అమెరికా ఏమంటోంది?
ఒకప్పుడు తమ దేశంలోకి ప్రవేశం కూడా కుదరదన్న అమెరికా.. ఇప్పుడు భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీ విషయంలో ఎలా స్పందిస్తోంది? తన సొంత పార్టీకే తిరుగులేని మెజారిటీ సాధించినా కూడా, కూటమి ధర్మాన్ని అనుసరించి మిత్ర పక్షాల సభ్యులకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారాన్ని అమెరికా పత్రికలు ఘనంగానే కవర్ చేశాయి. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులకు కేటాయించిన శాఖలపై కూడా తమ తమ విశ్లేషణలు అందించాయి. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఎంపికను శ్లాఘించాయి. అయితే, కొన్ని పత్రికలు మాత్రం తమకు స్వతస్సిద్ధంగా ఉన్న ద్వేషాన్ని శీర్షికలలో కూడా ప్రతిబింబించాయి.
'భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హిందూ జాతీయవాది నరేంద్రమోడీ' అంటూ వాషింగ్టన్ పోస్ట్ తన బుద్ధిని మరోసారి ప్రకటించుకుంది. 'మోడీకి సమర్థ సేనాని భారత కొత్త ఆర్థిక మంత్రి' అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక మంత్రుల ఎంపికపై కూడా విశ్లేషణ ఇచ్చింది. వాల్స్ట్రీట్ జర్నల్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా.. నేరుగా 'భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం' అనేసింది. అన్నిపత్రికల కంటే లాస్ ఏంజెలిస్ టైమ్స్ మాత్రం, మోడీపై తన అభిమానాన్ని చాటుకుంది. భవిష్యత్తులో భారత అధినేతతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఒబామాకు ఉంటుందని గతంలోనే రాసిన ఈ పత్రిక.. 'మార్పునకు ముందడుగు.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం' అని శీర్షిక పెట్టి, భారీ ఫొటోను కూడా ఉపయోగించింది.