Agreements
-
నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ ఇస్తారని తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కల సాకారంలో కస్టమర్‌తో బిల్డర్ చేసుకునే సేల్ అగ్రిమెంట్ అత్యంత కీలకం. ఒప్పందపత్రంలోని నిబంధనలు, షరతులను బట్టి మన కల తీరుతుందో లేక మధ్యలోనే పటాపంచలవుతుందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే మనిషికి హృదయ స్పందనలాగే డెవలపర్‌కు, కొనుగోలుదారులకు మధ్య జరిగే సేల్ అగ్రిమెంట్ అంతకంటే ముఖ్యమని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) సభ్యులు కె.శ్రీనివాస రావు అంటున్నారు. ఆయనతో ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ విశేషాలివీ..బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలన్నీ తమకు అనుకూలమైన నిబంధనలను, షరతులను పొందుపరిచి కస్టమైజ్డ్ అగ్రిమెంట్లను రూపొందించి కస్టమర్లతో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపట్ల గృహ కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పెట్టుబడులకు భద్రత, రక్షణ ఉండాలంటే రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఇస్తున్నారనో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్స్ వలలో చిక్కితే రోడ్డున పడతారు. నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే.. నిర్మాణ దశలను బట్టి డెవలపర్లకు బ్యాంక్ నిధులను విడుదల చేస్తుంది. రెరా నిబంధనల ప్రకారం ఆయా నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిర్మాణ పనుల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే డెవలపర్లు నిధులను ఇతర ప్రాజెక్ట్‌లు, అవసరాలకు మళ్లిస్తుండటంతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకునే సరికి నిధులు సరిపడాలేక అది ఆగిపోతుంది. మరోవైపు నిధులు పూర్తిగా విడుదల కాగానే కస్టమర్‌కు బ్యాంక్ నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లించడం ప్రారంభమవుతుంది. కానీ, కస్టమర్‌కు ఆ టైంకు ఫ్లాట్ చేతికి రాదు. గృహప్రవేశం చేయలేరు. దీంతో బయట అద్దె, ఫ్లాట్‌కు ఈఎంఐ చెల్లించడం కస్టమర్‌కు అదనపు భారంగా మారుతుంది. గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయని డెవలపర్లు ఆలస్యం అయిన కాలానికి 10.25 శాతం వడ్డీని కస్టమర్‌కు చెల్లించాల్సిందే. ఒకవేళ సమయానికి కస్టమర్లు బిల్డర్‌కు సొమ్ము చెల్లించకపోతే వారు కూడా 10.25 శాతం వడ్డీని డెవలపర్‌కు అందజేయాల్సిందే. కార్పస్ ఫండ్ అందజేయాలి.. సెమీ ఫర్నిష్ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.2 లక్షలు, 3 లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయనే బిల్డర్ల ఉచిత సలహాకు చాలామంది కస్టమర్లు చిక్కుతున్నారు. అయితే సెమీ ఫర్నీష్ ఫ్లాట్‌ను పూర్తి ఫర్నీష్గా ఎప్పుడు చేస్తారనే విషయంపై బిల్డర్‌తో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిందంటూ టైల్స్, పెయింటింగ్ వంటి తుది మెరుగులు దిద్దకుండా అసంపూర్తి ఫ్లాట్‌నే కస్టమర్‌కు అప్పగించి బిల్డర్లు చేతులు దులుపుకుంటారు. కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్‌ను బిల్డర్ తీసుకోరాదు. అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతాను తెరిచి, వడ్డీతోసహా కార్పస్ ఫండ్‌ను అందులో జమ చేయాలి. కస్టమర్ల అనుమతి తప్పనిసరి.. కస్టమర్‌తో ఒప్పందం చేసుకున్నాక ప్రాజెక్ట్ లేదా ఫ్లాట్ డిజైనింగ్, ఎలివేషన్ వంటి వాటిల్లో బిల్డర్ ఏమైనా మార్పులు చేయాలంటే 2/3 వంతు కస్టమర్ల అనుమతి తప్పనిసరి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బిల్డర్ బ్యాంక్ రుణంతోనే కడుతున్నప్పుడు కస్టమర్లు బిల్డర్‌కు పోస్ట్ డేటెడ్ చెక్స్ అందజేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా డెవలపర్లు కస్టమర్ల నుంచి 10 శాతానికి మించి టోకెన్ అమౌంట్‌ను వసూలు చేయకూడదు. భూ యజమానికి చిక్కులు.. నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్ పొజిషన్‌కు కస్టమర్‌కు రెరా చట్టం ప్రకారం 2 నెలల సమయం ఉంటుంది. కానీ, 15 రోజుల్లోనే పొజిషన్ తీసుకోవాలని బిల్డర్లు కస్టమర్లను ఒత్తిడి చేస్తుంటారు. ఇంటీరియర్ పనులు, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు కస్టమర్లు పొజిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. మరికొందరు పొజిషన్ తీసుకుంటే అపార్ట్మెంట్ నిర్వహణ వ్యయం చెల్లించాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి స్థల యజమానితో బిల్డర్ ఒప్పందం చేసుకుంటే రెరా చట్టం ప్రకారం డెవలపర్ కూడా ప్రమోటరే అవుతారు. కాబట్టి ఇరువురి మధ్య జరిగే అగ్రిమెంట్లు పారదర్శకంగా ఉండాలి. లేకపోతే భూ యజమానికి కూడా చిక్కులు తప్పవు. -
అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: లిథియం దిగుమతుల కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్.. ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో అయిదు లిథియం బ్లాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్), అర్జెంటీనాకు చెందిన క్యాటామార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడ్ డెల్ ఎస్టాడో (క్యామ్‌యెన్) ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో లిథియం నిక్షేపాల అన్వేషణ, గనుల అభివృద్ధిపై భారత్ సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించాయి. భారత్ ఇప్పటికే ఆ్రస్టేలియాలో రెండు లిథియం, మూడు కోబాల్ట్ గనులను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే క్రమంలో లిథియంకు సంబంధించి అర్జెంటీనాతో ఒప్పందం రెండోది కానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటి బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 25,000 కోట్ల విలువ చేసే లిథియంను చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 98 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉండగా ఇందులో 20 శాతం నిక్షేపాలు అర్జెంటీనాలో ఉన్నాయి. -
విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్ధల విద్యార్ధులు ప్రపంచస్ధాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లు. అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని కేవలం జూనియర్ లెవెల్కే పరిమితం చేయకుండా.. ప్లస్ వన్, ప్లస్ టూ సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. మీరు కచ్చితంగా మా ప్రభుత్వ బడులను చూడాలి. అప్పుడే మీకు మేం విద్యారంగంలో చేస్తున్న మార్పులు నేరుగా అర్ధం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ జూలై ఆఖరు నాటికి రాష్ట్రంలో 30,230 క్లాస్‌రూమ్‌లను డిజిటలైజ్ చేయబోతున్నాం. మొత్తంగా దాదాపు 63వేల క్లాస్ రూమ్‌లను డిసెంబరు నాటికి డిజిటలైజ్ చేయబోతున్నాం.’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్ ‘‘మరో వైపు 8వతరగతిలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్ధికి ట్యాబులు పంపిణీ చేశాం. ఈ ఏడాది కూడా 8వతరగతి విద్యార్ధులకు డిసెంబరు 21న ట్యాబులు పంపిణీ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు నేడు పేరుతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్ధికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా ఉచితంగా అందిస్తున్నాం. వీటకి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు. -
నింగి.. నేల.. నీరు.. ఎక్కడైనా పవర్ఫుల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ రంగంలో పటిష్ట బంధాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ రంగంలో వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అందులో అందరి దృష్టిని ఎంక్యూ9 రీపర్ డ్రోన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం.. నింగి, నేల, నీరు ఎక్కడైనా, ఏ పనైనా ఈ డ్రోన్లు చేయగలవు. కదన రంగంలో అరివీర భయంకరమైనవిగా గుర్తింపు సంపాదించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు బహుళ ప్రయోజనాలకు వినియోగపడతాయి. అమెరికాకు చెందిన జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సaరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రుదేశాల రహస్యాల సేకరణ వంటి కార్యక్రమాలతో పాటు బాంబు దాడుల్ని కూడా ఈ డ్రోన్లు చేయగలవు. ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. త్రివిధ బలగాలైన భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీలకు ఒక్కో దానికి 10 డ్రోన్ల చొప్పున మొత్తం 30 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గురువారం నాడు జరిగే భేటీలో 300 కోట్ల డాలర్ల విలువైన (రూ.24,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మిలటరీ ఆపరేషన్లు, సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో ఈ డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో వినియోగించినా ప్రాణనష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్‌ను నియంత్రిస్తూ ఉంటారు భారత్‌కు ఎలా ఉపయోగం ? దీర్ఘకాలం పనిచేయడం, నిరంతరాయంగా నిఘా పెట్టే సామర్థ్యం, దాడులకు దిగే సత్తా వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు భారత త్రివిధ బలగాల మేధస్సు, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మనకి నిరంతరాయంగా ఘర్షణలు, చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ డ్రోన్లు మన దగ్గరుంటే సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ముప్పుల్ని ముందే పనిగట్టడం, వాటికి సంబంధించిన ఇమేజ్‌లను పంపించి అప్రమత్తం చేయడం వంటివి చేస్తాయి. ఉగ్రవాద కార్యకలాపాలను కూడా ఇవి గుర్తించి వాయువేగంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. మన దేశానికి అతి పెద్ద సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో భద్రత అత్యంత కీలకం. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు పర్యవేక్షించగలవు. స్మగ్లింగ్, పైరసీ వంటి కార్యకలాపాలను గుర్తించడమే కాకుండా, సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులైన వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి సమయాల్లో విపత్తు నిర్వహణ కూడా చేయగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లు వెళ్లి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి? ఈ డ్రోన్లను అమెరికా చాలా విస్తృతంగా వినియోగిస్తోంది. అప్గానిస్తాన్, ఇరాక్ సహా ఇతర ఘర్షణ ప్రాంతాల్లో వీటిని మోహరించింది. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, నాసా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్, ఇటలీ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్‌ఫోర్స్ , జపాన్ దేశాలు ఈ డ్రోన్లు వాడుతున్నాయి. 2014–2018 మధ్య కాలంలో ఇరాక్, సిరియాలో నిర్వహించిన 2,400 మిషన్లలో బ్రిటన్ ఈ డ్రోన్లనే మోహరించింది. 398 సార్లు ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ తమ దేశ రహస్యాలను ఉక్రెయిన్‌కు చేరవేస్తోందన్న అనుమానంతో నల్లసముద్రంలో గత మార్చిలో కూల్చేసింది. 2020 జనవరిలో ఇరాన్లో జనరల్ క్వాజిం సొలెమినీ ఈ డ్రోన్‌తో అమెరికా చేసిన బాంబు దాడిలోనే మరణించారు. ప్రత్యేకతలు ► 50 వేల అడుగుల ఎత్తులో 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు ► అధునాతన కెమెరాలు, సెన్సార్లు, రాడార్లతో సరిహద్దుల్లో గట్టిగా నిఘా పెట్టి సున్నితమైన అంశాలను, అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపించగలదు ► 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ (కేటీఏఎస్) వేగంతో ప్రయాణిస్తుంది ► ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్‌క్రిపె్టడ్ కమ్యూనికేషన్ వంటివి చేయగలదు ► 12,177 కేజీల బరువైన పేలోడ్‌ను మోసుకుపోగలదు ► 2,721 కేజీల ఇంధనాన్ని నింపవచ్చు ► 114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ–12 పేవ్‌వే లైజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోగలదు ► ఆకాశంపై నుంచి బాంబుల్ని కూడా కురిపించగలదు సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీన్‌కోతో సెరెంటికా జట్టు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక క్లయింట్లకు నిరాటంకంగా పునరుత్పాదక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా గ్రీన్కో గ్రూప్‌తో సెరెంటికా రెన్యువబుల్స్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్కో గ్రూప్‌కి సంబంధించి 1500 మెగావాట్ అవర్ పునరుత్పాదక విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకోనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని పిన్నాపురంలో, మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్‌లో అందుబాటులోకి వస్తున్న ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ (ఓసీపీఎస్పీ) ఉపయోగపడ నున్నాయి. వివిధ క్లయింట్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ఒప్పందం సహా యపడగలదని సెరెంటికా రెన్యువబుల్స్ డైరెక్టర్ ప్రతీక్ అగర్వాల్ తెలిపారు. ట్విన్‌స్టార్ ఓవర్సీస్కు 100% అనుబంధ సంస్థగా సెరెంటికా 2022లో ఏర్పాటైంది. ట్విన్స్టార్కి స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్, స్టెరిలైట్ టెక్నాలజీస్‌లో నియంత్రణ స్థాయి వాటాలు ఉన్నాయి. గ్రీన్కో గ్రూప్‌నకు సౌర, పవన, హైడ్రో జనరేషన్ టెక్నాజీలవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సుమారు 7.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. -
ఆర్సెలర్ చేతికి ఎస్సార్ పోర్టులు
న్యూఢిల్లీ: పోర్టుల బిజినెస్‌ను మెటల్ రంగ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌కు విక్రయించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్సార్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఇందుకు 2.4 బిలియన్ డాలర్ల(రూ. 19,000 కోట్లు) విలువైన తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్–19 తదుపరి దేశీయంగా ఇది అతిపెద్ద డీల్‌కాగా.. నిర్ణీత పోర్టులతోపాటు, విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను సైతం ఆర్సెలర్‌కు బదిలీ చేయనున్నట్లు ఎస్సార్ తెలియజేసింది. ప్రధానంగా గుజరాత్‌లోని హజీరా స్టీల్ ప్లాంటు అవసరాల కోసం ఏర్పాటు చేసిన వీటిని విక్రయించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా డీల్‌లో భాగంగా హజీరాలో వార్షికంగా 4 ఎంటీ సామర్థ్యంగల ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు రెండు సంస్థలు 50:50 భాగస్వామ్య సంస్థను సైతం నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. హజీరా స్టీల్ ప్లాంటును 2018–19లోనే ఆర్సెలర్‌మిట్టల్ కొనుగోలు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 3 రాష్ట్రాల్లో... ఎస్సార్ గ్రూప్‌తో కుదిరిన తాజా ఒప్పందంలో భాగంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పోర్టులతోపాటు హజీరాలోగల రెండు విద్యుత్ ప్లాంట్లు సొంతం కానున్నట్లు ఆర్సెలర్ మిట్టల్ విడిగా ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్ ప్రసార లైన్ సైతం దీనిలో భాగమేనని తెలియజేసింది. 2018–19లో దివాలా చట్ట చర్యలలో భాగంగా రూ. 42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్‌ను ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేసింది. తద్వారా పోర్టు లైసెన్స్ కార్యకలాపాల హక్కులు సైతం దక్కినట్లు ఆర్సెలర్‌మిట్టల్ పేర్కొన్నప్పటికీ ఎస్సార్ బల్క్‌టెర్మినల్ దీనిని వ్యతిరేకించింది. దివాలా చర్యల్లోకి ఇవి రావని వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టులకు చేరింది. అయితే ప్రస్తుతం రెండు సంస్థలూ వీటిపై ఒక ఒప్పందానికి రావడం గమనార్హం! వైజాగ్ టెర్మినల్ సైతం హజీరాలోని డీప్ డ్రాఫ్ట్ బల్క్ పోర్ట్ టెర్మినల్‌లోని 25 ఎంటీపీఏ జెట్టీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోగల 16 ఎంటీపీఏ డీప్ డ్రాఫ్ట్ టెర్మినల్ డీల్‌లో భాగమని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడగల 8 ఎంటీపీఏ ఐరన్ ఓర్ పెల్లెట్ ప్లాంటుతో అనుసంధానమైన సమీకృత కన్వేయర్ కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా ఒడిశాలోని 12 ఎంటీపీఏ పారదీప్ డీప్ వాటర్ జెట్టీ, కన్వేయర్ ఒప్పందంలోకి వస్తాయని వివరించింది. వీటితోపాటు హజీరాలోని 270 మెగావాట్ల మల్టీ ఇంధన ప్లాంట్, 515 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉన్నట్లు వెల్లడించింది. -
ఎగ్జాన్‌మొబిల్‌తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్‌మొబిల్‌తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్‌మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్‌మొబిల్‌తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్‌మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి. -
గ్రీన్ ఎనర్జీ.. ఏపీ ఒక దిక్సూచి కాబోతుంది: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామన్నారు. ప్రపంచస్థాయి వేదికలపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రగతిని ఫోకస్ చేశామన్నారు. ఐదు రోజుల సదస్సుకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి గీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఏపీని ఆదర్శంగా మారుస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ ఒక దిక్సూచి కాబోతుందన్నారు. 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. -
Russia-Ukraine war: రష్యా గ్యాస్‌కు యూరప్ గుడ్‌బై!
బ్రసెల్స్: గ్యాస్ సరఫరాకు ప్రధానంగా రష్యాపై ఆధారపడుతూ వస్తున్న యూరప్ ఇకపై దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య శుక్రవారం కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలన్నది తాజా ఒప్పంద సారాంశం. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అంగీకారం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త ఒప్పందాలు: జర్మనీ బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది. తమతో స్నేహపూర్వకంగా మసులుకోని దేశాలు గ్యాస్ బిల్లులను రష్యా కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లించాల్సి ఉంటుందన్న పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఒప్పందాల ఉల్లంఘనేనని, ఆచరణసాధ్యం కాదని జర్మనీ చాన్స్‌లర్ ఒలాప్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ప్రకటించారు. రష్యాతో నిమిత్తం లేకుండా యూరప్ గ్యాస్ అవసరాలను అమెరికా, ఇతర దేశాలు తీర్చడం సా ధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే యూరప్‌కు భారీగా గ్యాస్ సరఫరా చేస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో అంతకుమించి సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధపడ్డా దాన్ని దిగుమతి చేసుకునే, పంపిణీ చేసే వ్యవస్థలు యూరప్‌లో ప్రస్తుతానికి లేవు. -
భారత్–యూఏఈ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు ఒక వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్వేగా ఉండడం మరో కీలక అంశం. స్మారక స్టాంప్ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశాయి. అపార వాణిజ్య అవకాశాలు ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి. – పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి -
ఖాళీ స్థలం చూపిస్తూ యూడీఎస్లో విక్రయాలు
అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్)లో విక్రయాలు చేయరాదని, నిబంధనలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. అక్రమ డెవలపర్లకు చెవికెక్కడం లేదు. హైదరాబాద్‌లో సొంతిల్లు కొనాలనే సామాన్యుని కలను ఆసరా చేసుకొని అందినకాడిక దండుకుంటున్నారు. స్థల యజమానితో ఒప్పందం చేసుకొని.. అదే ఖాళీ ప్లేస్‌లో తక్కువ ధరకే అపార్ట్మెంట్ కడుతున్నామనడంతో కొనుగోలుదారులు కూడా ముందు వెనకా ఆలోచించకుండా తెగ తొందరపడి కొనేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో శామీర్‌పేటలో 3.85 ఎకరాలలో జీ+10 అంతస్తులలో ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొత్తం 1,200 ఫ్లాట్లకు గాను 300 ఫ్లాట్లను చ.అ.కు రూ.1,600లకే విక్రయించింది. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియం వంటివి నిర్మిస్తామని ప్రకటించింది. పైగా ఎమినిటీస్ చార్జీలు లేవు. కార్ పార్కింగ్ ఫీజు కట్టక్కర్లేదు. జీఎస్టీ లేదు. రిజిస్ట్రేషన్ కూడా ఉచితమేనని ప్రకటించింది. ఈస్థాయిలో ఆఫర్లు ఇవ్వటం తో సామాన్యులు ఎగబడ్డారు. వందల సంఖ్యలో ఫ్లాట్లను విక్రయించి కోట్లాది రూపాయలను సంపాదించింది. మరి, నిర్మాణ పనులు మొదలయ్యాయా అంటే ఇంకా కంపెనీ దగ్గర సమాధానం లేదు. రూ.11 వేల అద్దె చెల్లిస్తుందంట.. ఇక ఇప్పుడిదే ప్రాంతంలో ఫేజ్–2 అని మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 11 ఎకరాలలో జీ+10 టవర్లను నిర్మిస్తోంది. 9 బ్లాక్‌లలో మొత్తం 1,170 ఫ్లాట్లుంటాయి. చ.అ.ను 2,600లకు విక్రయిస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందస్తుగా రూ.8 లక్షల సొమ్ము చెల్లించి ఫ్లాట్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేస్తారంట. 45 రోజుల వ్యవధిలో మిగిలిన సొమ్ము చెల్లిస్తే.. 121 గజాల స్థలాన్ని కొనుగోలుదారునికి రిజిస్ట్రేషన్ చేస్తారంట. ఈ స్థలాన్ని తిరిగి డెవలపర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసుకుంటాడంట. ఆపైన నిర్మాణ పనులను మొదలుపెడతారట. ఇప్పటివరకు సదరు నిర్మాణ సంస్థకు అనుమతులు రాలేదు. రెరాలో నమో దు కాకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. మొత్తం 11 ఎకరాల ప్రాజెక్ట్ కాగా ఫేజ్–1లో 5.5 ఎకరాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు వచ్చాయని కంపెనీ యజమాని తెలిపారు. ప్రస్తుతానికైతే అందులోనే విక్రయాలను చేస్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతులు రాకముందే యూడీఎస్లో చ.అ. రూ.1,600 చొప్పున 200 ఫ్లాట్లను విక్రయించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే? నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా.. యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసలుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే. -
ఎయిరిండియా విక్రయ ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంతకాలు చేశాయి. ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాదీ, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్‌నకు చెందిన సుప్రకాష్ ముఖోపాధ్యాయ్.. షేర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ... మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం ట్వీట్ చేశారు. టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఎయిరిండియాలో 100 శాతం వాటాలను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ సుమారు రూ. 18,000 కోట్లు. ఇందులో రూ. 2,700 కోట్ల మొత్తాన్ని టాలేస్ నగదు రూపంలో చెల్లించనుండగా, మిగతా రూ. 15,300 కోట్ల రుణభారం కంపెనీకి బదిలీ కానుంది. ఎయిరిండియా విక్రయాన్ని నిర్ధారిస్తూ అక్టోబర్ 11న టాటా గ్రూప్‌నకు కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేసింది. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణ భారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో 75 శాతం భారాన్ని (రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్‌ఎల్‌కు ప్రభుత్వం బదలాయిస్తోంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను రూ. 12,906 కోట్ల రిజర్వ్ ధరతో వేలం వేయగా, అత్యధికంగా కోట్ చేసి టాటా గ్రూప్ విజేతగా నిల్చింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ రూ. 15,100 కోట్లకు బిడ్ వేశారు. -
టాటా గ్రూప్‌నకు ఎల్వోఐ
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించడాన్ని నిర్ధారిస్తూ కేంద్రం సోమవారం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను (ఎల్వోఐ) జారీ చేసిందని∙పాండే తెలిపారు. టాటా గ్రూప్ దీనికి తమ అంగీకారం తెలిపిన తర్వాత వాటాల కొనుగోలు ఒప్పందంపై (ఎస్పీఏ) సంతకాలు అవుతాయి. ‘సాధారణంగా ఎల్‌వోఐని అంగీకరించిన తర్వాత 14 రోజుల్లోగా ఎస్‌పీఏపై సంతకాలు జరుగుతాయి. ఇది సాధ్యమైనంత వేగంగా పూర్తి కాగలదని ఆశిస్తున్నాం‘ అని పాండే పేర్కొన్నారు. డిసెంబర్ ఆఖరు నాటికి డీల్ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎస్పీఏ కుదుర్చుకున్నాక, నియంత్రణ అనుమతులు రావాలని, ఆ తర్వాత ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారు. ‘వారు అంగీకార పత్రం (ఎల్వోఏ) సమరి్పంచేటప్పుడు అంచనా విలువలో 1.5 శాతం (సుమారు రూ. 270 కోట్లు) సెక్యూరిటీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్‌వోఐతో పాటు బ్యాంక్ గ్యారంటీ రూపంలో పేమెంట్ సెక్యూరిటీని అందించాలి‘ అని పాండే తెలిపారు. ఇక డీల్‌లో భాగమైన నగదు లావాదేవీ విషయానికొస్తే.. డిసెంబర్ ఆఖరు నాటికి సంస్థను అప్పగించే రోజున జరుగుతుందని వివరించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాను బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాటా గ్రూప్‌లో ఇది మూడో విమానయాన సంస్థ కానుంది. టాటా గ్రూప్ ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. వీటికి ఎయిరిండియా కూడా తోడైతే టాటా గ్రూప్ మార్కెట్ వాటా 26.9 శాతానికి చేరుతుంది. ఇండిగో తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తుంది. -
ఇక ఆర్ఐఎల్ సోలార్ పవర్
జీరో కార్బన్‌పై దృష్టి పెట్టిన డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగం పెంచింది. ఇప్పటికే రిలయన్స్ న్యూ ఎనర్జీ పేరిట పునరుత్పాదక ఇంధన కంపెనీని నెలకొలి్పన సంస్థ ఒకే రోజు రెండు కంపెనీలపై గురిపెట్టింది. తాజాగా నార్వేజియన్ దిగ్గజం ఆర్ఈసీ సోలార్‌ను సొంతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ద్వారా 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లోనూ 40 శాతం వాటాను చేజిక్కించుకుంది. తద్వారా 2035కల్లా జీరో కార్బన్ పోర్ట్‌ఫోలియో నిర్మాణంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎస్ఎల్) తొలిసారి ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా నేషనల్ బ్లూస్టార్(గ్రూప్) కో నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. నార్వేకు చెందిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)లో 100 శాతం వాటాను 77.1 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,783 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో 2035కల్లా నికరంగా జీరో కార్బన్‌తో శుద్ధ ఇంధన పోర్ట్‌ఫోలియో కంపెనీగా ఆవిర్భవించేందుకు ఆర్ఐఎల్ తొలి అడుగు వేసింది. ఆర్ఐఎల్ వార్షిక సమావేశంలో శుద్ధ ఇంధన తయారీ సామర్థ్యాలపై రూ. 60,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. కంపెనీ తీరిలా.. నార్వే, సింగపూర్ కేంద్రాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)నకు సోలార్ ఎనర్జీలో పట్టుంది. కొత్తతరహా సాంకేతిక ఆవిష్కరణలు, అత్యంత మన్నికైన దీర్ఘకాలిక సోలార్ సెల్స్, ప్యానల్స్‌ను రూపొందిస్తోంది. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన కంపెనీ నార్వేలో సోలార్ గ్రేడ్ పాలీసిలికాన్ తయారీకి రెండు, సింగపూర్‌లో పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి ఒక ప్లాంటు చొప్పున నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా 1,300 మందికిపైగా ఉద్యోగులున్నారు. విస్తరణకు మద్దతు ఆర్ఈసీ విస్తరణ ప్రణాళికలకు పూర్తి మద్దతివ్వనున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్ఈసీ.. సింగపూర్‌లో 2–3 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు.. బ్రాండ్న్యూ 2 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ పేరిట జామ్‌నగర్‌లో ఏర్పాటైన కాంప్లెక్స్‌లో ఆర్ఈసీ సాంకేతికతలను ఆర్ఐఎల్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎల్కు షాపూర్జీ కంపెనీలో వాటా శుద్ధ ఇంధన ఆస్తులపై దృష్టిపెట్టిన ఆర్ఐఎల్ తాజాగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,845 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా కంపెనీ బోర్డులో ఇద్దరు సభ్యులను నియమించనుంది. ఈపీసీ కార్యకలాపాల స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌ను ఖుర్షీద్ యజ్డీ డరువాలా కుటుంబంతో కలసి షాపూర్జీ పల్లోంజీ భాగస్వామ్య ప్రాతిపదికన(జేవీ) ఏర్పాటు చేసింది. డీల్‌లో భాగంగా తొలుత షేరుకి రూ. 375 ధరలో 2.93 కోట్ల స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రిలయన్స్ న్యూ ఎనర్జీ పొందనుంది. ఈక్విటీ జారీ తదుపరి పెరగనున్న వాటా మూలధనంలో ఇది 15.46 శాతానికి సమానంకాగా.. తదుపరి మరో 1.84 కోట్ల షేర్లను(9.7 శాతం వాటాకు సమానం) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి అదే ధరలో సొంతం చేసుకోనుంది. ఆపై సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ నుంచి 25.9 శాతం వాటా(4.91 కోట్ల షేర్లు) కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. వెరసి కంపెనీలో 40 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. గ్రూప్ రూ. 20,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను కొద్ది రోజులుగా షాపూర్జీ పల్లోంజీ అమలు చేస్తోంది. వినూత్న ఇన్వెస్ట్మెంట్... కొత్త, ఆధునిక సాంకేతికతలపై ఇన్వెస్ట్‌చేసే మా వ్యూహాలకు అనుగుణంగానే ఆర్ఈసీ గ్రూప్‌ను కొనుగోలు చేశాం. నిర్వహణా సామర్థ్యాలు సైతం ఈ దశాబ్దాంతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకున్న 100 గిగావాట్ల శుద్ధ ఇంధన సాధనకు ఉపయోగపడనున్నాయి. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ అధినేత -
చైనాతో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయ్
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఒక ఒప్పందం కుదిరే వరకు సరహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా గతంలో మాదిరిగా బుద్ధి చెప్పడానికి మన సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. గురువారం పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో పాల్గొన్న నరవణె మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఏర్పడే ముప్పుపై దృష్టి సారించామని చెప్పారు. దానికనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలిపారు. -
ఓయోతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రావెల్, ఆతిథ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు, టెక్నాలజీలను కలిసి అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడనుంది. హాస్పిటాలిటీ, ట్రావెల్ టెక్నాలజీ పరిశ్రమ కొత్త రూపు సంతరించుకునేలా క్లౌడ్ ఆధారిత ఆవిష్కరణలను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్‌ను ఓయో ఉపయోగించనుంది. సెల్ఫ్–చెకిన్, డిజిటల్ రిజిస్టర్, ఐవోటీ ఆధారిత స్మార్ట్ తాళాలు, వర్చువల్ అసిస్టెన్స్ మొదలైన సర్వీసులను గెస్టుల కోసం రూపొందిస్తుంది. చిన్న, మధ్యతరహా హోటళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఓయో తెలిపింది. ట్రావెల్, ఆతిథ్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఓయోతో భాగస్వా మ్యం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. మైక్రోసాఫ్ట్ సుమారు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 37 కోట్లు) ఓయోలో ఇన్వెస్ట్ చేసింది. -
గగన్‌యాన్‌కు ఫ్రాన్స్ సాయం
సాక్షి, బెంగళూరు: ఇస్రో తొలి మానవ సహిత ప్రయోగం (గగన్‌యాన్ మిషన్)కు ఫ్రాన్స్ సహకారం అందించనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎన్ఈఎస్ ఒప్పందం చేసుకున్నాయి. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం దేశానికి వచ్చిన ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జీన్ యువేస్ లీ డ్రయాన్ చివరి రోజైన గురువారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు ఇస్రో చైర్మన్ శివన్ స్వాగతం పలికారు. ఇస్రో, సీఎన్ఈఎస్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఫ్రాన్స్‌లోని క్యాడమోస్ కేంద్రంలో భారత వ్యోమగాములకు, ఫ్లైట్ ఫిజీషియన్లకు, క్యాప్కామ్ మిషన్ కంట్రోల్ బృందాలకు శిక్షణ ఇస్తారు. మైక్రోగ్రావిటీ అప్లికేషన్లు, అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధికి సీఎన్ఈఎస్ సహకరిస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సీఎన్ఈఎస్ అభివృద్ధి చేసిన వ్యవస్థను భారత వ్యోమగాములు ఉపయోగించుకోవచ్చు. భారత వ్యోమగాములకు ఫైర్ ప్రూఫ్ క్యారీ బ్యాగ్‌లను కూడా సీఎన్ఈఎస్ సమకూరుస్తుంది. రోదసీయానంలో వ్యోమగాముల ఆరోగ్యం ఫ్లైట్ ఫిజీషియన్లు లేదా సర్జన్ల బాధ్యత. -
టెక్ దిగ్గజాలకు ఆస్ట్రేలియా చెక్
సాక్షి, హైదరాబాద్: వార్తా పత్రికలకు అన్యాయం చేస్తూ అప్పనంగా రెవెన్యూ మూట కట్టుకుంటున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ దూకుడుకు అడ్డుకట్ట వేసి ఆస్ట్రేలియా ప్రపంచ దేశాలకు, వార్తా పత్రికలకు సరికొత్త మార్గాన్ని చూపించింది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వార్తా పత్రికలు సేకరిస్తున్న సమాచారాన్ని తమ టెక్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నెట్ ప్రపంచం ముందు ఉంచుతున్న ఫేస్బుక్, గూగుల్ ఆ వార్తల ద్వారా వస్తున్న ఆదాయంలో 80 శాతం మొత్తాన్ని వెనకేసుకుంటున్న విషయాన్ని గ్రహించి ఆస్ట్రేలియా తీసుకున్న సంచలన నిర్ణయంతో భారత్ సహా అన్ని దేశాలు ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టాయి. సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది... అన్నట్లుగా పత్రికలు అందిస్తున్న వార్తలను నెట్ ప్రపంచంలో హోస్ట్ చేస్తున్న ఫేస్బుక్, గూగుల్ చేస్తున్న వ్యాపార రహస్యాన్ని ఆస్ట్రేలియా బట్టబయలు చేసింది. వాస్తవానికి ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఈ దిశగానే ఆ రెండు టెక్ దిగ్గజాలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే, అస్ట్రేలియా మరింత వేగంగా చర్యలు తీసుకుని పత్రికలకు రెవెన్యూలో తగిన వాటా ఇచ్చే విధంగా చట్టం చేసింది. వార్తలు, సమాచారం షేర్ చేయడం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆయా మీడియా సంస్థలతో పంచుకోవాల్సిందేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఫేస్బుక్ మొదట్లో బెదిరింపు చర్యలకు దిగింది. ఆస్ట్రేలియా నుంచి ఏ వార్త హోస్ట్ చేయకుండా కట్టడి చేసింది. వార్తలు షేర్ చేస్తే ఆయా పత్రికా సంస్థలకు ఆదాయంలో వాటా ఇవ్వాలన్న ఆస్ట్రేలియా నిబంధనల వల్లనే ఆ దేశ వార్తలను బంద్ చేస్తున్నట్టు ఫేస్బుక్ చేసిన ప్రకటన జనానికి ఆగ్రహం తెప్పించింది. వార్తలకే పరిమితం కాకుండా రవాణా, వైద్య ఆరోగ్యం, ఫైర్ సర్వీసెస్, వాతావరణ విభాగం నుంచి వచ్చే అత్యవసర సమాచారం కూడా బ్లాక్ చేయడంతో ఫేస్బుక్ జనాగ్రహానికి బుక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ప్రభుత్వం మరింత పట్టుదలగా తమ నిబంధనలకు అంగీకరిస్తే తప్ప కుదరదని తేల్చిచెప్పడంతో ఫేస్బుక్, గూగుల్ దిగి రాక తప్పలేదు. దాదాపు రెండేళ్ల పాటు ఫేస్బుక్, గూగుల్ రెవెన్యూపై దృష్టి సారించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ సంస్థలకు అధిక ఆదాయం న్యూస్, వార్తా కథనాల కోసం నెటిజన్స్ చేస్తున్న సెర్చ్ వల్లనే వస్తున్నదని నిర్ధారించుకుంది. ఇలా వచ్చే దాంట్లో 80 శాతం ఆదాయాన్ని ఫేస్బుక్, గూగుల్ తమ ఖాతాలో వేసుకోవడాన్ని ఆస్ట్రేలియా బహిర్గతం చేసింది. ఆస్ట్రేలియా మార్గంలోనే ఇండియా చర్యలు తీసుకోవాలని పత్రికా సంస్థలు కోరుతున్నాయి. పత్రికలు యాడ్స్‌పైనే ఆధారపడతాయని, డిజిటల్ స్పేస్‌లో మాత్రం రెవెన్యూలో మెజారిటీ వాటాను గూగుల్ తీసుకుని తమను నష్టానికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఒప్పందాల బాటలో గూగుల్ ఆస్ట్రేలియా ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో గూగుల్ ఆస్ట్రేలియాకు చెందిన నైన్ ఎంటర్టైన్ మెంట్, సెవెన్ వెస్ట్ మీడియాలతో గత వారంలో రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి విలువ సుమారు 4.7 కోట్ల డాలర్లు. దీని ప్రకారం గూగుల్‌కు చెందిన ‘‘న్యూస్ షో కేస్’’లో కనిపించే నైన్ ఎంటర్టైన్ మెంట్, సెవెన్ వెస్ట్ ప్రచురణ సంస్థల వార్తలకు గూగుల్ ఈ సంస్థలకు డబ్బు చెల్లిస్తుంది. మీడియో మొఘల్ రూపర్ట్ మర్డోక్‌కు చెందిన న్యూస్కార్ప్తోనూ గూగుల్ ఒప్పందం చేసుకుంది. మూడేళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం విలువ మాత్రం తెలియరాలేదు. గూగుల్ ఒప్పందంలో భాగంగా న్యూస్కార్ప్కు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్, ద సన్, ద టైమ్స్ వంటి పలు వార్తా పత్రికల వార్తలు, ప్రత్యేక కథనాలు, ఫీచర్స్ గూగుల్ న్యూస్ షో కేస్‌లో కనిపిస్తాయి. అంతే కాకుండా సబ్స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటుకు, గూగుల్ యాడ్ టెక్నాలజీ సర్వీస్ ద్వారా ప్రకటనల ఆదాయాన్ని రెండు సంస్థలు పంచుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. గూగుల్ న్యూస్ షోకేస్ ప్రస్తుతం యూకే, జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనెడా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలతోపాటు మొత్తం 12 దేశాల్లో అందుబాటులో ఉంది. కొన్ని నెలల చర్చల తరువాత ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ ప్రచురణ సంస్థల లాబీ ఒకటి గూగుల్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోగలిగింది. దీని ప్రకారం వార్తల కోసం గూగుల్ ప్రచురణ సంస్థలకు డబ్బు చెల్లించనుంది. భారత్‌లోనూ ప్రచురణ సంస్థల వార్తలకు డబ్బులు చెల్లించేలా చూడాలని ఇండియన్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆ సంస్థలకు ఒక లేఖ రాసింది. స్వతంత్ర వార్తా పత్రికలు సిద్ధం చేసే కంటెంట్‌కు సంబంధించిన పరిహారం విషయంలో టెక్నాలజీ దిగ్గజాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయన్న వాదన చాలాకాలంగా ఉంది. ‘‘కంటెంట్ ఈజ్ కింగ్ అని మాటవరసకు చెబుతారు కానీ... ఈ టెక్నాలజీ యుగంలో అది పాపర్ అయిపోయింది’’అని ద ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా వ్యాఖ్యానించారు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్, ప్రచురణకర్తల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడానికి భారత ప్రభుత్వం స్పందించాలని కోరారు. భారత్‌లో ఫేస్బుక్ వినియోగదారులు 32.8 కోట్లు దేశంలో ఫేస్బుక్ వినియోగదారులు మొత్తం 32.8 కోట్ల మంది ఉంటారని అంచనా. వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 40 కోట్ల పైమాటే. 2018 నాటి అంచనాల ప్రకారం ఆన్ లైన్ అడ్వర్టైజ్మెంట్ మార్కెట్లో గూగుల్, ఫేస్‌బుక్‌ల సంయుక్త వాటా 68 శాతం. వార్తల హోస్టింగ్ ద్వారా వచ్చే అడ్వర్టయిజ్మెంట్ ఆదాయంలో 85 శాతం ప్రచురణ సంస్థలకు ఇవ్వాలని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) గూగుల్‌కు రాసిన లేఖలో డిమాండ్ చేసింది. ప్రచురణ సంస్థలు కొన్ని వేల మంది జర్నలిస్టులను నియమించుకుని, ఖర్చులు భరిస్తూ వార్తా సేకరణ చేస్తుంటాయని, వారు తయారు చేసే వార్తలను వాడుకోవడం ద్వారా గూగుల్ లాంటి సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయని ఐఎన్ఎస్ అధ్యక్షుడు ఎల్.ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్ ప్రస్తుతం ప్రచురణ సంస్థలకు ఎంత మొత్తం చెల్లిస్తోందో? ఏ ప్రాతిపదికన చెల్లిస్తోందో స్పష్టంగా తెలియదు. ప్రచురణ సంస్థలు సేకరించే వార్తలు/ కథనాలు ప్రొప్రైటరీ తరహావి కావడం వల్ల అవి విశ్వసనీయమైనవని, భారత్‌లో గూగుల్‌పై నమ్మకం పెరిగేందుకు ఉపయోగపడ్డాయని ఐఎన్ఎస్ గట్టిగా చెపుతోంది. గూగుల్, ఫేస్బుక్ లాంటి టెక్ దిగ్గజాలు ప్రచురణ సంస్థల డిమాండ్లకు తలొగ్గేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో యూట్యూబ్‌కు టెలివిజన్ చానళ్లు, సినిమా నిర్మాణ సంస్థలకు కూడా కంటెంట్ విషయంలో వివాదాలు వచ్చినప్పుడు యూట్యూబ్ ఏకపక్షంగా వ్యవహరించిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. అంతర్జాతీయ టెక్ సంస్థల బలం ముందు స్థానిక మీడియా సంస్థలు నిలబడటం కష్టమవుతుందని, ఈ కారణంగానే ప్రభుత్వ జోక్యం అనివార్యమని మళయాల మనోరమ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జయంత్ ఎం మాథ్యూ అన్నారు. ప్రచురణ సంస్థలన్నీ ఒక్కతాటిపై నిలబడి, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కూడా సహకరిస్తే వాణిజ్యంపై టెక్ సంస్థలతో చర్చలు జరిగేందుకు అవకాశం ఉందని... దానికి చట్టసభల సహకారం ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 85 శాతం రెవెన్యూ ప్రచురణకర్తలకు ఇవ్వాలి విశ్వసనీయమైన సమాచారం గూగుల్‌కు సాధికారత సమకూర్చింది. అత్యంత విశ్వసనీయమైన ప్రింట్ మీడియా కంటెంట్ గూగుల్‌కు లభించేలా పూర్తి యాక్సెస్‌ను ప్రచురణకర్తలు ఇచ్చారు. విశ్వసనీయత కలిగిన సమాచారం కోసం ప్రింట్ మీడియా వేలాది మంది జర్నలిస్టులను క్షేత్రస్థాయిలో నియమించుకుంది. అయితే ఈ సమాచారం, స్టోరీలు గూగుల్‌లో కనిపించినప్పుడు... న్యాయమైన విలువను ప్రచురణకర్తలకు గూగుల్ చెల్లించాల్సి ఉంది. విశ్వసనీయమైన, నాణ్యమైన వార్తలు అందిస్తున్న సంస్థలకు, ఫేక్ న్యూస్ అందిస్తున్న వాటికి మధ్య భారీ తేడా ఉంది. అందువల్ల వార్తా ప్రచురణకర్తలకు గూగుల్ తగిన పరిహారం, తగిన విలువ చెల్లించాలని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) ప్రతిపాదిస్తోంది. న్యూస్ ఇండస్ట్రీకి వాణిజ్య ప్రకటనలే వెన్నెముక. అయితే డిజిటల్ స్పేస్‌కు వచ్చేసరికి ప్రచురణకర్తల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే వాణిజ్య ప్రకటనల వ్యయంలో గూగుల్‌కే సింహభాగం వెళుతోంది... ప్రచురణకర్తలకు కొద్దివాటా మిగులుతోంది. అలాగే ప్రకటనల విధానంలో పారదర్శకత లేని పరిస్థితిని ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల వార్తాసంస్థలకు 85 శాతం రెవెన్యూ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గుర్తింపు పొందిన వార్తా ప్రచురణ సంస్థల ఎడిటోరియల్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఫేక్ న్యూస్‌ను అరికట్టవచ్చు. – ఎల్.ఆదిమూలం, అధ్యక్షుడు, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ విశ్వసనీయ సమాచారానికి తగిన విలువ సమకూరాలి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నేను ఐఎన్ఎస్ డిజిటల్ కమిటీకి చైర్మన్‌గా కూడా ఉన్నాను. కంటెంట్‌కు న్యాయమైన విలువను వార్తాసంస్థలకు ఇవ్వడం, వాణిజ్య ప్రకటనల్లో ప్రచురణకర్తల వాటా పెంచడం, ఫేక్ న్యూస్‌ను అరికట్టడం... అన్న మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రచురణకర్తలు విశ్వసనీయమైన వార్తలు, కరెంట్ అఫైర్స్, విశ్లేషణ, సమాచారం, వినోదం తదితర అంశాల్లో నాణ్యమైన జర్నలిజాన్ని అందిస్తున్నారు. గూగుల్ వెబ్ క్రాలర్స్ ఈ వార్తలను పాఠకులకు పంచుతోంది. వేలాది మంది జర్నలిస్టులతో విశ్వసనీయత కలిగిన సమాచారం అందిస్తున్నందున దానికి తగిన విలువ సమకూరాలి. ఈ దిశగా గూగుల్‌కు ఐఎన్ఎస్ లేఖ రాసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టాయి. యురోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాలలో గూగుల్ సముచిత రీతిలో ప్రచురణకర్తలకు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఇక్కడ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. – జయంత్ మమెన్ మాథ్యూ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, మలయాళ మనోరమ వైశాల్యపరంగా పెద్దదే అయినప్పటికీ... ఆస్ట్రేలియా జనాభా 2.54 కోట్లు మాత్రమే. ఫేస్బుక్ వినియోగదారులు 1.12 కోట్ల మంది. ఇంత తక్కువ సబ్‌స్క్రైబర్ బేస్ ఉన్న ఆస్ట్రేలియానే ప్రభుత్వ దృఢ సంకల్పంతో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్‌లను దారిలోకి తెచ్చినపుడు... మనమెందుకు చేయలేం? భారత్‌లో ఫేస్‌బుక్‌కు ఏకంగా 32.8 కోట్ల మంది ఖాతాదారులున్నారు. ప్రపంచంలో వారికిదే అతిపెద్ద మార్కెట్. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ సంప్రదాయ వార్తా పత్రికలు అనేక సవాళ్లను, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఆస్ట్రేలియా స్ఫూర్తితో భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీడియా సంస్థలు కోరుతున్నాయి. తమ వార్తల ద్వారా ఫేస్బుక్, గూగుల్‌లు ఆర్జిస్తున్న మొత్తంలో సముచిత వాటాను ఇచ్చేలా చట్టం తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కొరవడిన పారదర్శకత వార్తల హోస్టింగ్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రకటనల రూపంలో ఎంత ఆదాయం వస్తోందన్న విషయం బయటికి తెలియడం లేదు. గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు తాము ఆర్జించిన ప్రకటనల ఆదాయంలో అతి తక్కువ మొత్తాన్ని ప్రచురణ సంస్థలకు విదిలిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్లు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా అదాయంలో అధిక మొత్తం టెక్ సంస్థలకే వెళుతోందన్నది ఆస్ట్రేలియా ప్రభుత్వ అంచనా కూడా. ♦ ఆస్ట్రేలియాలో డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ కోసం వంద రూపాయలు ఖర్చు చేస్తే అందులో 49 రూపాయలు గూగుల్‌కు, 24 రూపాయలు ఫేస్‌బుక్‌కు వెళుతోందని, మిగిలిన 27మాత్రమే ఇతర మాధ్యమాలకు అందుతోందని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ అధ్యయనంలో తేలింది. -
భారత్, మాల్దీవుల రక్షణ బంధం
మాలే: భారత్, మాల్దీవుల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైంది. మాల్దీవుల నావికాదళ బలోపేతానికి తాము పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తామని భారత్ మరోసారి స్పష్టం చేసింది. రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం ఇరు దేశాల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం కుదిరింది. మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌కు చెందిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుల మ«ధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్ బ్యాంకు నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకుంటాయి. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీంలతో చర్చించిన తర్వాత ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మాల్దీవుల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఎప్పుడైనా ఆ దేశానికి భారత్ విశ్వసనీయమైన నేస్తమని జై శంకర్ ట్విట్ చేశారు. 5 కోట్ల డాలర్ల రుణ ఒప్పందంతో పాలు మాల్దీవుల్లోని తీరప్రాంత రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం జై శంకర్ మారియా దీదీలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2016లో కుదుర్చుకున్న రక్షణ కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ఒప్పందాలు కుదిరాయి. మాల్దీవుల్లో రేవులు, డాక్‌యార్డ్‌ల నిర్మాణం, వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్ సర్వీసులు, ఆ దేశ నావికాదళానికి శిక్షణ వంటి వాటిలో భారత్ సహకారం అందించనుంది. -
బలగాల ఉపసంహరణపై చైనాతో డీల్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా ఇరుదేశాల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైన పాంగాంగ్ సో సరస్సుకు ఇరువైపుల మోహరించిన బలగాలను రెండు దేశాలు వెనక్కు తీసుకునే విషయంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మేరకు సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వద్ద మోహరించిన ఫ్రంట్‌లైన్ సైనికులు ‘దశలవారీగా, సమన్వయంతో, నిర్ధారించుకోదగిన విధానంలో’వెనక్కు వెళ్తారని పేర్కొన్నారు. దాదాపు గత 9 నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా చైనాతో కుదిరిన ఒప్పందం వివరాలను రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభకు వెల్లడించారు. తాజా ఒప్పందంతో గత సంవత్సరం మే 5 నాటి కన్నా ముందున్న స్థితికి సరిహద్దుల్లో పరిస్థితులు చేరుకుంటాయన్నారు. అన్ని ద్వైపాక్షిక నిబంధనలు, ఒప్పందాలను గౌరవిస్తూ, సాధ్యమైనంత తొందరగా ఉపసంహరణ జరగాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయన్నారు. పాంగాంగ్ సొ సరస్సునకు ఇరువైపులా గత సంవత్సరం ఏప్రిల్ తరువాత నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఏ విషయాన్ని దాచి పెట్టలేదు ఆయా ప్రాంతాల్లో గస్తీ సహా అన్ని మిలటరీ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు వెల్లడించారు. గస్తీ పునః ప్రారంభంపై ఇరుదేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. చైనాతో చర్చల విషయంలో భారత్ ఏ విషయాన్ని దాచి పెట్టలేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అలాగే, భారత భూభాగంలోని అంగుళం భూమిని కూడా ఎవరూ తీసుకోవడానికి అంగీకరించబోమన్నారు. తాజా ఒప్పందం ప్రకారం, చైనా తమ సైనిక బలగాలను పాంగాంగ్ సరస్సు ఉత్తర సరిహద్దు నుంచి తూర్పు దిశగా ‘ఫింగర్ 8’ వరకు వెనక్కు తీసుకుంటుందని రాజ్‌నాథ్ తెలిపారు. అలాగే, భారత దళాలు ‘ఫింగర్ 3’ సమీపంలోని శాశ్వత మిలటరీ కేంద్రం ధన్సింగ్ థాపా పోస్ట్ వరకే పరిమితమవుతాయన్నారు. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రావడం ప్రారంభమైందన్నారు. ఈ ఉపసంహరణ ముగిసిన 48 గంటల్లోపు రెండు దేశాల మిలటరీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు జరుగుతాయన్నారు. అప్పుడు, ఇతర అపరిష్కృత అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. ‘ప్రణాళికాబద్ధ విధానంతో చైనాతో క్రమం తప్పకుండా చర్చలు కొనసాగించిన కారణంగా, పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట మోహరించి ఉన్న ఇరుదేశాల బలగాల ఉపసంహరణకు ఒప్పందం కుదిరింది’అని రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటించారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట చైనా, భారత్ దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చైనా బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. సైనికులు చేసిన త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తరంగా ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు చైనా తన బలగాలను ఉపసంహరించాలని ఆ దేశంతో జరిగిన 9 విడతల చర్చల్లోనూ భారత్ గట్టిగా వాదించింది. ప్రతిగా, సరస్సు దక్షిణ తీరం వెంట ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత దళాలు వైదొలగాలని చైనా డిమాండ్ చేసింది. ముఖపరి, రెచిన్ లా, మగర్ హిల్ తదితర వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాలను ఐదు నెలల క్రితం భారత దళాలు స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం.. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 8 వరకు తాత్కాలికంగా ‘నో పెట్రోలింగ్ జోన్’గా మారుతుంది. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య చైనా పలు బంకర్లను నిర్మించింది. ఫింగర్ 4 ను దాటి ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారత దళాలను అడ్డుకుంది. చైనా దళాలు ఫింగర్ 8 వరకు వెళ్లేందుకు అంగీకరించడం గొప్ప విజయంగా భావించవచ్చని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ -
అమెరికా ఆంక్షలను పట్టించుకోం : రష్యా
న్యూఢిల్లీ: భారత్‌తో ఎస్–400 క్షిపణి వ్యవస్థల సరఫరా సహా అన్ని రక్షణ ఒప్పందాల అమలు కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా విధించే ఏకపక్ష ఆంక్షలను పట్టించుకోమని తెలిపింది. రష్యా రాయబారి నికొలాయ్ కుదాషెవ్, రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బబూష్కిన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘రష్యా నుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను టర్కీపై అమెరికా ఆంక్షలను విధించింది. దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేందుకు అమెరికా ఇలా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించడం అన్యాయం. ఐక్యరాజ్య సమితి విధించే ఆంక్షలను తప్ప ఇలా ఏకపక్షంగా ప్రకటించే చర్యలను పట్టించుకోం. ఏది ఏమైనా భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థల సరఫరా కొనసాగుతుంది’ అని అన్నారు. ఎస్–400 క్షిపణి వ్యవస్థలు ఐదింటిని కొనుగోలు చేసేందుకు 2018లో భారత్ రష్యాతో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్ డాలర్లను చెల్లించింది. -
ఆర్మేనియా, అజర్బైజాన్ శాంతి ఒప్పందం
ఎరేవాన్(ఆర్మేనియా): అజర్ బైజాన్‌లోని నాగోర్నో – కారాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతోన్న ఆర్మేనియా, అజర్బైజాన్లు ఘర్షణలకు స్వస్తి పలుకుతూ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి 2000 మంది రష్యన్ శాంతి దళాలను వివాదాస్పద ప్రాంతంలో మోహరించాలని తీర్మానించారు. 1994లో కుదిరిన యుద్ధ విరమణ సంధి ప్రకారం నాగోర్నో కారాబాఖ్, ఆర్మేనియా దళాల నియంత్రణలో ఉంది. అంతకు ముందు జరిగిన భీకర పోరాటంలో 30,000 మంది చనిపోయారు. అప్పటి నుంచి, అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ, పూర్తి స్థాయి యుద్ధం ఈ యేడాది సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం అయ్యింది. అనేక సార్లు కాల్పుల విరమణకు పిలుపునిచ్చి నప్పటికీ అవి అమలు కాలేదు. వ్యూహాత్మక నగరం సుషిని అజర్బైజాన్ తన అదుపులోకి తెచ్చుకుంది. దీనితో ఈ ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నారు. తాజా ఒప్పందం ప్రకారం ఆర్మేనియాకు చెందిన భద్రతా బలగాలు నాగర్నో కారాబఖ్ సరిహద్దులోని ప్రాంతాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ళ పాటు ఈ ప్రాంతంలో రష్యా దళాలు ఉంటాయి. -
నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య నేడు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరుదేశాల సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందం ఇది అని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ టీ ఎస్పర్ మధ్య సోమవారం జరిగిన చర్చల సందర్భంగా దీనిపై ఒక అంగీకారం కుదిరినట్లు తెలిపాయి. ఇరుదేశాల మధ్య రక్షణ సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సహకారం పెంపొందించుకోవడం మొదలైన అంశాలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపారని, చైనాతో సరిహద్దు వివాదం అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చిందని వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)’ ఒప్పందం కుదరడంపై రాజ్‌నాథ్, ఎస్పర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపాయి. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం పరస్పర విస్తృత ప్రయోజనకర అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్(నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా(ఎయిర్‌ఫోర్స్), డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులున్నారు. భారత్, అమెరికాల మధ్య నేడు(మంగళవారం) ప్రారంభం కానున్న 2+2 కీలక మంత్రిత్వ స్థాయి చర్చల కోసం మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ 2+2 చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, జైశంకర్ పాల్గొననున్నారు. ద్వైపాక్షిక సహకారంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతం విషయంలో పరస్పర సహకారం అంశంపై కూడా వారు చర్చించనున్నారు. అమెరికా మంత్రులు పాంపియో, ఎస్పర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ను కూడా కలవనున్నారు. యూఎస్ రక్షణ మంత్రి ఎస్పర్‌కు రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద త్రివిధ దళాలు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భార త్, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ 2+2 చర్చలు జరుగుతుండటం గమనార్హం. భారత్‌తో సరిహద్దు ఘర్షణలు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఎదుర్కొన్న తీరు.. తదితర అంశాలపై అమెరికా ఇప్పటికే పలుమార్లు చైనాను తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటనకు ముందు.. ‘ప్రాంతీయ, ప్రపం చ శక్తిగా భారత్ ఎదగడాన్ని అమెరికా స్వాగతిస్తోంది’ అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. 2016లో అమెరికా భారత్‌ను ‘ప్రధాన రక్షణ రంగ భాగస్వామి’గా ప్రకటించి, రక్షణ రంగ సహకారంలో విశ్వసనీయ మిత్రదేశం హోదా కల్పించింది. ఎస్పర్‌కు స్వాగతం పలుకుతున్న రాజ్‌నాథ్ -
బీఎస్ఈతో తెలంగాణ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా స్టాక్ ఎక్సే్ఛంజ్ బీఎస్ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక వనరుల లభ్యత, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాల్‌ను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అలాగే లిస్టింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేందుకు బీఎస్ఈ సాయం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల లభ్యత ఎంఎస్ఎంఈలకు పరిమితంగా ఉంటోంది. ఇది కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విస్తరణ మొదలుకుని కొనుగోళ్ల స్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుందన్నారు. ప్రస్తు తం స్టాక్ ఎక్సే్ఛంజీల్లో రాష్ట్రానికి చెందిన కొన్ని ఎంఎస్ఎంఈలు మాత్రమే నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఈ సంఖ్య త్వరలో పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
సయోధ్య దిశగా...
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు భారత్, చైనా మధ్య బుధవారం జరిగిన మరో దఫా చర్చల్లో ముందడుగు పడింది. ఇరు పక్షాలు అపార్థాలను, అనుమానాలను పక్కన పెట్టి సుస్థిరత నెలకొల్పే దిశగా సామరస్యంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించాయి. అయిదు నెలలుగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్ని నివారించడానికి సెప్టెంబర్ 10న మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య కుదిరిన అయిదు అంశాల ఒప్పందం అమలుకు సంబంధించి చర్చలు జరిపారు. సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) మార్గదర్శకాలకు అమలుకి చేపట్టాల్సిన చర్యలపై ఇరు దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని వెంటనే ఉపసంహరించడం, సరిహద్దు నిర్వహణలో అన్ని ప్రోటోకాల్స్‌ని పాటించడం, శాంతి స్థాపన వంటి అంశాలపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్ని కూడా సమీక్షించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు యప్‌టీవీ!
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు త్వరలో యప్ టీవీ ట్రిపుల్ ప్లే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్–యప్ టీవీ సోమవారమిక్కడ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నాయి. ప్రత్యేక కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్, యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో 250 లైవ్ టీవీ ఛానల్స్, 5 వేలకుపైగా సినిమాలు, వందకుపైగా టీవీ షోలు, వీడియో కాన్ఫరెన్స్, గేమింగ్, ఒరిజినల్ సిరిస్, ఫస్ట్ డే ఫస్ట్ షో లాంటి సేవలను అందిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా బీఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్లు, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు యప్ టీవీ సేవలు అందుబాటులోకి వస్తాయి. తాజా ఉదయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి గ్రామంలో బీఎస్ఎన్ఎల్ సేవలందిస్తోందని, వారందరికీ యప్‌టీవీ ట్రిపుల్ ప్లే సేవలు చేరువవుతాయని చెప్పారు. పునరుద్ధరణ ప్రణాళికపై సీఎండీ పుర్వార్ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను నెలలో ప్రజల ముందు ఉంచుతామని సంస్థ సీఎండీ పీకే పుర్వార్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయిస్తారని అంచనా వేస్తున్నట్టు తెలియజేశారు. ‘‘ఉద్యోగుల వేతనాలు దీపావళికి ముందే ఈ నెల 23, 24 నాటికి చెల్లిస్తాం. టెలికం రంగం సవాళ్లతో కూడిన దశలో ఉందని మనకు తెలుసు. పోటీ వల్ల టెలికం కంపెనీలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఎన్ఎల్కు ఇతర సమస్యలూ ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. పునరుద్ధరణ ప్యాకేజీ ద్వారా దీనికి పరిష్కారం చూపనున్నాం’’ అని పుర్వార్ వివరించారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ప్రభుత్వం అనుమతి తెలిపితే... రూ.74 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. బీఎస్ఎన్ఎల్ ఆస్తుల్ని విక్రయించడం ద్వారా దీన్ని రికవరీ చేసుకోవాలన్నది ప్రణాళిక. -
తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం
సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఇరు ప్రాంతాల సంబంధాలు మరింత ముందుకు వెళ్తాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ నేతృత్వంలోని బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా.. బుధవారం తెలంగాణతో ‘సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్’ కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మరీ్ఫ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంతకాలు చేశారు. 2 రోజులుగా తమ రాష్ట్రంలోని ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో సమావేశం అవుతున్నామని, తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం ఉందని ఫిలిప్ మర్ఫీ అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సెక్రటరీ అజయ్ మిశ్రా, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ పాల్గొన్నారు. -
భారత్‌కు 5 వేల కోట్ల క్షిపణి వ్యవస్థ
జెరూసలెం: భారత్‌కు అదనంగా దాదాపు రూ.5,683 కోట్ల విలువ చేసే శక్తిమంతమైన బరాక్–8 క్షిపణులను ఇజ్రాయెల్ అందించబోతోంది. ఈ మేరకు రక్షణ పరికరాలు తయారుచేసే ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత నావికాదళానికి బరాక్ 8 (ఎస్ఏఎం) క్షిపణులను సరఫరా చేయనుందని ఆ సంస్థ ప్రకటించింది. భారత్, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధిపరిచాయి. రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్‌ల బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయనేందుకు బరాక్–8 క్షిపణి వ్యవస్థ ఓ సంకేతం అని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ పేర్కొంది. గత కొద్ది సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గగన, సముద్ర, భూతలం నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఈ వ్యవస్థలో చాలా ఆధునికమైన వ్యవస్థలను పొందుపరిచారు. డిజిటల్ రాడార్, కమాండ్, కంట్రోల్, లాంచర్లు, ఇంటర్‌సెప్టార్లు, డేటా లింక్ తదితర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి. -
చైనా కంపెనీలకు ఫేస్బుక్ సమాచారం
వాషింగ్టన్: చైనాకు చెందిన కనీసం నాలుగు మొబైల్ కంపెనీలతో ఫేస్‌బుక్‌కు సమాచార మార్పిడి ఒప్పందం ఉందని అమెరికా మీడియాలో కథనం వెలువడింది. అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా నిఘా వర్గాలు పేర్కొన్న హువాయ్ కంపెనీ కూడా అందులో ఉన్నట్లు తెలిసింది. అమెరికా సంస్థ బ్లాక్‌బెర్రీతో సమాచారం పంచుకోవడానికి ఉన్న ఒప్పందం లాంటిదే చైనా కంపెనీలతోనూ కుదుర్చుకున్నామని ఫేస్బుక్ స్పష్టం చేసింది. చైనా కంపెనీలతో ఒప్పందాలు 2010లో కుదుర్చుకున్నామని, హువాయ్‌తో ఒప్పందం ఈ వారంతోనే ముగుస్తుందని వివరణ ఇచ్చింది. ఫేస్‌బుక్‌తో ఒప్పందం వల్ల హువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్ లాంటి చైనా కంపెనీలు కొందరు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పొందేందుకు వీలవుతుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చైనా కంపెనీలతో ఫేస్బుక్ ఒప్పందాలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
అభివృద్ధి కోసం ఉమ్మడి కృషి
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, అభివృద్ధితో కూడిన ప్రాంతీయ భద్రత కోసం కలిసికట్టుగా కృషి చేయాలని భారత్, వియత్నాం అంగీకరించాయి. భారత్‌లో ఉన్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్‌తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అణు ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతోపాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో సహకారం పెంచుకునేందుకు అంగీకరించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి విలేకరులతో మాట్లాడారు. సముద్ర సంబంధ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వతంత్రం, అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయనున్నామన్నారు. సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో సహకారం, రక్షణ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నామన్నారు. ఆసియాన్ దేశాలతో అన్ని రంగాల్లోనూ అనుసంధానత కలిగి ఉండాలన్న భారత్‌ను వియత్నాం అధ్యక్షుడు బలపరిచారు. ఆసియాన్ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానం, విమాన యానం ఉండాలని అన్నారు. ఈ ప్రాంతంలో సైనికపరంగా విస్తరిస్తున్న చైనాకు ఈ ప్రకటన ఒక సందేశంగా పనిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
రష్యాతో భారత్ భారీ రక్షణ బంధం
-
రష్యాతో భారీ రక్షణ బంధం
మోదీ - పుతిన్ భేటీతో సహకారం బలోపేతం - ‘ట్రయంఫ్’ క్షిపణి రక్షణ వ్యవస్థ సహా రూ. 60,000 కోట్లతో మూడు భారీ ఒప్పందాలు - 4 గ్రిగోరోవిచ్ తరగతి యుద్ధనౌకల కొనుగోలు.. 200 కమోవ్ హెలికాప్టర్ల తయారీ - ‘స్మార్ట్ సిటీ’ల్లో సహకారం, వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో మరో 13 ఒప్పందాలు - కూడంకుళం అణు ప్లాంటులో మరో రెండు రియాక్టర్ల నిర్మాణానికి పచ్చజెండా - భారత్, రష్యాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ మార్గంపై సంయుక్తంగా అధ్యయనం - ఉగ్రవాదంపై సత్వరమే బలమైన సమగ్ర అంతర్జాతీయ చట్టం: మోదీ, పుతిన్ పిలుపు - ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను ఏమాత్రం సహించరాదని అగ్రనేతల ఉద్ఘాటన బెనౌలిమ్(గోవా): భారత్ అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో సహా రష్యాతో మూడు భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. రూ. 60 వేల కోట్ల విలువైన మూడు భారీ రక్షణ ఒప్పందాలతో సహా 16 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అలాగే.. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో ఏమాత్రం సహనం వహించరాదని పాత మిత్రులైన ఇరు దేశాలూ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు శనివారం గోవాలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు నిర్వహించారు. ఉడీ ఉగ్రదాడి సహా అనేక అంశాలపై చర్చించారు. తర్వాత ఇద్దరి సమక్షంలో 16 ఒప్పందాలపై ఇరు పక్షాలూ సంతకాలు చేశాయి. మొత్తం 500 కోట్ల డాలర్లతో రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థలను కొనడంతో పాటు, అడ్మిరల్ గ్రిగోరోవిచ్ తరగతి (ప్రాజెక్ట్ 11356) నిర్దేశిత క్షిపణి రహస్య యుద్ధ నౌకల్ని నాలుగింటిని కొనడం(రూ. 20,016 కోట్లు) కమోవ్ హెలికాప్టర్ల తయారీ కోసం సంయుక్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. ఈ మూడు భారీ రక్షణ రంగ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్ ఇటీవల తన సైనిక స్థావరాలను అమెరికాకు అందుబాటులోకి తెస్తూ.. ఆ దేశంతో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. సంప్రదాయంగా రక్షణ భాగస్వామి అయిన రష్యా నుంచి దూరంగా జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, హైడ్రోకార్బన్లు, అంతరిక్షం, స్మార్ట్ సిటీల వంటి రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలూ మూడు ప్రకటనలు చేశాయి. పాత మిత్రుడు ఉత్తమం: మోదీ చర్చల అనంతరం పుతిన్‌తో కలసి మోదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు కొత్త మిత్రుల కన్నా ఒక పాత మిత్రుడు ఉత్తమం’ అనే రష్యా సామెతను ఉటంకించారు. తద్వారా.. ఇటీవల పాక్‌తో సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించిన రష్యాకు పరోక్షంగా అసంతృప్తిని తెలియజేశారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరాటానికి భారత చర్యలను అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వడం పట్ల రష్యాకు మోదీ అభినందనలు తెలిపారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో సహనానికి తావుండరాదని తామిద్దరం ఉద్ఘాటించినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల మధ్యా సన్నిహిత సహకారం ఉందని పుతిన్ పేర్కొన్నారు. ఈ భేటీతో అత్యున్నత ఫలితాలు రావడం.. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యపు ప్రత్యేక, విశిష్ట స్వభావాన్ని విస్పష్టంగా చాటుతోందని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వాముల మధ్య సహకారాన్ని నెలకొల్పి అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతి ఏటా సైనిక పారిశ్రామిక సదస్సును నిర్వహించే అంశంపై కృషి చేయాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. రష్యాలోని చమురు, సహజవాయువు రంగంలో భారత సంస్థలు గత 4 నెలలలోనే 550 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయని మోదీ చెప్పారు. దీని విస్తరణకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అలాగే.. ఇరు దేశాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ మార్గంపై సంయుక్తంగా అధ్యయనం చేస్తామన్నారు. ఇరు దేశాలూ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్‌ను నెలకొల్పాలనీ నిర్ణయించినట్లు తెలిపారు. కూడంకుళంలో మరో రెండు రియాక్టర్ల నిర్మాణం తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని రెండో యూనిట్‌ను మోదీ, పుతిన్‌లు జాతికి అంకితం చేశారు. 3, 4వ యూనిట్ల శంకుస్థాపనను వీక్షించారు. పౌర అణువిద్యుత్ రంగంలో సహకారాన్ని భారత్, రష్యాలు కొనసాగిస్తూ.. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటులో ఈ రెండు రియాక్టర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. అయితే ఆ ప్లాంటులో 5, 6వ యూనిట్ల నిర్మాణంపై జనరల్ ఎగ్రిమెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను, క్రెడిట్ ప్రొటోకాల్‌ను ఖరారు చేయలేకపోయాయి. వీటిని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయి. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు త్వరగా సభ్యత్వం ఇవ్వాలన్న అంశానికి రష్యా బలంగా మద్దతునిస్తోందని, ఖండాంతర క్షిపణి వ్యాప్తి, క్షిపణి సాంకేతికత నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా హేగ్ కోడ్ ఆఫ్ కండక్ట్లోకి భారత్ ప్రవేశాన్ని రష్యా ఆహ్వానించినట్లు ఇరుదేశాల సంయుక్త ప్రకటన తెలిపింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దు.. సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ.. ఉగ్రవాదులకు భద్రమైన స్థావరాలను నిరాకరించేందుకు చర్యలు చేపట్టాలని భారత్, రష్యాలు ఉద్ఘాటించాయి. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానం (సీసీఐటీ)ని సత్వరమే పూర్తిచేయాలన్నాయి. ఇరు దేశాల సంయుక్త ప్రకటన ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ ఖండించింది. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం సహనం లేని సూత్రం ప్రాతిపదికగా, ద్వంద్వ ప్రమాణాలను పాటించకుండా బలమైన అంతర్జాతీయ చట్ట నిబంధనలను రూపొందించాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. ‘స్మార్ట్ సిటీ’ల్లో రష్యా ఐటీ పరిష్కారాలు... భారత ‘స్మార్ట్ సిటీ’ కార్యక్రమం అమలులో రష్యా సంస్థల ఐటీ పరిష్కారాలను ఉపయోగించుకోవడం కోసం ఆ దేశంతో ఒప్పందాలు చేసుకుంది. జేఎస్సీ రూసిన్ఫామెక్సపర్ట్కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, హోం శాఖ, జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్, హరియాణా ప్రభుత్వాలకు మధ్య ఇవి జరిగాయి. ఉగ్రవాదంపై విభేదాలొద్దు - చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ - ‘బ్రిక్స్’ సందర్భంగా ప్రత్యేక భేటీ బెనౌలిమ్(గోవా): ఏ ఒక్క దేశానికీ ఉగ్రవాద నష్టం నుంచి మినహాయింపు లేదనీ.. ఈ విషయంలో విభేదాలుండజాలవని ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా శనివారం జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా విషయాన్ని స్పష్టం చేశారు. జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఐక్యరాజ్యసమితి నిషేధం ముద్ర పడకుండా చైనా అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. భారత్, చైనా దేశాలు రెండూ ఉగ్ర బాధిత దేశాలేనన్న మోదీ.. ఈ ప్రాంతంలో అస్థిరత సృష్టించే యత్నాలకు అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదం విషయంలో భిన్నాభిప్రాయాలను సహించేది లేదన్నారు. ఈ సమస్యను ఎదుర్కునేందుకు భారత్-చైనా దీర్ఘకాలం పనిచేసేందుకు సంయుక్త వేదికను ఏర్పాటుచేసి ముందుకెళ్లాలని జిన్‌పింగ్‌ను కోరారు. దీనికి అంగీకరించిన జిన్‌పింగ్ ఇరుదేశాలు ఉగ్రవాదవ్యతిరేక కార్యక్రమాలను, భద్రతపై చర్చలు, భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నట్లు విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఇరుదేశాల జాతీయ భద్రత సలహాదారులు త్వరలో భేటీ కావాలని జిన్‌పింగ్ సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. ‘ఎన్ఎస్జీ’పై త్వరలో భేటీ..: అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వంపై భారత అధికారులు మరోసారి చైనా అధికారులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జిన్‌పింగ్.. మోదీకి చెప్పారు. ఇది భారత్‌కు సహాయకరంగా ఉంటుందని జిన్‌పింగ్ చెప్పినట్లు స్వరూప్ తెలిపారు. భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై చైనా అంత వ్యతిరేకంగా ఏమీ లేదని.. కొన్ని విషయాల్లో ఉన్న అభిప్రాయభేదాల వల్లే ఆలస్యమైందని.. త్వరలోనే అన్నీ సర్దుకునేలా సానుకూలంగానే జిన్‌పింగ్ వ్యాఖ్యలున్నాయని స్వరూప్ చెప్పారు. ‘ట్రయంఫ్’తో భరోసా! రష్యాతో చేసుకున్న రక్షణ ఒప్పందాల్లో రూ.33,350 కోట్ల విలువైన ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ ఒప్పందం కీలకమైనది. 400 కి.మీ. పరిధి వరకూ దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లతో పాటు.. రహస్య విమానాలతోసహా శత్రు విమానాలనూ ధ్వంసం చేసే సామర్థ్యం గల ఈ వ్యవస్థ.. భద్రతకు మంచి భరోసానిస్తుందని రక్షణ నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి వ్యవస్థలు ఐదింటిని కొనాలని భారత్ భావిస్తోంది.వీటితో భారత్ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ అధునాత భద్రతా వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దు వెంట మూడింటిని, చైనా సరిహద్దు వెంట రెండింటిని మోహరించాలన్నది భారత్ ప్రణాళిక. ఒక్కో ట్రయంఫ్ వ్యవస్థలో 8 లాంచర్లు, ఒక కంట్రోల్ సెంటర్, రాడార్, 16 క్షిపణులు ఉంటాయి. ఒక్కో వ్యవస్థకు 100 కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. దీనికి 3 రకాల క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. ఒక రక్షణ పొరను సృష్టించటం, అదే సమయంలో 36 లక్ష్యాలపై దాడి చేయగలగడం దీని ప్రత్యేకత. గంటకు 17,000 కి.మీ వేగంతో ఇది లక్ష్యాలపై దాడి చేయగలదు. ప్రపంచంలోని అన్ని విమానాల కన్నా ఇది అధిక వేగం. కాగా అడ్మిరల్ గ్రిగోరోవిచ్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందం కింద.. రెండు నౌకలను భారత్‌కు రష్యా అందిస్తుంది. మరో రెండింటిని రష్యా సాయంతో భారత్‌లోనే నిర్మిస్తారు. కమోవ్ హెలికాప్టర్ల ఒప్పందం కింద రూ. 6,672 కోట్లతో 200 కమోవ్ 226టి హెలికాప్టర్లను రష్యా, భారత్‌లు కలసి భారత్‌లోనే తయారు చేస్తాయి. -
భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు
-
పాక్‌ని ఇండియా ఏకాకి చేసేనా..?
-
భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు
పణజీ: భారత్, రష్యా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు గోవాకు వచ్చిన పుతిన్‌తో నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు. భారత్, రష్యా 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పారిశ్రామిక అభివృద్ధి, రక్షణ రంగంలో ఒప్పందాలు చేసుకున్నాయి. నాగ్‌పూర్- సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లపై రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. అనంతరం మోదీ, పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాలు ఉజ్వల భవిష్యత్ దిశగా సాగుతున్నాయని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రష్యా అండగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇరు దేశాలు ఒకే వైఖరి అవలంభిస్తున్నాయని చెప్పారు. ఇద్దరు కొత్త మిత్రుల కంటే పాత మిత్రుడే ఉత్తమమని అన్నారు. సైన్స్, టెక్నాలజీ కమిషన్ ఏర్పాటు చేయడానికి భారత్-రష్యా అంగీకరించాయని మోదీ తెలిపారు. పారిశ్రామిక, రక్షణ, సాంకేతి రంగాల్లో ఇరు దేశాల కంపెనీల మధ్య సహకారం పెరుగుతోందని పుతిన్ అన్నారు. -
ఆగమేఘాలపై సీఆర్డీఏ పరిధిలో చెక్కులు పంపణీ!
విజయవాడ: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తుంది. రాజధాని ప్రాంత రైతులు, తమ భూములు బలవంతంగా లాక్కున్నారంటూ దేశ రాజధానిలో ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై సోమవారం రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని చెక్కులు పంపిణీ చేసింది. అనంతరం చెక్కులు పంపిణీ చేసిన రైతుల పంట భూముల్లో ట్రాక్టర్లతో చదును కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరు మండలం నేలపాడులో 93 ఎకరాలకు సంబంధించిన 36 మంది రైతులతో అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకుని భూములను స్వాధీనం చేసుకున్నారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 30 వేల చొప్పున రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. వెనువెంటనే నేలపాడు సర్పంచ్ సుబ్బారావు పొలంలో భూమి చదును చేసే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించారు. భూ సమీకరణకు అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులందరినీ పరిహారం వైపు మళ్లించడం, భవిష్యత్తులో న్యాయ వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం కోసమే ఈ రకమైన ఎత్తుగడ వేశారని రాజధాని ప్రాంత రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత భూ సమీకరణ ముగిసిన వెంటనే అంగీకార పత్రాలు అందిన భూములకు సంబంధించి సర్వే నిర్వహించి అన్నీ సక్రమంగా ఉంటేనే ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం తొలుత భావించింది. రైతుల భూమి అధికారికంగా సీఆర్డీఏ చేతికి అందాక భూమిని చదును చేస్తామని సీఆర్డీఏ అధికారులు నిన్నటి వరకూ చెప్పారు. ఒప్పందాలు పూర్తయిన తర్వాత మాస్టర్‌ప్లాన్ వచ్చేలోపు భూములను చదును చేయాలని భావించారు. కానీ అవేమీ మొదలుకాకుండానే సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సోమవారం సాయంత్రమే భూములు స్వాధీన పరుచుకునే పని ప్రారంభించారు. . -
పేదల భూముల్లో పెద్దల పాగా
ఉదయగిరి, న్యూస్‌లైన్: సొమ్మొకరిది..సోకొకరిది..చందంగా తయారైంది ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూముల పరిస్థితి. వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని పెద్దలు లబ్ధి పొందుతుండటమే ఇందుకు నిదర్శనమే. పేదల చేతుల్లో పదో, పావలో పెట్టి ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్న కొందరు ధనవంతులు జామాయిల్ తోటలు సాగు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులే ఉండటంతో మాయమాటలతో మభ్యపెట్టి 20 నుంచి 30 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరంలోని పరిస్థితే ఇందుకు నిదర్శనం. దుత్తలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 2100, 2200, 2205, 2199, 2198, 2167, 2170, 2188, 2180, 2189, 2107, 2106, 2202, 2173, 2197, 2190, 2186, 2201, 2196, 2191, 2185, 2194, 2203, 2183, 2193, 2204, 2192, 2185, 2199, 2173, 2190, 2181, 2298, 2274, 2290లోని 206 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములను ప్రభుత్వం 1977లో పేదలకు పంపిణీ చేసింది. 50 మంది ఎస్సీలకు, 70 మంది బీసీలకు రెండు నుంచి రెండున్నర ఎకరాల చొప్పున కేటాయించింది. ఈ భూముల్లో మొట్టపంటలు సాగుచేసుకుంటూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కృష్ణాజిల్లాకు చెందిన ఓ భూస్వామి మధ్యవర్తుల సాయంతో ఈ భూముల్లోకి ప్రవేశించాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి డబ్బు ఆశ చూపి 2027 వరకు లీజుకు ఇచ్చినట్లు అంగ్రిమెంట్లు రాయించుకున్నాడు. ఎకరాకు వెయ్యి నుంచి రూ.2 వేలు మా త్రం లీజు ఇస్తూ సుమారు 170 ఎకరాల్లో జామాయిల్ సాగు చేపట్టాడు. ప్రస్తుతం జామాయిల్ కొయ్యకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉండటంతో ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. 15 రోజులుగా ఈ భూముల్లో సాగుచేసిన జామాయిల్ కటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ భూస్వామికి మూడున్నర కోట్లకు పైగా ఆదాయం వస్తుండటం గమనార్హం. నిబంధనలకు తూట్లు అసైన్మెంట్, సీజేఎఫ్ఎస్ భూములను లీజుకు ఇవ్వడం, విక్రయించడం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరం. సీజేఎఫ్ఎస్ భూములను మం జూరు చేయడమంటేనే లీజుకు ఇచ్చినట్లు. ఈ భూముల్లో లబ్ధిదారులు సొంతంగా సాగుచేసి ఫలితాన్ని మాత్రమే పొందాలి. భూములు దుర్వినియోగం చేస్తే లీజు రద్దుచేస్తారు. ఈ నిబంధనలపై లబ్ధిదారులకు అవగాహన లేకపోవడంతో అధికారులు అండగా భూస్వాములు హవా సాగిస్తున్నారు. కొందరు మాత్రం నిబంధనలు తెలుసుకుని భూములను తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నా ఫలితంలేదు. అధికారుల అండతో భూస్వాములు లబ్ధిదారులను బెది రిస్తున్నారు. తమ భూములను తమకు అప్పగించేందుకు సహకరించాలని కొందరు తహశీల్దార్ రమేష్‌ను కలిసినా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా భూముల్లో సాగుచేసిన జామాయిల్ కటింగ్‌కు ముడుపులు తీసుకుని అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఓ అధికారి కీలకపాత్ర జామాయిల్ కటింగ్‌ను అనుమతి ఇచ్చే విషయంలో తహశీల్దార్ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించే ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత అయిన ఓ అధికారి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జామాయిల్ సాగుచేసిన వారి నుంచి మధ్యవర్తుల సహకారంతో ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితే ఈ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగులోకి రావడంతో పాటు పేదల భూముల్లో కోట్లు ఆర్జిస్తున్న వారి నుంచి రికవరీ చేసే అవకాశముంటుంది. ఇందిర జలప్రభకూ దూరం పేదల భూములకు సాగునీటి వనరు కల్పిం చేందుకు ఇందిర జలప్రభ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బ్రహ్మేశ్వరం పరిధిలోని భూములకు సుమారు 14 బోర్లు మంజూరయ్యాయి. తీరా అధికారులు క్షేత్ర పరిశీలనకు వెళితే ఆ భూముల్లో జామాయిల్ మొక్కలు ఉండటంతో బోర్ల మంజూరు విషయంలో వెనక్కుతగ్గారు. ఈ క్రమంలో ఇందిర జలప్రభ పథకాన్ని వినియోగించుకునే అవకాశాన్ని పేదలు కోల్పోయారు.