అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ రంగంలో పటిష్ట బంధాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ రంగంలో వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అందులో అందరి దృష్టిని ఎంక్యూ9 రీపర్ డ్రోన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం..
నింగి, నేల, నీరు ఎక్కడైనా, ఏ పనైనా ఈ డ్రోన్లు చేయగలవు. కదన రంగంలో అరివీర భయంకరమైనవిగా గుర్తింపు సంపాదించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు బహుళ ప్రయోజనాలకు వినియోగపడతాయి. అమెరికాకు చెందిన జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సaరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రుదేశాల రహస్యాల సేకరణ వంటి కార్యక్రమాలతో పాటు బాంబు దాడుల్ని కూడా ఈ డ్రోన్లు చేయగలవు. ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. త్రివిధ బలగాలైన భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీలకు ఒక్కో దానికి 10 డ్రోన్ల చొప్పున మొత్తం 30 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గురువారం నాడు జరిగే భేటీలో 300 కోట్ల డాలర్ల విలువైన (రూ.24,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మిలటరీ ఆపరేషన్లు, సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో ఈ డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో వినియోగించినా ప్రాణనష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్‌ను నియంత్రిస్తూ ఉంటారు
భారత్‌కు ఎలా ఉపయోగం ?
దీర్ఘకాలం పనిచేయడం, నిరంతరాయంగా నిఘా పెట్టే సామర్థ్యం, దాడులకు దిగే సత్తా వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు భారత త్రివిధ బలగాల మేధస్సు, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మనకి నిరంతరాయంగా ఘర్షణలు, చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ డ్రోన్లు మన దగ్గరుంటే సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ముప్పుల్ని ముందే పనిగట్టడం, వాటికి సంబంధించిన ఇమేజ్‌లను పంపించి అప్రమత్తం చేయడం వంటివి చేస్తాయి. ఉగ్రవాద కార్యకలాపాలను కూడా ఇవి గుర్తించి వాయువేగంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. మన దేశానికి అతి పెద్ద సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో భద్రత అత్యంత కీలకం. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు పర్యవేక్షించగలవు. స్మగ్లింగ్, పైరసీ వంటి కార్యకలాపాలను గుర్తించడమే కాకుండా, సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులైన వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి సమయాల్లో విపత్తు నిర్వహణ కూడా చేయగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లు వెళ్లి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి?
ఈ డ్రోన్లను అమెరికా చాలా విస్తృతంగా వినియోగిస్తోంది. అప్గానిస్తాన్, ఇరాక్ సహా ఇతర ఘర్షణ ప్రాంతాల్లో వీటిని మోహరించింది. అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, నాసా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్, ఇటలీ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్‌ఫోర్స్ , జపాన్ దేశాలు ఈ డ్రోన్లు వాడుతున్నాయి. 2014–2018 మధ్య కాలంలో ఇరాక్, సిరియాలో నిర్వహించిన 2,400 మిషన్లలో బ్రిటన్ ఈ డ్రోన్లనే మోహరించింది. 398 సార్లు ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ తమ దేశ రహస్యాలను ఉక్రెయిన్‌కు చేరవేస్తోందన్న అనుమానంతో నల్లసముద్రంలో గత మార్చిలో కూల్చేసింది. 2020 జనవరిలో ఇరాన్‌లో జనరల్ క్వాజిం సొలెమినీ ఈ డ్రోన్‌తో అమెరికా చేసిన బాంబు దాడిలోనే మరణించారు.
ప్రత్యేకతలు
► 50 వేల అడుగుల ఎత్తులో 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు
► అధునాతన కెమెరాలు, సెన్సార్లు, రాడార్లతో సరిహద్దుల్లో గట్టిగా నిఘా పెట్టి సున్నితమైన అంశాలను, అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపించగలదు
► 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ (కేటీఏఎస్) వేగంతో ప్రయాణిస్తుంది
► ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్‌క్రిపె్టడ్ కమ్యూనికేషన్ వంటివి చేయగలదు
► 12,177 కేజీల బరువైన పేలోడ్‌ను మోసుకుపోగలదు
► 2,721 కేజీల ఇంధనాన్ని నింపవచ్చు
► 114 హెల్‌ఫైర్ క్షిపణులు, జీబీయూ–12 పేవ్‌వే లైజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోగలదు
► ఆకాశంపై నుంచి బాంబుల్ని కూడా కురిపించగలదు
సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment