బేనజీర్ భుట్టో, రాజీవ్ గాంధీ
ఒక దౌత్యవేత్త జీవితంలోని ఘటనలు పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. ముఖ్యంగా ఆయన లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో చురుగ్గా ఉన్నవాడూ; మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డవాడూ అయినప్పుడు! అందుకే ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్’ పుస్తకం ఉర్రూతలూగిస్తుందనుకుంటాం. కానీ విషయ తీవ్రత ఎలాంటిదైనా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా మాట్లాడే శైలి ఆఫ్తాబ్ సేఠ్‌ది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దశాబ్దాల పాటు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం ఆయన శైలిలో స్పష్టంగా కనబడుతుంది. దౌత్యవేత్తగా ఆయన మనసు ఎప్పుడూ నాటకీయతను శూన్యం చేయడంపైనే ఉంటుందని ఈ పుస్తకం చెబుతుంది.
ఒక భారతీయ దౌత్యవేత్త జీవితం ఎలా ఉంటుందోనని మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే, ఒక్కసారి ఆఫ్తాబ్ సేఠ్ జ్ఞాపకాల్లోకి తొంగిచూడండి. లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో ఆయన చురుగ్గా ఉన్నారు, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డారు. అంతేనా? జపాన్ రాజ కుటుంబంతో విందులారగించడం మొదలుకొని, మంచానపడ్డ గ్రీకు ప్రధాన మంత్రులను ఆసుపత్రుల్లో పలకరించడం, మయన్మార్ విప్లవ నేత ఆంగ్‌సాన్ సూకీ దివంగత భర్త మైకేల్ ఆరిస్‌తో కలిసి కుట్రలు పన్నడం వరకూ దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ చేసిన పనులు ఎన్నో!
ఈ ఘటనలన్నీ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. బహుశా ఇవి ఆయన ‘అడ్రినలిన్’ను ఎప్పుడూ పైపైకి ఎగబాకించి ఉంటాయి కూడా. కానీ సుశిక్షితుడైన దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ రాసిన ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్ ’ పుస్తకం ఇలాంటి గాథలను పల్లెసీమల రోడ్ల మీద తిరిగే కారు వేగంలా నెమ్మదిగా వివరిస్తుంది. విషయం చాలా గొప్పది కావచ్చు కానీ చెప్పే శైలి మాత్రం ఆచితూచి, ప్రశాంతంగా ఉంటుంది. విషయ తీవ్రత ఎంత ఉన్నా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా నోట్లోని చుట్టతో పొగలు ఊదుకుంటూ, దేనికీ చలించని వ్యక్తిగా ఆఫ్తాబ్‌ను మనం ఊహించుకోవచ్చు.
పుస్తకంలోని చాలా వాక్యాలు ‘ఒకసారి గుర్తు చేసుకుంటే’, ‘గుర్తుంచుకోవాల్సిన అంశం’, ‘ఇంతకుముందే చెప్పినట్లు’, ‘దీని గురించి క్లుప్తంగా చెప్పుకుని’ వంటి పదబంధాలతో మొదలవుతాయి. ‘దీని వివరాలు మనల్ని నిలిపి ఉంచకూడదు’ అన్నదీ తరచుగా కని పిస్తుంది. కొన్నిసార్లు అధ్యాయాల మధ్యలో ‘ఇప్పుడు మనం అసలు కథలోకి వెళితే’ అని ఉంటుంది. దశాబ్దాలపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం స్పష్టంగా కనబడుతుంది.
కానీ తలుచుకుంటే ఆఫ్తాబ్ సేఠ్ భాష గాల్లోకి లేస్తుంది, ఆయన విశేషణాలు ఆకాశాన్ని అంటుతాయి. ‘‘భయంకరమైన తరచుదనంతో కాండ్రించి ఉమ్మడం ఆయనకున్న ఒకానొక ఇబ్బందికరమైన అల వాటు. అదృష్టం ఏమిటంటే, ఆ ఉమ్మడమేదో తన కుర్చీ దగ్గరగానే పెట్టుకున్న ఉమ్మితొట్టెలోకి పడేలా చాకచక్యంగా ఊసేవాడు.’’ సేఠ్ భాషకు మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. జాగ్రత్తగా తూచినట్టుండే ఆయన శైలి అప్పటికి ఆదరణీయం కాకపోయినా, ఆయన చేసిన పనులు, కలిసిన మనుషుల గురించి తెలిస్తే మాత్రం సంబరపడేన్ని కథలు ఉన్నాయనిపిస్తుంది.
చిన్న ఉదాహరణ చూద్దాం. లెబనాన్ అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న కాలంలో ఆఫ్తాబ్ బీరూట్‌లో ఉన్నారు. ఒక పక్క బాంబుల వర్షం, ఇంకోపక్క కుప్ప కూలుతున్న భవనాలు... వీటన్నింటి మధ్యలో సేఠ్ తన ఫ్లాట్ ముంగిట్లో నిద్ర పోయారట. పడే బాంబు ఏదో నేరుగా భవనం మీద పడవచ్చునన్న అంచనాతో! వాళ్ల డ్రైవర్ అలీ ‘‘కదులు తున్న దేనిమీదికైనా విచ్చలవిడిగా దూసుకొస్తున్న తుపాకీ గుళ్ల నుంచి తప్పించేందుకు కారును వాయువేగంతో ముందుకు ఉరికించాడు.’’
ఆఫ్తాబ్ భార్య పోలా అప్పుడు రెండోసారి గర్భవతిగా ఉన్నారు. పురిటినొప్పులు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఆంబులెన్ ్స కూడా అందుబాటులో లేదు. తానే సొంతంగా కాన్పు చేసేందుకు కూడా సేఠ్ సిద్ధమయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు.
ఈ పుస్తకం మొత్తం ఉత్కంఠభరితంగా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చెప్పే విషయంలో ఆఫ్తాబ్ చాలా డిప్లొమాటిక్‌గా వ్యవహరించారని చెప్పాలి. బేనజీర్ భుట్టో విషయాలు చెప్పేటప్పుడు ఆయనెంత జాగ్రత్తగా వ్యవహరించారన్నది స్పష్టంగా తెలుస్తుంది. బేనజీర్ ఓ అద్భుతమైన వ్యక్తి. ఆమె గురించి ఆఫ్తాబ్‌కూ బాగా తెలుసు. కరాచీ, లార్కానాల్లోని భుట్టో ఇళ్లకు ఆయన వెళ్లేవారు. అలాగే మలేసియా, న్యూఢిల్లీల్లోని హోటళ్లలోనూ సమావేశాలు, చర్చలు నడిచేవి. రాజీవ్ గాంధీ నుంచి వచ్చే రహస్య సందేశాలు ఇలాంటి సమావేశాల్లోనే చేతులు మారేవి. కానీ ఈ సందేశాల గురించి ఆయన మనోహరమైన మౌనం పాటిస్తారు.
ఈ అధ్యాయం ఎంత అద్భుతంగా మారి ఉండేది! కానీ ఏం చేస్తాం? తన వజ్రాలను సానపెట్టడం కాకుండా, వాటిని ఇలాంటి వాక్యాలతో రాళ్లలా మార్చేశారు. ‘‘మాజీ ప్రధాని వ్యక్తిత్వం గురించి తమకు తెలిసిన అరుదైన విషయాలను రోషన్(ఆఫ్తాబ్ సోదరుడు)తో భుట్టోలు పంచుకున్నారు’’ అని రాస్తారు. కానీ ఆ విషయాలు ఏమిటో వెల్లడించరు.
బేనజీర్‌తో జరిగిన ఒక సమావేశం గురించి ఆయన రాశారు. ఇందులో బేనజీర్ మిలిటరీ కార్యదర్శి ఆ సమావేశాన్ని అడ్డుకునేందుకు ‘‘తప్పుడు ఆఫ్తాబ్’’ గురించి చెబుతారు. ప్రతిగా బేనజీర్ ‘‘రహస్యంగా వినే మైక్రోఫోన్లను గందరగోళ పరిచేందుకు రేడియో సౌండ్ పెంచారు’’ అని రాశారు. దౌత్యవేత్తగా ఆయన మనసు నాటకీయతను సున్నా చేయడంపైనే ఉంటుంది. ‘‘నింపాదిగా భోంచేస్తూ పాకిస్తాన్ స్థానిక రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించాము’’ అని రాయడం ఇలాంటిదే.
అదృష్టం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఆఫ్తాబ్ విచక్షణకు కాకుండా, ధైర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి సందర్భాల్లోనే నియంత్రణలో నడిపే ఆయన వాక్యాలు సంకెళ్ల నుంచి తప్పించుకుంటాయి. కౌలాలంపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో బేనజీర్‌తో ఇద్దరిద్దరుగా భోంచేసిన కథ ఈ కోవకు చెందుతుంది. వారిద్దరూ ఒక టేబుల్ మీద ఉండగా, వారి సంభాషణను చెవులు రిక్కించినా వినలేనంతగా పదిహేను అడుగుల దూరంలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుడ్లగూబలా చూస్తూ ఉండటం!
ప్రధానిగా పాక్ అధ్యక్షుడితో తాను ఎదుర్కొంటున్న సమస్య లేమిటో ఆమె వివరంగా ఆఫ్తాబ్‌కు తెలిపిన సందర్భమిది. దాంతో పాటే ‘‘ఆయన రహస్య కార్యకలాపాల జాబితా’’ గురించి కూడా చర్చకు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆ క్షణంలోనే విదేశాంగ మంత్రి యాకూబ్ ఖాన్ను విస్మరించి చాలా సమయమైందని బేనజీర్ అనుకున్నారో ఏమో, తమతో కలవమన్నట్టుగా ఆయన వైపు చూస్తూ సంజ్ఞ చేశారనీ, అలాగే మాట్లాడుతున్న అంశాన్ని కూడా ‘‘ఏదేదో ఊహించుకునే యాకూబ్ మనసుకు సాంత్వన ఇచ్చేలా’’ పాకిస్తాన్‌లో ఎవరికైనా చిర్రెత్తించే ‘జిన్నా హౌస్’ వైపు మళ్లించారనీ ఆఫ్తాబ్ రాశారు. ఇలాంటి పూవులే ఆఫ్తాబ్ సేఠ్ ఉద్యానవనంలో మనల్ని ఉల్లాసపరుస్తాయి.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment