోల్పోతున్నాయి. మనిషి దెబ్బకు ఛిద్రమవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే దక్కన్ రాతి కొండల్ని ఫొటోల్లో మాత్రమే చూడగలం’ అని చెబుతుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ అశోక్ తీసిన చిత్రం. భూమే ఆధారం... మన ఉనికికి భూమే ఆధారం. భూమి మీద ఆధారపడిన అనేకానేక జీవుల్లో మనమూ ఒకరం. కానీ నేల, నీరు, వాతావరణాన్ని మన చేష్టలతో ఎంత పాడుచేస్తున్నామో ఇక్కడ కొలువుదీరిన చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. ‘పర్యావరణానికి ఎంత చేటు తెస్తున్నామో నిత్యం చేసే పనుల ద్వారా మనకు తెలుస్తూనే ఉంటుంది. మోడు వారిన చెట్లు.. గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు.. నగర జీవనంలో ఈ దృశ్యాలు కనిపించని రోజు ఉండదు. బిజీ లైఫ్‌లో పడి మన పనులు, ఆలోచనల్లో మునిగిపోతాం. ఆ దృష్టిని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫొటోలు చెబుతాయి’ అంటారు ఈ ఎగ్జిబిషన్ క్యూరేటర్ ప్రశాంత్ మంచికంటి. తల్లి కంటే మిన్నగా... ‘మన మనుగడకు ఏకైక ఆధారం భూమి. అమ్మ కన్నా మిన్నగా మదర్ ఎర్త్‌ను కాపాడుకోగలిగితే మనకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. పచ్చని నేల, స్వచ్ఛమైన నీరు, గాలిని భద్రంగా భావి తరాలకు అందించే బాధ్యత మన మీదే ఉంది’ అని చాటుతున్నాయి ఈ పర్యావరణ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు. ‘మదర్ ఎర్త్: బ్యూటీ, హర్ జాయ్స్, సారోస్ అండ్ పెయిన్.. ఈ మూడు అంశాలను ఈ చిత్రాల ద్వారా చెప్పాలన్నదే మా ప్రయత్నం’ అంటారు ప్రశాంత్ మంచికంటి. ఉప్పొంగే సముద్రం, కొండలు, నదులు ఈ సౌందర్యం మాటునే విధ్వంసమూ చోటుచేసుకుంటోంది. భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పులు ఏమిటో ఇవి తెలియ చెబుతాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్ తీసిన హియాలయాల చిత్రం. నింగిని తాకే వెండికొండ అందాలు.. ఆ పక్కనే గొడ్డలివేటుకు బలైన మహా వటవృక్షాల తాలూకు మోడులు.. ఈ చిత్రం భూమిపై జరుగుతున్న డిఫారెస్టేషన్కు నిదర్శనం. ఎన్విరాన్మెంటల్ ఏప్రిల్ ఎర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ‘మనం బతికేందుకు అన్నీ ఇస్తున్న నేల తల్లిని ఎంతగా వేధిస్తున్నామో గ్రహించి, దానిని సరిదిద్దుకోవాలని చెప్పడమే ఈ ప్రదర్శన ఉద్దేశం. ఏటా ఏప్రిల్ మాసాన్ని ఎన్విరాన్మెంటల్ ఏప్రిల్‌గా పరిగణిస్తూ మదర్ ఎర్త్ పేరుతో ఫొటో ప్రదర్శనలు, ఫిల్మ్ స్క్రీనింగ్స్, చర్చలు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు గోథెజంత్రమ్ డెరైక్టర్ అమితాదేశాయ్. -
ది ఎకనామిక్స్ ఆఫ్ హ్యాపీనెస్
ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రదర్శిస్తున్న ఈ చిత్రం... ప్రపంచంలోని ఆరు భిన్న ప్రాంతాల్లో సంభవించిన ఆర్థిక వ్యవస్థ మార్పులపై చర్చిస్తుంది. వేదిక: లామకాన్, బంజారాహిల్స్ సమయం: ఈ నెల 22 రాత్రి 7 గంటలకు -
భూమాతకు వందనం!
సందర్భం తొలి ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే)ను 1970 ఏప్రిల్ 22న జరుపుకున్నారు. పారిశ్రామీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణం గురించి మన అజాగ్రత్త...మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని అమెరికన్ సెనెటర్ గేలార్డ్ నెల్సన్ ‘ఎర్త్ డే’కు రూపకల్పన చేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన ‘డిస్నీ నేచర్’ 2009లో ‘ఎర్త’ పేరుతో చక్కని డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. తొలి ఎర్త్‌డే (1970) రోజు అమెరికా వీధుల్లో వేలాది మంది పారిశామ్రిక విప్లవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఎర్త్ డే’ పేరును 2009లో ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే’ గా మార్చింది. ‘ఎర్త్ డే నెట్వర్క్స్ ఇండియా ప్రోగ్రాం’ ప్రధాన కేంద్రం కోల్‌కతాలో ఉంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, వుమెన్ అండ్ ది గ్రీన్ ఎకానమీ, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్... మొదలైన విభాగాలలో ఈ సంస్థ పనిచేస్తుంది. కొన్ని దేశాల్లో ‘ఎర్త్ డే’ను వారం మొత్తం జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడానికి ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రణాళిక వేసుకున్నాడు. ఈరోజు ధరిత్రీ దినోత్సవాన్ని ఈవిధంగా జరుపుకోవచ్చు. మొక్కలను నాటండి పిట్టల కోసం ఇంటిని నిర్మించండి ‘రీసైక్లింగ్ సెంటర్’కు వెళ్లండి కారు, బైక్‌లలో కాకుండా సైకిల్ మీద ప్రయాణం చేయండి.