అనంతపురం కల్చరల్: వైశాఖ మాసం రాకనే ఏప్రిల్‌లోనే వచ్చేసిన ఎండలు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. జిల్లాలో నిత్యం వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న వారు క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. మానవులు చేసే తప్పిదాల వలన భూమి గతి తప్పుతోందని, ఓజోన్ వినాశనం వల్ల ఎండలు తీవ్రతరమవుతున్నాయని, ఇప్పటికే తనను తాను శుభ్రపరచుకొనే సహజ గుణాన్ని భూమి కోల్పోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. గతంలో వజ్రకరూరు మండలంలో ‘దప్పిక చావు’ నమోదు కావడం, అలాగే కల్యాణదుర్గం బోరంపల్లిలో ఆకలి చావులు అధికంగా నమోదు కావడం సంచలనం రేకెత్తించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ భూమిని రక్షించాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలియజేయడానికి ఏప్రిల్ 22న ‘ధరిత్రి దినోత్సవం’ జరుపుకుంటున్నాము. కనీసం ఒక్కరోజైనా ధరిత్రి గురించి మనం ఆలోచించికపోతే భవిష్యత్ తరాల వారి మనుగడే ప్రమాదమన్న సంకేతాలతో ఆర్డీటీ, ఎకాలజీ సెంటర్, అనంత ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు భూ ప్రాముఖ్యాన్ని తెలిపే సదస్సులు, చర్చావేదికలు అనేక ఏళ్లుగా నిర్వహిస్తూనే ఉన్నాయి.
ఎడారి నివారణకు చర్యలు
జిల్లాలో స్వార్థపరుల కుట్రల వల్ల అటవీ సంపద క్రమంగా కనుమరుగవుతోంది. జిల్లా భూభాగంలో 1.90 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించాయి. అటవీ సంరక్షణపై ఒకప్పటి నిర్లక్ష్యం జిల్లాను ఎడారిగా మార్చేసే ప్రమాదంలో పడేసింది. దానికితోడు గొర్రెల కాపర్లు అనాగరికంగా అడవులకు నిప్పు పెడితే అనంతరం లేత గడ్డి వస్తుందన్న మూఢనమ్మకంతో చెట్లను నాశనం చేస్తున్నారు. వృక్షాలు లేకపోతే రాబోయే ప్రమాద ఘంటికలను ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సంస్థలు త్వరగా గ్రహించాయి. ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు అంతరిస్తున్న అటవీ సంపద వల్ల రానున్న ప్రమాదాన్ని గ్రహించి ధరిత్రి, అటవీ, జల సంరక్షణ కోసం పాటుపడుతున్నాయి. చాలా సంస్థలు ‘ధరిత్రి రక్షతి రక్షితః’ అంటూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పడమేగాక, ఆచరించి చూపిస్తున్నాయి. దీనికి తోడు గ్యాస్ వాడకం బాగా పెరగడంతో అడవుల్లో కట్టెల కోసం చెట్లు నరికేసే ప్రమాదం కూడా క్రమంగా తగ్గుతూ ఉండడం కొంత వరకు మేలు కల్గిస్తున్న అంశం.
తడారుతున్న గొంతులు
దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమో దయ్యే జిల్లాగా అనంతపురం జిల్లా రికార్డులకెక్కింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ఇప్పటికే నీటి సమస్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పీఏబీఆర్, సీబీఆర్, పెన్నార్ కుముద్వతిని వంటి ప్రాజెక్టుల ద్వారానే ఇక్కడ నీటి కరువు తీరాలి. దురదృష్టవశాత్తు అధికార గణానికి చిత్తశుద్ధి లేకపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. వందలాది గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్టు ఇటీవల సర్వేలు చెపుతున్నాయి. నీటి వనరులు లేక పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇక్కడి కరువు ఎంత కరాళనృత్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాధారమైన నీటిని సంరక్షించుకోవాలంటే జిల్లాకు దాదాపు 40 టీఎంసీల నీరు అవసరం.
ఎండలు పెరగడం ఇబ్బందికరం
ఈ ధరిత్రికి హాని కలగకుండా శక్తిని సృష్టించే సహజ వనరులున్నాయి. సౌరశక్తి, పవన విద్యుత్తు, బయోగ్యాస్ మొదలైనవన్నీ ప్రతి మనిషికీ అత్యవసరమైనవే. వీటన్నింటినీ సంరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఈసారి ఎండల తీవ్రత వల్ల కనీసం అవగాహనా సదస్సులు నిర్వహించలేనంత ఇబ్బందిలో ఉన్నాము. భూతాపం పెరగకుండా చర్యలు అత్యవసరం. భవిష్యత్™Œ తరాల వారు సుఖంగా జీవించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనువైన మార్గనిర్దేశనం చేయాలి. – వైవీ మల్లారెడ్డి, ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్
భావి జీవితాలకు భరోసానిద్దాం
అనంతపురం కల్చరల్: పెరుగుతున్న కాలుష్యం, భూతాపం మనిషి ప్రమాదంగా మారేలా చేస్తోందని, ధరిత్రి రక్షణ కోసం అందరం కృషి చేయాలని జేవీవీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని జేవీవీ కార్యాలయంలో ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కల్పించే కరపత్రాలను ఆవిష్కరించారు. జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలు ష్యం భూమాతకు కడుపు కోతగా మిగులుతోందని, అభివృద్ధి పేరుతో సాగుతున్న తంతు భూ ఉపరితలాన్ని దహించివేస్తోందన్నారు. తాగేనీరు, పీల్చే గాలి, నివసించే నేల ఇలా ప్రతీది కలుషితమైపోతుంటే మానవ మనుగడకే ప్రమాదంగా మారుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఒకప్పుడు ప్రకృతి అందాలతో విరాజిల్లిన అటవీ భూములు, చెరువులు స్వార్థంతో నాశనం చేస్తుంటే ప్రభుత్వం చూడనట్టుందని విమర్శించారు. ప్రజలు తమ బాధ్యతగా తీసుకుని ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నారాయణప్ప, బాబాజాన్, శ్రీనివాసులు, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment