drones provided
-
రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోన్‌టెక్ నిధులు సమీకరించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తాజాగా 6.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.55 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. లోక్ క్యాపిటల్ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలిపింది. వార్షికంగా 3,000 డ్రోన్ల స్థాయికి తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యకలాపాలు పటిష్టం చేస్తున్నట్లు మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విశ్లావత్ పేర్కొన్నారు.అధునాతన వ్యవసాయ డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు, ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోకి చానల్ పార్ట్నర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ప్రేమ్ వివరించారు. దేశీయంగా కేంద్రం నమోదీదీ పేరుతో స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ కంపెనీల ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ ఏర్పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు ఉపాధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: మార్కెట్.. ‘ట్రంపె’ట్!మారుత్ డ్రోన్‌టెక్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2028 నాటికి డీలర్ల సంఖ్యను 500కు పెంచుకోనున్నట్టు గతంలోనే ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది. -
అమెరికాతో బిగ్ డీల్ ఓకే.. భారత సైన్యంలోకి అత్యాధునిక డ్రోన్స్
వాషింగ్టన్: భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త అందించింది. భారత్‌కు 31 ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు నోటిఫై చేస్తూ అవసరమైన ధ్రువీకరణను అందజేసినట్లు రక్షణ భద్రత సహకార సంస్థ (డీఎస్‌సీఏ) పేర్కొంది. వివరాల ప్రకారం.. అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగనుంది. 🚨US Clears Sale of 31 Armed Drones to India, Boosting Military Ties The US has approved the sale of 31 MQ-9B armed drones to India, a major boost to their military ties. This deal involves 15 Sea Guardian drones for maritime surveillance and 16 Sky Guardians for land… pic.twitter.com/zVK0FTdOlY — CRUXX | Indian Markets News (@CRUXX_Ind) February 1, 2024 భారత్‌తో ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయం చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇక, అమెరికా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు దిశగా పెద్ద ముందడుగు పడింది. ఆ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. సముద్ర మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. మరోవైపు.. ఈ ప్రతిపాదిత ఒప్పందం కింద భారత్.. తన నౌకాదళం కోసం 15 సీ గార్డియన్ డ్రోన్లు, వైమానిక దళం, సైన్యం కోసం ఎనిమిదేసి చొప్పున స్కై గార్డియన్ డ్రోన్లను సమకూర్చుకోనుంది. కాగా, భారత నౌకాదళం ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. -
నింగి.. నేల.. నీరు.. ఎక్కడైనా పవర్ఫుల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ రంగంలో పటిష్ట బంధాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ రంగంలో వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అందులో అందరి దృష్టిని ఎంక్యూ9 రీపర్ డ్రోన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం.. నింగి, నేల, నీరు ఎక్కడైనా, ఏ పనైనా ఈ డ్రోన్లు చేయగలవు. కదన రంగంలో అరివీర భయంకరమైనవిగా గుర్తింపు సంపాదించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు బహుళ ప్రయోజనాలకు వినియోగపడతాయి. అమెరికాకు చెందిన జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సaరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రుదేశాల రహస్యాల సేకరణ వంటి కార్యక్రమాలతో పాటు బాంబు దాడుల్ని కూడా ఈ డ్రోన్లు చేయగలవు. ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. త్రివిధ బలగాలైన భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీలకు ఒక్కో దానికి 10 డ్రోన్ల చొప్పున మొత్తం 30 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గురువారం నాడు జరిగే భేటీలో 300 కోట్ల డాలర్ల విలువైన (రూ.24,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మిలటరీ ఆపరేషన్లు, సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో ఈ డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో వినియోగించినా ప్రాణనష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్‌ను నియంత్రిస్తూ ఉంటారు భారత్‌కు ఎలా ఉపయోగం ? దీర్ఘకాలం పనిచేయడం, నిరంతరాయంగా నిఘా పెట్టే సామర్థ్యం, దాడులకు దిగే సత్తా వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు భారత త్రివిధ బలగాల మేధస్సు, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మనకి నిరంతరాయంగా ఘర్షణలు, చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ డ్రోన్లు మన దగ్గరుంటే సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ముప్పుల్ని ముందే పనిగట్టడం, వాటికి సంబంధించిన ఇమేజ్‌లను పంపించి అప్రమత్తం చేయడం వంటివి చేస్తాయి. ఉగ్రవాద కార్యకలాపాలను కూడా ఇవి గుర్తించి వాయువేగంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. మన దేశానికి అతి పెద్ద సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో భద్రత అత్యంత కీలకం. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు పర్యవేక్షించగలవు. స్మగ్లింగ్, పైరసీ వంటి కార్యకలాపాలను గుర్తించడమే కాకుండా, సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులైన వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి సమయాల్లో విపత్తు నిర్వహణ కూడా చేయగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లు వెళ్లి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి? ఈ డ్రోన్లను అమెరికా చాలా విస్తృతంగా వినియోగిస్తోంది. అప్గానిస్తాన్, ఇరాక్ సహా ఇతర ఘర్షణ ప్రాంతాల్లో వీటిని మోహరించింది. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, నాసా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్, ఇటలీ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్‌ఫోర్స్ , జపాన్ దేశాలు ఈ డ్రోన్లు వాడుతున్నాయి. 2014–2018 మధ్య కాలంలో ఇరాక్, సిరియాలో నిర్వహించిన 2,400 మిషన్లలో బ్రిటన్ ఈ డ్రోన్లనే మోహరించింది. 398 సార్లు ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ తమ దేశ రహస్యాలను ఉక్రెయిన్‌కు చేరవేస్తోందన్న అనుమానంతో నల్లసముద్రంలో గత మార్చిలో కూల్చేసింది. 2020 జనవరిలో ఇరాన్లో జనరల్ క్వాజిం సొలెమినీ ఈ డ్రోన్‌తో అమెరికా చేసిన బాంబు దాడిలోనే మరణించారు. ప్రత్యేకతలు ► 50 వేల అడుగుల ఎత్తులో 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు ► అధునాతన కెమెరాలు, సెన్సార్లు, రాడార్లతో సరిహద్దుల్లో గట్టిగా నిఘా పెట్టి సున్నితమైన అంశాలను, అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపించగలదు ► 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ (కేటీఏఎస్) వేగంతో ప్రయాణిస్తుంది ► ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్‌క్రిపె్టడ్ కమ్యూనికేషన్ వంటివి చేయగలదు ► 12,177 కేజీల బరువైన పేలోడ్‌ను మోసుకుపోగలదు ► 2,721 కేజీల ఇంధనాన్ని నింపవచ్చు ► 114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ–12 పేవ్‌వే లైజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోగలదు ► ఆకాశంపై నుంచి బాంబుల్ని కూడా కురిపించగలదు సాక్షి, నేషనల్ డెస్క్ -
తూచ్.. రష్యాకు ఆ డ్రోన్లు మేము ఇవ్వలేదు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్ధంలో భారీగా సైన్యాన్నికోల్పోయిన క్రమంలో ఆత్మాహుతి బాంబర్లు(డ్రోన్లు)తో దాడులు చేయటం మొదలు పెట్టింది. కొద్ది రోజుల క్రితం ఇరాన్ తయారీ షహీద్(జెరాన్-2) డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో రష్యాకు డ్రోన్లు సరఫరా చేస్తోందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఇరాన్. అయితే.. ఆ ఆరోపణలను ఖండించింది ఇరాన్. తాము డ్రోన్లు సరఫరా చేయలేదని కొట్టిపారేసింది. రష్యాకు డ్రోన్లు సరఫరా చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు, ఇటీవల ఓ ప్రార్థనా స్థలంలో ఐఎస్ఐఎస్ దాడులపై ప్రశ్నించగా సమాధానమిచ్చారు. ‘యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు ఒక్క ఆయుధాన్ని సైతం ఇరాన్ సరఫరా చేయలేదు. ఈ ఆరోపణలు నిరాధారమైనవి. రక్షణ రంగంలో సహకారంపై రష్యా-ఇరాన్‌ల మధ్య ఒప్పందం మాత్రమే ఉంది. దాని ఆధారంగా డ్రోన్లు సరఫరా చేసినట్లు పశ్చిమ దేశాల మీడియాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది.’ అని స్పష్టం చేశారు ఇరాన్ రాయబారి. మరోవైపు.. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొన్ని వర్గాలు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు డాక్టర్ ఇరాజ్ ఎలాహి. ప్రస్తుతం రెండు ఇరాన్‌లు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు ఒకవైపు.. పశ్చిమ మీడియాలు చూపుతున్నది నమ్ముతున్న వారు మరోవైపు అని తెలిపారు. హిజాబ్, ప్రభుత్వానికి మద్దతుగా చాలా ర్యాలీలు జరిగాయని..కానీ మీడియాలు దానిని చూపించలేదని ఆరోపించారు. ఇరాన్‌లోని పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వ ఛానల్స్‌ను అనుసరించాలని సూచించారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ బాంబులు.. 8 మంది మృతి -
సాగులో డ్రోన్ల వినియోగం వేగవంతం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని మూడు విభాగాలు దీనిపై సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్ (డీపీపీక్యూఎస్) సీనియర్ అధికారి రవి ప్రకాశ్ ఈ విషయాలు తెలిపారు. డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతించాలంటూ డీపీపీక్యూఎస్‌లో భాగమైన సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీఅండ్‌ఆర్‌సీ)కి ఎనిమిది పంట సరక్షణ కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. పంట పర్యవేక్షణ, ఆగ్రో రసాయనాలు స్ప్రే చేయడం తదితర అవసరాల కోసం డ్రోన్లను వినియోగించేందుకు ఉద్దేశించిన ఈ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), వ్యవసాయ శాఖ, సీఐబీఅండ్‌ఆర్‌సీ కలిసి పని చేస్తున్నాయని ప్రకాశ్ చెప్పారు. క్రాప్‌లైఫ్ ఇండియా, థింక్‌ఏజీ సంయుక్తంగా నిర్వహించిన పరిశ్రమ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. ఎన్ఐపీహెచ్ఎం శిక్షణా కోర్సు.. డ్రోన్లను ఎగరేయడం, స్ప్రే చేయడం వంటి అంశాల్లో డ్రోన్ పైలట్లు, ఆపరేటర్లకు శిక్షణనిచ్చేందుకు పది రోజుల ట్రెయినింగ్ కోర్సును రూపొందించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) జాయింట్ డైరెక్టర్ విధు కాంపూరథ్ తెలిపారు. దీనికి డీజీసీఏ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ మాడ్యూల్తో డ్రోన్ పైలట్‌కు పదేళ్లు వర్తించే లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నారు. ఫినిష్డ్ డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధించడం వల్ల దేశీయ తయారీ పరిశ్రమకు ఊతం లభించగలదని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా తెలిపారు. -
ఇక డ్రోన్ల వినియోగం మరింత సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది. ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్అండ్ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్లు, ఆర్అండ్డీ సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్లైన్లో పైలెట్ లైసెన్స్‌ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో వారి డ్రోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్–విండో ఆన్లైన్ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. -
ఫిట్నెస్ డ్రోన్స్ వచ్చేస్తున్నాయ్.. సమస్యలూ లేకపోలేదు!
ఇప్పటివరకు డ్రోన్స్ అంటే మిలటరీలో వాడతారని, అమెరికా లాంటి దేశాల్లో సరుకుల డెలివరీకి వాడతారని, మనదగ్గరైతే ఫొటోషూట్స్ కోసం వాడతారని తెలుసు. కానీ త్వరలో పర్సనల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ రంగంలో డ్రోన్స్ కాలుమోపనున్నాయి. ఫిట్నెస్ డ్రోన్లతో రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాగోబోట్ పేరిట కొన్ని నమూనాలు ఫిట్నెస్ రంగంలో హల్చల్ చేస్తున్నాయి. మెల్బోర్న్కు చెందిన ఎక్సర్షన్ గేమ్స్ ల్యాబ్ 2012లోనే దీన్ని సృష్టించింది. ఈ డ్రోన్ జాగింగ్ చేసేవారు ధరించే టీషర్ట్‌పై ఉండే ప్రత్యేక మార్కర్‌ను గుర్తించి దానికి పదడుగుల దూరంలో ఎగురుతూ ఉంటుంది. జాగింగ్‌లో దీన్ని తోడుగా కొందరు భావిస్తే, కొందరు పేసర్‌గా వాడుకుంటున్నారు. అయితే ఎక్కువమంది దీన్ని జాగింగ్‌లో స్నేహితుడిగా భావించడమే ఆశ్చర్యాన్నిస్తోందని దీని సృష్టికర్త ముల్లర్ చెప్పారు. మనిషి సంఘజీవి అని, ఒంటరిగా ఎక్కువసేపు ఉండడం ఎక్కువమందికి చేతకాదని వివరించారు. అందుకే చాలామంది ఫ్రెండ్స్‌తో, కుటుంబసభ్యులతో లేదా పెంపుడు కుక్కతో జాగింగ్‌కు వెళ్తుంటారన్నారు. ఇప్పుడు అంతా మెకానికల్ లైఫ్ అవుతున్న దశలో సరైన జాగింగ్ పార్టనర్ దొరకడం కష్టమవుతోంది. అలాంటివారికి జాగ్బాట్ స్నేహితుడిలా ఉపయోగపడుతోంది. పరిమితులున్నాయి హాలీవుడ్ సినిమాల్లోలాగా జాగ్బాట్ అన్నీ చేసేయదు. దీనికి కొన్ని పరిమితులున్నాయి. దీంతో జాగింగ్ చేయాలంటే సరళమార్గాల్లోనే పరుగెత్తాలి. అలాగే దీని బ్యాటరీ లైఫ్ 30 నిమిషాలే ఉంటుంది. ఈ లోటుపాట్లను అర్ధం చేసుకొని మరికొన్ని కంపెనీలు మరింత ఉన్నత సాంకేతికతతో కూడిన ఫిట్నెస్ డ్రోన్ల తయారీకి ముందు కొస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హాంగిక్ యూనివర్సిటీ విద్యార్థ్ధులు తాజాగా ట్రావెర్స్ డ్రోన్ పేరిట కొత్త నమూనా రూపొందించారు. కొత్తగా వ్యాయామాలు మొదలెట్టేవారికి పర్సనల్ ట్రైనర్‌గా వ్యవహరించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం దీనిలో అనేక కెమేరాలు, సెన్సర్లు అమర్చారు. డ్రోన్ వాడే కస్టమర్లు చిన్న పాడ్ లాంటిదాన్ని మెడలో వేసుకుంటే సరిపోతుంది. దీనిద్వారా డ్రోన్ కంట్రోల్స్‌ను మార్చుకోవడంతో పాటు, వాయిస్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. త్వరలో దీన్ని ఉత్పత్తి దశకు తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ యంత్రాల సాయం దివ్యాంగులకు మరింత ఎక్కువ ఉపయుక్తమని రిసెర్చర్లు భావిస్తున్నారు. ఈ దిశగా రోబోటిక్స్ రిసెర్చ్ ల్యాబ్ బ్లైండ్ రన్నర్లకు సహాయకారిగా ఉండే డ్రోన్లను రూపొందించింది. – డి. శాయి ప్రమోద్ సమస్యలు కూడా ఉన్నాయి ఇలాంటి యంత్రాల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ప్రతిధ్వని సమస్య. ఒక గదిలో వ్యాయామాలు చేస్తున్నప్పుడు డ్రోన్ కు ఇచ్చే వాయిస్కమాండ్ గదిలో ప్రతిధ్వనిస్తే డ్రోన్ కరెక్ట్‌గా గ్రహించలేదు. అలాగే బయట వాతావరణంలో పలు శబ్దాల మధ్య మన గొంతును కచ్ఛితంగా గుర్తుపట్టడం కూడా డ్రోన్ కు సమస్యే!. ఇక మరో అతిపెద్ద సమస్య డ్రోన్ తో ఢీ కొనడం! బ్లైండ్రన్నర్లు పరిగెత్తే సమయంలో డ్రోన్ మూవ్మెంట్ మొరాయిస్తే ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే దీర్ఘకాలిక బ్యాటరీ శక్తిని సమకూర్చడం కూడా అవసరం. ఈ సమస్యలకు పరిష్కారాల కోసం పరిశోధకులు యత్నిస్తున్నారు. ఇక ఫిట్నెస్ డ్రోన్లంటే కేవలం జాగింగ్, రన్నింగ్‌కు మాత్రమే సాయం చేస్తాయనుకుంటే పొరపాటే! పలు యూరోపియన్ సాకర్ టీమ్‌లు ప్రత్యర్ధి టీమ్ వ్యూహాలు, బాల్ కదలికలను అధ్యయనం చేసుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. అలాగే కొన్ని క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పోశ్చర్‌ను అన్ని కోణాల్లో చూసుకొని తప్పులు దిద్దుకునేందుకు డ్రోన్లను వాడుతున్నారు. పైన చెప్పుకున్న ఎక్సర్షన్ ల్యాబ్ తాజాగా ధ్యాన డ్రోన్స్‌ను తయారు చేయాలని భావిస్తోంది. డ్రోన్ ఛిగా పిలిచే ఈ డ్రోన్ చైనా మార్షల్ ఆర్ట్ తాయ్ఛికి ప్రతిరూపమని తెలిపింది. ఇప్పటికీ ఈ డ్రోన్ ప్రొటోటైప్స్‌ను సంస్థ రూపొందించింది. భవిష్యత్‌లో ఈ డ్రోన్లు ఫిట్నెస్ విషయంలో మెకానికల్ భాగస్వాములుగా మారనున్నాయంటే అతిశయోక్తి కాదేమో! -
తొలిసారిగా డ్రోన్లతో ఈసీ నిఘా
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు, చొరబాట్లకు చెక్‌పెట్టేందుకు విరివిగా వాడుతున్న డ్రోన్లను తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల కోసం ఈసీ ఉపయోగిస్తోంది. యూపీలోని గౌతంబుద్ధ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో పదివేల మంది భద్రతా సిబ్బందితో పాటు డ్రోన్లనూ నిఘా నిమిత్తం ఈసీ వినియోగిస్తోంది. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై కన్నేసిఉంచేందుకు 13 డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 23,995 పోలింగ్ కేంద్రాల్లో 163 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కాగా, వీటిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ల ద్వారా నిఘా పెంచామని, ఘర్షణలు చెలరేగిన చోటకు హుటాహుటిన అదనపు బలగాలు తరలిస్తామని జిల్లా మేజిస్ర్టేట్ బీఎన్ సింగ్ వెల్లడించారు. -
ఆర్పీఎఫ్కు అత్యాధునిక పరికరాలు
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ఆధునీకరణలో భాగంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులకు బాడీ కెమెరాలు, డ్రోన్లు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్ వంటి అత్యాధునిక పరికరాలు అందించేందుకు అంగీకరించింది. అలాగే ఈ అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసే అధికారాన్ని రైల్వే డివిజినల్, జోనల్ అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం డ్రోన్ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్లు, డ్రాగన్ సెర్చ్లైట్లు, ఫైరింగ్ సిమ్యులేటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత వ్యవస్థలు, కాల్ డేటా రికార్డర్, నైట్ విజన్ వంటి పరికరాలను డివిజినల్, జోనల్ అధికారులు కొనుగోలు చేయవచ్చు. -
పాక్‌కు చైనా అత్యాధునిక డ్రోన్లు
బీజింగ్: చైనా– పాకిస్తాన్ మధ్య రహస్యంగా శక్తిమంతమైన ఆయుద ఒప్పందం జరిగింది. రష్యా నుంచి భారత్ అత్యాధునిక ఎస్–400 క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న వారం వ్యవధిలోనే పాకిస్తాన్ చైనాతో అతిపెద్ద ఆయుధ దిగుమతి ఒప్పందం కుదుర్చుకుంది. చైనా నుంచి 48 అత్యాధునిక మానవ రహిత యుద్ధ విమానాల (మానవ రహిత హై ఎండ్ డ్రోన్) కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. రహస్యంగా జరిగిన ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడి కాలేదు. వింగ్ లూంగ్–2 సిరీస్‌కు చెందిన ఈ డ్రోన్లను పాక్, చైనా కలసి తయారు చేయనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు కలసి మల్టీరోలల్ యుద్ధ విమానాలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సిన అవశ్యం ఏర్పడింది. -
ఇక డ్రోన్లతో ఫుడ్ డెలివరీ
సాక్షి, న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఇంటికి కోరుకున్న ఆహారం అందుబాటులోకి వస్తే తాజాగా టెక్నాలజీ సాయంతో క్షణాల్లోనే ఆహారం అందేలా ఆయా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని కస్టమర్లకు చేరవేయడంపై దృష్టి సారించామని ఊబర్ ఈట్స్ ఆసియాపసిఫిక్ హెడ్ రాజ్ బేరి చెప్పారు. డ్రోన్ డెలివరీ కోసం తామిప్పటికే పైలట్లను ప్రకటించామన్నారు. డ్రోన్ల ద్వారా కేవలం ఏడెనిమిది నిమిషాల్లో ఆహారాన్ని కస్టమర్లు తమ ముంగిట్లో పొందగలుగుతారన్నారు. అయితే భారత్‌లో నూతన డ్రోన్ పాలసీ ఆహార సరఫరా లేదా వాణిజ్య అవసరాలకు డ్రోన్లను వినియోగించేందుకు అనుమతించదన్నారు. టెక్నాలజీలో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా సమీప భవిష్యత్‌లో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరాను చేపడతామని స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా రెస్టారెంట్లకు తమ సేవలతో మెరుగైన వ్యాపార అవకాశాలు నెలకొంటాయన్నారు. ఊబర్ ఈట్స్‌కు భారత్‌లో భారీ మార్కెట్ అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. తాము భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన 15 నెలల్లోనే ప్రతినెలా 50 శాతం వృద్ధి నమోదు చేశామని రాజ్ బేరీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 నగరాలు, 12,000 రెస్టారెంట్లలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఇప్పటికే దిగ్గజ సంస్థలున్నా, తాము సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వృద్ధి సాధిస్తామని దీర్ఘకాలంలో తమకు మంచి అవకాశాలున్నాయన్నారు. -
జిల్లా పోలీస్‌శాఖకు డ్రోన్
► డెమోను పర్యవేక్షించిన ఒంగోలు డీఎస్పీ ఒంగోలు : జిల్లా పోలీసు యంత్రాంగానికి డ్రోన్ రూపంలో మరో అధునాతన పరికరం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రతి జిల్లాకు ఒక డ్రోన్‌ను కేటాయించింది. దానిలో భాగంగా జిల్లాకు కేటాయించిన డ్రోన్‌ను ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సోమవారం కలెక్టరేట్ వద్ద ప్రదర్శించారు. డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుందో స్వయంగా ఆయన పరిశీలించారు. ముందుగా ప్రకాశం భవనం ముందు భాగంలో డ్రోన్‌ను పరీక్షించారు. అనంతరం ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు వెళ్లే మార్గంలో మరోమారు పరీక్షించారు. డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుందో డీఎస్పీ వివరించారు. డ్రోన్‌ను ఒక కిలోమీటర్ ఎత్తుకు పంపి మూడు కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న సంఘటనలను దానికి అనుసంధానం చేసిన అధునాతనమైన కెమేరా సాయంతో రిమోట్ కంట్రోల్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. క్వాలిటీ కలిగిన ఫొటోల ద్వారా అక్కడి పరిస్థితులను తెలుసుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వీలుంటుందన్నారు. కేసులకు సంబంధించిన దర్యాప్తులకు ఈ డ్రోన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సభలు, సమావేశాలు జరిగే సమయంలో, ప్రకాశం భవనం ముందు జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను కూడా దీని ద్వారా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. అంతేగాకుండా వరదలు పంట విపత్తులు సంభవించిన సమయంలో డ్రోన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనుమానాస్పద భవనాలపై ఎవరున్నారన్న విషయాలను కూడా దీని ద్వారా చూడవచ్చన్నారు. 500 నుంచి 600 మీటర్ల పరిధిలో ఏం జరుగుతుందో కూడా డ్రోన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా నీటిపై మృతదేహాలుంటే వాటి ఆనవాళ్లను కూడా డ్రోన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాకు కేటాయించిన డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు.