ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది.
ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు.
పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది.
ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం.
ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది.
నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ.
ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు.
వాజ్‌పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ.
1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్‌పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్‌నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు.
ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్‌పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్.
నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్‌పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్‌పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ.
తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్‌పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్‌పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్‌పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్‌జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు.
2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ.
నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు.
‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment