వాషింగ్టన్: అమెరికా ఆధ్వర్యంలో వచ్చే నెలలో 40 మంది దేశాధినేతలతో జరిగే వర్చువల్ సదస్సుకు భారత ప్రధాని మోదీని అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే సందర్భంగా జరగనున్న ఈ రెండు రోజుల సదస్సులో 2030కల్లా తగ్గించాల్సిన కర్బన ఉద్గారాల లక్ష్యాలను బైడెన్ వివరిస్తారని అధ్యక్ష భవనం తెలిపింది. వచ్చే నవంబర్‌లో గ్లాస్గోలో జరగనున్న యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్(సీవోపీ26)కు ఇది కీలకంగా మారనుందని వివరించింది.
ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ సదస్సుకు మోదీతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా ఆహ్వానాలను పంపినట్లు వెల్లడించింది. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక బైడెన్ వాతావరణానికి సంబంధించిన పలు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ప్రభుత్వ భూములు, సముద్రజలాల్లో చమురు, సహజ వాయువులకు సంబంధించి కొత్త ఒప్పందాలేవీ కుదుర్చుకోరాదనేది కూడా ఉంది. పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న ప్రపంచ దేశాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించడం ఈ సదస్సు కీలక ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఆర్థిక సాయంతో ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం, వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న దేశాలకు చేయూత ఇవ్వడంపైనా ఈ సదస్సు దృష్టి సారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment