Indian Prime Minister
-
భారత ప్రధానుల నిర్ణయ విధానాలు!
ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు. పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ. ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు. వాజ్‌పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ. 1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్‌పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు. ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్‌పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్. నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్‌పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్‌పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ. తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్‌పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్‌పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్‌పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్‌జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు. 2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ. నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నింగి.. నేల.. నీరు.. ఎక్కడైనా పవర్ఫుల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ రంగంలో పటిష్ట బంధాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ రంగంలో వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అందులో అందరి దృష్టిని ఎంక్యూ9 రీపర్ డ్రోన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం.. నింగి, నేల, నీరు ఎక్కడైనా, ఏ పనైనా ఈ డ్రోన్లు చేయగలవు. కదన రంగంలో అరివీర భయంకరమైనవిగా గుర్తింపు సంపాదించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు బహుళ ప్రయోజనాలకు వినియోగపడతాయి. అమెరికాకు చెందిన జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సaరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రుదేశాల రహస్యాల సేకరణ వంటి కార్యక్రమాలతో పాటు బాంబు దాడుల్ని కూడా ఈ డ్రోన్లు చేయగలవు. ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. త్రివిధ బలగాలైన భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీలకు ఒక్కో దానికి 10 డ్రోన్ల చొప్పున మొత్తం 30 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గురువారం నాడు జరిగే భేటీలో 300 కోట్ల డాలర్ల విలువైన (రూ.24,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మిలటరీ ఆపరేషన్లు, సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో ఈ డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో వినియోగించినా ప్రాణనష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్‌ను నియంత్రిస్తూ ఉంటారు భారత్‌కు ఎలా ఉపయోగం ? దీర్ఘకాలం పనిచేయడం, నిరంతరాయంగా నిఘా పెట్టే సామర్థ్యం, దాడులకు దిగే సత్తా వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు భారత త్రివిధ బలగాల మేధస్సు, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మనకి నిరంతరాయంగా ఘర్షణలు, చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ డ్రోన్లు మన దగ్గరుంటే సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ముప్పుల్ని ముందే పనిగట్టడం, వాటికి సంబంధించిన ఇమేజ్‌లను పంపించి అప్రమత్తం చేయడం వంటివి చేస్తాయి. ఉగ్రవాద కార్యకలాపాలను కూడా ఇవి గుర్తించి వాయువేగంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. మన దేశానికి అతి పెద్ద సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో భద్రత అత్యంత కీలకం. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు పర్యవేక్షించగలవు. స్మగ్లింగ్, పైరసీ వంటి కార్యకలాపాలను గుర్తించడమే కాకుండా, సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులైన వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి సమయాల్లో విపత్తు నిర్వహణ కూడా చేయగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లు వెళ్లి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి? ఈ డ్రోన్లను అమెరికా చాలా విస్తృతంగా వినియోగిస్తోంది. అప్గానిస్తాన్, ఇరాక్ సహా ఇతర ఘర్షణ ప్రాంతాల్లో వీటిని మోహరించింది. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, నాసా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్, ఇటలీ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్‌ఫోర్స్ , జపాన్ దేశాలు ఈ డ్రోన్లు వాడుతున్నాయి. 2014–2018 మధ్య కాలంలో ఇరాక్, సిరియాలో నిర్వహించిన 2,400 మిషన్లలో బ్రిటన్ ఈ డ్రోన్లనే మోహరించింది. 398 సార్లు ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ తమ దేశ రహస్యాలను ఉక్రెయిన్‌కు చేరవేస్తోందన్న అనుమానంతో నల్లసముద్రంలో గత మార్చిలో కూల్చేసింది. 2020 జనవరిలో ఇరాన్లో జనరల్ క్వాజిం సొలెమినీ ఈ డ్రోన్‌తో అమెరికా చేసిన బాంబు దాడిలోనే మరణించారు. ప్రత్యేకతలు ► 50 వేల అడుగుల ఎత్తులో 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు ► అధునాతన కెమెరాలు, సెన్సార్లు, రాడార్లతో సరిహద్దుల్లో గట్టిగా నిఘా పెట్టి సున్నితమైన అంశాలను, అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపించగలదు ► 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ (కేటీఏఎస్) వేగంతో ప్రయాణిస్తుంది ► ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్‌క్రిపె్టడ్ కమ్యూనికేషన్ వంటివి చేయగలదు ► 12,177 కేజీల బరువైన పేలోడ్‌ను మోసుకుపోగలదు ► 2,721 కేజీల ఇంధనాన్ని నింపవచ్చు ► 114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ–12 పేవ్‌వే లైజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోగలదు ► ఆకాశంపై నుంచి బాంబుల్ని కూడా కురిపించగలదు సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్
కీవ్: సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న క్రమంలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ క్రమంలోనే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడినట్లు సోమవారం ప్రకటించారు. తన శాంతి ఫార్ములాను అమలు చేయడంలో భారత్ పాలుపంచుకుంటుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. జీ20 దేశాల సదస్సుకు భారత్ విజయవంతంగా అధ్యక్షత వహించాలని మోదీకి శుభాకాంక్షలు తెలిపినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడాను. జీ20 ప్రెసిడెన్సీని విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించాను. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా నేను శాంతి ఫార్ములాను ప్రకటించాను. దానిని అమలు చేసేందుకు భారత్ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా. ఐక్యరాజ్య సమితిలో మానవతా సాయం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాను.’ - వొలొదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ విషయంపై భారత్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు జెలెన్స్కీతో పలు సందర్భాల్లో మాట్లాడారు. ప్రస్తుతం యుద్ధాలు చేసే సమయం కాదని, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు మోదీ. I had a phone call with @PMOIndia Narendra Modi and wished a successful #G20 presidency. It was on this platform that I announced the peace formula and now I count on India's participation in its implementation. I also thanked for humanitarian aid and support in the UN. — Володимир Зеленський (@ZelenskyyUa) December 26, 2022 ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
ఆకస్మికంగా పాకిస్తాన్‌కు..
♦ దాయాది దేశంలో ప్రధాని మోదీ పర్యటన ♦ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో చర్చలు లాహోర్: అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. పొరుగుదేశం ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జన్మదిన కానుకగా.. ఆయన మనవరాలు మెహరున్నిసా పెళ్లికి అనుకోని అతిథిగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన, ప్రచారం లేకుండా.. తన శైలి నాటకీయతతో.. భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అకస్మాత్తుగా పాక్ గడ్డపై అడుగుపెట్టారు. లాహోర్ శివార్లలోని షరీఫ్ రాజ ప్రసాదంలో రెండున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి భారత్ పయనమయ్యారు. రష్యా పర్యటన అనంతరం అఫ్గానిస్తాన్ నుంచి భారత్ బయల్దేరిన మోదీ.. శుక్రవారం సాయంత్రం 4.20 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు లాహోర్‌లోని అల్అమా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆయనకు విమానాశ్రయం వద్దనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు చిరునవ్వుతో సాదరంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారిరువురు ప్రత్యేక హెలీకాప్టర్‌లో లాహోర్ శివార్లలోని షరీఫ్ నివాసం ‘జతి ఉమ్రా రాయ్వింద్’ రాజప్రసాదానికి వెళ్లారు. భారత్, పాక్ ప్రధానులు ఒకే చాపర్‌లో ప్రయాణించడం ఇదే మొదటిసారి. దాదాపు 400 ఎకరాల ఆ సువిశాల ప్రాంగణంలోనే శుక్రవారం షరీఫ్ మనవరాలి వివాహం జరుగుతోంది. వధూవరులను ఆశీర్వదించిన మోదీ.. వారికి ప్రత్యేక కానుకలను అందించారు. షరీఫ్ మాతృమూర్తికి పాదాభివందనం చేసి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. షరీఫ్ జన్మదినం కూడా శుక్రవారమే కావడం విశేషం. ఈ డిసెంబర్ 25న 66వ ఏట అడుగుపెట్టిన షరీఫ్‌కు మోదీ సాదరంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశిష్ట అతిథి మోదీ కోసం షరీఫ్ ప్రత్యేకంగా విందుభోజనం ఏర్పాటు చేశారు. అందులో మోదీకి ఇష్టమైన ‘సాజ్’, కశ్మీరీ టీతో పాటు ఇతర శాకాహార వంటకాలను ఏర్పాటు చేశారు. షరీఫ్ నివాసంలో దాదాపు రెండున్నర గంటలకు పైగా గడిపిన మోదీ.. భారత్, పాక్ సంబంధాలను మెరుగుపర్చే దిశగా షరీఫ్‌తో కొద్దిసేపు చర్చలు జరిపారు. అనంతరం లాహోర్ విమానాశ్రయానికి చేరుకుని భారత్‌కు బయల్దేరారు. విమానాశ్రయానికి వచ్చిన షరీఫ్ మోదీకి స్వయంగా వీడ్కోలు పలికారు. భారత ప్రధాని ఆకస్మిక పర్యటన సందర్భంగా లాహోర్‌లోని విమానాశ్రయం చుట్టుపక్కలా, లాహోర్‌నుంచి షరీఫ్ నివాసం వరకు రహదారిపైనా, లాహోర్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు వెళ్లినవారిలో ముఖ్యులైన 11 మంది ప్రతినిధుల బృందం రోడ్డుమార్గం ద్వారానే రాయ్వింద్ రాజప్రసాదానికి వెళ్లింది. వారికి పాక్ 72 గంటల వీసాను మంజూరు చేసింది. మిగతా వందమందికి పైగా భారతీయ ప్రతినిధులు లాహోర్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. బర్త్‌డే విషెస్.. మ్యారేజ్ ఇన్విటేషన్ మనవరాలి వివాహానికి హాజరుకావాల్సిందిగా షరీఫ్ మోదీని ఆహ్వానించడంతో ఈ అనుకోని పర్యటన చోటు చేసుకుందని అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) వర్గాలు తెలిపాయి. మోదీ లాహోర్ పర్యటన శుక్రవారమే ఖరారయిందన్న వార్తలను పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖ్వాజి ఖలీలుల్లా ధ్రువీకరించారు. ‘అవును ప్రధాని షరీఫ్‌తో భేటీ అయ్యేందుకు భారత ప్రధాని మోదీ లాహోర్‌లో ఆగనున్నట్లు మాకు ఈ రోజే భారతీయ దౌత్య కార్యాలయం నుంచి సమాచారం అందింది’ అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపేందుకు షరీఫ్‌కు మోదీ ఫోన్ చేసినప్పుడే.. లాహోర్‌లో ఆగే విషయమై నిర్ణయం జరిగిందని భారత్‌లోని వర్గాలు చెప్పాయి. తర్వాత అదే విషయాన్ని పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధురి ధ్రువపర్చారు. మోదీ అఫ్గానిస్తాన్ పర్యటన సైతం ముందుగా ప్రకటించనిదే కావడం విశేషం. 2004లో వాజ్‌పేయి.. 2015లో మోదీ! 2004లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్లో పర్యటించారు. ఆ తరువాత దాయాది దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే. మోదీ పాక్‌లో అడుగుపెట్టిన రోజే వాజ్‌పేయి 91వ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ‘ఈ రోజు భారత్ వెళ్లే మార్గమధ్యంలో లాహోర్‌లో ఆగుతున్నా. మధ్యాహ్నం లాహోర్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలుసుకోబోతున్నా. షరీఫ్జీతో ఫోన్లో మాట్లాడాను. జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను’ అంటూ మోదీ అంతకుముందు ట్వీట్స్ చేశారు. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు విఫలమైన తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. నవంబర్ చివరలో వాతావరణ సదస్సు సందర్భంగా ఇరుదేశాల ప్రధానులు మోదీ, షరీఫ్ పారిస్‌లో అనుకోకుండా సమావేశమవడంతో మళ్లీ సత్సంబంధాల దిశగా అడుగులు పడ్డాయి. ఆ తరువాత ఈ డిసెంబర్ మొదట్లో రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భేటీ అయి, అన్ని ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపడం.. అనంతరం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్‌లో జరిపిన పర్యటన ఫలితంగా సమగ్ర చర్చలకు మార్గం సుగమమైంది. ఇప్పుడు ప్రధాని మోదీ తాజా సానుకూల చర్యతో దాయాది దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు బలోపేతమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 15న విదేశాంగ కార్యదర్శుల భేటీ న్యూఢిల్లీ: భారత, పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీ జనవరి 15న జరగనుంది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ విదేశాంగ శాఖ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ ఇస్లామాబాద్ వెళ్లి, పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరితో చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి. లాహోర్‌లో లంచ్.. ఢిల్లీలో డిన్నర్! మోదీ ఆకస్మిక పాక్ పర్యటనపై సోషల్ మీడియా తనదైన స్టైల్లో స్పందించింది. పలువురు సీనియర్ జర్నలిస్టులు సహా చాలామంది మోదీ చర్యను ప్రశంసించగా.. కాంగ్రెస్ నేతలు, పలువురు ఇతరులు వ్యతిరేక కామెంట్లు చేశారు. కొందరు ఫన్ లైనర్లతో అలరించారు. ‘అయితే మోదీ బ్రేక్‌ఫాస్ట్ కాబూల్‌లో, లంచ్ లాహోర్‌లో, డిన్నర్ ఢిల్లీలో చేస్తారన్న మాట’ అంటూ అశోక్ మాలిక్ ట్వీట్ చేశారు.‘భారత్, పాక్ సంబంధాలు ఇలానే, సహజంగా ఉండాల’ంటూ మెహర్ తరార్ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో తనదైన స్టైల్లో డైనమిజాన్ని తీసుకువచ్చారంటూ అజయ్ మిశ్రా ప్రశంసించారు. ‘వాజ్‌పేయి పాక్ పాలసీనే నేటికీ అనుసరణీయం. దాన్ని కొనసాగిస్తున్నందుకు అభినందనలు’ అంటూ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా ట్వీట్ చేశారు. షరీఫ్ ఆతిథ్యం అద్భుతం: మోదీ పాక్ ప్రధాని షరీఫ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలకడంతో పాటు, తిరిగి వెళ్తున్నప్పుడు కూడా స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు పలికిన తీరు తనను కదిలించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయితో తన అనుబంధాన్ని షరీఫ్ గుర్తు చేసుకున్నారని, బర్త్‌డే సందర్భంగా అటల్జీకి విషెస్ చెప్పాలని తనను కోరారని తెలిపారు. షరీఫ్ కుటుంబంతో ఆహ్లాదకర సమయం గడిపానన్నారు. కాగా, పాక్‌లో మోదీ, షరీఫ్‌ల భేటీని అమెరికా స్వాగతించింది. భారత్, పాక్‌ల మధ్య సత్సం బంధాలు ఆ ప్రాంతం మొత్తానికి ప్రయోజనకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. భారత ప్రధానుల పాకిస్తాన్ పర్యటనలు జవహర్లాల్ నెహ్రూ (1953 జులై 25-27) కశ్మీర్‌సహా అనేక వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం వెళ్లారు. (1960 సెప్టెంబర్ 19-23) భారత్-పాక్ నదీజలాల ఒప్పందంపై సంతకం. రాజీవ్‌గాంధీ (1988 డిసెంబర్ 29-31) నాలుగో సార్క్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. బెనజీర్ భుట్టోతో మూడు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు. అణుకేంద్రాలపై దాడుల నిషేధం, సాంస్కృతిక సహకారం, పౌర విమానయాన రంగాల్లో ఒప్పందాలు. (1989 జులై 16-17) ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పర్యటన. అటల్ బిహారీ వాజపేయి (1999 ఫిబ్రవరి 19-20) లాహోర్-ఢిల్లీ బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో భాగంగా లాహోర్‌కు వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్లిన వాజపేయికి ప్రధాని నవాజ్ షరీఫ్ సాదర స్వాగతం. (2004 జనవరి 4-6) 12వ సార్క్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. నరేంద్ర మోదీ (2015 డిసెంబర్ 25) అఫ్గానిస్తాన్ నుంచి తిరిగి వస్తూ ఆకస్మికంగా పాకిస్తాన్లో పర్యటించారు. అదీ రాజనీతిజ్ఞత.. ‘అదీ రాజనీతిజ్ఞత అంటే’ అంటూ మోదీ ఆకస్మిక పాక్ పర్యటనను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కొనియాడారు. ‘పొరుగు దేశాలతో ఇలాంటి సంబంధాలే ఉండాలి’ అని ట్వీట్ చేశారు. ‘మోదీజీ.. పాక్‌కు స్వాగతం. నిరంతర సంబంధాలతోనే అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోగలం’ అని పాక్ విపక్ష పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో అన్నారు. ‘ఈ పర్యటన, చర్చలు సానుకూల స్ఫూర్తి కోసం’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మోదీ పర్యటన సౌహార్ద చర్య అని పాక్ అంది. ‘సమగ్ర చర్చలను ముందుకు తీసుకువెళ్లడంపై ఇరువురు నేతలు చర్చించారు. వచ్చే నెల విదేశాంగ కార్యదర్శులు ఇస్లామాబాద్‌లో భేటీ కావాలనే దానిపై అంగీకారం కుదిరింది’ అని పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధురి చెప్పారు. ‘ఆందోళనలను అర్థం చేసుకుంటూనే, రెండు దేశాల ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా.. శాంతి స్థాపన, సానుకూల వాతావరణాన్ని మెరుగుపర్చుకోవడంపై ఇద్దరు ప్రధానులు దృష్టి పెట్టార’ని చౌధురి వెల్లడించారు. -
పాక్ ప్రధాని తల్లికి మోదీ పాదాభివందనం
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. మోదీ కోసం ప్రత్యేక వంటకాలు చేయించారు. శుక్రవారం సాయంత్రం లాహోర్ నగర శివారు రాయ్విండ్లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లిన మోదీకి.. పాక్ ప్రధాని కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. షరీఫ్ తన కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని తల్లి అక్కడికి రాగా.. మోదీ ఆమెకు పాదాభివందనం చేశారు. నవాజ్ తన నివాసంలో మోదీకి ఏర్పాటు చేసిన విందులో ఆయనకు ఇష్టమైన సాగ్, దాల్, శాకాహార వంటకాలను వండించారు. మోదీకి ప్రత్యేకంగా కశ్మీరీ టీ అందజేశారు. ఈ రోజు షరీఫ్ పుట్టినరోజుతో పాటు ఆయన మనవరాలి పెళ్లి. పాక్ ప్రధాని మనవరాలి వివాహంలో అనుకోని అతిథిలా నరేంద్ర మోదీ తళుక్కున మెరిశారు. ఊహించనివిధంగా మోదీ పాక్ పర్యటనకు వెళ్లడం ఇరు దేశాల్లోనూ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం లాహోర్ వెళ్లిన మోదీకి విమానాశ్రయంలో షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరూ ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన మనవరాలిని ఆశీర్వదించారు. అనంతరం లాహోర్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. 'పాక్ ప్రధాని ఎంతో ఆత్మీయత చూపారు. ఈ రోజు సాయంత్రం నవాజ్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపాను. షరీఫ్ జన్మదినం, ఆయన మనవారి వివాహం రెండు వేడుకల్లో పాల్గొన్నా' అని మోదీ ట్వీట్ చేశారు. -
ఢిల్లీ తిరిగొచ్చిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రష్యా, అప్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశం తిరిగొచ్చారు. శుక్రవారం రాత్రి లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మోదీ ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అక్కడ మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మోదీ అక్కడి నుంచి నేరుగా మాజీ ప్రధాని వాజ్‌పేయి నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ నెల 23న మోదీ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో ప్రధాని సమావేశమై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి అఫ్ఘానిస్తాన్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఈ రోజు సాయంత్రం కాబూల్ నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్లారు. లాహోర్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరూ ప్రత్యేక విమానంలో షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షాలు తెలిపిన మోదీ.. ఆయన మనవరాలి పెళ్లికి హాజరయ్యారు. అనంతరం లాహోర్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ లో పాక్ టూర్ లేకపోయినా షరీఫ్ ఆహ్వానం మేరకు ఈ రోజు మోదీ ఆకస్మికంగా ఆ దేశంలో పర్యటించారు. -
పాక్ ప్రధాని మనవరాలి పెళ్లికి మోదీ
లాహోర్: ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం మోదీ, షరీఫ్ కలిసి ఓ ప్రత్యేక హెలికాప్టర్లో లాహోర్ నగర శివారు రాయ్విండ్లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లారు. పాక్ ప్రధాని తన కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. రాయ్విండ్లోని షరీఫ్ నివాసంలో శుక్రవారమే ఆయన మనవరాలి పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి హాజరైన తర్వాత.. షరీఫ్ నివాసంలో ఇరు దేశాల ప్రధానులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అఫ్ఘానిస్తాన్ నుంచి నేరుగా లాహోర్ వచ్చిన మోదీకి.. దాయాది దేశంలో ఘనస్వాగతం లభించింది. లాహోర్ విమానాశ్రయంలో మోదీకి నవాజ్ షరీఫ్ సాదరంగా స్వాగతం పలికారు. షరీఫ్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడినుంచి ఇరు దేశాల ప్రధాన మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ ఇంటికి వెళ్లారు. -
పాక్ ప్రధానితో మోదీ భేటీ
లాహోర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం లాహోర్‌లోని షరీఫ్ నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై మోదీ, షరీఫ్ చర్చిస్తున్నారు. ఆప్ఘనిస్తాన్ నుంచి సాయంత్రం 4:45 గంటలకు మోదీ లాహోర్ విమానాశ్రయంలో దిగారు. లాహోర్ విమానాశ్రయంలో నవాజ్ షరీఫ్ సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ, షరీఫ్ కలిసి ఓ ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ వ్యక్తిగత నివాసానికి వెళ్లారు. 1700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంట్లోనే నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లి కూడా శుక్రవారమే జరుగుతోంది. కాగా.. అక్కడ షరీఫ్‌తో సమావేశం పూర్తయిన తర్వాత మోదీ భారత్‌కు బయల్దేరుతారు. -
చివరి వరకు రహస్యం..
లాహోర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాహోర్ పర్యటన వివరాలను చివరి వరకు రహస్యంగా ఉంచారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మోదీ లాహోర్ వస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆప్ఘనిస్తాన్ నుంచి సాయంత్రం 4:45 గంటలకు మోదీ లాహోర్ విమానాశ్రయంలో దిగారు. లాహోర్ విమానాశ్రయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ నివాసానికి వెళ్లారు. భద్రత కారణాల రీత్యా మోదీ పర్యటన వివరాలను రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. మోదీ రాక సందర్భంగా లాహోర్‌లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. మోదీ పాక్‌లో రెండు గంటల పాటు గడపనున్నారు. మూడు నెలల్లో మోదీ, షరీఫ్ భేటీకావడమిది మూడోసారి. షరీఫ్‌తో సమావేశానంతరం మోదీ భారత్‌కు బయల్దేరుతారు. -
11 ఏళ్ల తర్వాత.. అక్కడకు వెళ్లారు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాక్ గడ్డ మీద అడుగుపెట్టారు. అఫ్ఘానిస్థాన్ నుంచి నేరుగా ఆయన ప్రత్యేక విమానంలో లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అఫ్ఘాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీని పాకిస్థాన్ రావాలని నవాజ్ షరీఫ్ కోరగా, ఆయన వెంటనే అందుకు అంగీకరించారు. 11 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధానమంత్రి పాకిస్థాన్ గడ్డ మీద అడుగుపెట్టారు. గతంలో వాజ్‌పేయి పాకిస్థాన్‌లో పర్యటించగా, ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ మరే భారత ప్రధానమంత్రీ ఆ దేశానికి వెళ్లలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నరేంద్ర మోదీ పాక్ వెళ్లారు. మోదీని ఆహ్వానించేందుకు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ స్వయంగా లాహోర్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ మోదీని ఆయన సాదరంగా స్వాగతించారు. అనంతరం ఇద్దరు ప్రధానమంత్రులు భేటీ అయ్యారు. అఫ్ఘాన్ పర్యటనలో ఉన్న మోదీ.. ఉదయమే షరీఫ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయగా, అప్పుడే ఆయన పాక్ రావాలని కోరారు. అనూహ్యంగా అందిన ఈ ఆహ్వానాన్ని మోదీ కూడా తక్షణం ఆమోదించారు. రెండు గంటల పాటు మోదీ లాహోర్ లో గడపనున్నారు. మోదీ రాక సందర్భంగా లాహోర్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయన భారతదేశానికి తిరిగి బయల్దేరతారు. జాతీయ భద్రతా సలహాదారు దౌత్యం ఈ పర్యటన వెనుక ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వ్యక్తిగతంగా ఇద్దరు ప్రధానమంత్రుల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో పాటు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా సడలుతాయని చెబుతున్నారు. -
శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోదీ
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీనగర్ చేరుకున్నారు. అంతకుమందు సియాచిన్ గ్లేసియర్‌లోని భారత సైనికులతో దాదాపు రెండు గంటలపాటు గడిపారు. ఈ సందర్భంగా మోదీ సియాచిన్లోని భారత సైనికులతో మాట్లాడుతూ... భారతీయులంతా మీ వెంట ఉన్నారని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారంటూ సైనికుల సేవలను ఈ సందర్బంగా మోదీ కొనియాడారు. దేశ సేవ చేస్తున్న మీరు ఎంతో సాహసవంతులు అంటూ మోడీ సైనికులను ప్రశంసల జల్లులతో ముంచెత్తారు. సియాచిన్ నుంచే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సియాచిన్ ప్రాంతంలో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. కాశ్మీర్ వరద బాధితులకు మోదీ గురువారం ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు సాయంత్రం కాశ్మీర్ వరద బాధితులతో కలసి మోదీ దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. -
అక్కడ ఆయన... ఇక్కడ ఈయన
ఒకనాటి చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి 100 రోజులు పూర్తి అయిందో లేదో మరో చాయ్‌వాలా ఓ రాష్ట్రానికి సీఎం అయిపోయారు. ఒకరు తన ప్రసంగాలతో దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టి... పీఎం పీఠం అధిష్టిస్తే... మరోకరు 'అమ్మ' యందు భక్తి ప్రపత్తులతో మెలిగి ఆమె అచంచల విశ్వాసాన్ని పొందారు. అందుకు ప్రతిగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేశారు. ఆయన ఎవరో ఈ పాటికి అర్థమైయే ఉంటుంది. ఆయనే తమిళనాడు సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఓ. పన్నీరు సెల్వం. ఈ కొత్త ముఖ్యమంత్రిగారి స్వస్థలం పెరియకుళం. ఆయన స్థానికంగా హోటల్లో టీ విక్రయించే వారు. అంతేకాదు ఆయనే టీ కప్పులు కూడా కడుక్కునే వారు. అనుకోకుండా ఆయన ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1996లో పెరియకుళం మున్సిపాలిటి ఛైర్మన్‌గా అయ్యారు. ఆ తర్వాత అంటే 2001లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో... పెరియకుళం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. అప్పుటికే అమ్మ జయలలిత మనస్సు గెలుచుకున్నారు. దీంతో ఆమె కేబినెట్లో పీడబ్ల్యూడీ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అమ్మ రాజీనామా చేయక తప్పలేదు. దీంతో ముఖ్యమంత్రి ఎంతమంది సీనియర్లు ఉన్నా అమ్మ మాత్రం పన్నీరుకే సీఎం పీఠం అప్పగించింది. దీంతో 2001 నుంచి 2002 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన అమ్మకు తనకు అప్పగించిన కుర్చిని గుడ్బాయిలా మళ్లీ అలాగే అప్పగించేశారు. ఆ వినయం, ఆ విధేయత అమ్మ మనస్సును కట్టిపడేశాయి. అంతే సెప్టెంబర్ 28న జయలలితకు అక్రమ ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడగానే... ఈసారి అయిన తమకు సీఎం పదవి వస్తుందని ఆ పార్టీలోని సీనియర్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ సృష్టిలో విశ్వాసానికే మించినది లేదంటూ మళ్లీ పన్నీరుకే సీఎం పీఠాన్ని అమ్మ అప్పగించి....నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పకనే చెప్పింది. 1991 -1996 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత అక్రమంగా ఆస్తులు సంపాదించారని అప్పటి జనతాదళ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ కేసు 18 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఆ క్రమంలో బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. ఆ కేసులో జయలలిత ఆస్తులు కూడబెట్టినట్లు నేరం రుజువైంది. దీంతో సెప్టెంబర్ 28న అమ్మకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో సీఎంగా ఉన్న జయలలిత పదవిని కోల్పోయింది. ఆమె కేబినెట్లో ఉన్న పన్నీరు సెల్వం రెవెన్యూ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి చాయ్‌వాలా అయిన మోడీ కేంద్రంలో పాగా వేస్తే, పన్నీరు సెల్వం తమిళనాడులో గద్దె నెక్కారు. -
అమెరికా ఏమంటోంది?
ఒకప్పుడు తమ దేశంలోకి ప్రవేశం కూడా కుదరదన్న అమెరికా.. ఇప్పుడు భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీ విషయంలో ఎలా స్పందిస్తోంది? తన సొంత పార్టీకే తిరుగులేని మెజారిటీ సాధించినా కూడా, కూటమి ధర్మాన్ని అనుసరించి మిత్ర పక్షాల సభ్యులకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారాన్ని అమెరికా పత్రికలు ఘనంగానే కవర్ చేశాయి. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులకు కేటాయించిన శాఖలపై కూడా తమ తమ విశ్లేషణలు అందించాయి. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఎంపికను శ్లాఘించాయి. అయితే, కొన్ని పత్రికలు మాత్రం తమకు స్వతస్సిద్ధంగా ఉన్న ద్వేషాన్ని శీర్షికలలో కూడా ప్రతిబింబించాయి. 'భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హిందూ జాతీయవాది నరేంద్రమోడీ' అంటూ వాషింగ్టన్ పోస్ట్ తన బుద్ధిని మరోసారి ప్రకటించుకుంది. 'మోడీకి సమర్థ సేనాని భారత కొత్త ఆర్థిక మంత్రి' అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక మంత్రుల ఎంపికపై కూడా విశ్లేషణ ఇచ్చింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా.. నేరుగా 'భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం' అనేసింది. అన్నిపత్రికల కంటే లాస్ ఏంజెలిస్ టైమ్స్ మాత్రం, మోడీపై తన అభిమానాన్ని చాటుకుంది. భవిష్యత్తులో భారత అధినేతతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఒబామాకు ఉంటుందని గతంలోనే రాసిన ఈ పత్రిక.. 'మార్పునకు ముందడుగు.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం' అని శీర్షిక పెట్టి, భారీ ఫొటోను కూడా ఉపయోగించింది. -
దుర్భేద్యంగా రైసినా హిల్స్
మోడీ ప్రమాణానికి అసాధారణ భద్రత రిపబ్లిక్ డే పరేడ్ స్థారుులో ఏర్పాట్లు యూంటీ ఎరుుర్క్రాఫ్ట్ గన్లు, షార్ప్ షూటర్ల మోహరింపు న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థారుులో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. మోడీ సోమవారం రాష్ట్రపతి భవన్ ఆవరణలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన ఉన్నతస్థారుు నేతలతో పాటు ఎంపిక చేసిన మరో 3 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 26న న్యూఢిల్లీని హైఅలర్ట్ ప్రాంతంగా ప్రకటిస్తారు. రైసినా హిల్స్(రాష్ట్రపతి భవన ప్రాంగణ ప్రాంతం) చుట్టూ బహుళ అంచెల భద్రతా వలయూన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల కార్యాలయూలన్నిటినీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచే మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. 5,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇటు భూమి అటు ఆకాశం వైపునుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసే ద్రోన్ విమానాలను దృష్టిలో ఉంచుకుని వైమానిక భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసు కమాండోలతో పాటు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్లు, జాతీయ భద్రతా దళానికి చెందిన షార్ప్ షూటర్లను కూడా మోహరిస్తున్నారు. చుట్టుపక్కల ఎత్తై భవనాలపై కమాండోలను మోహరించనున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లు పరిసరాలన్నిటినీ తమ అధీనంలోకి తీసుకుంటారుు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేరుు మాదిరిగా ఎక్కువమంది వీక్షించేలా రాష్ట్రపతి భవన్ ముందు ప్రమాణం చేయూలని మోడీ నిర్ణరుుంచడం తెలిసిందే. మోడీ భద్రతకు ఉమ్మడి నిఘా హైదరాబాద్: ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మోడీకి భద్రతను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలైన ఇంటలిజెన్స్ బ్యూరో , రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ దేశ చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి నిఘా బృందాలను ఏర్పాటు చేశాయి. అల్పాహారంలో ఢోక్లా: ప్రమాణం తరువాత అతిథులకు అందించే అల్పాహారాన్ని రాష్ట్రపతి భవన్ వంట సిబ్బందితో పాటు ఐటీడీసీ, హైదరాబాద్ హౌస్ సిబ్బంది కలిసి తయారుచేస్తారు. మోడీ గుజరాతీ నేపథ్యం దృష్ట్యా ఢోక్లాను చేర్చారు. విదేశీ అతిథుల కోసం కబాబ్‌లను వడ్డిస్తారు. భార్యగా నన్ను గుర్తించారు: జశోదాబెన్ అహ్మదాబాద్: ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన భార్య జశోదాబెన్ ఆనందంలో మునిగితేలుతున్నారు. దేశ పగ్గాలు చేపట్టే స్థాయికి తన భర్త ఎదిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఓ చానల్‌కు చెప్పారు. అలాగే భార్యగా తనను తొలిసారి అంగీకరించినందుకు ఆయనకు రుణపడి ఉంటానన్నారు. ‘దేశ సేవ కోసం ఆయన కుటుంబాన్ని వీడాల్సి రావడం వల్ల విడిగా ఉంటున్నాం తప్పితే మేం విడాకులు తీసుకునే తరహాలో వేరుపడలేదు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందితే తప్పకుండా వెళ్తా’’ అని అన్నారు. -
26న భువనగిరిలో ప్రధాని ప్రచారం
తెలంగాణపై సోనియా ప్రకటన చేసిన చోటే సభ సభను విజయవంతం చేయాలి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు భువనగిరి, న్యూస్‌లైన్, భువనగిరిలో ఈ నెల 26న జరిగే భారత ప్రధాని మన్మోహన్సింగ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం సాయంత్రం భువనగిరి మండలం మోత్కూరు రోడ్డులోని కూనూరు సమీపంలో ప్రధాని సభ జరిగే ప్రాంగణాన్ని ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009లో ఇక్కడే జరిగిన బహిరంగసభలో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానని ఇక్కడే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ఆకాంక్షను మన్నించి పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేసిన మహోన్నత వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అలాంటి నాయకుడు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వస్తున్న సభకు 3లక్షల మంది జనం హాజరౌతారన్నారు. 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన గొప్ప ప్రధాని మన్మోహన్ అని చెప్పారు. మన్మోహన్ సింగ్ ఇక్కడికి రావడం మన అదృష్టమన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి తరలి రావాలని ప్రజలను కోరారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానికి సభావేదికను ఉద్ధేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సభా ఏర్పాట్లను ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పరిశీలిస్తారని చెప్పారు. గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రధాని సభకు అన్ని రకాల చర్యలను తీసుకుంటానని చెప్పారు. వీరీ వెంట జిలాపరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డినారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, కేశవపట్నం రమేష్, సందెల సుధాకర్, ఉపేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఈర పాక నర్సింహలున్నారు. ప్రధాని సభా స్థలిని పరిశీలించిన ఎస్పీజీ డీఐజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పాల్గొనే బహిరంగ సభాస్థలిని బుధవారం సాయంత్రం ఎస్పీజీ డీఐజీ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావు ఉన్నారు.