సాక్షి, న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఇంటికి కోరుకున్న ఆహారం అందుబాటులోకి వస్తే తాజాగా టెక్నాలజీ సాయంతో క్షణాల్లోనే ఆహారం అందేలా ఆయా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని కస్టమర్లకు చేరవేయడంపై దృష్టి సారించామని ఊబర్ ఈట్స్ ఆసియాపసిఫిక్ హెడ్ రాజ్ బేరి చెప్పారు. డ్రోన్ డెలివరీ కోసం తామిప్పటికే పైలట్లను ప్రకటించామన్నారు. డ్రోన్ల ద్వారా కేవలం ఏడెనిమిది నిమిషాల్లో ఆహారాన్ని కస్టమర్లు తమ ముంగిట్లో పొందగలుగుతారన్నారు. అయితే భారత్‌లో నూతన డ్రోన్ పాలసీ ఆహార సరఫరా లేదా వాణిజ్య అవసరాలకు డ్రోన్లను వినియోగించేందుకు అనుమతించదన్నారు.
టెక్నాలజీలో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా సమీప భవిష్యత్‌లో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరాను చేపడతామని స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా రెస్టారెంట్లకు తమ సేవలతో మెరుగైన వ్యాపార అవకాశాలు నెలకొంటాయన్నారు. ఊబర్ ఈట్స్‌కు భారత్‌లో భారీ మార్కెట్ అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. తాము భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టిన 15 నెలల్లోనే ప్రతినెలా 50 శాతం వృద్ధి నమోదు చేశామని రాజ్ బేరీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 నగరాలు, 12,000 రెస్టారెంట్లలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఇప్పటికే దిగ్గజ సంస్థలున్నా, తాము సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వృద్ధి సాధిస్తామని దీర్ఘకాలంలో తమకు మంచి అవకాశాలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment