ఆకస్మికంగా పాకిస్తాన్‌కు.. | PM modi pak visit | Sakshi
Sakshi News home page

ఆకస్మికంగా పాకిస్తాన్‌కు..

Published Sat, Dec 26 2015 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 9:39 PM

ఆకస్మికంగా పాకిస్తాన్‌కు.. - Sakshi

ఆకస్మికంగా పాకిస్తాన్‌కు..

♦ దాయాది దేశంలో ప్రధాని మోదీ పర్యటన
♦ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో చర్చలు
 
 లాహోర్: అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. పొరుగుదేశం ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జన్మదిన కానుకగా.. ఆయన మనవరాలు మెహరున్నిసా పెళ్లికి అనుకోని అతిథిగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన, ప్రచారం లేకుండా.. తన శైలి నాటకీయతతో.. భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అకస్మాత్తుగా పాక్ గడ్డపై అడుగుపెట్టారు. లాహోర్ శివార్లలోని షరీఫ్ రాజ ప్రసాదంలో రెండున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి భారత్ పయనమయ్యారు. రష్యా పర్యటన అనంతరం అఫ్గానిస్తాన్ నుంచి భారత్ బయల్దేరిన మోదీ.. శుక్రవారం సాయంత్రం 4.20 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు లాహోర్‌లోని అల్‌అమా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆయనకు విమానాశ్రయం వద్దనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆత్మీయ స్వాగతం పలికారు.

ఇరువురు నేతలు చిరునవ్వుతో సాదరంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారిరువురు ప్రత్యేక హెలీకాప్టర్‌లో లాహోర్ శివార్లలోని షరీఫ్ నివాసం ‘జతి ఉమ్రా రాయ్‌వింద్’ రాజప్రసాదానికి వెళ్లారు. భారత్, పాక్ ప్రధానులు ఒకే చాపర్‌లో ప్రయాణించడం ఇదే మొదటిసారి. దాదాపు 400 ఎకరాల ఆ సువిశాల ప్రాంగణంలోనే శుక్రవారం షరీఫ్ మనవరాలి వివాహం జరుగుతోంది. వధూవరులను ఆశీర్వదించిన మోదీ.. వారికి ప్రత్యేక కానుకలను అందించారు.  షరీఫ్ మాతృమూర్తికి పాదాభివందనం చేసి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. షరీఫ్ జన్మదినం కూడా శుక్రవారమే కావడం విశేషం. ఈ డిసెంబర్ 25న 66వ ఏట అడుగుపెట్టిన షరీఫ్‌కు మోదీ సాదరంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశిష్ట అతిథి మోదీ కోసం షరీఫ్ ప్రత్యేకంగా విందుభోజనం ఏర్పాటు చేశారు.

అందులో మోదీకి ఇష్టమైన ‘సాజ్’, కశ్మీరీ టీతో పాటు ఇతర శాకాహార వంటకాలను ఏర్పాటు చేశారు. షరీఫ్ నివాసంలో దాదాపు రెండున్నర గంటలకు పైగా గడిపిన మోదీ.. భారత్, పాక్ సంబంధాలను మెరుగుపర్చే దిశగా షరీఫ్‌తో కొద్దిసేపు చర్చలు జరిపారు. అనంతరం లాహోర్ విమానాశ్రయానికి చేరుకుని భారత్‌కు బయల్దేరారు. విమానాశ్రయానికి వచ్చిన షరీఫ్ మోదీకి స్వయంగా వీడ్కోలు పలికారు. భారత ప్రధాని ఆకస్మిక పర్యటన సందర్భంగా లాహోర్‌లోని విమానాశ్రయం చుట్టుపక్కలా, లాహోర్‌నుంచి షరీఫ్ నివాసం వరకు రహదారిపైనా, లాహోర్‌లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు వెళ్లినవారిలో ముఖ్యులైన 11 మంది ప్రతినిధుల బృందం రోడ్డుమార్గం ద్వారానే రాయ్‌వింద్ రాజప్రసాదానికి వెళ్లింది. వారికి పాక్ 72 గంటల వీసాను మంజూరు చేసింది. మిగతా వందమందికి పైగా భారతీయ ప్రతినిధులు లాహోర్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు.

 బర్త్‌డే విషెస్.. మ్యారేజ్ ఇన్విటేషన్
 మనవరాలి వివాహానికి హాజరుకావాల్సిందిగా షరీఫ్ మోదీని ఆహ్వానించడంతో ఈ అనుకోని పర్యటన చోటు చేసుకుందని అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) వర్గాలు తెలిపాయి. మోదీ లాహోర్ పర్యటన శుక్రవారమే ఖరారయిందన్న వార్తలను పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖ్వాజి ఖలీలుల్లా ధ్రువీకరించారు. ‘అవును ప్రధాని షరీఫ్‌తో భేటీ అయ్యేందుకు భారత ప్రధాని మోదీ లాహోర్‌లో ఆగనున్నట్లు మాకు ఈ రోజే భారతీయ దౌత్య కార్యాలయం నుంచి సమాచారం అందింది’ అని ఆయన స్పష్టం చేశారు.  శుక్రవారం ఉదయం బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపేందుకు షరీఫ్‌కు మోదీ ఫోన్ చేసినప్పుడే.. లాహోర్‌లో ఆగే విషయమై నిర్ణయం జరిగిందని భారత్‌లోని వర్గాలు చెప్పాయి. తర్వాత అదే విషయాన్ని పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధురి ధ్రువపర్చారు. మోదీ అఫ్గానిస్తాన్ పర్యటన సైతం ముందుగా ప్రకటించనిదే కావడం విశేషం.

 2004లో వాజ్‌పేయి.. 2015లో మోదీ!
 2004లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆ తరువాత దాయాది దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే. మోదీ పాక్‌లో అడుగుపెట్టిన రోజే వాజ్‌పేయి 91వ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ‘ఈ రోజు భారత్ వెళ్లే మార్గమధ్యంలో లాహోర్‌లో ఆగుతున్నా. మధ్యాహ్నం లాహోర్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలుసుకోబోతున్నా. షరీఫ్‌జీతో ఫోన్‌లో మాట్లాడాను. జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను’ అంటూ మోదీ అంతకుముందు ట్వీట్స్ చేశారు. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు విఫలమైన తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

నవంబర్ చివరలో వాతావరణ సదస్సు సందర్భంగా ఇరుదేశాల ప్రధానులు మోదీ, షరీఫ్ పారిస్‌లో అనుకోకుండా సమావేశమవడంతో మళ్లీ సత్సంబంధాల దిశగా అడుగులు పడ్డాయి. ఆ తరువాత ఈ డిసెంబర్ మొదట్లో రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భేటీ అయి, అన్ని ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపడం.. అనంతరం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్‌లో జరిపిన పర్యటన ఫలితంగా సమగ్ర చర్చలకు మార్గం సుగమమైంది. ఇప్పుడు ప్రధాని మోదీ తాజా సానుకూల చర్యతో దాయాది దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు బలోపేతమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

 జనవరి 15న విదేశాంగ కార్యదర్శుల భేటీ
 న్యూఢిల్లీ: భారత, పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీ జనవరి 15న జరగనుంది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ విదేశాంగ శాఖ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ ఇస్లామాబాద్ వెళ్లి, పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరితో చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి.
 
 లాహోర్లో లంచ్.. ఢిల్లీలో డిన్నర్!
 మోదీ ఆకస్మిక పాక్ పర్యటనపై సోషల్ మీడియా తనదైన స్టైల్‌లో స్పందించింది. పలువురు సీనియర్ జర్నలిస్టులు సహా చాలామంది మోదీ చర్యను ప్రశంసించగా.. కాంగ్రెస్ నేతలు, పలువురు ఇతరులు వ్యతిరేక కామెంట్లు చేశారు. కొందరు ఫన్ లైనర్లతో అలరించారు. ‘అయితే మోదీ బ్రేక్‌ఫాస్ట్ కాబూల్‌లో, లంచ్ లాహోర్‌లో, డిన్నర్ ఢిల్లీలో చేస్తారన్న మాట’ అంటూ అశోక్ మాలిక్ ట్వీట్ చేశారు.‘భారత్, పాక్ సంబంధాలు ఇలానే, సహజంగా ఉండాల’ంటూ మెహర్ తరార్ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో తనదైన స్టైల్‌లో డైనమిజాన్ని తీసుకువచ్చారంటూ అజయ్ మిశ్రా ప్రశంసించారు. ‘వాజ్‌పేయి పాక్ పాలసీనే నేటికీ అనుసరణీయం. దాన్ని కొనసాగిస్తున్నందుకు అభినందనలు’ అంటూ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా ట్వీట్ చేశారు.
 
 షరీఫ్ ఆతిథ్యం అద్భుతం: మోదీ
 పాక్ ప్రధాని షరీఫ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలకడంతో పాటు, తిరిగి వెళ్తున్నప్పుడు కూడా స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు పలికిన తీరు తనను కదిలించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయితో తన అనుబంధాన్ని షరీఫ్ గుర్తు చేసుకున్నారని, బర్త్‌డే సందర్భంగా అటల్‌జీకి విషెస్ చెప్పాలని తనను కోరారని తెలిపారు. షరీఫ్ కుటుంబంతో ఆహ్లాదకర సమయం గడిపానన్నారు. కాగా, పాక్‌లో మోదీ, షరీఫ్‌ల భేటీని అమెరికా స్వాగతించింది. భారత్, పాక్‌ల మధ్య సత్సం బంధాలు ఆ ప్రాంతం మొత్తానికి ప్రయోజనకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
 
 భారత ప్రధానుల పాకిస్తాన్ పర్యటనలు
 
 జవహర్‌లాల్ నెహ్రూ

 (1953 జులై 25-27) కశ్మీర్‌సహా అనేక వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం వెళ్లారు. (1960 సెప్టెంబర్ 19-23) భారత్-పాక్ నదీజలాల ఒప్పందంపై సంతకం.
 
 రాజీవ్‌గాంధీ    
(1988 డిసెంబర్ 29-31) నాలుగో సార్క్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. బెనజీర్ భుట్టోతో మూడు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు. అణుకేంద్రాలపై దాడుల నిషేధం, సాంస్కృతిక సహకారం, పౌర విమానయాన రంగాల్లో ఒప్పందాలు. (1989 జులై 16-17) ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పర్యటన.
 
 అటల్ బిహారీ వాజపేయి
(1999 ఫిబ్రవరి 19-20) లాహోర్-ఢిల్లీ బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో భాగంగా లాహోర్‌కు వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్లిన వాజపేయికి ప్రధాని నవాజ్ షరీఫ్ సాదర స్వాగతం. (2004 జనవరి 4-6) 12వ సార్క్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు.
 
 నరేంద్ర మోదీ
 (2015 డిసెంబర్ 25) అఫ్గానిస్తాన్ నుంచి తిరిగి వస్తూ ఆకస్మికంగా పాకిస్తాన్‌లో పర్యటించారు.
 
 అదీ రాజనీతిజ్ఞత..
 ‘అదీ రాజనీతిజ్ఞత అంటే’ అంటూ మోదీ ఆకస్మిక పాక్ పర్యటనను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కొనియాడారు. ‘పొరుగు దేశాలతో ఇలాంటి సంబంధాలే ఉండాలి’ అని ట్వీట్ చేశారు. ‘మోదీజీ.. పాక్‌కు స్వాగతం. నిరంతర సంబంధాలతోనే అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోగలం’ అని పాక్ విపక్ష పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో అన్నారు. ‘ఈ పర్యటన, చర్చలు సానుకూల స్ఫూర్తి కోసం’ అని భారత విదేశాంగ  శాఖ పేర్కొంది. మోదీ పర్యటన సౌహార్ద చర్య అని పాక్ అంది.  ‘సమగ్ర చర్చలను ముందుకు తీసుకువెళ్లడంపై ఇరువురు నేతలు చర్చించారు. వచ్చే నెల విదేశాంగ కార్యదర్శులు ఇస్లామాబాద్‌లో భేటీ కావాలనే దానిపై అంగీకారం కుదిరింది’ అని పాక్ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్ అహ్మద్ చౌధురి చెప్పారు. ‘ఆందోళనలను అర్థం చేసుకుంటూనే, రెండు దేశాల ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా.. శాంతి స్థాపన, సానుకూల వాతావరణాన్ని మెరుగుపర్చుకోవడంపై ఇద్దరు ప్రధానులు దృష్టి పెట్టార’ని చౌధురి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement