11 ఏళ్ల తర్వాత.. అక్కడకు వెళ్లారు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాక్ గడ్డ మీద అడుగుపెట్టారు. అఫ్ఘానిస్థాన్ నుంచి నేరుగా ఆయన ప్రత్యేక విమానంలో లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అఫ్ఘాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీని పాకిస్థాన్ రావాలని నవాజ్ షరీఫ్ కోరగా, ఆయన వెంటనే అందుకు అంగీకరించారు. 11 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధానమంత్రి పాకిస్థాన్ గడ్డ మీద అడుగుపెట్టారు. గతంలో వాజ్‌పేయి పాకిస్థాన్‌లో పర్యటించగా, ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ మరే భారత ప్రధానమంత్రీ ఆ దేశానికి వెళ్లలేదు.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నరేంద్ర మోదీ పాక్ వెళ్లారు. మోదీని ఆహ్వానించేందుకు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ స్వయంగా లాహోర్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ మోదీని ఆయన సాదరంగా స్వాగతించారు. అనంతరం ఇద్దరు ప్రధానమంత్రులు భేటీ అయ్యారు. అఫ్ఘాన్ పర్యటనలో ఉన్న మోదీ.. ఉదయమే షరీఫ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయగా, అప్పుడే ఆయన పాక్ రావాలని కోరారు. అనూహ్యంగా అందిన ఈ ఆహ్వానాన్ని మోదీ కూడా తక్షణం ఆమోదించారు. రెండు గంటల పాటు మోదీ లాహోర్ లో గడపనున్నారు. మోదీ రాక సందర్భంగా లాహోర్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
సాయంత్రం ఆయన భారతదేశానికి తిరిగి బయల్దేరతారు. జాతీయ భద్రతా సలహాదారు దౌత్యం ఈ పర్యటన వెనుక ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వ్యక్తిగతంగా ఇద్దరు ప్రధానమంత్రుల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో పాటు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా సడలుతాయని చెబుతున్నారు.